మధుమేహ రోగులు అధికంగా ఉన్న దేశం?

24 Jul, 2014 22:58 IST|Sakshi
మధుమేహ రోగులు అధికంగా ఉన్న దేశం?

మానవ శరీర ధర్మశాస్త్రం
శరీరంలోని వివిధ భాగాల మధ్య అర్థవంతమైన సమన్వయం చాలా అవసరం. మానవునిలో దీనికోసం నాడీ వ్యవస్థ, అంతస్రావిక వ్యవస్థలు ఉన్నాయి. నాడీ వ్యవస్థలో నాడీ ప్రచోదనం అనే నాడీ సమాచార ప్రసారం ద్వారా వేగవంతమైన సమన్వయం సాధ్యమవుతుంది. అంతస్రావిక వ్యవస్థలోని అంతస్రావిక గ్రంథుల నుంచి విడుదలయ్యే హార్మోన్లు కూడా కీలకమైన సమన్వయాన్ని నిర్వహిస్తాయి.
 
నాడీకణం

నాడీ వ్యవస్థలోని ప్రతి భాగం నాడీకణాలతో నిర్మితమై ఉంటుంది. నాడీ కణాలకు కణవిభజన శక్తి ఉండదు. నాడీ కణాల సంఖ్య స్థిరంగా ఉంటుంది. మిగతా శరీర కణాల కంటే నాడీ కణాలు పొడవుగా ఉంటాయి. నాడీ కణం లో రెండు ప్రధాన భాగాలు ఉంటాయి. అవి: వెడల్పాటి కణదేహం, పొడవైన ఏక్సాన్. కణదేహం (Cyton)లో కేంద్రకం ఉంటుంది. కేంద్రకం చుట్టూ నిస్సల్స్ కణికలు ఉంటాయి. కణదేహం అంతా డెండ్రైట్స్ అనే విభజనలు ఉంటాయి. ఏక్సాన్ తంతువు చివరన టెలిడెండ్రైట్స్ ఉంటాయి. ఏక్సాన్ చుట్టూ మైలిన్‌పొర విద్యుత్ బంధకంగా వ్యవహరిస్తుంది. దీని చుట్టూ న్యూరిలెమ్మా ఉంటుంది. న్యూరిలెమ్మా, మైలిన్ పొరల మధ్య ప్రత్యేకంగా ష్క్వాన్ కణాలు ఉంటాయి.
 
నాడీ ప్రచోదనం
నాడీ వ్యవస్థలోని ప్రతి భాగం నాడీ కణాలతో నిర్మితమై ఉంటుంది. మెదడు, వెన్నుపాము నాడులన్నీ నాడీ కణాలతోనే నిర్మితమై ఉంటాయి. అనేక నాడీకణాలు ఒక దాని వెనుక మరొకటి చేరి ఒక సమూహంగా ఏర్పడితే, దాన్ని ‘నాడు’ అంటారు. ఒక నాడులోని నాడీకణాల ద్వారా సాగే నాడీ సమాచారం ప్రసారమే నాడీ ప్రచోదనం. ఇది విద్యుత్ రూపంలో ప్రసారమవుతుంది. నాడీ ప్రచోదనం రెండు నాడీ కణాల మధ్య రసాయన మాధ్యమంతో ముందుకు సాగుతుంది. నాడీ ప్రచోదనంలో ఉపయోగపడే ఈ రసాయనాలను న్యూరోట్రాన్‌‌సమీటర్లు అంటారు.
 
నాడీ వ్యవస్థ భాగాలు
నాడీ వ్యవస్థను మూడు భాగాలుగా విభజించవచ్చు. అవి: కేంద్ర, పరధీయ, స్వయంచోదిత నాడీ మండలాలు. మెదడు, వెన్నుపాములను కలిపి కేంద్ర నాడీ మండలం అంటారు. ఈ రెండూ అతి సున్నితమైన భాగాలు. వీటి చుట్టూ మూడు రక్షణ పొరలు, మెనింజిస్ ఉంటాయి. కపాలం అనే అస్థిపంజర నిర్మాణంలో మెదడు, వెన్నెముకలోని వెన్నుపాము సురక్షితంగా ఉంటాయి.
 
