ఎల్‌ఐసీలో కొలువుల మేళా..!

3 Jun, 2015 23:28 IST|Sakshi

 దేశంలో జీవిత బీమా సంస్థల్లో అతిపెద్దదైన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) ఆఫ్ ఇండియా భారీ ఖాళీలతో ప్రకటన విడుదల చేసింది. వివిధ జోన్లలో మొత్తం 5,066 అప్రెంటీస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్స్ (ఏడీవో) ఖాళీలున్నాయి. సౌత్ సెంట్రల్ జోనల్ ఆఫీస్ పరిధిలో 699 పోస్టులున్నాయి. ఈ నేపథ్యంలో అర్హతలు, పరీక్ష విధానం, విజయానికి వ్యూహాలు తదితరాలపై ఫోకస్...
 
 ఖాళీల వివరాలు:
 వర్గం    ఖాళీలు
 జనరల్    339
 ఎస్సీ    109
 ఎస్టీ    48
 ఓబీసీ    203
 మొత్తం    699
 డివిజన్ల వారీగా పోస్టులు
 కడప- 66; హైదరాబాద్- 53; కరీంనగర్- 15; మచిలీపట్నం- 49; నెల్లూరు- 45; రాజమండ్రి- 41; సికింద్రాబాద్-51; విశాఖపట్నం-41; వరంగల్- 11; బెంగళూరు-1: 67; బెంగళూరు-2: 65; బెల్గాం-34; ధార్వాడ్-34; మైసూర్-39; రాయ్‌చూర్-37; షిమోగ-22; ఉడిపి-29.
 
 వేతనాలు
 ఏడీఓగా ఎంపికైన అభ్యర్థికి అప్రెంటీస్ సమయంలో నెలకు రూ.23,836 స్టైఫండ్‌గా లభిస్తుంది. అప్రెంటీస్‌షిప్‌ను విజయవంతంగా పూర్తిచేసుకున్నవారిని ప్రొబేషనరీ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌గా నియమిస్తారు. వీరికి ప్రారంభంలో నెలకు రూ.26,736 వరకు అందుతుంది. దీంతో పాటు ఇతర అలవెన్స్‌లుంటాయి.
 
 అర్హతలు
 గుర్తింపు పొందిన ఏదైనా విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీ. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (మార్కెటింగ్)లో మాస్టర్ డిగ్రీ లేదా మార్కెటింగ్‌లో పీజీ డిప్లొమా చేసిన వారికి ప్రాధాన్యం ఉంటుంది. వయసు: 2015, జూన్ 1 నాటికి 21-30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు మినహాయింపు ఉంటుంది. ఎల్‌ఐసీ ఉద్యోగులకు కూడా గరిష్ట వయోపరిమితిలో ప్రత్యేక సడలింపు ఉంటుంది. జనరల్ కేటగిరీకి గరిష్ట వయోపరిమితి 42 ఏళ్లు; ఓబీసీలకు 45 ఏళ్లు; ఎస్సీ, ఎస్టీలకు 47 ఏళ్లు. ఎల్‌ఐసీ ఏజెంట్లకు కూడా మినహాయింపు ఉంటుంది. ఎల్‌ఐసీ ఏజెంట్లకు జనరల్ కేటగిరీ గరిష్ట వయోపరిమితి 37 ఏళ్లు; ఓబీసీ-40; ఎస్సీ, ఎస్టీ-42 ఏళ్లు.
 
 ఎంపిక విధానం
 ఎంపిక పక్రియ రెండు దశల్లో ఉంటుంది. మొదటి దశలో ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించిన వారికి ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. రెండింటిలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా రూపొందిస్తారు. అర్హత సాధించిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించి, ఉద్యోగాలను ఖరారు చేస్తారు. ఏడీఓగా నియమితులైన అభ్యర్థులు కనీసం నాలుగేళ్లపాటు ఎల్‌ఐసీలో సేవలందించాల్సి ఉంటుంది. ఇందుకుగాను పోస్టులో చేరేముందు రూ.25,000 బాండ్ సమర్పించాలి.
 
