‘విదేశీ’ వేదికపై ఉన్నత విద్య..!

25 Dec, 2014 02:53 IST|Sakshi
‘విదేశీ’ వేదికపై ఉన్నత విద్య..!

 నాణ్యమైన ఉన్నత విద్య పునాదులపై నిర్మించుకునే కెరీర్ సౌధం ఉజ్వల భవిష్యత్తుకు చుక్కాని అవుతుంది!  అలాంటి ఉన్నత విద్యను విదేశాల్లో చేస్తే ఆ కెరీర్ మరింత ఉన్నతంగా ఉంటుందన్న ఆలోచన నేడు విద్యార్థులను ‘అబ్రాడ్’  విశ్వవిద్యాలయాల క్యాంపస్‌ల దిశగా అడుగులు వేయిస్తోంది. గ్రాడ్యుయేషన్ తర్వాత ఎంఎస్, ఎంబీఏ వంటి కోర్సులు చేసేందుకు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఎక్కువ మక్కువ చూపుతున్నారు. ఈ నేపథ్యంలో విదేశాలు-ఉన్నత విద్యావకాశాలపై స్పెషల్ ఫోకస్..
 
 కాలేజీల నుంచి గ్రాడ్యుయేషన్ పట్టాతో బయటకు రాకముందే విద్యార్థుల్లో ‘స్టడీ అబ్రాడ్’ దిశగా ఆలోచనలు మొదలవుతాయి. ప్రధానంగా ఇంజనీరింగ్, సెన్సైస్, బిజినెస్ మేనేజ్‌మెంట్ పీజీ కోర్సులు చేసి, సమున్నత కెరీర్‌లో స్థిరపడాలనుకునే వారిలో ఈ ఉత్సాహం ఎక్కువ ఉంటుంది. అందుకే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల నుంచి ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య ఏటికేడు పెరుగుతోంది. ఉన్నత విద్య పూర్తయ్యాక యూఎస్‌లోనే కెరీర్‌ను సుస్థిరం చేసుకోవాలని అధిక శాతం మంది భావిస్తున్నారు. యూఎస్ నేషనల్ సైన్స్ ఫౌండేషన్ అధ్యయనం ప్రకారం అమెరికాలో పీహెచ్‌డీ పూర్తిచేసిన భారత్, ఇతర ఆసియా దేశాల విద్యార్థుల్లో 80 శాతానికి పైగా అక్కడే ఉండిపోవాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యం లో విదేశాల్లోని విద్యాసంస్థలు.. ఇక్కడి కన్సల్టెన్సీలతో ఒప్పందాల ద్వారా ప్రవేశ ప్రక్రియను సులభతరం చేస్తూ విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి.
 
 ఆధునికత వెంట కొత్త కోర్సులు:
 ఇటీవల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వివిధ రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో విద్యా వ్యవస్థలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. అనేక కొత్త కోర్సులకు రూపకల్పన జరిగింది. బయో ఇన్ఫర్మాటిక్స్, మెకట్రానిక్స్, ఇంటరాక్టివ్ డిజైన్ మీడియా, ప్రొడక్ట్ డిజైన్, నానో టెక్నాలజీస్, కంట్రోల్ సిస్టమ్స్, మైక్రో ఎలక్ట్రానిక్స్, ఏవియేషన్ అండ్ మెరైన్ ఇంజనీరింగ్ (స్పెషలైజేషన్), డిఫెన్స్ ఎడ్యుకేషన్, ఫ్యాషన్ డిజైన్ అండ్ ఆర్ట్స్, ఫుడ్ టెక్నాలజీ తదితర అంశాల్లో ఉన్నత విద్య అవకాశాలున్నాయి. విదేశీ విశ్వవిద్యాలయాల్లోని ఇలాంటి కోర్సుల్లో చేరేందుకు ఎక్కువ మంది ఆసక్తి కనబరుస్తున్నారు. ఇవి కాకుండా వివిధ యూనివర్సిటీలు డిమాండ్‌కు అనుగుణంగా ఎప్పటికప్పుడు బిజినెస్, ఇంజనీరింగ్, సెన్సైస్‌లలో కొత్త కొత్త కోర్సులను ప్రవేశపెడుతూ, భారతీయ విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి.
 