మెదడులో అతిపెద్ద భాగం మస్తిష్కం. ఇది రెండు మస్తిష్క గోళార్ధాల రూపంలో ఉంటుంది. మస్తిష్కం తెలివి తేటలు, ఆలోచన, జ్ఞాపకశక్తి, విచక్షణా శక్తి, సమస్యా పరిష్కారం లాంటి గుణాలను, అనేక భావాలను నియంత్రిస్తుంది. మస్తిష్కం తర్వాత మెదడులోని పెద్ద భాగం అనుమస్తిష్కం. ఇది శరీర చలనాన్ని, సమన్వయాన్ని, కండర సంకోచాలను నియంత్రిస్తుంది. బ్రెయిన్‌స్టెంలో పాన్‌‌స అనే భాగం మెదడు వెన్నుపాముల మధ్య సమాచార మార్పిడికి ఒక రిలే కేంద్రంగా వ్యవహరిస్తుంది. పాన్‌‌స కింద మజ్జాముఖం ఉంటుంది. ఇది ప్రధానంగా శ్వాసను నియంత్రిస్తుంది. మస్తిష్కం కింద ఉండే అథాపర్యంకం (Hypothalamus) శరీర ఉష్ణోగ్రత, ఆకలి, దప్పిక, నిద్ర, లైంగిక వాంఛలను నియంత్రిస్తుంది. మెదడు, కింది భాగం వెన్నుపాముగా కొనసాగుతుంది.
 
వెన్నుపాము ఒక సెంటీ మీటర్ మందంలో ఉంటుంది. ఇది అసంకల్పిత ప్రతీకార చర్యలను నియంత్రిస్తుంది. మెదడు, వెన్నుపాముల నుంచి సాగే నాడులన్నీ కలిిసి పరధీయ నాడీ మండలం ఏర్పడుతుంది. మెదడు నుంచి సాగే నాడులను ‘మస్తిష్క/ కపాల నాడులు’ అంటారు. ఇవి 12 జతలు. వెన్నుపాము నుంచి సాగే నాడులను ‘వెన్నునాడులు’ అంటారు. ఇవి 31 జతలు. కేంద్ర నాడీ మండలానికి సంబంధం లేకుండా వ్యవహరించే నాడీ కేంద్రాల వల లాంటి నిర్మాణం, స్వయంచోదిత నాడీ మండలం సహానుభూత, పరసహానుభూత వ్యవస్థలు అనే రెండు రకాలుగా స్వయంచోదిత నాడీ వ్యవస్థ విభజన చెంది ఉంటుంది.
 
అంతస్రావిక వ్యవస్థ
అంతస్రావిక వ్యవస్థలో అంతస్రావిక గ్రంథులు, వాటి నుంచి హార్మోన్లు అనే రసాయన విభాగాలు ఉంటాయి. అంతస్రావిక గ్రంథులు వాటి స్రావితాలను, ఏ నాళం సాయం లేకుండా నేరుగా రక్తంలోకి విడుదల చేస్తాయి. వీటిని వినాళ గ్రంథులు అంటారు. ఇవి శరీరంలోని వివిధ భాగాల్లో ఉంటాయి. ఒక అంతస్రావిక గ్రంథి ద్వారా రక్తంలోకి విడుదలై, రక్తం ద్వారా ఇతర భాగాలకు చేరి, క్రియాశీల చర్యలను నియంత్రించే రసాయనాలను హార్మోన్లు అంటారు.
 
మెదడు కింది భాగంలో పీయూష గ్రంథి ఉంటుంది. దీనిలో పూర్వ, మధ్యస్థ, పర లంబికలు ఉంటాయి. పూర్వలంబిక నుంచి ట్రాపిన్‌‌స అనే హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి కొన్ని ఇతర అంతస్రావిక గ్రంథులను ప్రేరేపిస్తాయి. పూర్వలంబిక నుంచి విడుదలయ్యే పెరుగుదల హార్మోన్ శారీరక పెరుగుదలను ప్రేరేపిస్తుంది. దీని అల్పస్రావం ద్వారా పిల్లల్లో మరుగుజ్జుత నం వస్తుంది. అధికస్రావం వల్ల జెగాంటిజం (అతిదీర్ఘకాయం)వస్తుంది. మధ్యస్థలంబిక నుంచి మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ (MSH) విడుదలవుతుంది.
 
పరలంబిక నుంచి విడుదలయ్యే ఆక్సిటోసిన్ శిశు జననానికి తోడ్పడుతుంది. వాసోప్రెసిన్ అతిమూత్రాన్ని నిరోధిస్తుంది. మెడలో వాయునాళానికి ముందుగా స్వరపేటిక దిగువన అవటు గ్రంథి ఉంటుంది. దీని నుంచి థైరాక్సిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఇది జీవక్రియారేటును నియంత్రిస్తుం ది. థైరాక్సిన్ లోపం వల్ల క్రెటినిజం అనే మానసిక, శారీరక మాంద్యంతో శిశువు పుట్టే ప్రమాదముంది. పెద్దల్లో థైరాక్సిన్ అల్పస్రావం ద్వారా మిక్సోడియ/ గల్స్ వ్యాధి అధిక స్రావం ద్వారా గ్రేవ్‌‌స వ్యాధి/ ఎక్సాఫ్తాల్మిక్ గాయిటర్ వస్తాయి.
 
