మీరూ జర్నలిస్టు కావచ్చు!

24 Oct, 2013 13:14 IST|Sakshi

సామాజిక అవగాహన, భాషపై పట్టుంటే...
 
ప్రసార మాధ్యమాలు.. జాతి హృదయ స్పందనను కళ్లకు కట్టే అత్యుత్తమ సాధనాలు. సమాజానికి నిలువుటద్దంగా ఉంటూ సామాన్య ప్రజల రోజు వారీ సమస్యలకు పరిష్కారాన్ని చూపే నిజమైన వేదికలు.. కేవలం సమాచారాన్ని అందించడమే కాదు.. లక్షణమైన అక్షరాలే అస్త్రాలుగా, మేలిమి మాటలే తూటాలుగా చేసుకొని ప్రజా సమస్యలపై పోరాడటంలోనూ, చైతన్యవంతుల్ని చేయడంలోనూ మీడియా కీలక పాత్ర పోషిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో యువత ముందు ఉత్తమ కెరీర్ ఆప్షన్‌గా ఉన్న జర్నలిజంపై స్పెషల్ ఫోకస్..
 

 దేశంలోని మీడియా రంగంలో పెట్టుబడుల ప్రవాహం పెరుగుతుండటంతో అనేక కొత్త సంస్థలు ప్రవేశిస్తున్నాయి. కొత్త పత్రికలు, చానళ్లు, మ్యాగజైన్లు, వెబ్ పోర్టల్స్ ప్రారంభమవుతున్నాయి. ముఖ్యంగా 24 గంటల న్యూస్ చానళ్ల సంఖ్య అధికమవుతోంది. దీంతో సుశిక్షితులైన మానవ వనరుల కోసం తీవ్ర డిమాండ్ ఏర్పడుతోంది. అందువల్ల విశ్వవిద్యాలయాలు జర్నలిజంలో వివిధ కోర్సులను అందుబాటులో ఉంచుతున్నాయి.
 
 ఇదే సమయంలో ఎప్పటికప్పుడు నిత్య నూతనంగా ఉండటంతోపాటు ఆకర్షణీయ ఆదా యం, సమాజానికి సేవచేసే అవకాశం లభిస్తుండటంతో యువత జర్నలిజం వైపు అడుగులు వేస్తోంది. ఇంగ్లిష్, కామర్స్, ఎకనామిక్స్ కోర్సులతో సమానంగా జర్నలిజం కోర్సులకు క్రేజ్ పెరుగుతోంది. ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది ఢిల్లీ యూనివర్సిటీలో జర్నలిజం కోర్సుకు 59 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయంటే జర్నలిజం కెరీర్‌పై యువతకు ఎంతటి మక్కువ ఉందో అర్థం చేసుకోవచ్చు.
 
 డిప్లొమా నుంచి డాక్టోరల్ వరకు:
 మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో దాదాపు అన్ని విశ్వవిద్యాలయాలు డిప్లొమా, పీజీ డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పీజీ, డాక్టోరల్ స్థాయి కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. జర్నలిజానికి పెరుగుతున్న ప్రాధాన్యత దృష్ట్యా బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో గ్రూప్ సబ్జెక్ట్‌ల్లో జర్నలిజం ఒక సబ్జెక్టుగా ఆఫర్‌చేసే కళాశాలలూ ఉన్నాయి. బ్యాచిలర్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం (బీసీజే), మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం (ఎంసీజే) కోర్సులను ఎక్కువ మంది ఎంపిక చేసుకుంటున్నారు. ఇగ్నో, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వంటివి దూరవిద్యలో జర్నలిజం కోర్సులను అందుబాటులో ఉంచుతున్నాయి. ఇంటర్, డిగ్రీ విద్యార్హతలతో కోర్సుల్లో చేరొచ్చు.  
 
 రాష్ట్రం బయట కోర్సులు అందించే వాటిలో యూనివర్సిటీ ఆఫ్ లక్నో, బెనారస్ హిందూ యూనివర్సిటీ, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్, సింబయాసిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మీడియా అండ్ మాస్ కమ్యూనికేషన్ వంటివి ఉన్నాయి. ఇంగ్లిష్, ప్రాంతీయ భాషా మాధ్యమాల్లో కోర్సులను ఆఫర్ చేస్తున్నారు.
 
