ఇంజినీరింగ్ సర్వీసెస్‌లో ఎవరెస్ట్... ఐఈఎస్

27 Mar, 2014 14:43 IST|Sakshi

అఖిల భారత సర్వీసుల్లో ఐ.ఎ.ఎస్, ఐ.పి.ఎస్‌ల తర్వాత అత్యున్నత స్థాయిల్లో  నిలిచే వాటిలో ఐఈఎస్ (ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీస్) ఒకటి. కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఇంజినీరింగ్ కెరీర్‌తో ఉన్నత శిఖరాలను అధిరోహించాలనుకునేవారికి సువర్ణావకాశం ఐఈఎస్. యూపీఎస్సీ ఏటా నిర్వహించే ఈ పరీక్షకు తీవ్రమైన పోటీ నెలకొని ఉంటుంది.. ప్రణాళిక ప్రకారం ప్రిపేర్ అయితేనే విజయం సాధ్యం.. ఐఈఎస్-2014 నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో సంబంధిత వివరాలు..
 

 

మొత్తం 4 బ్రాంచ్‌లలో ఐఈఎస్ పరీక్ష ఉంటుంది. అవి..
 కేటగిరీ    {బాంచ్
 1.సివిల్ ఇంజినీరింగ్
 2.మెకానికల్ ఇంజినీరింగ్
 3. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్
 4.ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్
 
 భర్తీ చేసే విభాగాలు
 ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ ఇంజినీర్స్
 సెంట్రల్ ఇంజినీరింగ్ సర్వీస్
 ఇండియన్ డిఫెన్స్ సర్వీస్ ఆఫ్ ఇంజినీర్స్
 సర్వే ఆఫ్ ఇండియా గ్రేడ్-ఎ సర్వీస్
 ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ సర్వీస్
 ఇండియన్ ఇన్‌స్పెక్షన్ సర్వీస్
 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్
 ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్స్
 సెంట్రల్ పవర్ ఇంజినీరింగ్ సర్వీస్ గ్రేడ్-ఎ
 అసిస్టెంట్ నావల్ స్టోర్స్ ఆఫీసర్స్
 సెంట్రల్ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్ సర్వీస్
 ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజినీర్స్
 ఇండియన్ రైల్వే స్టోర్స్ సర్వీస్
 సెంట్రల్ ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజినీరింగ్ సర్వీస్
 
 రెండు దశల్లో ఎంపిక:
 రాతపరీక్ష, ఇంటర్వ్యూ (పర్సనాలిటీ టెస్ట్) అనే రెండు దశల  ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
 
 పరీక్ష స్వరూపం:
 పార్ట్ 1 రాతపరీక్షలో రెండు విభాగాలుంటాయి. సెక్షన్ 1 ఆబ్జెక్టివ్, సెక్షన్ 2 డిస్క్రిప్టివ్ (వ్యాసరూపం)లో ఉంటుంది. రెండు సెక్షన్‌లకు మొత్తం 1000 మార్కులుంటాయి.
 
 సెక్షన్-2 డిస్క్రిప్టివ్ (కన్వెన్షనల్):
 ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. ప్రతి పేపర్‌కు 200 మార్కులుంటాయి. ఒక్కో దానికి సమయం 3 గంటలు.
 పేపర్-1: ఏడు ప్రశ్నలుంటాయి. ఏవైనా ఐదింటికి సమాధానాలు రాయాలి. ఒక్కోదానికి 40 మార్కులు.
 పేపర్-2: మొదటి ప్రశ్నకు తప్పనిసరిగా సమాధానం రాయాల్సి ఉంటుంది. దీనికి 80 మార్కులు. ఇదే ప్రశ్నకు సంబంధించి మరో 10 అనుబంధ ప్రశ్నలుంటాయి. ఇం దులో మిగిలిన రెండు సెక్షన్లకు మొత్తం 120 మార్కులు.
 సెక్షన్-ఎ లో మూడు ప్రశ్నలుంటాయి. వీటిలో ఏవైనా రెండింటికి సమాధానం రాయాలి. ఒక్కోదానికి 30 మార్కులు.
 సెక్షన్-బి లోనూ ఇదే పద్ధతి ఉంటుంది. ఇందులో నెగెటివ్ మార్కులు ఉండవు. కానీ దస్తూరీ ఆకర్షణీయంగా లేకపోతే 5 శాతం వరకు మార్కులు తగ్గవచ్చు.
 పేపర్-2: ఇంటర్వ్యూ (పర్సనాలిటీ టెస్ట్)
 రాతపరీక్షలో అర్హత సాధించిన వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. దీనికి 200 మార్కులుంటాయి.
 
