నల్లధనం అరికట్టే బిల్లుకు పార్లమెంటు ఆమోదం

20 May, 2015 23:52 IST|Sakshi

 అంతర్జాతీయం
 నేపాల్‌లో రెండోసారి భూకంపం
 నేపాల్‌లో మే 12న కాఠ్మాండూకు తూర్పున 80 కి.మీ.ల దూరంలో ఎవరెస్టు పర్వతానికి సమీపంలో రెండోసారి భూకంపం సంభవించిన ఘటనలో 50 మంది మృతి చెందారు. వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.3గా నమోదైంది. భూమి లోపల 15 కి.మీ లోతులో భూకంపం సంభవించింది. దీని ప్రభావం నేపాల్‌లోని 32 జిల్లాలపై పడింది. నేపాల్‌తోపాటు భారత్, అఫ్గానిస్థాన్‌లలో కూడా భూమి కంపించింది. భారత్‌లో 17 మంది మరణించారు. ఏప్రిల్ 25న సంభవించిన భూ కంపంతో నేపాల్‌లో సుమారు 8వేల మంది మరణించారు. భారీ ఆస్తి నష్టం వాటిల్లింది.
 
 పాలస్తీనాను అధికారికంగా గుర్తించిన వాటికన్
 పాలస్తీనాను వాటికన్ సిటీ అధికారికంగా గుర్తించింది. ఇందుకు సంబంధించి పాలస్తీనా, వాటికన్‌ల మధ్య మే 13న ఒప్పందం కుదిరింది. ఇకపై వాటికన్ దౌత్య సంబంధాలను పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్‌తో కాకుండా పాలస్తీనా దేశంతో కలిగి ఉంటుంది. పాలస్తీనా రాజ్యాన్ని ఐక్యరాజ్యసమితి సాధారణ సభ 2012లో గుర్తించడాన్ని వాటికన్ స్వాగతించింది. ఇజ్రాయెల్ మాత్రం పాలస్తీనా గుర్తింపుపై తీవ్ర నిరాశకు గురైంది.
 
 రూ. 1,154 కోట్లు పలికిన పికాసో చిత్రం
 ప్రఖ్యాత స్పానిష్ చిత్రకారుడు పాబ్లో పికాసో వేసిన ఉమెన్ ఆఫ్ అల్జీర్స్ (వెర్షన్ ఓ) చిత్రం రూ. 1,154 కోట్లు పలికింది. న్యూయార్క్‌లో క్రిస్టిస్ సంస్థ మే 11న నిర్వహించిన వేలంలో ఈ అమ్మకాలు జరిగాయి. కళాఖండానికి అత్యధిక ధర పలకడం ఇదే తొలిసారి. ఇదే వేలంలో స్విట్జర్లాండ్ శిల్పి ఆల్బర్ట్ జియకోమెట్టి వేసిన పాయింటింగ్ మేన్ అనే శిల్పం రూ. 909 కోట్లు పలికింది. ఒక శిల్పానికి రికార్డు స్థాయిలో ధర పలకడం కూడా ఇదే మొదటిసారి.
 
 క్రీడలు
 చైనాకు బ్యాడ్మింటన్ సుదిర్మన్ కప్
 బ్యాడ్మింటన్ సుదిర్మన్‌కప్‌ను చైనా గెలుచుకుంది. చైనాలోని డాంగ్వాన్‌లో మే 16న ముగిసిన ప్రపంచ టీమ్ మిక్స్‌డ్ చాంపియన్‌షిప్ సుదిర్మన్ కప్ ఫైనల్‌లో జపాన్‌ను చైనా ఓడించి వరుసగా ఆరోసారి విజేతగా నిలిచింది. ఈ పోటీలు తిరిగి 2017లో ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్ నగరంలో జరుగుతాయి.
 
