స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం

25 Jan, 2017 04:42 IST|Sakshi
స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం

1. ఏకీకృత విధానం: దేశ పాలనాధికారాలన్నీ కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉండటం. ఇది ఏకకేంద్ర ప్రభుత్వ వ్యవస్థ ముఖ్య లక్షణం. ఉదా: బ్రిటన్‌.
2. సమాఖ్య విధానం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాలు స్పష్టంగా విభజితమై ఉండటం. ఉదా: అమెరికా, ఇండియా మొదలైనవి.
3. ఉభయ పద్దు (ఉమ్మడి జాబితా): ఇది కేంద్రానికి, రాష్ట్రాలకు ఉమ్మడిగా గల అధికారాలను తెలిపే అంశాల జాబితా. సమాఖ్య వ్యవస్థలో కేంద్రం, రాష్ట్రాల మధ్య చట్టాలు చేసే అధికారాలు విభజితమై ఉంటాయి. ఉదా: భారత రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాలో 47 అంశాలను తెలిపారు.

4పౌరసత్వం: దేశంలో నివసించే పౌరులకు దేశ అత్యున్నత రాజ్యాంగం ద్వారా చట్టబద్ధంగా ఇచ్చే గుర్తింపు. ఇండియాలో ఏక పౌరసత్వం, అమెరికాలో ద్వంద్వ పౌరసత్వం అమల్లో ఉంది.
5.అధ్యక్ష తరహా వ్యవస్థ: దేశ పరిపాలనాధికారాలన్నీ అధ్యక్షుడి చేతిలోనే ఉండే ప్రభుత్వ వ్యవస్థ. అధ్యక్షుణ్ని ప్రభుత్వాధినేత, దేశాధినేత అని కూడా పిలుస్తారు. అధ్యక్షుడు ప్రభుత్వ వాస్తవ కార్యనిర్వహణాధికారిగా  ఉంటాడు. ఉదా: అమెరికా
6. పార్లమెంటరీ తరహా వ్యవస్థ: పార్లమెంట్‌లో ప్రజాస్వామ్యబద్ధంగా మెజారిటీ సీట్లు పొందిన పార్టీ లేదా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ప్రభుత్వ కార్యనిర్వాహక అధికారాలను మంత్రిమండలి నిర్వర్తిస్తుంది. ఈ విధంగా శాసననిర్మాణ శాఖ, కార్యనిర్వాహక శాఖల అధికారాల సమన్వయంతో కూడిన వ్యవస్థను పార్లమెంటరీ తరహా ప్రభుత్వ వ్యవస్థ అంటారు. మంత్రిమండలి నాయకుడిని ప్రధానమంత్రి అంటారు. ఆయనే ప్రభుత్వాధినేతగా ఉంటారు. ఆయన సలహాలు, సూచనల మేరకే దేశాధినేత అయిన అధ్యక్షుడు (రాష్ట్రపతి) నడచుకోవాల్సి ఉంటుంది. ఈ వ్యవస్థలో వాస్తవ కార్యనిర్వాహణాధికారి ప్రధానమంత్రి. ఉదా: బ్రిటన్, ఇండియా
7.సవరణ: రాజ్యాంగబద్ధంగా దేశ మౌలిక రాజ్యాంగంలో చేసే అవసరమైన మార్పు. దేశాభివృద్ధికి అవసరమైన రాజ్యాంగ సవరణలను చట్టసభలు ఆమోదిస్తాయి. సవరణ అంటే రాజ్యాంగంలో అప్పటికే ఉన్న అధికరణలను తొలగించవచ్చు లేదా మార్చవచ్చు, కొత్తవాటిని చేర్చవచ్చు.

4  మార్కుల ప్రశ్న
1.రాజ్యాంగంలో మౌలిక సూత్రాలుంటాయి. అయితే ప్రజలు వ్యవస్థతో తలపడినప్పుడే సామాజిక మార్పు వస్తుంది. ఈ వ్యాఖ్యతో మీరు ఏకీభవిస్తారా? మీ కారణాలను పేర్కొనండి?
(సమకాలీన అంశాలపై ప్రతిస్పందన – ప్రశ్నించడం)
lజవాబు: పై వ్యాఖ్యతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. ఏ దేశ రాజ్యాంగంలోఅయినా కొన్ని మౌలిక సూత్రాలుంటాయి. అవి.. రాజ్యాంగ స్వరూపాన్ని, ఉద్దేశాలను ప్రతిబింబిస్తాయి. రాజ్యాంగ ప్రవేశికలో పొందుపర్చిన మౌలిక సూత్రాల లక్ష్యాలకు అనుగుణంగా వ్యవస్థలో మార్పులు రావాలి. దీంతోపాటు ప్రజల ఆకాంక్షలు నెరవేరాల్సిన అవసరం కూడా ఉంది. ప్రజలు రాజ్యాంగ పద్ధతిలో వ్యవస్థతో తలపడినప్పుడే ఈ సామాజిక మార్పు సాధ్యమవుతుంది. నేను ఈ వాస్తవాలతో ఏకీభవించడానికి కారణాలు..

