జాబ్ కన్సల్టెంట్లతో వ్యవహరించేదెలా?

4 Sep, 2014 00:08 IST|Sakshi
జాబ్ కన్సల్టెంట్లతో వ్యవహరించేదెలా?

జాబ్ స్కిల్స్
అభ్యర్థులు తమ అర్హతలకు తగిన ఉద్యోగం కోసం గాలిస్తున్నప్పుడు అవసరాన్ని బట్టి జాబ్ కన్సల్టెంట్ల సహాయం కూడా తీసుకుంటూ ఉంటారు. కొలువు వేటలో కన్సల్టెంట్లతో ప్రయోజనం పొందొచ్చు. అయితే, వారి సేవలను ఎలా ఉపయోగించుకుంటున్నారు అనేదాన్ని బట్టే అభ్యర్థుల విజయం ఆధారపడి ఉంటుంది. సంస్థలు ఉద్యోగాల భర్తీ కోసం జాబ్ కన్సల్టెంట్లను లేదా కన్సల్టెన్సీలను ఏర్పాటు చేస్తాయి. తమకు తగిన అభ్యర్థులను వాటి ద్వారా నియమించుకుంటాయి. కంపెనీ అవసరాలను, అభ్యర్థుల అర్హతలను క్షుణ్నంగా పరిశీలించి అర్హులైన వారిని ఎంపిక చేసి, సంస్థకు అప్పగించడమే కన్సల్టెంట్ల ప్రధాన బాధ్యత. వీరితో సరిగ్గా వ్యవహరించగలిగితే ఇష్టమైన కొలువు సాధించడం సులువవుతుంది. కన్సల్టెంట్లను ఎలా ఉపయోగించుకోవాలో అభ్యర్థులు తప్పనిసరిగా తెలుసుకోవాలి.

ఓపెన్‌గా మాట్లాడాలి
కన్సల్టెంట్ల దగ్గర మొహమాటం ఎంతమాత్రం పనికిరాదు. కొందరు అభ్యర్థులు పూర్తి సమాచారం ఇవ్వకుండా దాచిపెడుతుంటారు. సరైన ఉద్యోగం కావాలంటే కన్సల్టెంట్లకు సమాచారం మొత్తం ఇవ్వాలి. వారిని శ్రేయోభిలాషులుగా భావించి ఓపెన్‌గా మాట్లాడాలి. మీ ఆశలు, ఆకాంక్షలను ఉన్నదున్నట్లుగా తెలియజేయాలి. దీనివల్ల మీ అవసరాలను వారు గుర్తించగలుగుతారు. మీకు తగిన ఉద్యోగాన్ని వెతికి పెడతారు.

సులభంగా అర్థమయ్యేలా
కన్సల్టెంట్లు సాధారణంగా మానవ వనరుల నిపుణులై(హెచ్‌ఆర్ ప్రొఫెషనల్స్)  ఉంటారు. ఇతర రంగాల్లో వారి పరిజ్ఞానం తక్కువగా ఉండొచ్చు. కాబట్టి వారితో మాట్లాడేటప్పుడు క్లిష్టమైన టెక్నికల్ పదాలను వాడకుండా స్పష్టంగా అర్థమయ్యేలా సులభమైన భాషను ఉపయోగించాలి. సమాచార లోపం రాకుండా చూసుకోవాలి.

పరస్పర అవగాహన
కన్సల్టెంట్, అభ్యర్థి మధ్య ఉండే అనుబంధం.. అమ్మకందారు, కొనుగోలుదారులాంటిదే. ఇక్కడ ఉభయ పక్షాలూ లాభపడాలి. కాబట్టి పరస్పర అవగాహన చాలా ముఖ్యం. కన్సల్టెంట్లతో పూర్తిగా సహకరించాలి. వారు అడిగిన వివరాలు ఇవ్వాలి. వారి సలహాలు, సూచనలను అభ్యర్థులు సాధ్యమైనంతవరకు పాటించాలి.

రెజ్యుమె ఒక్కరికే పంపాలి
ఒక కన్సల్టెన్సీలో ఒక్కరి కంటే ఎక్కువ మంది ఉండొచ్చు. వారందరి నుంచి మీకు ఫోన్‌కాల్స్, ఈ-మెయిల్స్ వస్తుంటాయి. అయితే, వారందరితో మాట్లాడేందుకు ప్రయత్నించకూడదు. దీనివల్ల గందరగోళం ఏర్పడుతుంది. కన్సల్టెన్సీలో ఒక్కరితోనే కమ్యూనికేషన్ జరపాలి. అభ్యర్థులు తమ రెజ్యుమెను ఆ ఒక్కరికే పంపించాలి. మిగిలినవారికి కూడా పంపిస్తే విశ్వసనీయత దెబ్బతింటుంది. ఒకే సంస్థకు చెందిన పలువురు కన్సల్టెంట్లతో సంప్రదింపులు జరిపితే మిమ్మల్ని పక్కనపెట్టే అవకాశం ఉంది.

‘టచ్’లో ఉండాల్సిందే
ఉద్యోగం వచ్చినా రాకున్నా కన్సల్టెంట్‌తో టచ్‌లో ఉండడం మంచిది. దీనివల్ల మీ అర్హతలకు తగిన మంచి కొలువు ఏదైనా వారి దృష్టికి వస్తే మీకు సమాచారం చేరవేస్తారు. అవకాశాలను కళ్లముందుంచే కన్సల్టెంట్‌కు సహకరిస్తే మంచి ఉద్యోగం సొంతం చేసుకోవచ్చు.

మరిన్ని వార్తలు