 పరీక్ష విధానం
 ఆన్‌లైన్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. రెండు గంటల పాటు జరిగే పరీక్షలో ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలుంటాయి. మూడు పేపర్లు ఉంటాయి.
 పేపర్    ప్రశ్నల సంఖ్య    మార్కులు
 పేపర్-1
 రీజనింగ్ ఎబిలిటీ    25    25
 న్యూమరికల్ ఎబిలిటీ    25    25
 పేపర్-2
 జనరల్ నాలెడ్జ్ అండ్
 కరెంట్ అఫైర్స్    25    25
 ఇంగ్లిష్ లాంగ్వేజ్
 (గ్రామర్, వొక్యాబులరీ)    25    25
 పేపర్-3
 ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్షియల్
 మార్కెటింగ్ అవేర్‌నెస్    50    50
 (లైఫ్ ఇన్సూరెన్స్,ఫైనాన్షియల్
 సెక్టార్ ప్రత్యేక ప్రాధాన్యం)
 మొత్తం    150    150
 ఇంటర్వ్యూకు అర్హత సాధించాలంటే ప్రతి పేపర్‌లోనూ నిర్దేశ కటాఫ్ మార్కులు సాధించాలి. ఈ కటాఫ్‌ను ఎల్‌ఐసీ నిర్ణయిస్తుంది. ప్రతి తప్పు సమాధానానికి మార్కుల్లో కోత విధిస్తారు.
 
 
 విధులు
 తమకు నిర్దేశించిన డివిజనల్‌లో ఎల్‌ఐసీ పాలసీల సేల్స్‌ను పర్యవే క్షించడం వీరి ప్రధాన విధి. ఏజెంట్లను నియమించుకుని.. వారితో ఎక్కువ సంఖ్యలో పాలసీలను విక్రయించేలా చూడాలి. తాను నియమించుకున్న ఏజెంట్లకు శిక్షణనందించడంతోపాటు ఎల్‌ఐసీ అందించే వివిధ ఇన్సూరెన్స్ పథకాలను వివరించడం.అవసరమైతే ఏజెంట్లు చేర్చిన పాలసీదారులతో మాట్లాడి.. వారి సందేహాలను నివృత్తి చేయడం.తాము పనిచేసే డివిజన్‌లో వివిధ ప్రాంతాల్లో పర్యటించి సేల్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి.
 
 ఎస్సీ, ఎస్టీలకు ఉచిత శిక్షణ సదుపాయం
 ఏడీఓ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు పరీక్షకు సిద్ధం కావడానికి ఉచిత కోచింగ్ సదుపాయాన్ని కూడా ఎల్‌ఐసీ అందిస్తుంది. దీనికోసం ఏ డివిజన్ పరిధిలో అయితే దరఖాస్తు చేసుకున్నారో.. ఆ ఎల్‌ఐసీ సీనియర్ డివిజనల్ మేనేజర్‌ను 2015 జులై మొదటి వారంలో సంప్రదించాలి. ప్రిపరేషన్ ప్రణాళిక
 
 రీజనింగ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ
 అభ్యర్థి తార్కిక ఆలోచన శక్తిని, విశ్లేషణా శక్తిని పరిశీలించేలా ఈ విభాగంలో ప్రశ్నలడుగుతారు. నంబర్ సిరీస్, కోడింగ్-డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, సీటింగ్ అరేంజ్‌మెంట్, స్టేట్‌మెంట్స్ మొదలైనవాటి నుంచి ప్రశ్నలెదురవుతాయి. సంబంధిత ప్రాథమిక అంశాలపై పట్టు, నిశిత పరిశీలనతో ఈ విభాగంలో ఎక్కువ మార్కులు సాధించొచ్చు. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ విభాగంలో నంబర్ సిస్టమ్స్, రిలేషన్‌షిప్ బిట్వీన్ నంబర్స్, శాతాలు, స్క్వేర్ రూట్స్, సగటు, సాధారణ, చక్రవడ్డీ, లాభనష్టాలు,డిస్కౌంట్, భాగస్వామ్య వ్యాపారం మొదలైన అంశాలపై ప్రశ్నలడుగుతారు.
 
