అవకాశాలకు, ఆదాయానికి వారధి.. యానిమల్ ట్రైనర్!

6 Sep, 2014 00:15 IST|Sakshi
అవకాశాలకు, ఆదాయానికి వారధి.. యానిమల్ ట్రైనర్!

ఇంట్లో కుక్కలు, పిల్లులు వంటి జంతువులను పెంచుకోవడం చాలామందికి అభిరుచి, అలవాటు. ఇవి యజమానుల పట్ల విశ్వాసపాత్రంగా మెలుగుతాయి. వారికి రక్షణ కల్పిస్తాయి. ఇంట్లో పెంపుడు జంతువులు ఉండడం సమాజంలో ఒక హోదాగా మారింది. ఇక పోలీసు, రక్షణ శాఖలో జాగిలాలు అందిస్తున్న సేవలు తెలిసినవే. జంతువులను మచ్చిక చేసుకోవడం అనాదిగా ఉన్నదే. జంతువులను పెంచుకోవాలంటే మొదట వాటికి తగిన శిక్షణ ఇవ్వాలి. శిక్షణ పొందినవే.. యజమానులు చెప్పినట్లు నడుచుకుంటాయి. క్రమశిక్షణతో మెలుగుతాయి. ఇలాంటి వాటికే మార్కెట్‌లో అధిక డిమాండ్ ఉంటుంది. జంతువులకు శిక్షణ  ఇచ్చే నిపుణులే.. యానిమల్ ట్రైనర్లు. ఆధునిక కాలంలో పెట్స్ సంస్కృతి విస్తరిస్తుండడంతో ట్రైనర్లకు అవకాశాలు ఇబ్బడిముబ్బడిగా లభిస్తున్నాయి. విదేశాల్లో ఎప్పటినుంచో ఆదరణ పొందుతున్న ఈ కెరీర్.. భారత్‌లోనూ ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తోంది. యానిమల్ ట్రైనింగ్‌ను కెరీర్‌గా ఎంచుకుంటే ఉపాధికి ఢోకా ఉండదని ఘంటాపథంగా చెప్పొచ్చు.
 
 సినిమాలు, టీవీ కార్యక్రమాల్లో..
 జంతు శిక్షకులకు ప్రస్తుతం ఎన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. పోలీసు, రక్షణ శాఖలో, వెటర్నరీ క్లినిక్స్, పెట్ షాప్స్, జంతు ప్రదర్శనశాలలు, యానిమల్ షెల్టర్స్, వైల్డ్‌లైఫ్ పార్కులు, రిజర్వ్‌లు, పరిశోధనా కేంద్రాలు, సర్కస్‌ల్లో ఉద్యోగాలు దక్కుతున్నాయి. విదేశాల్లో అయితే సినిమాలు, టీవీ కార్యక్రమాలు, వాణిజ్య ప్రకటనలు, ప్రింట్ యాడ్స్‌లోనూ యానిమల్ ట్రైనర్ల సహాయం తీసుకుంటున్నారు. ఆకర్షణీయమైన వేతనాలు అందజేస్తున్నారు. జంతువులతో సంబంధం ఉన్న ప్రతిరంగంలోనూ వీరికి అవకాశాలుంటాయి. సొంతంగా జంతువులకు శిక్షణ ఇచ్చి, వాటిని విక్రయించుకోవచ్చు.
 
 కావాల్సిన నైపుణ్యాలు:
 యానిమల్ ట్రైనర్లకు ప్రాథమికంగా జంతువుల పట్ల అభిమానం, వాటిని ప్రేమించే గుణం ఉండాలి. సమయానుసారంగా జంతువుల ప్రవర్తనను అర్థం చేసుకొని తదనుగుణంగా వ్యవహరించే నేర్పు అవసరం. సమస్యలను పరిష్కరించే నైపణ్యం కావాలి. శారీరకంగా దృఢంగా, ఆరోగ్యంగా ఉండాలి. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. స్వయం నియంత్రణ అవసరం. కోపతాపాలకు, ఆవేశానికి దూరంగా ఉండాలి. వివిధ జంతువుల ప్రవర్తన వేర్వేరుగా ఉంటుంది కాబట్టి ఓపిక, సహనంతో  పనిచేయగలగాలి.
 
 అర్హతలు:  మనదేశంలో యానిమల్ ట్రైనర్‌గా మారేందుకు ఎలాంటి విద్యార్హతలు, నియమ నిబంధనలు లేవు. అయితే, కనీసం ఇంటర్మీడియెట్‌లో ఉత్తీర్ణులై ఉండడం మంచిది. అమెరికా, యునెటైడ్ కింగ్‌డమ్(యూకే), ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో యానిమల్ సైన్స్, యానిమల్ బిహేవియర్, బయాలజీ, జువాలజీ, మెరైన్ బయాలజీ, సైకాలజీ కోర్సులను చదివినవారు ఈ రంగంలోకి అడుగుపెడుతున్నారు. ఈ కోర్సులను పలు యూనివర్సిటీలు ఆఫర్ చేస్తున్నాయి.
 