 పూర్తి అవగాహనతో అడుగేయాలి:
 విదేశాల్లో ఉన్నత విద్యా కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు తొలుత పూర్తిస్థాయి అవగాహన ఏర్పరుచుకోవాలి. లేదంటే తర్వాత ఇబ్బందులు తప్పవు. ఏ కోర్సును ఎంపిక చేసుకోవాలి? ఏ దేశంలో ఏ కోర్సు చేయాలి? కోర్సు పూర్తిచేసిన కెరీర్‌కు సంబంధించి ఆర్‌వోఐ (రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్) ఎలా ఉంటుంది? చేరబోయే కోర్సుకు భవిష్యత్తులో స్వదేశంలో అవకాశాలుంటాయా? మొత్తం ఖర్చు ఎంతవుతుంది? ఆ కోర్సుకు స్వదేశంలోని సంస్థల గుర్తింపు ఉందా? ఇలాంటి వాటిపై అవగాహన ముఖ్యం. పేరున్న కన్సల్టెన్సీలు, వెబ్‌సైట్ల ద్వారా ఈ వివరాలను తెలుసుకోవాలి. వీసా, బ్యాంకుల విద్యా రుణాలు, ప్రయాణం, బీమా, ఇంటర్నేషనల్ సిమ్ కార్డులు తదితరాలకు సంబంధించిన సందేహాలను కూడా నివృత్తి చేసుకోవాలి.కోర్సులో ప్రవేశానికి ఆయా విశ్వవిద్యాలయాలు నిర్దేశించిన అర్హతలు, జీఆర్‌ఈ, జీమ్యాట్, ఐఈఎల్‌టీఎస్, టో ఫెల్ వంటి పరీక్షల్లో ఎంత స్కోర్ సాధించి ఉండాలి? అనేదానిపై తప్పనిసరిగా అవగాహన పెంపొందించుకోవాలి.
 
 మేనేజ్‌మెంట్ కోర్సులు:
 విదేశీ విద్యలో ఇప్పుడు అధిక ప్రాధాన్యత కలిగిన కోర్సు ఎంబీఏ. ఇందులో చేరాలనుకునే విద్యార్థులకు దరఖాస్తు సమయం నుంచి అప్రమత్తత అవసరం. మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశించాలనుకునే వారు గ్రాడ్యుయేట్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్ (జీమ్యాట్)లో మంచి స్కోర్ సాధించాలి. అప్పుడే పేరున్న యూనివర్సిటీలో సీటును ఖాయం చేసుకోవచ్చు. ఈ ప్రక్రియను ఫాల్, స్ప్రింగ్‌ల్లో ఏ సెషన్‌కైనా కనీసం 6 నుంచి 9 నెలల ముందు ప్రారంభిస్తే మంచిది. జీమ్యాట్ స్కోరు ఉన్నప్పటికీ టాప్-బి స్కూళ్లల్లో ప్రవేశించాలంటే అడ్మినిస్ట్రేషన్, టీమ్ లీడర్‌షిప్ స్థారుులో రెండు, మూడేళ్ల పని అనుభవం తప్పనిసరి.
 