 ప్రశ్నల స్థాయి (పేపర్-1)
 ప్రాథమిక పరిజ్ఞానం    40 శాతం,
 అప్లికేషన్ పద్ధతి     40 శాతం
 ఫార్ములా, గ్రాఫ్స్     15 శాతం
 రీజనింగ్    05 శాతం
 
 ప్రశ్నల స్థాయి (పేపర్-2)
 పేపర్-2 వ్యాసరూప ప్రశ్నల విషయానికి వస్తే బీటెక్ సిలబస్‌కు అనుబంధంగానే ఉంటాయి. పెద్దగా వ్యత్యాసం ఉండదు.
 
 రాతపరీక్ష
 జనరల్ ఇంగ్లిష్: ఈ విభాగంలో ఇంగ్లిష్ భాషపై ప్రాథమిక పరిజ్ఞానాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. సినానిమ్స్, యాంటానిమ్స్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, స్పాటింగ్ ఎర్రర్స్, కాంప్రహెన్షన్ తరహా ప్రశ్నలు వస్తాయి. స్మృతి ఆధారిత ప్రశ్నలు కాబట్టి సులువుగానే సమాధానాలను గుర్తించవచ్చు.
 జనరల్ స్టడీస్: ఈ విభాగంలో కరెంట్ అఫైర్స్‌తోపాటు భారతదేశ చరిత్ర, భూగోళశాస్త్రం, ప్రభుత్వ పరిపాలన, సైన్స్ అండ్ టెక్నాలజీ, కార్పోరేట్ గవర్నెన్స్, జనాభా లెక్క లు, ప్రపంచ బ్యాంక్ తదితర అంశాల నుంచి ప్రశ్నలు వచ్చే వీలుంది. ఎక్కువ భాగం మాత్రం కరెంట్ అఫైర్స్ నుంచే అడుగుతారు. కనుక పరీక్ష తేదీకి ఏడాదికి ముందు కాలం లో చోటుచేసుకున్న ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో సంఘటనలు, క్రీడలు, అవార్డులు, వార్తల్లో వ్యక్తులపై ఎక్కువ దృష్టిపెట్టాలి.
 
 ఇంజినీరింగ్‌ఆబ్జెక్టివ్ పేపర్లు:
 ఇంజినీరింగ్ ఆబ్జెక్టివ్ పేపర్-1, పేపర్-2లలోని ప్రశ్నలు... బ్రాంచ్‌ల వారీగా బీఈ/బీటెక్ స్థాయిలో ఉంటాయి. పునస్మరణ, విశ్లేషణ, అన్వయం, ఎర్రర్, డిటెక్షన్ వంటి అంశాల ఆధారంగా ప్రశ్నలు వస్తాయి. ఇందులో అడిగే ప్రశ్నలకు కేటాయించిన సమయాన్ని పరిశీలిస్తే... మొత్తం 120 ప్రశ్నలకు 120 నిమిషాలు మాత్రమే. అంటే ప్రతి ప్రశ్నకు సమయం నిమిషం మాత్రమే. అందువల్ల వేగం, కచ్చితత్వం అవసరం. కాలిక్యులేటర్లను పరీక్ష హాలులోకి అనుమతించరు. గుర్తుంచుకోదగిన విషయం ఏమిటంటే.... సెక్షన్-1లోఅర్హత మార్కులు వస్తేనే కన్వెన్షనల్ (సెక్షన్-2) జవాబు పత్రాలు దిద్దుతారు.
 
