జాబ్స్ అబ్రాడ్.. గల్ఫ్

17 Jun, 2016 23:29 IST|Sakshi
జాబ్స్ అబ్రాడ్.. గల్ఫ్

జాబ్స్ అబ్రాడ్ అంటే యూఎస్, యూకే, ఆస్ట్రేలియా తదితర దేశాల పేర్లు గుర్తొస్తాయి.. అయితే సంఖ్యా పరంగా చూస్తే అధిక శాతం మంది గమ్యం గల్ఫ్ దేశాలే! భారత విదేశీ మంత్రిత్వ శాఖ నివేదిక (2014-15) ప్రకారం వివిధ దేశాల్లో 50 లక్షల మందికి పైగా భారతీయులు పనిచేస్తుంటే.. వారిలో 90 శాతానికి పైగా గల్ఫ్, ఆగ్నేయాసియా దేశాల్లోనే ఉన్నారు. ఆయా దేశాల విధానాలు కూడా విదేశీ ఉద్యోగార్థులకు పెద్దపీట వేస్తున్నాయి. ఈ క్రమంలో గల్ఫ్ దేశాల్లో అవకాశాలు కల్పిస్తున్న రంగాలు, అందుబాటులో ఉన్న ఉద్యోగాలు తదితరాలపై ఫోకస్..
 
గల్ఫ్ దేశాల్లో ఉద్యోగం అంటే డొమెస్టిక్ వర్కర్స్, డైలీ వేజ్ లేబర్, చమురు శుద్ధి కర్మాగారాల్లో కింది స్థాయి ఉద్యోగాలు- అనేది ఎక్కువ మందిలో ఉండే అభిప్రాయం. వాస్తవానికి గల్ఫ్ కంట్రీస్‌లో అర్హతలను బట్టి అవకాశాలు అందుకోవచ్చు.
 
ఏటా 8 లక్షల మంది..
ఉద్యోగావకాశాల కల్పనలో జీసీసీ (గల్ఫ్ కోపరేషన్ కౌన్సిల్) కంట్రీస్‌గా పేర్కొనే కువైట్, ఖతార్, సౌదీ అరేబియా, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ ముందంజలో ఉన్నాయి. భారత్ నుంచి ఏటా దాదాపు 8 లక్షల మంది జీసీసీ దేశాల్లో ఉద్యోగాలు సొంతం చేసుకుంటున్నారు. ఈ దేశాల్లోని విదేశీ ఉద్యోగుల్లో దాదాపు 30 శాతం మంది భారత్ నుంచి వెళ్లినవారే. భారత్ నుంచి ఉద్యోగాల కోసం గల్ఫ్ దేశాలకు వెళుతున్న వారి సంఖ్య పరంగా చూస్తే రెండు తెలుగు రాష్ట్రాలు గత నాలుగైదేళ్లుగా మొదటి 5 స్థానాల్లో నిలుస్తున్నాయి.

2010-15 మధ్యకాలంలో ఏటా సగటున 1.10 లక్షల మంది తెలుగు వారు గల్ఫ్ దేశాల్లో పలు హోదాల్లో ఉద్యోగాలు సొంతం చేసుకున్నారు. ఎడ్యుకేషన్ నుంచి ఎనర్జీ సెక్టార్ వరకు; నిర్మాణ రంగం నుంచి ఆయిల్ రిఫైనరీస్ వరకు.. వివిధ రంగాలు ఆకర్షణీయ కెరీర్‌కు అవకాశాలు కల్పిస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఉత్పత్తి, సేవారంగాల్లో అవకాశాలు మరింత పెరుగుతున్నాయి.
 
కువైట్
నిర్మాణం, ఆస్పత్రులు, ఆతిథ్య రంగాల్లో  నియామకాల సంఖ్య అధికంగా ఉంది. దీనికి కారణం.. కువైట్ ప్రభుత్వం కీ డెవలప్‌మెంట్ ప్లాన్ 2010-15 పేరుతో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టడమే. సివిల్ ఇంజనీరింగ్‌లో బీటెక్, ఐటీఐ, డిప్లొమా; నర్సింగ్‌లో డిప్లొమా, బ్యాచిలర్; హోటల్ మేనేజ్‌మెంట్, హౌస్‌కీపింగ్ వంటి విభాగాల్లో సర్టిఫికెట్లు ఉంటే కువైట్‌లో కొలువు సొంతం చేసుకోవచ్చు.
 