అవటుకు దగ్గరగా నాలుగు చిన్న పార్శ్వ అవటు గ్రంథులుంటాయి. వీటి నుంచి పారాథార్మోన్ విడుదలవుతుంది. అవటు నుంచి విడుదలయ్యే కాల్సిటోనిన్ అనే హార్మోన్‌తో కలిసి పారాథార్మోన్ రక్తంలో కాల్షియం శాతాన్ని నియంత్రిస్తుంది.
 
క్లోమం
క్లోమం జీర్ణాశయం కింది భాగాన, చిన్న పేగులోకి తెరుచుకొని ఉంటుంది. ఇది ఒక మిశ్రమ గ్రంథి. దీనిలోని అంతస్రావిక భాగం లాంగర్‌హన్‌‌స పుటికలు. క్లోమంలోని ఆల్ఫా కణాలు గ్లూకగాన్ హార్మోన్‌ను, బీటా కణాలు ఇన్సులిన్‌ను విడుదల చేస్తాయి. ఈ రెండు హార్మోన్లు కలిసి రక్తంలో చక్కెర శాతాన్ని నియంత్రిస్తాయి. గ్లూకగాన్ రక్తంలో చక్కెర శాతాన్ని పెంచుతుంది. ఇన్సులిన్ తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర శాతం పెరిగి, శరీర అవయవాల పనితీరు దెబ్బతినే రుగ్మతను ‘మధుమేహం’ (Diabetes mellitus) అంటారు. ఇది రెండు రకాలు.
 
 పూర్తిగా ఇన్సులిన్ ఏర్పడక పోవడం ద్వారా సంభవించేది టైప్-1 మధుమేహం. ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గడం లేదా సరిగా పనిచేయకపోవడం ద్వారా సంభవించేది రెండో రకం మధుమేహం. రక్తంలో చక్కెర శాతం పెరిగే కొద్దీ రక్త సరఫరాకు అవరోధం ఏర్పడి, వివిధ అవయవాల పనితీరు దెబ్బతింటుంది. గాయాలు తొందరగా మానవు. పాదాల్లో అల్సర్లు ఏర్పడతాయి. మూత్రపిండాల పనితీరు దెబ్బతింటుంది. పురుషుల్లో లైంగిక సామర్థ్యం తగ్గుతుంది. కంటి చూపు మందగిస్తుంది (డయాబెటిక్ రెటినోపతి). చివరకు గుండె పనితీరు దెబ్బతిని, వ్యక్తి కోమా స్థితిలోకి చేరి మరణిస్తాడు.
 
 అధివృక్క గంథ్రి
 అధివృక్క గ్రంథులు మూత్రపిండాలపై టోపిలా కనిపిస్తాయి. వీటి నిర్మాణంలో రెండు భాగాలుంటాయి. వెలుపలి వల్కలం (Cortex), లోపలి దవ్వ (Medulla) వల్కలం నుంచి విడుదలయ్యే కార్టికాయిడ్‌‌స మూడు రకాలు. గ్లూకో, ఖనిజ, లైంగిక కార్డికాయిడ్‌‌స దవ్వ నుంచి ఎపినెఫ్రిన్ (అడ్రినలిన్) నార్ ఎపినెఫ్రిన్ (నార్ అడ్రినలిన్) అనే హార్మోన్లు విడుదలవుతాయి. ఈ రెండూ ఎమర్జెన్సీ లేదా పోరాట పలాయన హార్మోన్లు.
 
 బీజకోశాలు
 పురుష బీజ కోశాలైన ముష్కాలు, స్త్రీ బీజ కోశాలైన అండాశయాలు లైంగిక హార్మోన్లను విడుదల చేస్తాయి. పురుష లైంగిక హార్మోన్లు ఆండ్రోజెన్‌‌స. వీటిలో ప్రధానమైంది టెస్టోస్టిరాన్. స్ట్రీ లైంగిక హార్మోన్లు ఈస్ట్రోజెన్‌‌స. వీటిలో ప్రధానమైంది బీటా-ఈస్ట్రడయోల్. ఈ లైంగిక హార్మోన్లు స్త్రీ, పురుషుల్లో ద్వితీయ లైంగిక లక్షణాల అభివృద్ధిని ప్రేరేపిస్తాయి. అదనంగా జీర్ణకోశం నుంచి కొన్ని హార్మోన్లు, మెదడులో ఉండే పీనియల్ గ్రంథి నుంచి మెలటోనిన్ అనే హార్మోన్, యుక్తవయసు వరకు మాత్రమే ఉండే బాలగ్రంథి (థైమస్) నుంచి థైమోసిన్ అనే హార్మోన్లు విడుదలవుతాయి.
 
