‘ఆతిథ్యం’ ఇస్తే.. అవకాశాలెన్నో..

14 Sep, 2014 00:07 IST|Sakshi
‘ఆతిథ్యం’ ఇస్తే.. అవకాశాలెన్నో..

గతంలో ఆర్థికమాంద్యం ప్రభావంతో ఐటీ సహా ఎన్నో కీలక రంగాల్లోని ఉద్యోగులు ఉపాధి కోల్పోయారు. కాని ఆతిథ్య రంగంలో పనిచేసే వారిపై మాత్రం ఆ ప్రభావం పెద్దగా కనిపించలేదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదురుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో పర్యాటక రంగం మరింత ఊపందుకుంది. వింతలు, విశేషాలకు నిలయమైన భారతావనిని సందర్శించడానికి విదేశీ పర్యాటకులు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా పర్యాటక కేంద్రంగా పేరు పొందిన మన హైదరాబాద్‌కు వచ్చే పర్యాటకుల సంఖ్య ఎక్కువే. దాంతో ఇటీవల కాలంలో భాగ్యనగరంలోని యువతకు ఆతిథ్య రంగం భారీ అవకాశాలతో ఆహ్వాన ం పలుకుతోంది. నగరంలోని పలు విద్యా సంస్థలు హాస్పిటాలిటీ, టూరిజం మేనేజ్‌మెంట్ సంబంధిత కోర్సులను అందిస్తున్నాయి. ఈ కోర్సులు పూర్తిచేసి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను సులువుగా సొంతం చేసుకోవచ్చు. సిటీలో హాస్పిటాలిటీ కోర్సులు, కెరీర్ స్కోప్‌పై ఫోకస్..
 
 నగరం ప్రముఖ పర్యాటక కేంద్రం. ముత్యాలను రాసులుగా పోసి అమ్మిన భాగ్యనగరం ప్రపంచ పర్యాటక కేంద్రంగా ఏనాడో గుర్తింపు పొందింది. కేవలం సంద ర్శనీయ ప్రాంతంగానే కాకుండా విభిన్న అవసరాలు, అవకాశాలకు నెలవుగా మారింది. మెడికల్ టూరిజం, లీజర్ టూరిజం, టెంపుల్ టూరిజం తదితర భిన్న రంగాల్లో తన ప్రాధాన్యతను చాటుకుంటోంది. ప్రయాణికులకు వీలుగా అంతర్జాతీయ విమానాశ్రయం నగరంలో ఏర్పాటైంది. ఇక్కడి నుంచి అన్ని ప్రధాన దేశాలకు రాకపోకలు సాగించే సౌకర్యం ఉంది. గతంలో నిర్వహించిన ప్రపంచ మిలటరీ గేమ్స్ నుంచి ఇటీవల జరిగిన అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సు వరకూ జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, సమావేశాలకు నగరమే వేదిక. గతేడాది 2.5 లక్షల మంది నగరాన్ని సందర్శించారు. దేశ, విదేశాల నుంచి వచ్చే పర్యాటకులకు ఆతిథ్యం ఇచ్చే స్టార్ హోటల్స్, బడ్జెట్ హోటల్స్ నగరంలో 1000 వరకూ ఉంటాయి. పర్యాటకుల తాకిడితో రాబోయే రోజుల్లో వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఆ మేరకు యువతకు ఉద్యోగాలు లభించడం ఖాయం.
 
ఉద్యోగాలు కోకొల్లలు
 హోటల్‌కు వచ్చే అతిథులను ఆహ్వానించడం నుంచి సకల సదుపాయాలు, సౌకర్యాలు అందజేసేందుకు పలు విభాగాలు పనిచేస్తుంటాయి. ఆయా విభాగాలకు అనుగుణంగా కోర్సులు పూర్తిచేస్తే లాబీ మేనేజర్ నుంచి వైస్ ప్రెసిడెంట్ వరకూ ఎదిగే వీలున్న రంగం హాస్పిటాలిటీ అంటున్నారు నిపుణులు. హోటల్స్‌లో ఫ్రంట్ ఆఫీస్, రూం బుకింగ్, గెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్, లాబీ మేనేజ్‌మెంట్, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, అకామిడేషన్ అండ్ బిల్లింగ్, హౌస్‌కీపింగ్, గెస్ట్ సప్లయిర్స్ వంటి విభాగాలు ఉంటాయి. ఫుడ్ అండ్ బేవరేజ్ విభాగంలో ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించడం, ఫుడ్ సర్వీసింగ్, మేనేజర్, కిచెన్ సర్వీసెస్(చెఫ్స్, హెడ్ చెఫ్స్) విభాగాలు.. ఇవికాకుండా సెక్యూరిటీ, హెచ్.ఆర్. విభాగం, స్టోర్స్ డిపార్ట్‌మెంట్, ఫైర్ అండ్ సేఫ్టీ, జిమ్, స్పా నిపుణులు.. ఇలా హాస్పిటాలిటీలో ఎన్నో ఉద్యోగావకాశాలు ఉన్నాయి.
 