 వేతనాలు: యానిమల్ ట్రైనర్‌కు ప్రారంభంలో నెలకు రూ.20 వేల వేతనం లభిస్తుంది. ఈ రంగంలో అనుభవం, పనితీరును బట్టి ఆదా యం ఉంటుంది. నెలకు లక్ష రూపాయలకు పైగా సంపాదించే ట్రైనర్లు కూడా ఉన్నారు. విదేశాల్లో ఇంకా అధిక వేతనాలు అందుతాయి.
 
 శిక్షణ, సేవలు అందిస్తున్న సంస్థలు:
     కమాండో కెన్నెల్స్-హైదరాబాద్
 వెబ్‌సైట్: http://www.commandokennels.com/
     యూనివర్సిటీ ఆఫ్ లింకన్. వెబ్‌సైట్: www.lincoln.ac.uk
     ఆంగ్లియా రస్కిన్ యూనివర్సిటీ
 వెబ్‌సైట్: www.anglia.ac.uk/ruskin/en/landing.html
     యూనివర్సిటీ ఆఫ్ చెస్టర్. వెబ్‌సైట్: www.chester.ac.uk
     ద సెంటర్ ఆఫ్ అప్లయిడ్ పెట్ ఎథాలజీ
 వెబ్‌సైట్: www.coape.org
 
 జంతు ప్రేమికులకు సరైన కెరీర్!
 ‘‘జంతువుల పట్ల ప్రేమ, వాటి ప్రవర్తనపై అవగాహన ఉన్నవారు యానిమల్ ట్రైనర్‌గా కెరీర్‌ను ఎంచుకోవచ్చు. తమ ఆజ్ఞలకు అనుగుణంగా జంతువులు పనిచేసేలా శిక్షణ ఇవ్వడమే వారి విధి. ప్రధానంగా శునకాల శిక్షణకు డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. ఇంటికి కాపలాగా ఉండడంలో, శాంతిభద్రతల రక్షణలో పోలీసులకు సాయపడడంలోనూ జాగిలాలది కీలక పాత్ర. అంతేకాకుండా చాలా మంది కుక్కలను పెంచుకుంటారు. అవి కూడా యజమానులు చెప్పే చిన్నచిన్న పనులను చేస్తుంటాయి. వీటిలో కొన్ని స్వతహాగా ఆ లక్షణాలు అలవర్చుకున్నప్పటికీ మరికొన్ని శిక్షణ ద్వారా చెప్పినట్లుగా నడుచుకుంటాయి. ఈ కెరీర్‌కు సంబంధించి ప్రత్యేకమైన కోర్సులు లేనప్పటికీ పలు సంస్థలు యానిమల్ ట్రైనర్‌గా శిక్షణను అందిస్తున్నాయి. ఇందులో నైపుణ్యం పొందినవారు పార్ట్ టైం లేదా ఫుల్‌టైమ్‌గా పనిచేస్తూ ఆకర్షణీయమైన ఆదాయం ఆర్జిస్తున్నారు’’
 - ప్రకాశ్ భట్, మేనేజింగ్ డెరైక్టర్, కమాండో కెన్నెల్స్
 
 కాంపిటీటివ్ కౌన్సెలింగ్
 ఎస్‌బీఐ అసోసియేట్స్ బ్యాంకుల పీవో పరీక్షలో జనరల్ అవేర్‌నెస్
 విభాగానికి ఎలా ప్రిపేర్ కావాలి?   - కె.సాయికృష్ణ, ఉప్పల్
 
