మైనింగ్ మెషినరీ ఇంజనీరింగ్ కోర్సు వివరాలు..

1 May, 2014 01:37 IST|Sakshi

బిట్స్-పిలానీ అందిస్తున్న మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్సు వివరాలను తెలపండి?
 -శ్రీధర్, అదిలాబాద్.

బిట్స్-పిలానీ, శంకర్ నేత్రాలయ సహకారంతో ఎంఎస్ (మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ) కోర్సును అందిస్తుంది. బయాలాజికల్ సైన్స్‌తో డిగ్రీ లేదా బిట్స్ నుంచి ఇంటిగ్రేటెడ్ ఫస్ట్ డిగ్రీ ప్రోగ్రామ్‌ను పూర్తి చేసిన విద్యార్థులు ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. కోర్సులో మొదటి రెండేళ్లు బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, జెనెటిక్స్, మాలిక్యులర్ బయాలజీ, అనాటమీ, ఫిజియాలజీ, బ్లడ్ బ్యాంకింగ్, టెక్నికల్ కమ్యూనికేషన్స్, బయోస్టాటిస్టిక్స్ వంటి అంశాలను బోధిస్తారు. మూడో ఏడాదిలో ఇంటర్న్‌షిప్ ఉంటుంది.
వివరాలకు: www.bitspilani.ac.in
మాస్టర్స్ స్థాయిలో మెడికల్ ల్యాబ్‌టెక్నాలజీ కోర్సును ఆఫర్ చేస్తున్న మరికొన్ని ఇన్‌స్టిట్యూట్‌లు: శ్రీరామచంద్ర యూనివర్సిటీ (వెబ్‌సైట్: www.sriramachandra. edu.in)- తమిళనాడు, మణిపాల్ యూనివర్సిటీ (వెబ్‌సైట్: www.manipal.edu)-మణిపాల్ (కర్ణాటక).

 
ఎన్‌జీవో మేనేజ్‌మెంట్‌కు సంబంధించి పీజీ డిప్లొమా కోర్సును అందిస్తున్న సంస్థలేవి?    -రాజేంద్ర, నల్గొండ.
సామాజిక సేవ పట్ల ఆసక్తి ఉన్న వారికి సరిపోయే కోర్సు ఎన్‌జీవో మేనేజ్‌మెంట్. కొత్తగా తెచ్చిన కంపెనీల చట్టం ప్రకారం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సబిలిటీ తప్పనిసరిగా మారింది. ఈ నేపథ్యంలో సదరు కోర్సు చేసిన అభ్యర్థులకు అవకాశాలు విస్తృతంగా అందుబాటులోకి వస్తాయి. కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్వీస్ ప్రొవైడర్, ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్, సోషల్ సర్వీస్ ప్రొవైడర్, హెచ్‌ఆర్ మేనేజర్, ఫైనాన్స్ మేనేజర్ వంటి హోదాల్లో స్థిరపడొచ్చు. మినిస్ట్రీ ఆఫ్ యూత్ ఎఫైర్స్, ఫిక్కీ, యునెస్కో, తదితర సంస్థలు వీరిని నియమించుకుంటాయి.
అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు:
సెంటర్ ఫర్ సోషల్ ఇన్షియేటివ్ అండ్ మేనేజ్‌మెంట్ (వెబ్‌సైట్: www.csim.in), అమిటీ యూనివర్సిటీ (వెబ్‌సైట్: www.amity.edu)-నోయిడా, జామియా మిలియా ఇస్లామియా (http://jmi.ac.in)-న్యూఢిల్లీ.

 
ఇండియన్ ఫారెన్ సర్వీస్ వివరాలను తెలపండి?
 -సురేష్, సూర్యాపేట.

కేంద్ర విదేశీ మంత్రిత్వ శాఖ పరిధిలోనిది ఇండియన్ ఫారెన్ సర్వీస్ (ఐఎఫ్‌ఎస్). ఐపీఎస్, ఐఎఎస్, ఐఆర్‌ఎస్ ఇతర సర్వీసులతో కలిసి ఉమ్మడిగా ముస్సోరిలో ఫౌండేషన్ కోర్సు పూర్తి చేసుకున్న తర్వాత ఐఎఫ్‌ఎస్ అభ్యర్థులకు న్యూఢిల్లీలోని ఫారెన్ సర్వీస్ ఇన్‌స్టిట్యూట్‌లో ఏడాది కాలంపాటు శిక్షణ ఉంటుంది. శిక్షణ సమయంలోనే.. విదేశాల్లో భారత రాయబార కార్యాలయాల పనితీరుపై అవగాహన కల్పించేలా విదేశీ పర్యటన, అక్కడ భారతీయ రాయబార కార్యాలయాలతో అటాచ్‌మెంట్ ఉంటుంది.