 కోర్సులనందిస్తున్న విద్యా సంస్థలు...
 హైదరాబాద్‌లో వివిధ ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు హాస్పిటాలిటీ కోర్సులను అందిస్తున్నాయి. కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ కేటరింగ్ టెక్నాలజీ అండ్ అప్లైడ్ న్యూట్రిషన్ (ఐహెచ్‌ఎంసీటీ), డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ (వైఎస్‌ఆర్ నిథమ్), డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం ప్రాంతీయ కేంద్రం-మాదాపూర్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లు హోటల్‌మేనేజ్‌మెంట్, టూరిజం మేనేజ్‌మెంట్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. ఇవి కాకుండా దేశంలో వందల సంఖ్యలో విద్యాసంస్థలు హోటల్ మేనేజ్‌మెంట్‌లో వివిధ స్పెషలైజేషన్లలో కోర్సులను అందిస్తున్నాయి.
 
 కోర్సులు.. అర్హతలు
 ఆయా విద్యా సంస్థలు అందించే హాస్పిటాలిటీ కోర్సుల్లో పదో తరగతి నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణుల వరకు చేరొచ్చు.  బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ.. ఇంటర్మీడియెట్ అర్హతతో మూడేళ్ల వ్యవధి ఉన్న బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ (బీహెచ్‌ఎం), ఏడాది వ్యవధి ఉన్న డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సును, పదో తరగతి అర్హతతో ఆరు నెలల వ్యవధి ఉన్న సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ఇన్ ఫుడ్ అండ్ బేవరెజ్ ప్రొడక్షన్, ఫుడ్ అండ్ బేవరెజ్ సర్వీస్, అకామిడేషన్ ఆపరేషన్స్ కోర్సులను అందిస్తోంది.
 వెబ్‌సైట్: www.braou.ac.in
 
  డాక్టర్ వైఎస్‌ఆర్ నిథమ్.. మూడేళ్ల బీఎస్సీ(హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్).. నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (టూరిజం అండ్ హాస్పిటాలిటీ), రెండేళ్ల ఎంబీఏ (హాస్పిటాలిటీ), ఎంబీఏ (టూరిజం అండ్ హాస్పిటాలిటీ)లతోపాటు వివిధ స్వల్పకాలిక శిక్షణా కోర్సులను ఆఫర్ చేస్తోంది. బీఎస్సీ, బీబీఏ కోర్సుల్లో ప్రవేశాలకు ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులై ఉండాలి. ఎంబీఏలో చేరడానికి నిర్దేశిత మార్కులతో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత తప్పనిసరి. కోర్సును బట్టి ప్రవేశపరీక్ష, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక ఉంటుంది.     
 వెబ్‌సైట్: www.nithm.ac.in
 
  నగరంలోనే కొలువుదీరిన మరో సంస్థ.. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ కేటరింగ్ టెక్నాలజీ అండ్ అప్లైడ్ న్యూట్రిషన్. ఈ సంస్థ.. రెండేళ్ల ఎంఎస్సీ(హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్), మూడేళ్ల బీఎస్సీ( హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్), ఏడాదిన్నర వ్యవధి ఉన్న పీజీ డిప్లొమా ఇన్ అకామిడేషన్ ఆపరేషన్స్ అండ్ మేనేజ్‌మెంట్స్, ఫుడ్ అండ్ బేవరెజ్ సర్వీస్, ఫుడ్ ప్రొడక్షన్‌లో స్వల్పకాలిక శిక్షణ  కోర్సులు నిర్వహిస్తోంది. వెబ్‌సైట్: www.ihmhyd.org ఇవేకాకుండా సిటీలో ఇగ్నో, సెట్విన్ లాంటివి కూడా హాస్పిటాలిటీలో వివిధ కోర్సులను అందిస్తున్నాయి. సాధారణంగా సర్టిఫికెట్ కోర్సులకు పదో తరగతి/ఇంటర్మీడియెట్, డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ కోర్సులకు ఇంటర్మీడియెట్, పీజీ కోర్సులకు బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఇన్‌స్టిట్యూట్‌ను బట్టి వయోపరిమితి నిబంధనలు కూడా ఉంటాయి.
 