 
 కోర్సుల్లో బోధించే అంశాలు:

 జర్నలిజం కోర్సు కరిక్యులంను తరగతి గది పాఠాలు, క్షేత్రస్థాయి ప్రాక్టికల్ వర్క్, గెస్ట్ లెక్చర్స్, ఇంటర్న్‌షిప్ మేళవింపుగా రూపొందిస్తున్నారు. ఇందులోని కొన్ని అంశాలు..
 
 కమ్యూనికేషన్ అండ్ మాస్ మీడియా ప్రాథమిక భావనలు.
 ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా.
 అడ్వర్టైజింగ్, మ్యాగజైన్ అండ్ ఫొటో జర్నలిజం.
 రిపోర్టింగ్ అండ్ ఎడిటింగ్.
 క్రియేటివ్ థింకింగ్ అండ్ రైటింగ్.
 కార్పొరేట్ అండ్ ఆర్గనైజేషనల్ కమ్యూనికేషన్.
 ట్రెండ్స్ ఇన్ కమ్యూనికేషన్.
 డెవలప్‌మెంట్ అండ్ రూరల్ కమ్యూనికేషన్.
 మీడియా లాస్ అండ్ ఎథిక్స్.
 
 సొంతంగా శిక్షణ కేంద్రాలు:
 ప్రస్తుతం మీడియా రంగంలో తీవ్ర పోటీ వాతావరణం నెలకొంది. అందువల్ల సమర్థులైన మానవ వనరుల కోసం మీడియా సంస్థలు ఎదురుచూస్తున్నాయి. ఈ క్రమంలో అనేక పత్రికలు, చానళ్లు సొంతంగా జర్నలిజం శిక్షణ సంస్థలను ఏర్పాటు చేసి, తమకు అవసరమైన సిబ్బందిని నియమించుకుంటున్నాయి. మరికొన్ని మీడియా సంస్థలు నేరుగా విశ్వవిద్యాలయాల్లో కోర్సులు పూర్తిచేసిన వారికి ఉద్యోగాలు ఇస్తున్నాయి. మన రాష్ట్రంలో ప్రధాన దినపత్రికలన్నింటికీ సొంతంగా జర్నలిజం స్కూళ్లు ఉన్నాయి. అవసరాన్ని బట్టి వీటిలో ప్రవేశాలకు నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నాయి. జాతీయస్థాయి సంస్థలైన ది హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఎన్డీటీవీ సొంతంగా జర్నలిజం శిక్షణ కేంద్రాలను నడుపుతున్నాయి.
 
 ఉద్యోగ అవకాశాలు:
 జర్నలిజం కోర్సులు పూర్తిచేసిన వారికి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో విస్తృత ఉద్యోగావకాశాలు అందుబాటులో ఉన్నాయి. ప్రారంభంలో పత్రికలు, చానళ్లలో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్/కాపీ ఎడిటర్‌గా ఉద్యోగాలు లభిస్తాయి. రిపోర్టర్.. క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. పనిచేసే ప్రాంతంలో ప్రతిరోజూ జరిగే కీలక పరిణామాలను గమనిస్తూ కథనాలు, వార్తలు రాయాల్సి ఉంటుంది.
 
 సబ్‌ఎడిటర్ లేదా కాపీ ఎడిటర్.. రిపోర్టర్లు తీసుకొచ్చిన వార్తలను సమగ్రంగా తీర్చిదిద్దుతారు. న్యూస్ ఏజెన్సీలు అందించే ఇంగ్లిష్ వార్తలను స్థానిక భాషలోకి అనువదించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ వార్తలను ప్రచురించడం లేదా ప్రసారం చేయడం జరుగుతుంది.
 
 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విభాగాల్లో పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ (పీఆర్‌వో) నియామకాల కోసం నిర్వహించే పరీక్షల్లో ప్రతిభ కనబరిచి ఉన్నత కొలువులను సొంతం చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు ఎస్‌ఎస్‌సీ, రాష్ట్ర ఉద్యోగ నియామక సంస్థలు ప్రకటనలు జారీచేస్తుంటాయి.
 
 ప్రైవేటు వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు జర్నలిజం కోర్సులు పూర్తిచేసిన వారిని అధిక వేతనాలతో పీఆర్‌వోలుగా నియమించుకుంటున్నాయి.
 
