డీఈడీ 4, బీఈడీ 2 ఏళ్లు

26 Dec, 2013 01:00 IST|Sakshi

జస్టిస్ వర్మ కమిటీ సిఫారసుల అమలుకు సన్నాహాలు..

సాక్షి, హైదరాబాద్:  ఉపాధ్యాయ విద్యా కోర్సుల్లో సమూల సంస్కరణలు రాబోతున్నాయి. కోర్సుల కాలపరిమితులతో పాటు నాణ్యతకు సంబంధించి పెద్ద ఎత్తున్న మార్పులు రాబోతున్నాయి. జస్టిస్ వర్మ కమిటీ చేసిన సిఫారసులను వచ్చే ఏడాది నుంచే అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం దృష్టిపెట్టింది. ప్రస్తుతం ఇంటర్‌మీడియట్ విద్యార్హతతో రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (డీఈడీ) కోర్సు అందుబాటులో ఉండగా.. ఇకపై దీనికి బదులుగా ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ కోర్సులను అందుబాటులోకి తేనున్నారు. పదో తరగతి ఉత్తీర్ణులైన వెంటనే ఈ కోర్సులో చేరొచ్చు. అలాగే ప్రస్తుతం డిగ్రీ అర్హతతో ఏడాది కాలపరిమితి గల బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ) కోర్సు అందుబాటులో ఉంది. ఇక ఈ కోర్సు కాలపరిమితిని రెండేళ్లకు పెంచనున్నారు.

2015-16 విద్యా సంవత్సరం నుంచి ఈ కోర్సులను అమలుచేయనున్నారు. అలాగే ఎంఈడీ కోర్సును ప్రస్తుత కాలపరిమితి ఏడాది నుంచి రెండేళ్లకు పెంచనున్నారు. దీనిలో స్పెషలైజేషన్ బ్రాంచి ఎంచుకునే అవకాశం కల్పించనున్నారు. ఇది వచ్చే విద్యా సంవత్సరంలోనే అమలుకానుంది. యూజీసీ, ఎన్‌సీటీఈలు ఈ కోర్సుల అమలు బాధ్యతను తీసుకోనున్నాయి. జస్టిస్ వర్మ కమిటీ మొత్తం 30 సిఫారసులను చేసింది. వీటన్నింటినీ 2014-15 విద్యాసంవత్సరం నుంచే అమలుచేయాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. అమలుకు వర్సిటీలను సన్నాహ పరిచేందుకు గురువారం ఎంహెచ్‌ఆర్‌డీ కార్యదర్శి ఆర్.భట్టాచార్య, సహాయక కార్యదర్శి డాక్టర్ అమర్‌జిత్‌సింగ్, ఉపాధ్యాయ విద్య జాతీయ మండలి (ఎన్‌సీటీఈ) చైర్మన్ సంతోష్‌పండా రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని వర్సిటీల ఉపకులపతులతో వర్మ కమిటీ సిఫారసులపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించనున్నారు.

పెరగనున్న ప్రభుత్వ కళాశాలలు...

ఇప్పటివరకు ఉపాధ్యాయ విద్యా కోర్సులైన డీఈడీ, బీఈడీ కోర్సులను అందిస్తున్న కళాశాలల్లో 97 శాతం ప్రైవేటు కళాశాలలే. మన రాష్ట్రంలో 647 బీఈడీ కళాశాలలు ఉండగా.. వీటిలో ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలలు కేవలం 20 మాత్రమే ఉండగా వీటిలో 2,499 సీట్లు ఉన్నాయి. మొత్తం సీట్లలో వీటి వాటా కేవలం 3.6 శాతం మాత్రమే. ఇక ప్రైవేటు స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు సరైన శిక్షణ కూడా లేదు. రాష్ట్రం మొత్తంలో 22 శాతం ప్రైవేటు స్కూళ్లు ఉండగా.. రాష్ట్రంలోని మొత్తం ఉపాధ్యాయుల్లో 38 శాతం మంది ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్నారు. జస్టిస్ వర్మ కమిటీ ఉపాధ్యాయ కోర్సులు అందించేందుకు ప్రభుత్వం తగిన పెట్టుబడులు పెట్టాలని, ప్రభుత్వ కళాశాలలు పెంచాలని సిఫారసు చేసింది. దీనిపై ఇప్పటికే కేంద్రం రాష్ట్రాల నుంచి ప్రతిపాదనలు కోరింది. అలాగే కొత్త కళాశాలలన్నీ విభిన్న కోర్సుల సంకలనంగా ఉండాలని కమిటీ సిఫారసు చేసింది. ఉపాధ్యాయ కోర్సులన్నింటినీ ఇకపై ఉన్నత విద్య పరిధిలోకి తేవాలని కూడా ప్రతిపాదించింది. ఉపాధ్యాయ విద్య జాతీయ పాఠ్యప్రణాళిక ఫ్రేమ్ వర్క్ 2009-10 కి అనుగుణంగా ఉపాధ్యాయ విద్యా కోర్సులన్నింటినీ సమూలంగా నవీకరించాలని ప్రతిపాదించింది.

 అనుబంధంగా బోధన పాఠశాల..

 ప్రతి ఉపాధ్యాయ విద్యా శిక్షణ సంస్థకు అనుబంధంగా ఒక పాఠశాల ఉండాలని జస్టిస్ వర్మ కమిటీ ప్రతిపాదించింది. దీని ద్వారా ఉపాధ్యాయ శిక్షణ పొందుతున్న విద్యార్థులకు ప్రాక్టికల్ అనుభవం పెరుగుతుందని, సృజనాత్మక ప్రయోగాలకు వీలుపడుతుందని సిఫారసు చేసింది. ఈ విధానం మార్చి 2014 నుంచే ప్రారంభం కానుంది. అలాగే ఉపాధ్యాయ విద్యలోని తొలి కోర్సులన్నీ కచ్చితంగా తరగతి గది ద్వారానే ఉండాలని, దూర విద్య కోర్సులు కేవలం సర్వీసులో ఉన్న టీచర్లకు మాత్రమే అందుబాటులోకి తేవాలని కమిటీ సిఫారసు చేసింది. సర్వీసులో ఉన్న టీచర్లకు, ముఖ్యంగా సెకండరీ స్కూల్ టీచర్లకు ఎప్పటికప్పుడు వృత్తిపరమైన అభివృద్ధి ఉండేలా తగిన శిక్షణ అందించాలని, ఉపాధ్యాయ విద్యా కోర్సుల నియంత్రణకు ఒక జాతీయ స్థాయి యంత్రాంగం ఏర్పాటుచేయాలని సూచించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఉపాధ్యాయుల పనితీరును అంచనా వేసేందుకు తగిన యంత్రాంగం ఉండాలని సూచించింది.
 

మరిన్ని వార్తలు