ఐబీపీఎస్‌లో ప్రిలిమ్స్, మెయిన్స్

28 Jan, 2015 23:41 IST|Sakshi
ఐబీపీఎస్‌లో ప్రిలిమ్స్, మెయిన్స్

 ఆకర్షణీయ వేతనాలు, ఆహ్లాదకర పనివాతావరణం, కెరీర్‌లో చకచకా ఎదిగేందుకు విస్తృత అవకాశాలు..  ఇవే నేటి యువతకు బ్యాంకులో కొలువుదీరడాన్ని లక్ష్యంగా నిర్దేశిస్తున్నాయి. బీఎస్సీ, బీఏ, బీకామ్, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ.. చేసిన కోర్సు ఏదైనా ఇప్పుడు చాలా మంది బ్యాంకు ఉద్యోగం లక్ష్యంగా కసరత్తు చేస్తున్నారు. ఇలాంటి వారికి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) గేట్ వే వంటిది. ఇది నిర్వహించే పరీక్షల్లో విజయం సాధించడం ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకులో కొలువును ఖాయం చేసుకోవచ్చు. బ్యాంకు ఉద్యోగ నియామకాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న ఐబీపీఎస్ తాజాగా కొన్ని పరీక్షల విధానాన్ని మార్చింది. వీటిపై స్పెషల్ ఫోకస్..
 
 ఎస్‌బీఐ, దాని అనుబంధ బ్యాంకుల్లో ఉద్యోగాల భర్తీకి ఎస్‌బీఐ సొంతంగా నియామక ప్రక్రియ చేపడుతోంది. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్).. అలహాబాద్ బ్యాంకు, ఆంధ్రాబ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, యునెటైడ్ బ్యాంకు ఆఫ్ ఇండియా తదితర ప్రభుత్వరంగ బ్యాంకుల్లో క్లరికల్ కేడర్, ప్రొబేషనరీ ఆఫీసర్, స్పెషలిస్టు ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహిస్తోంది. వీటి తర్వాత ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. ఇప్పుడు ఐబీపీఎస్ కొన్ని పరీక్షల విధానంలో మార్పులు చేసింది.
 
 వీటికి పాత విధానమే
 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు(ఆర్‌ఆర్‌బీ)ల్లో స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 ఆఫీసర్లు; ఆఫీస్ అసిస్టెంట్ నియామకాలకు కామన్ రిటెన్ ఎగ్జామినేషన్(సీడబ్ల్యూఈ)-4ను పాత విధానంలో నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఒకే పరీక్ష నిర్వహిస్తారు.ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఐటీ ఆఫీసర్, అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్ వంటి స్పెషలిస్టు ఆఫీసర్ల నియామకాలకు కూడా పాత విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. నియామక ప్రక్రియలో ఒకే పరీక్ష ఉంటుంది.
 
 ప్రధాన మార్పులు
 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లరికల్ కేడర్, ప్రొబేషనరీ ఆఫీసర్/మేనేజ్‌మెంట్ ట్రెయినీ నియామకాలకు ఇప్పటి వరకు ఒకే పరీక్ష ఉండేది. ఇక నుంచి రెండు దశల్లో అంటే ప్రిలిమనరీ, మెయిన్ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రిలిమ్స్‌లో నిర్దేశ మార్కులు సాధించిన వారిని మెయిన్ రాసేందుకు అనుమతిస్తారు. ఇందులో విజయం సాధించిన వారిని ఇంటర్వ్యూకు పిలుస్తారు. తుది జాబితా రూపకల్పనకు ప్రిలిమ్స్ మార్కులను పరిగణనలోకి తీసుకోరు. సీడబ్ల్యూఈ-5 నుంచి కొత్త విధానం అమల్లోకి వస్తుంది.
 
 మార్పులెందుకు?
 ప్రస్తుతం బ్యాంకు పరీక్షలకు ఏటా లక్షల మంది దరఖాస్తు చేసుకుంటున్నారు. 2013-14లో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోని క్లరికల్ పరీక్షలకు 14.24 లక్షల మంది, ఆఫీసర్ కేడర్ పరీక్షలకు 13.19 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో ఒకే పరీక్ష ఉండటం వల్ల అందులో ఉత్తీర్ణత సాధించిన వారందరికీ ఇంటర్వ్యూలు నిర్వహించడం కష్టమవుతోంది. అందువల్ల పరీక్ష దశలోనే అభ్యర్థులను వడపోసేందుకు ప్రిలిమనరీ, మెయిన్ పరీక్షల విధానాన్ని తెచ్చినట్లు తెలుస్తోంది.
 