 కన్వెన్షనల్ పేపర్లు:
 సెక్షన్-2లో ఉండే రెండూ పూర్తిగా కన్వెన్షనల్ పేపర్లు. సెక్షన్-1లోని ఆబ్జెక్టివ్ పేపర్లను సమగ్రంగా ప్రిపేరైతే కన్వెన్షనల్ పేపర్లను కూడా సులువుగా రాయొచ్చు. ఉదాహరణకు ఈసీఈలోని నెట్‌వర్క్ థియరీ టాపిక్‌ను బాగా ప్రిపేర్ అయితే అనలాగ్ సర్క్యూట్స్, కంట్రోల్ సిస్టమ్ అంశాలు సులువు అవుతాయి. కన్వెన్షనల్ విభాగంలోని పేపర్-1లో 7 ప్రశ్నలుంటాయి. వీటిలో ఐదింటికి సమాధానాలు రాయాలి. పేపర్-2లో మొత్తం 9 ప్రశ్నలుంటాయి. ఇందులో మొదటి ప్రశ్న విధిగా రాయాలి. సెక్షన్-ఎ లోని 4 ప్రశ్నలకు 2 ప్రశ్నలు. సెక్షన్-బిలోని 4 ప్రశ్నలకు ఏవైనా రెండిటికి సమాధానాలు రాయాలి. గ్రాఫ్స్‌ను ఉపయోగిస్తే మెరుగైన స్కోరుకు ఆస్కారం ఉంటుంది. పరీక్ష హాలులోకి కాలిక్యులేటర్‌ను అనుమతిస్తారు. ఇందులో డెరివేషన్స్, ప్రాక్టికల్ అప్లికేషన్లకు సంబంధించిన న్యుమరికల్ ప్రశ్నలు, కొంతమేర థియరీకి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. ఎన్ని ప్రశ్నలకు సమాధానం రాశామని కాకుండా సరైన సమాధానాలెన్ని రాశామనేదే ముఖ్యం. కొట్టివేతలు లేకుండా నీట్‌గా సమాధానాలు ఇవ్వాలి. లేదంటే 5 శాతం మార్కులు తగ్గే ప్రమాదం ఉంది.
 
 ఇంటర్వ్యూ
 ఈ విభాగానికి 200 మార్కులు కేటాయించారు. రాతపరీక్షలో ఫలితాన్ని అనుసరించి 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూలో అభ్యర్థి నాయకత్వ లక్షణాలు, మానసిక, శారీరక దృఢత్వం,  పని-బాధ్యతల పట్ల ఆసక్తి, నిజాయితీ వంటి  లక్షణాలను క్షుణ్నంగా పరిశీలిస్తారు. ఎంఈ/ఎంటెక్ అభ్యర్థులను వారి స్పెషలైజేషన్‌కు సంబంధించిన ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. సబ్జెక్టు ఆధారిత ప్రశ్నలు, వర్తమాన వ్యవహారాలకు సంబంధించిన అంశాలపై అవగాహన ఉందో లేదో   పరిశీలిస్తారు. బీటెక్/ఎంటెక్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన విషయాలు కూడా ప్రిపేర్ అవడం ఉపయోగకరం. ఉద్యోగం చేస్తుంటే ... దానికి సంబంధించి కూడా ప్రశ్నలు అడిగే అవకాశం ఎక్కవ.
 