 ప్రాధాన్య దేశాలు అమెరికా
 విదేశీ విద్య విషయంలో తెలుగు విద్యార్థులు ఎక్కువగా ప్రాధాన్యమిచ్చే దేశం అమెరికా. ఆధునిక బోధనా విధానం, ఆర్థిక ప్రోత్సాహకాలు ఆ దేశం వైపు విద్యార్థులు ఆకర్షితులయేందుకు ప్రధాన కారణాలు. దీంతోపాటు అమెరికాలో ఒకసారి కాలుపెడితే, కెరీర్ బంగారుమయం కావడం ఖాయమనే అభిప్రాయం కూడా ఉంది. హార్వర్డ్ యూనివర్సిటీ, మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ, ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ, కాలిఫోర్నియా యూనివర్సిటీ వంటివి ప్రధాన విశ్వవిద్యాలయాలు. యూఎస్ వెళ్లే విద్యార్థుల్లో అధిక శాతం మంది కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్, బయోటెక్నాలజీ, ఎంబీఏ, బయలాజికల్ సెన్సైస్ కోర్సుల్లో చేరుతున్నారు.
 
 ఫాల్ (ఆగస్టు/సెప్టెంబర్), స్ప్రింగ్ (డిసెంబర్) సెషన్‌లలో అధిక శాతం యూనివర్సిటీలు ప్రవేశాలు కల్పిస్తున్నాయి. టోఫెల్, జీఆర్‌ఈ, ఐఈఎల్‌టీఎస్ తో పాటు పీటీఈ (పియర్సన్ టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్) పరీక్షల స్కోర్ల ఆధారంగా అడ్మిషన్ ఇస్తాయి. వీటిలో ఎంఎస్ కోర్సులకు టోఫెల్/ఐఈఎల్‌టీఎస్, జీఆర్‌ఈ స్కోర్ తప్పనిసరి. మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశానికి జీమ్యాట్ స్కోర్ తప్పనిసరి. ఔత్సాహిక విద్యార్థులు ఆయా ఇన్‌స్టిట్యూట్‌లకు నేరుగా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుతోపాటు నిర్దేశిత పత్రాలు (విద్యార్హతల సర్టిఫికెట్లు; ఫీజు నివాస వ్యయానికి సరిపడే విధంగా ఆర్థిక వనరుల రుజువు పత్రాలు, స్టేట్‌మెంట్ ఆఫ్ పర్పస్, రికమండేషన్ లెటర్స్ తదితర) అందించాలి. వీటి ఆధారంగా.. ఆయా ఇన్‌స్టిట్యూట్‌లు ఆఫర్ లెటర్ అందిస్తాయి. దీన్నే ఐ-20 ఫామ్‌గా పిలుస్తారు. దీని ఆధారంగా స్టూడెంట్ వీసాకు దరఖాస్తు చేయాలి. అమెరికాలో ఫీజులు.. చదువుతున్న స్ట్రీమ్‌ను బట్టి 10 వేల నుంచి 25 వేల డాలర్ల మధ్యలో ఉంటాయి.
 పూర్తి వివరాలకు: www.educationusa.state.gov,
 www.usnews.com..

 ఆస్ట్రేలియా
 ఆస్ట్రేలియాకు సంబంధించి సెన్సైస్ (కంప్యూటర్, ఐటీ), ఇంజనీరింగ్ (ఎలక్ట్రికల్/మెకానికల్), ఏవియేషన్, ఎంబీఏ, ఫుడ్ అండ్ డెయిరీ మేనేజ్‌మెంట్ ప్రధాన కోర్సులు. అధిక శాతం ప్రవేశాలు ఫిబ్రవరి/మార్చి, జూలై సెషన్‌లలో పూర్తవుతాయి. ఆస్ట్రేలియా నేషనల్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ మెల్‌బోర్న్, యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ, అడిలైడ్ యూనివర్సిటీ వంటివి ప్రధాన యూనివర్సిటీలు. ఇవి ఐఈఎల్‌టీఎస్ (6.5/9) స్కోర్ ఆధారంగా ప్రవేశం కల్పిస్తున్నాయి. మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశానికి జీమ్యాట్, టోఫెల్ స్కోర్ అవసరం. ఆన్ క్యాంపస్, ఆఫ్ క్యాంపస్ రెండు విధాలుగా వసతి అందుబాటులో ఉంటుంది. రెండు వారాల్లో(15 రోజులు) 40 గంటలు పార్ట్ టైమ్ జాబ్ చేసే వెసులుబాటును ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయాలు కల్పించాయి. ఆస్ట్రేలియా కాన్సులేట్‌లోని డ్రాప్‌బాక్స్ ద్వారా వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. పీజీ కోర్సులకు ఫీజు దాదాపు 9,000 నుంచి 18,500 ఆస్ట్రేలియన్ డాలర్లు ఉంటుంది.
 పూర్తి వివరాలకు: www.studyinaustralia.gov.au
 