విదేశీ వ్యవహారాలతోపాటు స్వదేశంలో గ్రాస్ రూట్ లెవల్‌లో పరిస్థితిపై అవగాహన ఏర్పరిచే దిశగా డిస్ట్రిక్ట్ అటాచ్‌మెంట్ కూడా ఉంటుంది. దీని ప్రకారం అభ్యర్థులను బృందాలుగా విభజించి ఒక్కో బృందాన్ని ఒక్కో రాష్ట్రానికి పంపుతారు. అలా.. ఆయా రాష్ట్రాలకు వెళ్లిన బృందాలు అక్కడి సామాజిక, ఆర్థిక, సాంస్కృతికపరమైన అన్ని అంశాలను పరిశీలించాలి. ప్రతి క్షేత్ర స్థాయి పర్యటనలాధారంగా నివేదిక సమర్పించాలి. ఇలా ఏడాదిపాటు తరగతి బోధన పూర్తయ్యాక ఫైనల్ పరీక్షలు ఉంటాయి. వాటిలో ఉత్తీర్ణత సాధిస్తేనే పోస్టింగ్‌కు అర్హత లభిస్తుంది. ఐఎఫ్‌ఎస్ ప్రొబేషనర్లు ఫారెన్ సర్వీస్ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్నాక తప్పనిసరిగా ఒక విదేశీ భాషను ఎంచుకుని అందులో శిక్షణ పొందాలి.

 ఐఎఫ్‌ఎస్ అభ్యర్థులకు తొలి పోస్టింగ్ విదేశాల్లోనే ఉంటుంది. సీఎఫ్‌ఎల్ ప్రోగ్రాంలో భాగంగా శిక్షణ తీసుకున్న విదేశీ భాషను పరిగణనలోకి తీసుకుని ఆ భాష మాతృ భాషగా ఉన్న దేశంలో పోస్టింగ్ లభిస్తుంది. పోస్టింగ్ పొందిన అభ్యర్థులకు.. విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాల్లో లభించే తొలి హోదా థర్డ్ సెక్రటరీ. తర్వాత సీనియారిటీ ఆధారంగా సెకండ్ సెక్రటరీ, ఫస్ట్ సెక్రటరీ, కౌన్సెలర్, అంబాసిడర్ లేదా హై కమిషనర్, పర్మినెంట్ రిప్రజెంటేటివ్ హోదాలు లభిస్తాయి.

 యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ద్వారా ఇండియన్ ఫారెన్ సర్వీసుల్లో ప్రవేశించవచ్చు. ఈ పరీక్షలో ప్రిలిమ్స్, మెయిన్స్, పర్సనాలిటీ టెస్ట్ అనే మూడు దశలుంటాయి. అర్హత: ఏదైనా డిగ్రీ. పరీక్ష విధానం, సిలబస్, సంబంధిత వివరాల కోసం యూపీఎస్సీ
 
 మైనింగ్ మెషినరీ ఇంజనీరింగ్ కోర్సును అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లేవి? కోర్సు వివరాలను తెలపండి?
 -రమేష్, నిజామాబాద్.
మైనింగ్ కార్యకలాపాల్లో వినియోగించే యంత్రాల (మెషిన్స్)కు సంబంధించి మెకానికల్, ఎలక్ట్రికల్ అంశాలను మైనింగ్ మెషినరీ ఇంజనీరింగ్ కోర్సులో అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఈ కోర్సులో  మైనింగ్ కోసం ఉపయోగించే యంత్రాలు, ఖనిజాల వెలికితీత విధానాలను వివరిస్తారు.

 ఈ క్రమంలో మైనింగ్ మెథడ్స్ అండ్ మెషినరీ, మెకానిక్స్, ప్లానింగ్, మైన్ డెవలప్‌మెంట్, జియో మెకానిక్స్, గ్రౌండ్ కంట్రోల్, సర్ఫేస్ ఎన్విరాన్‌మెంట్, సిస్టమ్స్ ఇంజనీరింగ్ వంటి సబ్జెక్ట్‌లను బోధిస్తారు. ధన్‌బాద్ (జార్ఖండ్)లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్, బీటెక్, ఎంటెక్ విభాగాల్లో మైనింగ్ మెషినరీ ఇంజనీరింగ్ కోర్సును ఆఫర్ చేస్తుంది. జేఈఈ-అడ్వాన్స్‌డ్ ఆధారంగా బీటెక్ కోర్సులో ప్రవేశం కల్పిస్తారు. గేట్ ద్వారా ఎంటెక్ కోర్సులో అడ్మిషన్ పొందొచ్చు.
వివరాలకు: www.ismdhanbad.ac.in
 కోర్సు పూర్తయిన తర్వాత మైనింగ్ సంబంధిత కార్యకలాపాలు నిర్వహించే ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. మైనింగ్ ఇంజనీర్, జియాలాజికల్ ఇంజనీర్, మైనింగ్ మెకానిక్ ఆపరేటర్, మైనింగ్ సూపర్‌వైజర్, ఎన్విరాన్‌మెంటల్ అండ్ సేఫ్టీ మేనేజర్, మినరల్ సేల్స్ ఆఫీసర్ వంటి హోదాల్లో స్థిరపడొచ్చు.

టాప్ రిక్రూటర్స్: భారత్ కుకింగ్ కోల్ లిమిటెడ్, అర్సెలర్ మిట్టల్, భారత్ ఫ్రోగ్ లిమిటెడ్, కెయిర్న్ ఎనర్జీ, అదానీ మైనింగ్.

మరిన్ని వార్తలు