 బీసీజే అర్హత ఉన్నవారు ఎంసీజే, ఎంఫిల్, పీహెచ్‌డీ వంటి ఉన్నత విద్యా కోర్సులను దిగ్విజయంగా పూర్తిచేసి రీసెర్చ్ సంస్థల్లో చేరొచ్చు.
 
 యూజీసీ-నెట్‌లో అర్హత సాధించి విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యా సంస్థల్లో జర్నలిజం ఫ్యాకల్టీగా స్థిరపడొచ్చు.
 
 యూజీసీ-నెట్ జేఆర్‌ఎఫ్‌కు అర్హత సాధిస్తే పరిశోధన చేసేందుకు అయిదేళ్లపాటు నెలకు రూ. 22 వేల స్టైపెండ్ కూడా లభిస్తుంది.
 
 ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పనిచేయొచ్చు. సొంతంగా కన్సల్టెన్సీ సంస్థలను నెలకొల్పవచ్చు.
 
 అవసరమైన నైపుణ్యాలు:
 సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు, చొరవ, కష్టపడే తత్వం.
 రోజువారీ లక్ష్యాలు, వాటి సాధనకు వ్యూహ రచన సామర్థ్యం.
 కమ్యూనికేషన్ స్కిల్స్ (లిజనింగ్, రైటింగ్, స్పీకింగ్..).
 ఆత్మవిశ్వాసం, ఒత్తిడిని ఎదుర్కొనే సామర్థ్యం.
 భాష, స్వేచ్ఛానువాద నైపుణ్యం.
 సృజనాత్మకంగా ఆలోచించడం.
 సామాజిక అంశాలపై పట్టు.
 వేగం (Speed), స్పష్టత (Clarity), కచ్చితత్వం (Accuracy). ఇవి జర్నలిజం కెరీర్‌కు మూలస్తంభాలు.
 
 టాప్ రిక్రూటర్స్:
 ఎన్డీటీవీ నెట్‌వర్క్
 జీ టీవీ నెట్‌వర్క్.
 బీబీసీ.
 18 నెట్‌వర్క్.
 ఇండియా టుడే గ్రూప్.
 
 కెరీర్ అవకాశాలు
 ప్రింట్ మీడియా
 న్యూస్ పేపర్స్, మ్యాగజైన్లు, బుక్స్, జర్నల్స్..
 ఉద్యోగాలు: రైటర్, ఫీచర్ రైటర్, రిపోర్టర్, సబ్‌ఎడిటర్, ఫొటో జర్నలిస్టు, కార్టూనిస్టు, ఆర్ట్ డెరైక్టర్ వంటివి.
 
 ఎలక్ట్రానిక్ మీడియా
 టీవీ చానళ్లు, వెబ్ పోర్టల్స్, రేడియో..
 ఉద్యోగాలు: కరస్పాండెంట్, స్పెషల్ కరస్పాండెంట్, ప్రెజెంటర్, న్యూస్ రీడర్, ప్రోగ్రాం ప్రొడ్యూసర్, సౌండ్ టెక్నీషియన్, స్క్రీన్ రైటర్, కెమెరామెన్, వీడియో ఎడిటర్, రేడియో జాకీ, కంటెంట్ డెవలపర్ వంటివి.
 వెబ్ మీడియా ఇప్పుడు ఎమర్జింగ్ మీడియాగా వెలుగొందుతోంది. ఫ్యాషన్, హెల్త్, పాలిటిక్స్, బిజినెస్, ఎడ్యుకేషన్.. ఇలా వివిధ అంశాలకు సంబంధించి వెబ్‌సైట్లు ఏర్పాటు చేస్తుండటంతో అవకాశాలు పెరిగాయి.
 
 జర్నలిస్టుగా సేవలందించే విభాగాలు:
 పాలిటిక్స్, బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, ఫీచర్స్ అండ్ లైఫ్‌స్టైల్, ఫ్యాషన్, ఫిల్మ్స్, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్, అగ్రికల్చర్, లిటరరీ, డెవలప్‌మెంట్.
 
 వేతనాలు:

 ప్రారంభంలో రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు వరకు వేతనం ఉంటుంది. తర్వాత విద్యార్హతలు, ప్రతిభ, పనితీరు ఆధారంగా నెలకు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు పే ప్యాకేజీని అందుకోవచ్చు.
 