 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుబంధ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్ల పోస్టుల భర్తీకి నవంబర్‌లో పరీక్ష నిర్వహించనున్నారు. ఇందులో జనరల్ అవేర్‌నెస్ నుంచి 25 ప్రశ్నలు ఇస్తారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. ఈ విభాగంలో కరెంట్ అఫైర్స్, బ్యాంకింగ్ రంగాల నుంచి ఎక్కువ ప్రశ్నలు అడుగుతారు. గత ప్రశ్నపత్రాలను  పరిశీలించినట్లయితే కరెంట్ అఫైర్స్ నుంచి 15 ప్రశ్నలు, బ్యాంకింగ్ అవేర్‌నెస్ నుంచి 10 ప్రశ్నలు వచ్చాయి. కరెంట్ అఫైర్స్‌లో వార్తల్లోని వ్యక్తులు, ప్రదేశాలు, ప్రభుత్వ పథకాలు, జాతీయ, అంతర్జాతీయ వర్తమానాంశాలు, దేశాల మధ్య జరిగిన ఒప్పం దాలు, అంతర్జాతీయ సదస్సులు, జాతీయ, అంతర్జాతీయ అవార్డులు, ఇటీవల జరిగిన క్రీడా టోర్నమెంట్లు- రికార్డులు, ఆర్థిక వ్యవహారాలు, ప్రణాళికలు, భారత అంతరిక్ష పరిశోధనలు, దేశ రక్షణ వ్యవస్థ, ఇటీవల ప్రయోగించిన క్షిపణులు, ప్రవేశపెట్టిన యుద్ధ నౌకలు, కమిటీలు - చైర్మన్లు, అణ్వస్త్ర రంగానికి సంబంధించిన తాజా పరిణామాలు, 16వ లోక్‌సభ ఎన్నికలు మొదలైన  అంశాలను బాగా చదవాలి. కేంద్ర మంత్రి మండలి, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నూతన గవర్నర్లు, ప్రపంచకప్ ఫుట్‌బాల్, కామన్‌వెల్త్ క్రీడలు, ఆసియా క్రీడల నుంచి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలలో భారత్ జీడీపీ వృద్ధిరేటు, రైల్వే బడ్జెట్, ఎకనమిక్ సర్వే, కేంద్ర బడ్జెట్ నుంచి ప్రశ్నలు రావడానికి ఆస్కారం ఉంది. బ్యాంకింగ్ రంగంలో ఆర్‌బీఐ తాజా పరపతి విధానం, ఆర్‌బీఐ గవర్నర్, డిప్యూటీ గవర్నర్లు, ఆర్‌బీఐ ఇటీవల తీసుకున్న నిర్ణయాలు, భారతీయ స్టేట్ బ్యాంక్.. వాటి అనుబంధ బ్యాంకులు, బ్యాంకింగ్ రంగంలో తాజా పరిణామాలు, కొత్త బ్యాంకులు, ప్రధానమంత్రి జనధన యోజన, ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్, ఆర్‌బీఐ కమిటీలు - వాటి సిఫారసులు, పాలసీ రేట్లు, బ్యాంకింగ్ పదజాలం, ఏటీఎంలు, వైట్ లేబుల్ ఏటీఎంలు, డిపాజిట్లు - వాటి రకాలు, నో యువర్ కస్టమర్ విధానాలు, మనీ లాండరింగ్ వంటి అంశాలను క్షుణ్నం గా చదవాలి. స్టాక్ జీకేకు సంబంధించి ముఖ్యమైన దినాలు, దేశాలు- రాజధానులు- కరెన్సీలు- పార్లమెంట్‌లు, క్రీడల ట్రోఫీలు, క్రీడా పదాలు వంటివి కూడా చదివితే మంచిది. జనరల్ అవేర్‌నెస్‌లో మంచి స్కోరు సాధించాలంటే రోజూ ఏదైనా దినపత్రిక చదివి నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం తప్పనిసరి. www.sakshieducation.com లో ఉన్న కరెంట్ అఫైర్స్‌ను చదివితే విజయం మీదే.
 ఇన్‌పుట్స్: ఎన్.విజయేందర్‌రెడ్డి, సీనియర్ ఫ్యాకల్టీ
 
 జాబ్స్ అలర్‌‌ట్స.. సెయిల్
 స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్).. దుర్గాపూర్ ప్లాంట్‌లో వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
     ఆపరేటర్ కమ్ టెక్నీషియన్
 అర్హతలు: పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిప్లొమా ఉండాలి.
     అటెండెంట్ కమ్ టెక్నీషియన్
 అర్హతలు: పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు సంబంధిత విభాగంలో ఐటీఐ ఉండాలి.
     మెడికల్ సర్వీస్ ప్రొవైడర్(ట్రైనీ)
 అర్హతలు: ఫార్మసీ/రేడియాలజీలో డిగ్రీ/డిప్లొమా/బీఎస్సీ (ఫుడ్ అండ్ న్యూట్రిషన్/డైటిటిక్స్/క్లినికల్ న్యూట్రిషన్)తోపాటు సంబంధిత విభాగంలో ఏడాది అనుభవం ఉండాలి.
     పై పోస్టులకు నోటిఫికేషన్‌లో నిర్దేశించిన వయోపరిమితి కూడా తప్పనిసరిగా ఉండాలి.
 ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా..
 దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.. చివరి తేది: అక్టోబర్ 8
 వెబ్‌సైట్: http://sailcareers.com/careers

మరిన్ని వార్తలు