  గణితంపై అభ్యర్థికున్న పట్టును తెలుసుకునేలా ప్రశ్నలుంటాయి. ఈ విభాగంలో అత్యధిక మార్కులు సాధించాలంటే ఆర్‌ఎస్ అగర్వాల్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ పుస్తకాలను సాధన చేయాలి. దీంతోపాటు 8, 9, 10వ తరగతుల మ్యాథ్స్ పాఠ్యపుస్తకాలలోని మాదిరి సమస్యలను సాధన చేస్తే అత్యధిక మార్కులు సాధించొచ్చు. ప్రతి చాప్టర్‌ను ప్రాక్టీస్ చేయడంతోపాటు వీలైనన్ని మాక్ టెస్ట్‌లను సాధన చేయాలి. సంబంధిత అంశాలలో ప్రాథమిక సూత్రాలను బాగా గుర్తు పెట్టుకోవాలి.
 
 జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, జనరల్ ఇంగ్లిష్
 జీకేలో అత్యధిక మార్కుల కోసం 6 నుంచి 10వ తరగతి వరకు సోషల్ పాఠ్యపుస్తకాలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. వీటితోపాటు ఏవైనా తెలుగు దినపత్రికలను, ఏదైనా ఒక ఇయర్‌బుక్‌ను చదవాలి. ఈ విభాగంలో భారతదేశ చరిత్ర, సంస్కృతి, వివిధ జాతీయ ఉద్యమాలు, ఇండియన్ జాగ్రఫీ, జనరల్ సైన్స్, వ్యక్తులు-బిరుదులు, పుస్తకాలు-రచయితలు, అవార్డులు-వ్యక్తులు, క్రీడలు, వ్యక్తులు-నియామకాలు, వివిధ సదస్సులు జరిగిన ప్రాంతాలు, శాస్త్రసాంకేతిక ప్రయోగాలు మొదలైనవాటి నుంచి ప్రశ్నలడిగే అవకాశం ఉంది. అదేవిధంగా పరీక్షకు ఆరు నెలల ముందు నుంచి ఉన్న కరెంట్ అఫైర్స్‌పై దృష్టి పెట్టాలి. అదేవిధంగా ఎల్‌ఐసీకి చెందిన ఉద్యోగం కాబట్టి ఎల్‌ఐసీ, ఐఆర్‌డీఏ తాజా విధానాలు, రిజర్వ్‌బ్యాంక్ వడ్డీరేట్లు, బడ్జెట్ వంటి విషయాలపై కూడా దృష్టి సారించాలి. పేపర్-2లోనే ఎదురయ్యే జనరల్ ఇంగ్లిష్‌లో ప్రధానంగా వొకాబులరీ, గ్రామర్‌పై ప్రశ్నలడుగుతారు. వాక్యాల పునరమరిక, స్పెల్లింగ్, వాక్యాల్లో తప్పులను సరిదిద్దడం, ప్రిపోజిషన్, ఆర్టికల్స్ తదితర అంశాలపై పట్టు సాధించాల్సి ఉంటుంది. ఆరు నుంచి పదో తరగతి వరకు ఉన్న ఇంగ్లిష్ పాఠ్యపుస్తకాలలో ఉన్న వ్యాకరణాన్ని సాధన చేస్తే ఈ విభాగంలో అత్యధిక మార్కులు సాధించొచ్చు.
 
 ఫైనాన్షియల్ మార్కెటింగ్ అవేర్‌నెస్ (లైఫ్ ఇన్సూరెన్స్,
 ఫైనాన్షియల్ సెక్టార్ ప్రత్యేక ప్రాధాన్యం) 50 మార్కులు కేటాయించారు కాబట్టి విజయంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని చెప్పొచ్చు. బ్యాంకులు, బీమా సంస్థలు, ఇతర ఆర్థిక సంస్థలకు సంబంధించిన వర్తమాన సంఘటనలపై అవగాహన పెంపొందించుకోవాలి. ఆర్థిక సేవలపై ప్రత్యేక దృష్టిసారించాలి. బీమా సంస్థలు, జాయింట్ వెంచర్లు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, కొత్త చట్టాలు, సంప్రదాయ, ఆధునిక పాలసీలు, రిటర్నులు వంటి వాటిపై అవగాహన అవసరం.
 

మరిన్ని వార్తలు