 జొకోవిచ్, షరపోవాలకు రోమ్ ఓపెన్ టైటిళ్లు
 రోమ్ మాస్టర్స్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను జొకోవిచ్ గెలుచుకున్నాడు. రోమ్‌లో మే 16న జరిగిన ఫైనల్‌లో రోజర్ ఫెదరర్‌ను జొకోవిచ్ ఓడించాడు. ఇది జొకోవిచ్‌కు నాలుగో మాస్టర్స్ టైటిల్. మహిళల సింగిల్స్ టైటిల్‌ను మరియా షరపోవా కైవసం చేసుకుంది. మహిళల డబుల్స్ టైటిల్‌ను టిమియా బాబోస్, క్రిస్టినా మడనోవిచ్ జోడీ గెలుచుకుంది.
 
 వార్తల్లో వ్యక్తులు
 ఈజిప్టు మాజీ అధ్యక్షుడు మోర్సీకి మరణశిక్ష
 పదవీచ్యుతుడైన ఈజిప్టు మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ మోర్సీ (63)కి కైరోలో మే 16న కోర్టు మరణశిక్ష విధించింది. 2011 జనవరిలో జరిగిన తిరుగుబాటు సమయంలో వేలాది మంది జైలు నుంచి పారిపోయేందుకు కారణమైన మోర్సీతో పాటు నిషేధిత ముస్లిం బ్రదర్‌హుడ్ పార్టీ అధినేత మొహమ్మద్ బేడీ మరో 100 మంది ఇస్లామిస్టులకు కోర్టు మరణశిక్ష విధించింది. 2012లో అధ్యక్షుడైన మోర్సీ ఒక సంవత్సరం మాత్రమే పాలించారు. 2013 జూలైలో సామూహిక నిరసనల నేపథ్యంలో సైన్యం మోర్సీని పదవీచ్యుతుడిని చేసింది.
 
 ఉత్తర కొరియా రక్షణ మంత్రికి మరణశిక్ష
 ఉత్తర కొరియా రక్షణమంత్రి హైయోన్ యోంగ్-చోల్ (66)కు ప్రభుత్వం మరణశిక్ష విధించింది. యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్‌తో యోంగ్-చోల్‌ను కాల్చి చంపినట్లు ఉత్తర కొరియా నిఘా వర్గాలు మే 13న ప్రకటించాయి. దేశ నేత కిమ్ జాంగ్ ఉన్‌కు వ్యతిరేకంగా యోంగ్-చోల్ పదేపదే ఫిర్యాదు చేయడం, ఉత్తర్వులు పాటించక పోవడం, సైనిక కార్యక్రమంలో నిద్రపోవడం ఆయన శిక్షకు ప్రధాన కారణాలని ప్రభుత్వం తెలిపింది.
 
 స్వలింగ సంపర్క వివాహం చేసుకున్న
 లక్సెంబర్గ్ ప్రధాని
 లక్సెంబర్గ్ ప్రధానమంత్రి జేవియర్ బెట్టెల్ (42) తన సహచరుడు గాథియర్ డెస్టెనేను మే 15న వివాహం చేసుకున్నారు. ఇలాంటి వివాహం చేసుకున్న తొలి యూరోపియన్ యూనియన్ రాజకీయ నేతగా ఆయన గుర్తింపు పొందారు. బెట్టెల్ 2013 నుంచి లక్సెంబర్గ్ ప్రధానిగా కొనసాగుతున్నారు. ఆ దేశ పార్లమెంట్ 2014 జూన్‌లో స్వలింగ సంపర్కుల వివాహాలకు ఆమోదం తెలిపింది.
 