 

 

 జర్నలిజం..  అపార అవకాశాలకు వేదిక!
 మీడియా శరవేగంగా విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో తగిన నైపుణ్యాలున్న మానవ వనరులకు తీవ్ర డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో విశ్వవిద్యాలయాలు వివిధ కోర్సులను అందుబాటులో ఉంచుతున్నాయి. ఇప్పుడు ఎంసీజే కోర్సుపై ఎక్కువ మంది విద్యార్థులు ఆసక్తి కనబరుస్తున్నారు. రెగ్యులర్ లేదా డిస్టెన్స్ విధానంలో జర్నలిజం కోర్సు పూర్తిచేసిన వారికి విస్తృత ఉద్యోగావకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఔత్సాహికులు తమ అభిరుచికి అనుగుణంగా ప్రింట్, ఎలక్ట్రానిక్, వెబ్ మీడియాను ఎంపిక చేసుకోవచ్చు.
 
రిపోర్టర్లు, సబ్ ఎడిటర్లు, ఫీచర్ ఎడిటర్లు వంటి ఉద్యోగాలు పొందొచ్చు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని వివిధ సంస్థల్లో పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ అవకాశాలను అందిపుచ్చుకోచ్చు. జర్నలిజం వృత్తిలో రాణించాలంటే ఒక ప్రాంతీయ భాషతో పాటు ఇంగ్లిష్, హిందీ పరిజ్ఞానం అవసరం. భావ వ్యక్తీకరణ సామర్థ్యం, సామాజిక అంశాలపై అవగాహన, సమయస్ఫూర్తి, వార్తలను పసిగట్టే స్వభావం వంటి నైపుణ్యాలు ఓ వ్యక్తిని జర్నలిజంలో ఉన్నత స్థానంలో నిలబెడతాయి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే జర్నలిజం కెరీర్‌లోకి అడుగుపెట్టిన వారు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ప్రధానం.  మద్యం, ధూమపానం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి.

 - డాక్టర్ బాలస్వామి, హెచ్.ఓ.డి,
 కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం, ఓయూ.
 

జర్నలిజంలో ఉన్నత స్థానాలకు ఎదగాలనుకునే ఔత్సాహికులు డిప్లొమా కోర్సులకు బదులు యూజీసీ గుర్తింపు ఉన్న ఎంసీజే కోర్సును ఎంపిక చేసుకొని, పూర్తిచేయడం ఉత్తమ మార్గం. ఈ కోర్సు పూర్తిచేసిన వారికి పత్రికలు, చానళ్లతో పాటు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, ప్రసార భారతి, అడ్వర్టైజింగ్ అండ్ విజువల్ పబ్లిసిటీ తదితర కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో అవకాశాలుంటాయి. భాషా పరిజ్ఞానం, వర్తమాన వ్యవహారాలను విశ్లేషించే సామర్థ్యం, సామాజిక స్పృహ, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే జర్నలిజంలో రాణించవచ్చు. నేను పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సీటీలో ఎంసీజే చేశాను. పీఐబీ-ప్రెస్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ పరీక్షలో విజయం సాధించాను. ఇంటర్వ్యూలో భాష సామర్థ్యం, సామాజిక అనుసంధానం, జర్నలిజం తదితరాలపై ప్రశ్నలు అడిగారు.
 
 - శ్రీరాముల శ్రీకాంత్,
 ప్రెస్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, పీఐబీ.
 
 రూ. 83 వేల కోట్ల విలువైన భారతీయ మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ (క-ఉ) మార్కెట్ శరవేగంగా విస్తరిస్త్తోంది. ఏటా అధిక వృద్ధిని నమోదు చేసుకుంటూ దూసుకెళ్తోంది.
భారతీయ టెలివిజన్ మార్కెట్ రెవెన్యూ 2011లో రూ. 34 వేల కోట్లుంటే, అది 2012 నాటికి రూ. 38 వేల కోట్లకు చేరింది.
 2012లో రూ. 21 వేల కోట్ల మేర ఉన్న ప్రింట్ సెక్టార్ రెవెన్యూ 2017 నాటికి రూ. 33 వేల కోట్లకు చేరుతుందని అంచనా.

మరిన్ని వార్తలు