అక్క బాట.. నాన్న మాట స్ఫూర్తిగా

17 Jul, 2014 03:26 IST|Sakshi
అక్క బాట.. నాన్న మాట స్ఫూర్తిగా

 కుటుంబ నేపథ్యం:
 మా స్వస్థలం ఖమ్మం జిల్లా తల్లాడ మండలం పాత పినపాక గ్రామం. నాన్న పుల్లయ్య. గుదిమెళ్ల ఉన్నతపాఠశాలలో ప్రధానోపాధ్యాయుడుగా పనిచేస్తున్నారు. అమ్మ పద్మ గృహిణి. అక్క కిరణ్మయి. జేఎన్‌టీయూ హైదరాబాద్‌లో బీటెక్ చదువుతోంది. మా చదువుల కోసం అమ్మా నాన్నలు సొంతూరుకు దూరంగా ఖమ్మంలో ఉండాల్సి వచ్చింది.
 
 అక్కను చూసి:
 అక్క కిరణ్మయి ఎంసెట్‌లో మంచి ర్యాంకు సాధించింది. జేఎన్‌టీయూ హైదరాబాద్‌లో సీటు సాధించింది. అక్కను చూసి అమ్మా, నాన్న మురిసిపోయేవారు. అప్పుడు నేను ఏడో తరగతి చదువుతున్నాను. ఎందుకో అక్కను చూసి ఆమె కంటే బాగా రాణించాలని మనసులో అనుకున్నాను.
 
 ఏడో తరగతి నుంచే పునాది:
 మంచి ఇంజనీర్ కావాలంటే ఏం చేయాలని నాన్నను అడిగా. ఐఐటీలో చదవాలన్నారు. నేను చేస్తా నన్ను చదివించండంటూ పట్టు బట్టాను. సరేనంటూ ఏడో తరగతి నుంచేఖమ్మం నగరంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఐఐటీ ఫౌండేషన్ కోర్సులో చేర్పించారు. అలా చిన్నప్పుడే పట్టుదలతో చదివాను. ఏ తరగతిలో ఉన్నా ఐఐటీ ధ్యాసగానే చదివాను.
 
 చదువొక్కటే తెలుసు:
 పుస్తకమే నా ప్రపంచం. తోటి విద్యార్థులకు దూరంగా ముభావంగా ఉండే స్వభావిని నేను. నన్ను గమనించిన కృష్ణవేణీ కళాశాల డెరైక్టర్ వై.వెంకటేశ్వర్‌రావు చుట్టూ ఉన్న సమాజం, సంబంధాలు మొదలైన అంశాల గురించి చెప్పేవారు. అందరితో కలిసి ఉండాలి.. అందరికంటే బాగా చదవాలని సలహా ఇచ్చారు. అప్పట్నుంచి చదువుపరంగా అర్థం కాని విషయాలను ఫ్రెండ్స్‌తో చర్చించడం మొదలు పెట్టాను. అధ్యాపకులను అడిగి తెలుసుకోవడం అలవాటైంది. ఇది పరీక్షల్లో ఎంతగానో ఉపయోగపడింది.
 
 ప్రణాళికే విజయ సోపానం:
 విద్యాసంవత్సరం ఆరంభం నుంచే టైం టేబుల్ ప్రకారం చదవడం అలవాటు చేసుకున్నాను. ఇంటర్‌లోనూ అలానే చేశాను. ఎప్పటికప్పుడు సిలబస్ పూర్తి చేశాను. దీంతో పరీక్షల సమయంలో ఏనాడూ ఒత్తిడికి లోనవలేదు. ఏమాత్రం అలసినట్లు అనిపించినా.. బోర్‌కొట్టినా షటిల్ అడటం.. ఆ తర్వాత మళ్లీ చదువుకోవడం ఇదే నా నిత్యకృత్యం.
 