ఖతార్
ఆయిల్ రిఫైనరీలతో పాటు సేవా రంగం, హోటల్ పరిశ్రమ, హౌస్ కీపింగ్, మెయింటనెన్స్ విభాగాల్లో అవకాశాలు ఎక్కువ. వీటితోపాటు 2022 ఫిఫా వరల్డ్ కప్ నిర్వహణకు ఖతార్ ఆతిథ్యమిస్తున్న నేపథ్యంలో వచ్చే అయిదేళ్లలో ఉత్పత్తి, సేవా రంగాల్లో వలస ఉద్యోగులకు డిమాండ్ పెరగనుంది.
 
సౌదీ
మ్యానుఫ్యాక్చరింగ్ ప్రధాన ఉపాధి రంగం. ఇక్కడి ప్రభుత్వం ఎకనామిక్ సిటీస్, ఇంధనేతర తయారీ రంగాల అభివృద్ధికి చర్యలు చేపడుతోంది. సౌదీలో హాస్పిటాలిటీ, మ్యానుఫ్యాక్చరింగ్, లాజిస్టిక్స్, ఎడ్యుకేషన్, హెల్త్‌కేర్ రంగాలు ఇతర ముఖ్య ఉపాధి వేదికలుగా నిలవనున్నాయి.
 
యూఏఈ
నిర్మాణం, రిటైల్, హాస్పిటాలిటీ, మ్యానుఫ్యాక్చరింగ్, డొమెస్టిక్, ఎడ్యుకేషన్, హెల్త్‌కేర్ రంగాలు టాప్ రిక్రూటర్స్‌గా నిలుస్తున్నాయి. వరల్డ్ ఎక్స్‌పో-2020 పేరిట యూఏఈ ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమంతో వచ్చే అయిదేళ్లలో అవకాశాలు మరింత పెరగనున్నాయి.
 అర్హతను బట్టి ఉద్యోగాలు
 
ఐటీఐ, ఒకేషనల్ కోర్సులు చేసిన వారు సెమీ స్కిల్డ్ హోదాలో ఉద్యోగాలు అందుకోవచ్చు. వీటినే బ్లూ కాలర్ జాబ్స్‌గా పేర్కొంటున్నారు.  బ్యాచిలర్ డిగ్రీ, ప్రొఫెషనల్ కోర్సులు ఉంటే స్కిల్డ్ వర్కర్స్ హోదాలో సూపర్‌వైజర్స్, ఆఫీస్ మేనేజర్స్ వంటి వైట్ కాలర్ ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు.  మేనేజ్‌మెంట్ పీజీలు, ఎంటెక్/ఎంఈ కోర్సులతో ఉన్నత స్థాయి ఉద్యోగాలు పొందొచ్చు. వేతనాలు కూడా ఆకర్షణీయంగా ఉంటున్నాయి. స్కిల్స్ వారీగా చూస్తే లో స్కిల్: 500-100; సెమీ స్కిల్డ్: 1200-1500; స్కిల్డ్ (ప్రొఫెషనల్): 3500-4000. (ఆయా దేశాల కరెన్సీల్లో..)
 
ఔత్సాహికులకు భరోసా
గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాలు పొందేందుకు అవసరమైన స్కిల్స్ విషయంలో భారత ప్రభుత్వం కొన్ని ప్రత్యేక చర్యలు చేపడుతోంది. స్వర్ణ ప్రవాస్ యోజన పేరుతో అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్న రంగాల్లో భారత అభ్యర్థులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తద్వారా మన దేశంలో అందించే వృత్తి విద్యా కోర్సులు, టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించేందుకు చర్యలు తీసుకుంటోంది.  

