‘స్ఫూర్తి’గా నిలిచిన ఉన్నత విజయం...

20 Mar, 2014 15:43 IST|Sakshi
‘స్ఫూర్తి’గా నిలిచిన ఉన్నత విజయం...

ఎంసెట్‌లో నాలుగు మార్కులు తగ్గడంతో ఎంబీబీఎస్ సీటు దూరమైంది.. అయినా నిరాశ చెందకుండా అందొచ్చిన బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ (బీడీఎస్)ని ఆమె సద్వినియోగం చేసుకున్నారు.. పక్కా ప్రణాళికతో చదివి, స్వర్ణ పతకం సాధించారు. ఆపై ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నిర్వహించిన ఎండీఎస్ ప్రవేశ పరీక్షలో మొదటి ర్యాంకు సాధించారు. చిత్తూరు జిల్లాకు చెందిన కె.స్ఫూర్తి రెడ్డి. పేరులోనే స్ఫూర్తిని నింపుకున్న ఆమె గెలుపు బాట అనుభూతుల్ని ‘భవిత’తో పంచుకున్నారు..

 

 మాది చిత్తూరు జిల్లా మదనపల్లి. నాన్న మల్లికార్జునరెడ్డి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల లెక్చరర్. అమ్మ విజయలక్ష్మి టీచర్. ఎనిమిదో తరగతి నుంచి బీడీఎస్ వరకు కర్నూల్‌లోని బాబాయి ప్రసాద్‌రెడ్డి ఇంట్లోనే ఉండి చదువుకున్నాను. వైద్యునిగా బాబాయికి ఉన్న గుర్తింపు, సేవ చేయడం ద్వారా ఆయన పొందుతున్న సంతృప్తి నాలో డాక్టర్ కావాలన్న ఆశను రేకెత్తించాయి. ఆయన స్ఫూర్తితో ఎప్పటికైనా గొప్ప డాక్టర్ కావాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాను.

 

 ‘పది’ నుంచే పట్టుదలతో:

 పదో తరగతిలో 600 మార్కులకు 557 మార్కులు తెచ్చుకున్నా. ఇంటర్మీడియెట్ బైపీసీలోనూ ఎక్కువ మార్కులు వచ్చాయి. ఎంసెట్-2007లో నాలుగు మార్కులు తగ్గడంతో ఎంబీబీఎస్ సీటు చేజారింది. బీడీఎస్ సీటు రావడంతో కర్నూలు పుల్లారెడ్డి మెడికల్ కాలేజీలో చేరాను. ఒక ప్రణాళిక ప్రకారం చదవడమనేది పదో తరగతి నుంచే అలవడింది. రోజువారీగా చదవాల్సిన అంశాలను ఒక పేపర్‌పై రాసి, గోడకు అంటించేదాన్ని. ఆ రోజు చదవాల్సిన పాఠాలు పూర్తయితేనే నిద్రపోయేదాన్ని. అది క్రమంగా అలవాటుగా మారింది. ఇదే పద్ధతిని బీడీఎస్‌లోనూ అనుసరించాను. 69 శాతం మార్కులతో కోర్సును పూర్తిచేశాను. చివరి సంవత్సరంలో స్వర్ణ పతకం సాధించాను.

 

 తొలి ప్రయత్నంలో నిరాశ:

 పీజీ ఎంట్రన్స్ రాయడం ఇది రెండోసారి. బీడీఎస్ పూర్తయిన వెంటనే రాసిన మొదటి ఎంట్రన్స్‌లో ఆశించిన ర్యాంకు రాలేదు. అందుకే కర్ణాటకలోని ఒక కోచింగ్ సెంటర్‌లో తొమ్మిది నెలలు శిక్షణ తీసుకున్నా. సబ్జెక్టుపై పూర్తి స్థాయిలో పట్టు సాధించాననే భావన నాలో ఉండేది. అది వాస్తవం కాదని శిక్షణ కేంద్రంలో చేరిన తర్వాత తెలిసింది. పాఠ్యాంశాలను రివిజన్ చేస్తూ, లోతైన అధ్యయనం చేయడం ముఖ్యమని గ్రహించాను.

 

కోచింగ్ క్లాస్‌లో చెప్పబోయే అంశాలను ముందే చదువుకొని వెళ్లేదాన్ని. దీంతో తరగతిలో చెప్పే పాఠాలు రివిజన్‌లా ఉండేది. రోజువారీ పరీక్షలు రాసి, తప్పులను సరిదిద్దుకునేదాన్ని. పీజీ ఎంట్రన్స్‌లో 100కు 89 మార్కులు వచ్చాయి. ఉస్మానియాలో మెడికల్ కాలేజీలో పీజీ పూర్తిచేసి, మంచి డాక్టర్‌గా పేరుతెచ్చుకోవాలన్నది నా లక్ష్యం. అమ్మా, నాన్న ఇచ్చిన ప్రోత్సాహం వల్లే ఈ విజయం సాధ్యమైంది.

 

ఎప్పటికప్పుడు ప్రిపరేషన్‌లో లోటుపాట్లను గుర్తించి, సరిదిద్దుకుంటూ ముందుకు సాగాలి. మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జరీ (ఎండీఎస్) ఎంట్రన్స్‌లో 60 శాతం ప్రశ్నలు తేలిగ్గా ఉంటాయి. మిగిలిన 40 శాతం ప్రశ్నలు క్లిష్టంగా ఉంటాయి. ర్యాంకింగ్‌కు ప్రతి మార్కూ కీలకమే.

 

 డెంటల్ పల్స్‌తో మేలు:

 తప్పులను సమీక్షించుకుంటూ నిజాయితీగా కష్టపడి చదవాలి. పీజీ ఎంట్రన్స్‌లో బీడీఎస్ విద్యార్థులకు ‘డెంటల్ పల్స్’ పుస్తకం ప్రామాణికమైంది. దాన్ని ఎన్నిసార్లు రివిజన్ చేస్తే అంత మంచిది. రివిజన్ చేసిన ప్రతిసారీ కొత్త విషయాలు తెలుస్తాయి. డాక్టర్ గౌరీశంకర్ రాసిన పుస్తకాలతో పాటు టెక్స్ట్‌బుక్స్ చదువుతూ, పాత ప్రశ్నపత్రాలను సాధన చేస్తే విజయం సులువవుతుంది.

 

‘‘అకడమిక్ అంశాలు చదవగానే అంతా వచ్చినట్లే ఉంటుంది. అదే భావనతో పరీక్షకు హాజరైతే ఉత్తీర్ణత సాధిస్తాంగానీ ర్యాంకులు సాధించలేమన్నది గుర్తించాలి. ఇది నాకు స్వీయ అనుభవంలోకి వచ్చాక, విజయం సాధించేందుకు అవసరమైన మార్గం కనిపించింది. ఫలితం ఎండీఎస్ ఎంట్రన్స్‌లో మొదటి ర్యాంకు’’

కె.స్ఫూర్తి రెడ్డి.

మరిన్ని వార్తలు