ఆభరణాలకు రూపమిచ్చే.. జువెలరీ డిజైనర్

15 Jul, 2014 00:25 IST|Sakshi
ఆభరణాలకు రూపమిచ్చే.. జువెలరీ డిజైనర్

అప్‌కమింగ్ కెరీర్: మేని ఆందాన్ని ద్విగుణీకృతం చేసే ఆభరణాలతో భారతీయుల అనుబంధాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. ఆకర్షణీయమైన ఆభరణానికి రూపమిచ్చే కళాకారుడు.. జువెలరీ డిజైనర్. దేశంలో నగల వ్యాపారం వందల నుంచి వేల కోట్ల రూపాయలకు చేరడంతో డిమాండ్ పెరుగుతున్న కెరీర్.. జువెలర్ డిజైనింగ్.  జువెలరీ డిజైనింగ్ అనేది ప్రధానంగా సృజనాత్మక ప్రక్రియ. అప్పటివరకు మార్కెట్‌లోని లేని కొత్త డిజైన్‌ను తయారు చేయాలంటే అపూర్వమైన ఊహ శక్తి ఉండాలి. వినియోగదారుల అభిరుచులు, అవసరాలు తప్పనిసరిగా తెలిసి ఉండాలి. ప్రజల సంస్కృతులు, సంప్రదాయాలు, వారు ధరించే నగలపై అవగాహన పెంచుకోవాలి.  జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వస్తున్న నూతన డిజైన్‌లను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. వాటి కంటే భిన్నంగా చేయగల నైపుణ్యం సాధించాలి.
 
 అనుభవజ్ఞులకు ఉపాధి అవకాశాలు
 దేశంలో జువెలరీ డిజైనర్లకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. అనుభవం కలిగిన డిజైనర్లకు రూ.లక్షల్లో వేతనాలు లభిస్తున్నాయి. నిధులు లభిస్తే సొంతంగా డిజైనింగ్ యూనిట్‌ను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఆభరణాల డిజైన్లను జువెలరీ సంస్థలకు విక్రయించుకోవడం ద్వారా అధిక ఆదాయం పొందొచ్చు. మనదేశంతోపాటు విదేశాల్లోనూ డిజైనర్లకు మంచి అవకాశాలున్నాయి.
 
 అర్హతలు..
 ఇంటర్మీడియెట్ పూర్తిచేసిన తర్వాత జువెలరీ డిజైన్‌లో డిప్లొమా ప్రోగ్రామ్ లేదా గ్రాడ్యుయేషన్ కోర్సును చదవాలి. తర్వాత పోస్టుగ్రాడ్యుయేషన్, ఇంటర్న్‌షిప్ కూడా పూర్తిచేస్తే మెరుగైన అవకాశాలను దక్కించుకోవచ్చు. కొన్ని సంస్థలు స్వల్పకాలిక కోర్సులను కూడా ఆఫర్ చేస్తున్నాయి.
 
 వేతనాలు..
 జువెలరీ డిజైనర్లకు ఎక్కువగా ప్రైవేట్ రంగంలో అవకాశాలు లభిస్తున్నాయి. ప్రారంభంలో పనితీరు ఆధారంగా నెలకు రూ.10 వేల నుంచి రూ.25 వేల దాకా అందుకోవచ్చు. తర్వాత సీనియారిటీని బట్టి నెలకు రూ.లక్ష దాకా వేతనం పొందొచ్చు.
 
 జువెలరీ డిజైన్ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు
 ఏ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిఫ్ట్)
 వెబ్‌సైట్: http://www.nift.ac.in/
 ఏ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్(ఎన్‌ఐడీ)-అహ్మదాబాద్
 వెబ్‌సైట్: http://www.nid.edu/
 ఏ జువెలరీ డిజైన్ అండ్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్-నోయిడా
 వెబ్‌సైట్: http://www.jdtiindia.com/   
 ఏ ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ
 వెబ్‌సైట్: http://www.iiftindia.net/
 
 మోడ్రన్ కెరీర్... జువెలరీ డిజైనింగ్
 ‘ప్రజల అభిరుచుల్లో చాలా మార్పులొచ్చాయి. దానికి తగినట్లుగా ఫ్యాషన్ డిజైనింగ్‌లోనూ కొత్తదనం చోటుచేసుకుంటోంది. జువెలరీ డిజైన్ కోర్సు ఇప్పుడున్న ఫ్యాషన్ ప్రపంచంలో అగ్రగామి అనే చెప్పొచ్చు.  జువెలరీలోనూ విభిన్నమైన మోడల్స్ వస్తున్నాయి. డ్రెస్సింగ్, టైం సెన్స్, అప్పియరెన్స్‌కు తగిన ఆభరణాలను ధరించటం ఫ్యాషన్‌లో భాగమైంది. దీంతో ఈ కోర్సు చేసిన యువతకు అవకాశాలు పెరుగుతున్నాయి. ఢిల్లీ, ముంబై, పుణె వంటి నగరాల్లో బాగా డిమాండ్ ఉంది. హైదరాబాద్‌లో రెండు మూడేళ్లుగా క్రేజ్ సంపాదించుకుంది. మంచి వేతనంతో ఉద్యోగ అవకాశాలున్నాయి. ఆర్థిక వెసులుబాటు ఉంటే.. డిజైనింగ్ షోరూం ఏర్పాటుచేసుకోవచ్చు’’
 - డి.గోపాలకృష్ణ, జాయింట్ డెరైక్టర్ (నిఫ్ట్) హైదరాబాద్

>
మరిన్ని వార్తలు