 మాదిరి ప్రశ్నలు
 1.    మెదడులో థర్మోస్టాట్‌గా పనిచేసే భాగం?
     1) మస్తిష్కం    2) అనుమస్తిష్కం
     3) అథాపర్యంకం    4) మజ్జాముఖం
 2.    {పపంచ అల్జీమర్‌‌స దినం?
     1) ఏప్రిల్ 2    2) మే 14
     3) జూన్ 23    4) సెప్టెంబరు 21
 3.    జపనీస్ ఎన్సిఫలైటిస్ కారక వైరస్ ఏది?
     1) ఫ్లేమి వైరస్    2) టోగా
     3) ఆల్ఫా    4) పాక్స్
 4.    ఏ న్యూరో ట్రాన్‌‌సమీటర్ లోపం ద్వారా పార్కిన్‌సన్‌‌స వ్యాధి వస్తుంది?
     1) అసిటైల్ కొలిన్    2) డోపమైన్
     3) సెరటోనిన్    4) గ్లైసిన్
 5.    మనిషి మెదడు సగటు బరువు ఎంత?
     1) 1350 గ్రాములు    2) 1800 గ్రాములు
     3) 2000 గ్రాములు    4) 1000 గ్రాములు
 6.    మెదడులోని ఏ భాగానికి గాయమైతే, శ్వాస ఆగిపోయి వ్యక్తి మరణించే ప్రమాదం ఉంటుంది?
     1) మస్తిష్కం    2) అనుమస్తిష్కం
     3) మజ్జాముఖం    4) అథాపర్యంకం
 7.    మెదడులో ఏర్పడే అసాధారణ పరిస్థితులను తెలుసుకోవడానికి వినియోగించే నిర్ధారణ పరీక్ష ఏది?
     1) ఎక్స్‌రే
     2) అల్ట్రాసౌండ్ స్కానింగ్
     3) మ్యాగ్నెటిక్ రెసొనెన్‌‌స ఈమేజింగ్
     4) ఎండోస్కోపి
 8.    హార్మోన్ అనే పదాన్ని ప్రతిపాదించింది?
     1) బ్యాంటింగ్, బెస్ట్    
     2) యంగ్‌వల్, పర్‌‌లమన్
     3) అలెక్ జెఫ్రీస్    4) బేలిస్, స్టార్లింగ్
 9.    మధుమేహ రోగులు అధికంగా ఉన్న దేశం ఏది?
     1) భారత్    2) చైనా
     3) అమెరికా    4) బ్రెజిల్
 10.    పుట్టుకతోనే శరీరంలోని ఏ భాగంలోనూ  మెలనిన్ ఏర్పడని జన్యు వ్యాధి?
     1) విటిలిగో    2) ల్యూకోడెర్మ
     3) పైబాల్డ్    4) ఆల్బినిజం
 11.    థైరాక్సిన్ ఏర్పడటానికి అవసరమయ్యే ఖనిజం ఏది?
     1) అయోడిన్    2) ఇనుము
     3) కాల్షియం    4) మాంగనీస్
 12.    ఆహారంలో తగినంత అయోడిన్ లోపిస్తే,  అవటు గ్రంథి?
     1) క్షీణిస్తుంది
     2) బంతిలా వాచిపోతుంది
     3) పూర్తిగా అదృశ్యం అవుతుంది
     4) ఏ మార్పూ ఉండదు
 సమాధానాలు
 1) 3; 2) 4; 3) 1; 4) 2; 5) 1; 6) 3; 7) 3; 8) 4; 9) 2; 10) 4; 11) 1; 12) 2
 కాంపిటీటివ్ కౌన్సెలింగ్
 
సివిల్స్ ప్రిలిమ్స్‌లో చరిత్రలో ఎక్కువ మార్కులు రావాలంటే ఏం చేయాలి? ఏయే అంశాలపై దృష్టి సారించాలి?
- ఎస్.ప్రకాశ్ రెడ్డి, హైదరాబాద్.
 