 ఐఈఎస్-2014 సమాచారం
 పోస్టుల సంఖ్య:582
 అర్హత: సంబంధిత బ్రాంచ్‌లో ఇంజినీరింగ్ డిగ్రీ(ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, సివిల్, మెకానికల్) లేదా తత్సమానం. ఫైనల్ ఇయర్ విద్యార్థులు కూడా పరీక్షకు హాజరుకావచ్చు. ఎంఎస్సీ/తత్సమాన కోర్సులో వైర్‌లెస్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్, రేడియో ఫిజిక్స్ లేదా రేడియో ఇంజనీరింగ్ సబ్జెక్టులను కలిగిన విద్యార్థులు కూడా కొన్ని పోస్టులకు అర్హులు.
 
 వయసు: 21-30 ఏళ్లు
 ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 20, 2014
 పరీక్ష తేదీ:     మే 24, 2014
 వివరాలకు: www.upsconline.nic.in
 
 ఫైనల్ కటాఫ్ మార్కులు 2013:
 కేటగిరీ     జనరల్     ఓబీసీ     ఎస్సీ     ఎస్టీ
 సివిల్     290    240    235    230
 ఎలక్ట్రికల్    358    318    285    254
 మెకానికల్    380    338    315    290
 ఎలక్ట్రానిక్స్    435    395    348    305
 
 టాపర్‌గా నిలవాలంటే
 ప్రాథమిక అంశాలపై లోతైన పరిజ్ఞానం ఉండాలి
 ప్రిపరేషన్‌కు ప్రామాణిక పుస్తకాలను ఎంచుకోవాలి.
 సంబంధిత టాపిక్స్‌లోని ఫండమెంటల్స్, కాన్సెప్ట్‌లపై అవగాహన ఏర్పరచుకోవాలి. థియరిటికల్ నాలెడ్జ్ సొంతం చేసుకోవాలి. ప్రాక్టీస్‌కు ప్రాధాన్యమివ్వాలి.
 సబ్జెక్ట్‌ను థియరీ, ప్రాబ్లమేటిక్ సబ్జెక్టులుగా విభజించుకోవాలి.
 బృందంగా చదవడం వల్ల తక్కువ సమయంలో ఎక్కువ సిలబస్‌ను పూర్తి చేయవచ్చు.
 రోజువారీ ప్రిపరేషన్‌లో టెక్నికల్, జనరల్ ఎబిలిటీ అంశాలు ఉండే విధంగా ప్రణాళిక వేసుకోవాలి.
 నిర్వచనాలు, ప్రాబ్లమ్స్‌ను ఒకటికి రెండు సార్లు ప్రాక్టీస్ చేయాలి. దీనివల్ల కన్వెన్షనల్ పేపర్‌ను ప్రభావవంతంగా ప్రిపేర్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది.
 గత ప్రశ్న పత్రాలను ప్రాక్టీస్ చేయాలి. గేట్ ప్రశ్న పత్రాలు కూడా సహాయపడతాయి.
 
