ఇంటర్న్‌షిప్‌లో మెరవండిలా...

13 May, 2016 04:09 IST|Sakshi
ఇంటర్న్‌షిప్‌లో మెరవండిలా...


 వృత్తి విద్యా కోర్సులు చదువుతున్నవారు ఇంటర్న్‌షిప్‌ల్లో చేరుతున్న సమయం ఇది. ప్రొఫెషనల్ జీవితంలో ఇంటర్న్‌షిప్ చేయడం కెరీర్ నిర్మాణానికి తొలి మెట్టు. శాశ్వత ఉద్యోగం సాధించేందుకు ఇంటర్న్‌షిప్ దోహదపడుతుంది. అంతవరకు క్లాస్ రూం పాఠాలకే పరిమితమైన విద్యార్థి ఇంటర్న్‌షిప్ ద్వారా పని అనుభవం నేర్చుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇంటర్న్‌షిప్ సమయంలో అభ్యర్థులు ఏ విధంగా నడుచుకోవాలో నిపుణులు అందిస్తున్న సూచనలు..
 
 సంస్థపై అవగాహన
 అభ్యర్థులు ఇంటర్న్‌షిప్‌లో చేరబోయే ముందు ఆ సంస్థ గురించి పరిశోధన చేసి అవగాహన ఏర్పరచుకోవాలి. కంపెనీ చరిత్ర, బిజినెస్, చేపడుతున్న ప్రాజెక్టులు, ఆర్థిక సంవత్సరంలో కంపెనీ వెలువరించిన ఫలితాలు, బాస్, ఉద్యోగుల సంఖ్య తదితర వివరాలు తెలుసుకోవడం ద్వారా ఆత్మవిశ్వాసంతో ఆర్గనైజేషన్‌లో అడుగిడవచ్చు.
 
 ఫస్ట్ ఇంప్రెషన్
 ఇంటర్న్‌షిప్‌లో చేరిన మొదటి రోజు అభ్యర్థికి చాలా కీలకం. ముఖ్యంగా ఎంపికైన ఉద్యోగానికి అనుగుణంగా, కంపెనీ వాతావరణానికి ఇమిడిపోయేలా వ్యవహరించాలి. సహాద్యోగులు ధరించిన విధానానికి దగ్గరగా ఉండేలా దుస్తులు ధరించాలి. తద్వారా అభ్యర్థి మీద సదభిప్రాయం కలగడమే కాకుండా నిర్వర్తించబోయే ఉద్యోగం మీద ఆసక్తి ఉన్నట్లుగా అభిప్రాయానికి వచ్చే అవకాశం ఉంటుంది.
 
 ఉత్సాహంతో ముందుకు..
 అభ్యర్థులు తమ విధుల్లో ఉత్సుకత, అంకితభావం, వృత్తి పట్ల నిబద్ధతతో ఉండాలి. మీకు విషయ పరిజ్ఞానం పెద్దగా లేకపోయినప్పటికీ ఇతరులతో కలిసి పనిచేయగలిగే నేర్పు, కొత్తగా నేర్చుకోవడానికి ఆసక్తి కనబర్చగలిగే లక్షణాలు ఉంటే మీపై మంచి అభిప్రాయం కలుగుతుంది. సందేహాలు కలిగినప్పుడు భయం లేకుండా నివృత్తి చేసుకోవాలి. అవసరమున్నప్పుడు తోటి ఉద్యోగులకు సహాయం చేయాలి.
 
 సమయపాలన
 మీరు అక్కడ ఫుల్ టైం ఉద్యోగిగా భావించండి. సమయానికి కార్యాలయానికి చేరుకోవడం, ఇచ్చిన పనిని ముందుగా పూర్తి చేయడానికి ప్రయత్నించండి. దీంతో మిమ్మల్ని కంపెనీ శాశ్వత ఉద్యోగిగా నియమించుకునే అవకాశం ఉంటుంది.
 
 నిత్య విద్యార్థిగా
 ఇంటర్న్‌షిప్‌లో భాగంగా చేస్తున్న పనిలో తనలోని లోపాలను గుర్తించి వాటిని అధిగమించి నైపుణ్యాలు మెరుగుపరుచుకోవాలి. అదేవిధంగా కెరీర్‌కు ఉపయోగపడే కొన్ని ముఖ్యాంశాలను గుర్తించి వాటిపై దృష్టి సారించి, వాటిల్లో నిష్ణాతులుగా మారాలి. ఇలా ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతుండాలి.

మరిన్ని వార్తలు