 జర్మనీ

 హంబోల్ట్ యూనివర్సిటీ, ఫ్రీ యూనివర్సిటీ ఆఫ్ బెర్లిన్, టెక్నికల్ యూనివర్సిటీ మ్యునిచ్, జార్జ్ అగస్ట్ యూనివర్సిటీ, ఎబర్‌హార్డ్ కార్ల్స్ యూనివర్సిటీ, టెక్నికల్ యూనివర్సిటీ బెర్లిన్ వంటివి ముఖ్యమైన విశ్వవిద్యాలయాలు. వీటిలో ప్రవేశాలు ఏప్రిల్, అక్టోబర్‌లో జరుగుతాయి. లైఫ్ సెన్సైస్, బయో సెన్సైస్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, టెక్నాలజీ సంబంధిత కోర్సులకు సరైన వేదిక జర్మనీ. మాస్టర్ కోర్సులకు టోఫెల్ (స్కోర్ 80/120), ఐఈఎల్‌టీఎస్ (స్కోర్ 6.5/9) తప్పనిసరి. కొన్ని ప్రధాన కోర్సుల్లో జీఆర్‌ఈ (300/340) స్కోర్ అవసరం. మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశానికి జీమ్యాట్ స్కోర్ తప్పనిసరి. జర్మన్ భాషా పరిజ్ఞానం అవసరం. ఇక్కడ సంవత్సరానికి 90 రోజులు పార్ట్ టైమ్ జాబ్ చేయవచ్చు. కొన్ని యూనివర్సిటీలు మాత్రం సెలవుల్లోనే ఈ అవకాశం కల్పిస్తాయి. జర్మనీలో సెమిస్టర్‌కు ఫీజు దాదాపు 500-1,000 యూరోలు ఉంటుంది. పూర్తి వివరాలకు: www.studyin.de/en
 
 యూకే
 విద్యార్థుల నమోదు సంఖ్య, క్రేజీ కోర్సుల పరంగా అమెరికా తర్వాత స్థానం యూకే యూనివర్సిటీలదే.
 బిజినెస్ మేనేజ్‌మెంట్, ఇంజనీరింగ్, హ్యుమానిటీస్ కోర్సులకు కేరాఫ్‌గా నిలుస్తున్న దేశమిది. సాధారణంగా మాస్టర్స్ డిగ్రీ వ్యవధి రెండేళ్లు ఉండగా అధిక శాతం యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్‌లు ఫాస్ట్‌ట్రాక్ కోర్సుల పేరుతో ఏడాది వ్యవధిలోనే పీజీ కోర్సులను అందిస్తుండటం కూడా ఇక్కడి వెళ్లే విద్యార్థుల సంఖ్య పెరగడానికి కారణం. యూకేలో అధిక శాతం ప్రవేశాలు సెప్టెంబర్/అక్టోబర్ సెషన్‌లలో పూర్తవుతాయి.
 
 ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ వంటివి ప్రధాన విశ్వవిద్యాలయాలు. విద్యార్థుల్లో అత్యధిక శాతం మంది ఎంబీఏ, ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, సెన్సైస్ కోర్సులను ఎంచుకుంటున్నారు. వర్సిటీలు ఐఈఎల్‌టీఎస్ (6.5/9), టోఫెల్ స్కోర్ ఆధారంగా ప్రవేశం కల్పిస్త్తున్నాయి. మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశానికి జీమ్యాట్ స్కోర్ అవసరం. ప్రవేశం లభిస్తే యూకే కాన్సులేట్‌లోని డ్రాప్‌బాక్స్ ద్వారా వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. యూకేలో ఫీజు.. పీజీ కోర్సులకు దాదాపు 12,000 పౌండ్లు, ఎంబీఏ కోర్సుకు 15,000 యూరోలు ఉంటుంది.
 పూర్తి వివరాలకు:www.ukvisas.gov.uk,
     www.ukba.homeoffice.gov.uk
 