చరిత్రలో ‘ప్రాచీన భారతదేశ చరిత్ర’ నుంచి 3 నుంచి 5 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ప్రాచీన ప్రాంతాలు, పురావస్తు తవ్వకాల్లో బయల్పడిన కట్టడాలు, పరికరాలు, సింధూనాగరికత, ఆర్యులు, మత ఉద్యమాలు, మౌర్యుల పరిపాలనాంశాలు, గుప్తుల సాంస్కృతిక సేవ లాంటి అంశాలపై దృష్టి సారించాలి. ‘మధ్య యుగ భారతదేశ చరిత్ర’కు సంబంధించి సూఫీ, భక్తి ఉద్యమకారుల ప్రభావం, ఢిల్లీ, మొగల్ చక్రవర్తుల సాహిత్య, సాంస్కృతిక సేవ, విజయనగర - బహమనీ రాజ్యాల ప్రభావం, దక్షిణ భారతంలో చోళ, పాండ్య రాజ్యాల ఆర్థిక, శిల్పకళా రంగాలు, దక్షిణ భారతదేశం సందర్శించిన యాత్రికులు, వారి రచనల్లోని అంశాలపై ప్రశ్నలు వచ్చే అవకాశముంది. అదేవిధంగా బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణ, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో ప్రభావం, సామాజిక సంస్కరణోద్యమాలు, స్వాతంత్రోద్యమంలోని దశలు, స్వాతంత్య్రం అనంతరం పరిస్థితులపై పట్టు సాధించాలి. గత మూడు, నాలుగేళ్ల ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయో అర్థమవుతుంది. 2008 సివిల్స్‌లో కింది ప్రశ్నను అడిగారు.
 
 ప్రశ్న: జతపర్చండి.
  -1 (సూఫీమతం)
     ఎ) చిస్తీ సిల్‌సిలా
     బి) నక్షబంది సిల్‌సిలా
     సి) ఖాద్రీ సిల్‌సిలా
     డి) సౌహాద్రి సిల్‌సిలా
  2 (నాయకులు)
     1) షేక్ అహ్మద్ షేర్‌హింద్
     2) షేక్ బహ్రూద్దీన్ జకారియా
     3) షేక్ హమీదుద్దీన్
     4) సయ్యద్ ముక్దుమ్ మహ్మద్ గిలాని
 1) ఎ-3, బి-4, సి-1, డి-2
 2) ఎ-1, బి-4, సి-3, డి-2
 3) ఎ-3, బి-1, సి-4, డి-2
 4) ఎ-1, బి-3, సి-4, డి-2
 సమాధానం: 3
 
1857 సిపాయిల తిరుగుబాటును ‘నాగరికత- అనాగరికతల’ తిరుగుబాటుగా పేర్కొన్నవారు ఎవరు? 1869లో కార్ల్‌మార్క్స్ ఈ తిరుగుబాటును ఏమని వ్యాఖ్యానించాడు? లాంటి ప్రశ్నలు అడిగే అవకాశముంది. ‘గాంధీయుగం’ నుంచి గాంధీ వ్యక్తిత్వం, పోరాట పద్ధతులు, సత్యాగ్రహం + అహింస ప్రాధా న్యం, 1942 క్విట్ ఇండియాలో ‘డూ ఆర్ డై’ అని ఎందుకు పిలుపునిచ్చారు? దక్షిణాఫ్రికాలో గాంధీజీ ఆసియన్ల హక్కుల కోసం పోరాడటానికి కారణాలు, గాంధీజీ చేపట్టిన ఉప్పు సత్యాగ్రహం మొదలైన అంశాలను అధ్యయనం చేయాలి. ఈ సమాచారమంతా ప్రామాణిక పాఠ్యపుస్తకాల్లో లభిస్తుంది. చదువుతున్నప్పుడే అర్థం చేసుకున్న అంశాలను నోట్స్ రూపంలో రాసుకోవాలి.
 
అప్పుడే సబ్జెక్టుపై ప్రాథమిక అవగాహన వస్తుంది. సివిల్ సర్వీసెస్, కాలేజ్ సర్వీస్ కమిషన్స్ నిర్వహించిన నెట్/ స్లెట్ ప్రశ్న పత్రాల్లోంచి 50 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. పాత విషయాలే కాకుండా, నూతన, సమకాలీన, సాంస్కృతిక పరమైన అంశాలకూ ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రిలిమినరీ పరీక్ష జ్ఞానానికి సంబంధించిందే తప్ప, సబ్జెక్టుకు సంబంధించింది కాదు అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఇది కేవలం వడపోత (ఎలిమినేట్) చేయడానికి నిర్వహించేది మాత్రమే.
 డాక్టర్ పి.మురళి, సీనియర్ ఫ్యాకల్టీ,
 నిజాం కాలేజ్, హైదరాబాద్.

మరిన్ని వార్తలు