 బాంచ్‌ల వారీ ముఖ్య అంశాలు
 ఈసీఈ: ఈ బ్రాంచ్‌లో నెట్‌వర్క్స్, కంట్రోల్ సిస్టమ్, ఈడీసీ అనలాగ్ సర్క్యూట్స్, కమ్యూనికేషన్ సిస్టమ్స్, మైక్రో ప్రాసెసర్ అంశాలకు ఆబ్జెక్టివ్, కన్వెన్షనల్ విభాగాల్లో ఎక్కువ వెయిటేజీ ఉంటుంది.
 ఈఈఈ: పేపర్-1 కోసం నెట్‌వర్క్
 థియరీ, కంట్రోల్ సిస్టమ్, మెజర్‌మెంట్స్, ఇన్‌స్ట్రుమెంట్స్ అంశాలపై ఎక్కువ దృష్టిపెట్టాలి. పేపర్-2 పరిధి విస్తృతం. ఇందులో పవర్ సిస్టమ్, పవర్ ఎలక్ట్రానిక్స్, డిజిటల్ అండ్ అనలాగ్ సర్క్యూట్స్ అంశాలను సమగ్రంగా చదవాలి. ఎలక్ట్రికల్ మెషిన్స్‌లోని డీసీ మెషిన్స్, ఇండక్షన్ మెషిన్స్, ట్రాన్స్ ఫార్మర్స్‌పై ఎక్కువగా దృష్టిపెట్టాలి.
 మెకానికల్: పేపర్-1, 2లో ఎక్కువ శాతం ప్రశ్నలు థర్మోడైనమిక్స్, హైడ్రాలిక్స్ బేసిక్స్‌పై ఉంటాయి. పేపర్-2లో స్టెంగ్త్ ఆఫ్‌మెటీరియల్స్, ప్రొడక్షన్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అంశాలను చక్కగా చదవాలి.
 సివిల్: ఈ బ్రాంచ్‌లో దాదాపు అన్ని టాపిక్స్‌ను చదవాల్సిందే. స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్, హైడ్రాలిక్స్, ట్రాన్స్ పోర్టేషన్ ఇంజనీరింగ్, సర్వేయింగ్, సాయిల్ మెకానిక్స్, ఎన్విరాన్‌మెంట్ ఇంజనీరింగ్ అంశాలకు ఆబ్జెక్టివ్, కన్వెన్షనల్ విభాగాల్లో అధిక ప్రాధాన్యం ఉంటుంది.
 
 
 సమగ్రంగా చదివితే విజయం తథ్యం
 రోజుకు కనీసం 6-8 గంటలు చదవాలి. ప్రతీ అంశాన్ని సమగ్రంగా అధ్యయనం చేయాలి. సిలబస్ విస్తృతం కనుక 2 నెలల ముందే పూర్తయ్యేలా చూసుకోవాలి. పరీక్షకు ముందు రెండు సార్లు రివిజన్ చేసుకుంటే మంచిది. ఇందుకు సమయపాలన ఎంతో కీలకం. ఒత్తిడిని అధిగమించాలంటే మాక్‌టెస్ట్‌లకు హాజరవ్వాలి. ఎక్కడ తప్పులు చేస్తున్నామో వాటిని సరిదిద్దుకోవాలి. కన్వెన్షనల్ పేపర్ల విషయంలో ప్రశ్నల ఎంపికే కీలకం. ఒక్కో పేపర్‌లో ఏడు ప్రశ్నలు ఉంటాయి. వీటిలో మనం ఏ ఐదింటికి వరుస క్రమంలో సమాధానాలు రాశామో వాటి మార్కులనే పరిగణనలోకి తీసుకుంటారు. కనుక జాగ్రత్త వహించాలి.

 

ఎలాంటి కొట్టివేతలు లేకుండా నీట్‌గా సమాధానాన్ని ప్రెజంట్ చేయాలి. ఇంటర్వ్యూలో ఆయా సబ్జెక్ట్ నిపుణులు నలుగురు ఉంటారు. నా ఇంటర్వ్యూ 15-20 నిమిషాల పాటు సాగింది. టెక్నికల్ అంశాలతో పాటు మన వ్యక్తిగత విషయాలు, హాబీస్ గురించి అడుగుతారు. సబ్జెక్ట్ సంబంధిత ప్రశ్నలను అడిగేటప్పుడు తెలియకపోతే రాదు అని సూటిగా చెప్పడం మంచిది. ఇంటర్వ్యూలో ఎన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పామా అన్నది కాదు ఎంత ఆత్మవిశ్వాసం కనబరిచామనే అంశాన్ని చూస్తారు.
 -అనిల్‌కుమార్ అడెపు
 ఐఈఎస్ -2013 జాతీయస్థాయి ఏడో ర్యాంకర్

 

 పి.శ్రీనివాసులు రెడ్డి,
 మేనేజింగ్ డెరైక్టర్,
 వాణి ఇన్‌స్టిట్యూట్, హైదరాబాద్

మరిన్ని వార్తలు