 వేతనాలు.. ఏడాదిలో రెట్టింపు
హౌస్‌కీపింగ్ విభాగంలో ప్రారంభంలోనే నెలకు రూ.12,000; చెఫ్స్‌కు రూ.30 వేల వరకూ ఇస్తున్నారు. నిపుణులైన వారికి ఏడాది తర్వాత రెట్టింపు వేతనం చేతికి అందుతుంది. అతిథులు మెచ్చేలా సేవలు అందించే వారికి ఈ రంగంలో వేతనాలకు ఢోకా లేదు. మిగిలిన విభాగాల్లో కూడా ప్రారంభ వేతనం రూ.15,000 నుంచి ఉంటుంది. పనితీరు, అనుభవం ఆధారంగా మరింత ఆదాయం సంపాదించొచ్చు. సాధారణంగా నగరానికి టూరిస్టుల రాక అక్టోబరు నుంచి జనవరి వరకూ ఉంటుంది. ఆ సమయంలో చేతినిండా పనితోపాటు వేతనాలు కూడా 10-15 శాతం పెరుగుతాయి. మిగిలిన ఆఫ్ సీజన్‌లో ఫుడ్ ఫెస్టివల్స్, ఈవెంట్స్ ఉంటాయి. కాబట్టి 365 రోజులూ తీరిక లేకుండా ఉంటామంటున్నారు ఫైవ్‌స్టార్ హోటల్‌లో మేనేజర్‌గా పని చేస్తున్న యూ.రమేశ్.
 
 హోటల్ మేనేజ్‌మెంట్.. ఎవర్‌గ్రీన్
 ‘‘పర్యాటకంగా హైదరాబాద్ పురోగతి సాధిస్తున్న నగరం. ఇక్కడకు వచ్చే అతిథుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. వీరికి అవసరమైన వసతి సౌకర్యాలకు హోటల్స్ ఆధారం. పర్యాటకుల సంఖ్య పెరిగేకొద్దీ ఈ రంగం విస్తరిస్తుంది. అవకాశాలు పెరుగుతాయి. ప్రస్తుతం హాస్పిటాలిటీ ఇండస్ట్రీ చాలా బాగుంది. ఉపాధి అవకాశాలు భారీగా  లభించనున్నాయి. కేవలం హోటల్ రంగమే కాకుండా.. కార్పొరేట్ సంస్థలు హౌస్‌కీపింగ్, మేనేజ్‌మెంట్ విభాగాల్లో హాస్పిటాలిటీ పూర్తిచేసిన వారికి ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. మెడికల్ టూరిజం హబ్‌గా సిటీ ఖ్యాతి గడిస్తోంది. దీంతో భ విష్యత్తులో ఉద్యోగ అవకాశాలు పెరగడమే కాదు. వేతనాలు కూడా భారీగానే అందుకోవచ్చు. ఇంగ్లిష్, ఫ్రెంచ్ భాషలు నేర్చుకోవాలి. గ్లోబలైజేషన్‌తో ఇంగ్లిష్ తప్పనిసరి. కష్టపడేతత్వమే కాకుండా, నేర్పు, ఓర్పు, ఎదుటివారిని గౌరవించే మనస్తత్వం ఉన్న యువతీ, యువకులకు ఇది అద్భుతమైన కెరీర్. ప్రారంభ వేతనం రూ.15 వేలు ఉంటుంది’’
 - ఎస్.సుధాకుమార్, ప్రిన్సిపల్,
 స్కూల్ ఆఫ్ హాస్పిటాలిటీ (వైఎస్‌ఆర్ నిథమ్).

మరిన్ని వార్తలు