 అవార్డులు
 అమెరికా నేషనల్ జియోగ్రఫిక్ బీ విజేతగా కరణ్ మీనన్
 భారత సంతతికి చెందిన కరణ్ మీనన్ అమెరికాలో నిర్వహించిన నేషనల్ జియోగ్రఫిక్ బీ పోటీలో విజేతగా నిలిచాడు. వాషింగ్టన్‌లో మే 12న ముగిసిన పోటీలో అమెరికాలోని 11వేల పాఠశాలల నుంచి 40 లక్షల మంది విద్యార్థులు పాల్గొన్నారు. న్యూజెర్సీలో ఎనిమిదో తరగతి చదువుతున్న కరణ్ మీన న్ (14) ప్రథమ స్థానంలో నిలవగా, మరో భారత సంతతి విద్యార్థిని శ్రేయ యార్లగడ్డకు ద్వితీయ స్థానం దక్కింది. విజేత కరణ్‌మీనన్‌కు 85వేల డాలర్ల స్కాలర్ షిప్, నేషనల్ జియోగ్రఫిక్ సొసైటీలో జీవిత కాల సభ్యత్వం లభించగా, రెండో స్థానంలో నిలిచిన శ్రేయ 25వేల డాలర్ల స్కాలర్‌షిప్ అందుకుంది.
 
 నీల్ ముఖర్జీకి బ్రిటన్ ఎన్‌కోర్ సాహిత్య అవార్డు
 ప్రముఖ రచయిత నీల్ ముఖర్జీకి బ్రిటన్‌కు చెందిన ఎన్‌కోర్ సాహిత్య అవార్డు లభించింది. ఆయన రాసిన ద లైవ్స్ ఆఫ్ అదర్స్ నవలకు ఈ బహుమతి దక్కింది. రచయిత రెండో నవలను ఈ అవార్డుకు ఎంపిక చేస్తారు. పురస్కారం కింద రూ. 10 లక్షల నగదు బహూకరిస్తారు. కోల్‌కతాలో జన్మించిన ముఖర్జీ మొదటి నవల ఎ లైఫ్ అపార్ట్.
 
 ఆర్థికం
 ఏప్రిల్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.87 శాతం
 ఏప్రిల్‌లో వినియోగధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం రేటు 4.87 శాతంగా నమోదైంది. 2014 ఏప్రిల్ ధరలతో పోల్చితే ఆయా వినియోగ వస్తువుల ధరలు 2015 ఏప్రిల్‌లో 4.87శాతం పెరిగి మార్చిలో 5.25 శాతంగా ఉన్నాయి. 4 నెలల తర్వాత తక్కువ స్థాయిలో ధరల వృద్ధి రేటు నమోదయింది. పండ్లు, కూరగాయలు, పాలు సంబంధిత ఉత్పత్తుల ధరల పెరుగుదలలో వేగం తగ్గడం వల్ల ద్రవ్యోల్బణం రేటు తగ్గింది.
 
 ఏప్రిల్‌లో -2.65కు తగ్గిన టోకు ధరల ద్రవ్యోల్బణం
 టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం రేటు ఏప్రిల్‌లో - 2.65 శాతం క్షీణించింది. 2014 ఏప్రిల్‌తో పోల్చితే మొత్తం టోకు వస్తువుల ధరలు పెరగకపోగా 2015 ఏప్రిల్‌లో -2.65 శాతం తగ్గాయి. ఆహార ఉత్పత్తుల ధరలు పెరిగినా చమురు, తయారీ రంగ ఉత్పత్తుల ధరలు తగ్గడంతో ఏప్రిల్‌లో డబ్ల్యూపీఐలో ప్రతి ద్రవ్యోల్బణం నమోదైంది. ఇది 2014 ఏప్రిల్‌లో 5.5 శాతంగా ఉందని ప్రభుత్వం మే14న ప్రకటించింది.
 
 భారత వృద్ధి రేటు 8.1 శాతంగా ఐరాస అంచనా
 భారత ఆర్థిక వ్యవస్థ 2015లో 8.1 శాతం వృద్ధి సాధిస్తుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. ఆసియా, పసిఫిక్ ప్రాంతం- ఈ ఏడాది ఆర్థిక, సామాజిక పరిస్థితులు అనే నివేదికలో ఐక్యరాజ్య సమితి వృద్ధిని అంచనా వేసింది. తగ్గిన ద్రవ్యోల్బణం, పటిష్టమైన వినియోగ డిమాండ్, మౌలిక ప్రాజెక్టుల అమలు, ప్రభుత్వ సంస్కరణలు చేపట్టడం వంటివి వృద్ధి రేటు పెరగడానికి దోహదపడతాయని ఐరాస తెలిపింది. ఈ వృద్ధి 2016 లో 8.2 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది.
 జాతీయం
 