భారత ప్రభుత్వం.. గల్ఫ్ దేశాల్లో ఉద్యోగార్థుల కెరీర్‌కు భరోసా కల్పించే విధంగా ప్రత్యేక నిబంధనలు రూపొందిస్తోంది. ఇందులో ముఖ్యమైంది మినిమల్ రిఫరల్ వేజెస్ మొత్తాన్ని 800 రియాల్స్ నుంచి 1500 రియాల్స్‌కు పెంచడం. అంటే.. ఒక అభ్యర్థిని నియమించుకోవాలనుకునే గల్ఫ్ దేశాలకు చెందిన వ్యక్తులు లేదా సంస్థలు ప్రతి అభ్యర్థికి కనీసం 1500 రియాల్స్ చెల్లించాలని పేర్కొనడం.

వీటితోపాటు రిక్రూటర్ల ప్రామాణికత, ఏజెంట్లకు సంబంధించిన సమాచారంపై అవగాహన పెంచేందుకు చర్యలు తీసుకుంటోంది. రిక్రూట్‌మెంట్ ఏజెంట్లు ఇమిగ్రేషన్ అధికారుల వద్ద డిపాజిట్ చేయాల్సిన నగదు మొత్తాన్ని కూడా భారీగా పెంచింది.

అంతా ఆన్‌లైన్లో
భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ.. గల్ఫ్ ఉద్యోగ ఔత్సాహికుల కోసం ఆన్‌లైన్ సేవలు అందిస్తోంది. ఈ శాఖ.. రిక్రూటర్స్, జాబ్ సీకర్స్, రిక్రూటింగ్ ఏజెంట్స్ తమ దరఖాస్తులను ఆన్‌లైన్లో అందించే సదుపాయం కల్పిస్తోంది. ఈ మూడు వర్గాల వారు అనుసరించాల్సిన విధివిధానాలు, కొత్త మార్పులపై సమాచారం కూడా అందిస్తోంది.
 
కఫాలా.. తప్పనిసరి
గల్ఫ్ దేశాల ఉద్యోగార్థులు ఇమిగ్రేషన్ అధికారుల వద్ద అనుమతి పొందాలంటే కఫాలా (స్పాన్సర్‌షిప్ లెటర్) తప్పనిసరి. ఇది ఒక అభ్యర్థిని నియమించుకున్న వ్యక్తి లేదా సంస్థ దాన్ని ధ్రువీకరిస్తూ ఇచ్చే పత్రం. ఇది ఉంటేనే వీసా చేతికందుతుంది. ముఖ్యంగా ఇమిగ్రేషన్ చెక్ రిక్వయిర్డ్ (ఈసీఆర్) జాబితాలో ఉన్న గల్ఫ్ దేశాలకు సంబంధించి ఇది తప్పనిసరి.
 
అవసరమైన డాక్యుమెంట్లు
ఇమిగ్రేషన్ చెక్ పూర్తిచేసుకుని.. వీసా పొంది ఉద్యోగం కోసం గల్ఫ్ దేశాల్లో అడుగుపెట్టాలనుకునే వారికి దరఖాస్తుతోపాటు అందించాల్సిన డాక్యుమెంట్లు.. ఎంప్లాయర్ అందించే స్పాన్సర్ లెటర్ (కఫాలా), పాస్‌పోర్ట్, ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్, ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్స్, నిర్ణీత మొత్తంలో నగదు డిపాజిట్.
 
గల్ఫ్ దేశాల్లోని అవకాశాలతో పాటు ప్రైవేటు నియామక ఏజెంట్ల పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ క్రమంలో తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ పేరిట సంస్థను నెలకొల్పడం జరిగింది. ఔత్సాహికులు మమ్మల్ని సంప్రదిస్తే వారికి అవసరమైన సమాచారం అందిస్తాం. వీసా విధివిధానాలను వివరిస్తాం. వీటిని ఔత్సాహికులు ఉపయోగించుకోవడం వల్ల ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ ఆఫీస్‌లో ఇబ్బందులు ఎదురు కాకుండా ఉంటాయి.
 - కె.భవాని, జీఎం-హెచ్‌ఆర్, టామ్‌కామ్.

మరిన్ని వార్తలు