 మారిన ఫీజు చెల్లింపు విధానం
 ఇప్పటి వరకు దరఖాస్తు ఫీజును ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ విధానంలో చెల్లించే వెసులుబాటు ఉండేది. ఇకపై ఆన్‌లైన్ ద్వారా మాత్రమే చెల్లించాలి. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఐఎంపీఎస్, మొబైల్ వేలెట్, క్యాష్‌కార్డు ద్వారా చెల్లించవచ్చు.
 
 ప్రిపరేషన్ ప్రణాళిక
 ఐబీపీఎస్ 2015-16లో నిర్వహించనున్న పరీక్షలకు కేలండర్‌ను ముందుగానే విడుదల చేసింది కాబట్టి అభ్యర్థులు తమ ప్రిపరేషన్‌కు పటిష్ట ప్రణాళిక వేసుకునేందుకు అవకాశం లభించింది. పరీక్ష విధానం ఏదైనా కష్టపడేవారికి విజయం తథ్యం. ప్రభుత్వరంగ బ్యాంకుల క్లరికల్, పీవో పరీక్షలకు ప్రిలిమినరీ, మెయిన్ రెండంచెల విధానాన్ని ప్రవేశపెట్టినా, పరీక్షల సిలబస్, మార్కులు, సమయం, ప్రిలిమ్స్ నుంచి మెయిన్‌కు ఎందరిని ఎంపిక చేస్తారు తదితర అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రిలిమ్స్‌లో రీజనింగ్, ఇంగ్లిష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌లపై ప్రశ్నలు ఉండే అవకాశముంది. తక్కువ ప్రశ్నలు ఉండి, స్వల్ప వ్యవధిలో పరీక్ష ముగిసేలా ఉంటుంది. మెయిన్‌లో ఇప్పుడున్న సబ్జెక్టుల నుంచి కొంత క్లిష్టతతో ప్రశ్నలు అడిగే అవకాశముంది.
 
 గత సబ్జెక్టులనే కొనసాగించే అవకాశముంది కాబట్టి పరీక్ష విధానంలో మార్పుల వల్ల ఆందోళన చెందనవసరం లేదు. రోజుకు ఎన్ని గంటలు చదివామనే దానికంటే ఎంత విశ్లేషణాత్మకంగా చదివామన్నదే ముఖ్యం. రోజూ కోచింగ్ తీసుకునే సమయాన్ని మినహాయించి, ఇంటి దగ్గర ప్రిపరేషన్‌కు మూడు, నాలుగు గంటలు కేటాయించాలి. శిక్షణ కేంద్రంలో నిర్వహించే రోజువారీ, వారంతపు పరీక్షలను తప్పనిసరిగా రాయాలి. దీనివల్ల ఏ సబ్జెక్టుల్లో బలహీనంగా ఉన్నారో తెలుస్తుంది. దానికనుగుణంగా ప్రిపరేషన్ ప్రణాళికను మార్చుకోవచ్చు.
 
  రీజనింగ్‌లో ఎరేంజ్‌మెంట్, పజిల్ సాల్వింగ్ విభాగాలు చాలా ముఖ్యమైనవి. వీటితో పాటు బ్లడ్ రిలేషన్స్ సమస్యల సాధన కీలకం. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌లో డేటా ఇంటర్‌ప్రిటేషన్ ముఖ్యమైంది. 8, 9 పాఠ్యపుస్తకాల్లోని అంశాలను ప్రాక్టీస్ చేస్తే క్వాంటిటేటివ్ విభాగంలో అధిక స్కోర్ సాధనకు వీలవుతుంది. ఇంగ్లిష్‌లో కటాఫ్ దాటేందుకు చాలా మంది అభ్యర్థులు ఇబ్బందులుపడుతున్నారు. ఈ పరిస్థితి రాకూడదంటే కాంప్రెహెన్షన్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అంశాలపై ఎక్కువ దృష్టిసారించాలి. దీనికోసం ఇంగ్లిష్ గ్రామర్, రూట్ వర్డ్స్‌పై పట్టు సాధించాలి. ఇంగ్లిష్ గ్రామర్‌పై పట్టు సాధించడానికి ఇంగ్లిష్ దినపత్రికలు, ప్రామాణిక పుస్తకాలను ఉపయోగించుకోవాలి.  ోజూ తప్పకుండా నమూనా పరీక్షలు రాయాలి. గ్రూపుగా ఏర్పడి ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది.
 

మరిన్ని వార్తలు