 భారత్ - చైనాల మధ్య 24 ఒప్పందాలు
 భారత ప్రధాని నరేంద్రమోదీ చైనా పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య మే 15న 24 ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. మోదీ మూడు రోజుల పర్యటనలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ స్వస్థలం జియాన్ నగరాన్ని సందర్శించారు. చైనా తొలి చక్రవర్తి క్విన్ షిహ్వాంగ్ రూపొందించిన యుద్ధవీరుల ప్రతిమలున్న టైట (మట్టితో చేసిన ప్రతిమల మ్యూజియం)ను మోదీ సందర్శిం చారు. రెండోరోజు చైనా ప్రధాని లీకెక్వియాంగ్‌తో సమావేశమ య్యారు. ఇరుదేశాల మధ్య రైల్వేలు, గనులు, అంతరిక్షం, ఇంజనీరింగ్, పర్యాటక, విద్యా, భూకంపశాస్త్రం వంటి ప్రధాన రంగాల్లో పరస్పర సహకారం, చెంగ్డు, చెన్నైలలో రాయబార కార్యాలయాల ఏర్పాటుపై ఒప్పందాలు జరిగాయి. సోదర నగరాల నిర్మాణ ఒప్పందాల్లో కర్ణాటక రాష్ట్రం - సిచువాన్ రాష్ట్రం, చెన్నై - చోంగ్ క్వింగ్, హైదరాబాద్ - క్వింగ్ డావో, ఔరంగాబాద్ - దన్‌హాంగ్ నగరాల అభివృద్ధికి ఒప్పందం జరిగింది.
 
 బాల కార్మిక చట్టానికి సవరణలు
 బాల కార్మిక (నిషేధ, నియంత్రణ) చట్టానికి చేసిన సవరణలకు కేంద్ర మంత్రి వర్గం మే 13న ఆమోదం తెలిపింది. ఈ సవరణల వల్ల ప్రమాదకరం కాని కుటుంబ వ్యాపారాలు, వృత్తుల్లో 14 ఏళ్లలోపు పిల్లలు పనిచేసేందుకు అనుమతి లభించింది. వినోద పరిశ్రమలు, క్రీడా కార్యక్రమాల్లోనూ పిల్లలతో పనిచేయించుకోడానికి వీలుంటుంది. వ్యవసాయం, హస్తకళలు వంటి కుటుంబ వృత్తుల్లో పిల్లలు పనిచేయడం వల్ల మెళకువలు నేర్చుకోవడం, తల్లిదండ్రులకు సహకరించడం, సామాజిక నిర్మాణం వంటి పరిస్థితుల వల్ల పిల్లలు పనిచేసేందుకు మినహాయింపు ఇచ్చినట్లు ప్రభుత్వం పేర్కొంది. బాలకార్మికులను ప్రోత్సహించేవారికి జైలుశిక్షను మూడేళ్లకు, జరిమానాను రూ. 50 వేలకు పెంచారు.
 
 నల్లధనం అరికట్టే బిల్లుకు పార్లమెంటు ఆమోదం
 విదేశాల్లో దాచిన నల్లధనాన్ని స్వాధీనం చేసుకునేందుకు ఉద్దేశించిన బిల్లును లోక్‌సభ మే 11న, రాజ్యసభ మే 13న ఆమోదించాయి. దీంతో నల్లధనం (బహిర్గతం చేయని విదేశీ ఆదాయం, ఆస్తులు), పన్ను విధింపు బిల్లు -2015కు పార్లమెంటు ఆమోదం లభించింది. బిల్లు అమల్లోకి వస్తే 120 శాతం పన్ను, జరిమానాతో పాటుపదేళ్ల జైలు శిక్ష పడుతుంది. విదేశాల్లో దాచిన నల్లధనానికి సమానంగా భారత్‌లో ఉన్న ఆస్తులను స్వాధీనం చేసుకోడానికి ప్రభుత్వానికి అధికారం కల్పిస్తుంది.
 