దేశ సార్వభౌమాధికారం ప్రజల చేతిలో ఉంటుంది. ప్రజలే పాలకులు, ప్రజల కోసం ప్రజలే చట్టాలు చేసుకుంటారు. ప్రజలతో కూడిందే వ్యవస్థ. ఇలాంటి వ్యవస్థలో అభివృద్ధి పూర్వక మార్పులకు ప్రజలు సిద్ధపడాలి.
లౌకిక, సామ్యవాద సూత్రాలు జాతీయ సమైక్యతను, ప్రజల సంక్షేమాన్ని పెంపొందిస్తాయి. పాలనా వ్యవస్థ వీటిని అమలు చేయాలి. ప్రజలు జాగరూకులై అభివృద్ధి ఫలాలను అందుకోవాలి. పాలనా వ్యవస్థ ప్రజల కోరికలు, ఆకాంక్షలను పట్టించుకోనప్పుడు ప్రజలే
ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి.    

∙రాజ్యాంగ సూత్రాల ప్రకారం పౌరులందరికీ సామాజిక, ఆర్థిక రాజకీయ న్యాయాన్ని అందించాలి. అలాగే పౌరుల్లో సమానత్వం, సౌభ్రాతృత్వాలను పెంపొందించాలి. వీటి ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అప్పుడే ప్రజల జీవితాల్లో ఫలప్రదమైన మార్పులు సంభవిస్తాయి. తద్వారా సామాజిక మార్పును ఆశించవచ్చు.
∙రాజ్యాంగ మౌలిక సూత్రాలను పాలనా వ్యవస్థ విస్మరించినప్పుడు ప్రజలు సమూహంగా ఏర్పడి సామాజిక వ్యవస్థలో మార్పు కోసం ప్రజాప్రతినిధులతో కూడిన పాలనా వ్యవస్థతో తలపడాల్సి వస్తుంది. రాజ్యాంగం కూడా దీన్నే కోరుకుంటుంది. పాలనా వ్యవస్థకు సామాజిక వ్యవస్థే ఆధారం.
2 మార్కుల ప్రశ్నలు
73వ రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామాలకు ఎలాంటి స్వయంప్రతిపత్తి కల్పించారో తెలపండి.

(సమాచార సేకరణ నైపుణ్యం)
జవాబు: భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో పేర్కొన్న 40వ ప్రకరణ.. పంచాయతీరాజ్‌ వ్యవస్థ ఏర్పాటు, గ్రామాలకు స్వయం పాలనాధికారాల గురించి ప్రస్తావించింది. దానికి అనుగుణంగా పార్లమెంట్‌ 1992లో 73వ రాజ్యాంగ సవరణ చేసింది. ఇది 1993, ఏప్రిల్‌ 24 నుంచి అమల్లోకి వచ్చింది. 73వ రాజ్యాంగ సవరణ.. గ్రామ పంచాయతీలకు స్వయం ప్రతిపత్తిని కల్పించింది. దీంతోపాటు గ్రామ స్వయంపాలనకు అవసరమైన అధికారాలు, విధులు, బాధ్యతలను పంచాయతీ వ్యవస్థలకు కల్పించింది. వాటిలో ముఖ్యమైనవి.. గ్రామసభ ఏర్పాటు, ప్రత్యక్ష ఎన్నికలు, సీట్ల రిజర్వేషన్, మూడంచెల వ్యవస్థ, రాష్ట్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఆర్థిక సంఘం ఏర్పాటు, నిర్దేశిత పదవీకాలం తదితరాలు.

2.భారత్, అమెరికా సమాఖ్య వ్యవస్థల మధ్య ముఖ్య భేదాలను
పేర్కొనండి.      (విషయావగాహన)
జవాబు: అమెరికా, ఇండియాల్లో సమాఖ్య వ్యవస్థ అమల్లో ఉంది. ఈ దేశాల్లో అనుసరిస్తున్న సమాఖ్య విధానాల్లో స్పష్టమైన తేడాలున్నాయి. అవి..
భారత సమాఖ్య వ్యవస్థ: 1. ఏక పౌరసత్వం, ద్వంద్వ ప్రభుత్వాలు, ఏక న్యాయ వ్యవస్థ, 2. సివిల్, క్రిమినల్‌ చట్టాల్లో సారూప్యత, ఏక విధానం, 3. అఖిల భారత సర్వీసులు.
అమెరికా సమాఖ్య వ్యవస్థ: 1. ద్వంద్వ పౌరసత్వం, ద్వంద్వ ప్రభుత్వాలు, ప్రత్యేక న్యాయ వ్యవస్థలు. 2. చట్టాల్లో సారూప్యత, ఏక విధానం లేదు 3. ప్రత్యేకంగా వేర్వేరు సర్వీసులు.

మరిన్ని వార్తలు