 నాన్న సూచనలు:
 సిలబస్ పరంగా ఏ పుస్తకాలు చదవాలి? ఏ తరహాలో చదవాలనే విషయంలో నాన్న సూచనలు ఎంతగానో ఉపకరించాయి. అకడమిక్ సిలబస్‌నే అనుసరించమన్నారు. అకడమిక్ పుస్తకాలు చదివే సమయంలో కొత్తపదాలు. ముఖ్యమైన అంశాలను వెంటనే నోట్ చేసుకోవడం అలవాటు చేసుకోవడమెలా? అనే విషయాలపై మంచి సలహాలిచ్చేవారు. ఇలా చేయడంతో ఏ ప్రశ్నలు ఏ రూపంలో అడుగుతారో అవగాహన ఏర్పడింది. పరీక్షలంటే భయం పోయింది.
 
 గ్రాండ్ టెస్టులతో మేలు:
 ఎంత చదివాం అన్నది కాదు. చదివిన అంశాలను ఏ విధంగా పరీక్షల్లో అన్వయించామన్నదే కీలకం. అందుకోసం గ్రాండ్ టెస్టులు ఎంతో దోహదపడ్డాయి. 25కు పైగా ఐఐటీ గ్రాండ్ టెస్టులు రాశాను. వాటి ఫలితాలపై విశ్లేషించుకునే వాళ్లం. ఎక్కడ ఏ సబ్జెక్టులో పొరపాట్లు తలెత్తుతున్నాయో తెలిసేది. ఎందులో వెనుకబడి ఉన్నానో తెలుసుకొని ఆ అంశాలను మరింత లోతుగా చదివాను. ఇలా గ్రాండ్ టెస్టులతో తప్పులు సరిదిద్దుకునే అవకాశం వచ్చింది. మెయిన్స్, అడ్వాన్స్‌డ్ పరీక్షలు రాయడానికి మార్గం సుగమమైంది.
 
 ఖరగ్‌పూర్-ఐఐటీలో చేరతా:
 జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో జాతీయస్థాయిలో 137వ ర్యాంక్ వచ్చింది. ఖరగ్‌పూర్ ఐఐటీలో ఇంజనీరింగ్ పూర్తి చేస్తాను.  జాతీయ స్థాయిలో పోటీనా అనుకుంటే ఏదీ సాధించలేం. అలాని కోచింగ్ తీసుకుంటే వస్తుందని అనుకోవద్దు. పట్టుదల, ప్రణాళికతో సాగితే ఏదైనా సాధ్యమే. ఐఐటీ లక్ష్యంగా పెట్టుకున్న విద్యార్థులు ముందుగా ఒత్తిడి, భయాన్ని వీడాలి.
 
 లక్ష్యం... ఐఏఎస్:
 చిన్నప్పటి నుంచి తరగతిలో ప్రథమస్థానం నాదే. నా ప్రతిభను చూసిన ఉపాధ్యాయులు కలెక్టర్‌వి అవుతావు అనేవాళ్లు. టెన్త్ నుంచి ఇప్పటిదాకా నేను సాధించే విజయాలు చూస్తే ఆ నమ్మకం నిజమేననిపిస్తుంది. కంప్యూటర్ ఇంజనీరింగ్‌లో మంచి మార్కులు సాధించి ఆ తర్వాత సివిల్స్‌పై దృష్టి సారిస్తా. మా ఊరికి..ఆ తర్వాత జిల్లా ప్రజలకు సేవ చేస్తా.
 
 అకడమిక్ ప్రొఫైల్:
     పదో తరగతి (2012): 10/10
     ఇంటర్: 992 మార్కులు
     ఎంసెట్ ర్యాంకు(2014): 156
     బిట్‌శాట్ 2014 స్కోర్: 330
     జేఈఈ-మెయిన్ ర్యాంక్: 4
     జేఈఈ- అడ్వాన్స్‌డ్ ర్యాంక్: 137
 
 సహకారం:
 ఈరగాని భిక్షం, న్యూస్‌లైన్ ఖమ్మం.
 

మరిన్ని వార్తలు