 దక్షిణ కొరియాలో మోదీ పర్యటన
 ప్రధాని మోదీ మే 17న దక్షిణ కొరియా అధ్యక్షురాలు పార్క్ గున్ హైతో చర్చలు జరిపారు. ఇరుదేశాలు ద్వంద్వ పన్నుల నిరోధ ఒప్పందం, దృశ్య శ్రవణ సంయుక్త నిర్మాణం, విమాన రాకపోకల విస్తరణ, విద్యుత్ ఉత్పత్తి - పంపిణీతోపాటు పలు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. సముద్ర భద్రతపై పరస్పర సహకారం, నౌకా నిర్మాణంపై జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటుకు ఇరుదేశాలు నిర్ణయించాయి.
 
 మానవ వనరుల వినియోగంలో భారత్‌కు వందో స్థానం
 ప్రపంచ ఆర్థిక ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) రూపొందించిన మానవ వనరుల వినియోగ సూచీ (హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్)లో భారత్ 100వ స్థానంలో నిలిచింది. మే 14న విడుదల చేసిన సూచీలో బ్రిక్స్ (రష్యా, చైనా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా) దేశాలు, పొరుగు దేశాలు శ్రీలంక, భూటాన్, బంగ్లాదేశ్‌ల కంటే భారత్ తక్కువ స్థానంలో నిలిచింది. ఫిన్‌లాండ్ మొదటి స్థానంలో నిలవగా నార్వే, స్విట్జర్లాండ్ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. విద్యను ఆర్జించడంలో భారత్ పరిస్థితి మెరుగుపడినప్పటికీ యువతలో అక్షరాస్యత 90 శాతంగా ఉంది. ఇది పురోగమిస్తున్న ఆర్థిక వ్యవస్థలతో పోల్చితే తక్కువని నివేదిక పేర్కొంది. అధిక అసంఘటిత రంగం వల్ల శ్రామిక భాగస్వామ్యంలో భారత్ ర్యాంకు తక్కువని డబ్ల్యూఈఎఫ్ వివరించింది.
 
 మంగోలియాకు రూ. 6,344 కోట్ల
 భారత్ రుణం
 ప్రధాని నరేంద్రమోదీ రెండు రోజుల మంగోలియా పర్యటనలో ఆ దేశ మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం రూ. 6,344 కోట్ల రూపాయల రుణాన్ని ప్రకటించారు. మే 17న ఆ దేశ ప్రధాని చిమెదిన్ సాయిఖాన్ బిలెగ్‌తో నిఘా, వైమానిక సేవలు, సైబర్ భద్రతతోపాటు 13 అంశాలకు చెందిన ఒప్పందాలు చేసుకున్నారు. మంగోలియా సందర్శించిన తొలి భారత ప్రధానిగా మోదీ ఆ దేశ పార్లమెంట్ స్టేట్ గ్రేట్ ఖురల్ ప్రత్యేక సమావేశంలో ప్రసంగించారు.
 
 హైదరాబాద్‌లో గూగుల్ క్యాంపస్
 ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్ హైదరాబాద్‌లో క్యాంపస్ ఏర్పాటు చేయనుంది. కాలిఫోర్నియాలో మే 12న తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె. తారకరామారావు సమక్షంలో గూగుల్, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఈ క్యాంపస్ అమెరికా వెలుపల గూగుల్ క్యాంపస్‌లలో అతిపెద్దది కానుంది. ఇది ఆసియాలో గూగుల్‌కు తొలి క్యాంపస్. 7.2 ఎకరాల విస్తీర్ణంలో రూ. 1000 కోట్లతో ఈ క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తారు. 13 వేల మంది ఉద్యోగులు పనిచేస్తారు. 2016లో దీని నిర్మాణం ప్రారంభించి నాలుగేళ్లలో పూర్తి చేయనున్నారు.
 

మరిన్ని వార్తలు