 ఉపకారవేతనాలు
 విదేశీ విశ్వవిద్యాలయాల్లో చదువుకోవాలని ఉన్నా, ఆర్థిక పరిస్థితులు సరిగా లేని కారణంగా వెనకడుగు వేస్తారు. ప్రతిభావంతులకు ఇలాంటి పరిస్థితి ఎదురుకాకూడదన్న ఉద్దేశంతో వివిధ యూనివర్సిటీలు, ట్రస్టులు, ప్రభుత్వాలు స్కాలర్‌షిప్స్‌ను అందిస్తున్నాయి. వీటి ద్వారా విదేశాల్లో అత్యుత్తమ విద్యా సంస్థల్లో చదవాలనే కోరికను తీర్చుకోవచ్చు. వీటిలో ఖొరానా ప్రోగ్రామ్ ఫర్ స్కాలర్స్, డాక్టర్ మన్మోహన్‌సింగ్ స్కాలర్‌షిప్స్, గేట్స్- కేంబ్రిడ్జ్ స్కాలర్‌షిప్స్, ద రోడ్స్ స్కాలర్‌షిప్, కామన్‌వెల్త్ స్కాలర్‌షిప్ అండ్ ఫెలోషిప్ ప్లాన్ వంటివి ఉన్నాయి. వెబ్‌సైట్ల ఆధారంగా వీటి పూర్తివివరాలు తెలుసుకోవచ్చు.స్కాలర్‌షిప్‌లు పొందాలంటే అకడమిక్ స్కోర్ 70 శాతం కంటే ఎక్కువ ఉండాలి. జీఆర్‌ఈ 300 ప్లస్, టోఫెల్ 100 ప్లస్, ఐఈఎల్‌టీఎస్ 7.5పైన ఉంటే స్కాలర్‌షిప్‌లు లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
 
  టిప్స్
 విదేశీ విద్య దిశగా ఆలోచించే విద్యార్థి తొలుత తన కు అనుకూలమైన కోర్సు, కాలేజీతో పాటు ఆ దేశం పై అవగాహన ఏర్పరుచుకోవాలి. విద్యాసంస్థ ప్రా ధాన్యతను ఆయా దేశాల ఇమిగ్రేషన్ శాఖ వెబ్‌సైట్‌లలోని సమాచారం ఆధారంగా విశ్లేషించుకోవాలి.అకడమిక్ షెడ్యూల్ ఒక్కో దేశానికి ఒక్కో రకంగా ఉంటుంది. ఆ మేరకు వీలైనంత ముందుగా సన్నాహకాలు ప్రారంభించాలి. కనీసం 8 నుంచి 12 నెలల ముందు దరఖాస్తు చేసుకుంటే సంబంధిత ప్రక్రియ ఆటంకం లేకుండా ముగియడానికి, వీసా దరఖాస్తుకు తగిన సమయం లభిస్తుంది.విదేశీ వర్సిటీలు ప్రవేశాలు కల్పించేందుకు వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నాయి. మెరిట్(అకడమిక్ రికార్డ్), జీఆర్‌ఈ/జీమ్యాట్ వంటి పరీక్షల స్కోర్, టోఫెల్/ఐఈఎల్‌టీఎస్ స్కోర్, ఎస్‌ఓపీ, సమ్మరీ ప్రాజెక్ట్ అండ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్, రీసెర్చ్ ఎక్స్‌పీరియెన్స్, వర్క్ ఎక్స్‌పీరియెన్స్, రెజ్యుమె, ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్ తదితరాల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తాయి.
 

>
మరిన్ని వార్తలు