తెలుగు పంచకావ్యాల్లో చోటు దక్కని ప్రబంధం?

5 Sep, 2014 10:35 IST|Sakshi

కావ్య ప్రక్రియలు - లక్షణాలు
పురాణం
పరమశివుని నిట్టూర్పు వల్ల వేదాలు, శివుడు స్మరించడం వల్ల పురాణాలు జనించాయని ఐతిహ్యం. వేదాలు సృష్టి పూర్వ రహస్యాలను, పురాణాలు సృష్టి అనంతర విషయాలను తెలియజేస్తాయి. పురాణం అంటే ప్రాచీనమైందని అర్థం. వేదవ్యాసుడు వేదాల సారాన్ని చక్కని కథలతో పురాణాలుగా రచించాడని ప్రతీతి.

ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అనే చతుర్విధ పురుషార్థాలను పురాణాలు తెలియజేస్తాయి.
ఈ పురాణ వాఙ్మయాన్ని ఆంగ్లంలో ‘మైథాలజీ’ అంటారు.

పురాణాల్లోని కథలన్నీ ప్రతీకాత్మకాలే. అవి రమ్యంగా, ప్రాచీన మానవుని సుఖ దుఃఖాలను, ఉత్తాన పతనాలను తెలియ జేస్తాయని ఇరివెంటి కృష్ణమూర్తి పేర్కొన్నారు.
 పురాణం - నిర్వచనాలు:
‘పురాపినవమ్ ఫురాణమ్’
 ‘పురాణీయతే ఇతి పురాణమ్’
‘పురా అవ ఇతి పురాణమ్’

పురాణం - లక్షణాలు:
పురాణ లక్షణాలను పరిశీలించి, అమరసింహుడు పురాణం పంచ లక్షణమ్ అని అమరకోశంలో కిందివిధంగా పేర్కొన్నాడు.
‘స్వర్గశ్చ ప్రతిసర్గశ్చవంశో మన్వంతరాణిచ వంశాను చరితం చేతి లక్షణానాంతు పంచకమ్’
పురాణం - పంచ లక్షణాలు:
 సర్గ: బ్రహ్మాండమ్ పుట్టు పూర్వోత్తరాలను తెలిపేది సర్గ.
పతిసర్గ: కల్పాంతంలో జరిగే పునఃసృష్టిని వివరించేది ప్రతిసర్గ.
వంశం: దేవతల, రాక్షసుల వంశకర్తల గురించి వివరించేది వంశం.
మన్వంతరం: 14 మంది మనువుల పుట్టుక, వారి పాలన విశేషాలను వివరించేది మన్వంతరం.
 వంశానుచరితం: సూర్య, చంద్ర వంశాల్లో జన్మించిన రాజుల చరిత్రను తెలిపేది వంశానుచరితం.
అష్టాదశ పురాణాల శ్లోకం
‘మద్వయంభద్వయం చైవ బత్రయం వ చతుష్టయం
అనాపలింగ కూస్కాని పురాణేని పృథక్ పృథక్’
లోకంలో అష్టాదశ పురాణాలున్నాయని ప్రతీతి.
అష్టాదశ పురాణాలు వేదవ్యాసుని కలం నుంచి జాలువారాయి.
సంస్కృతంలో 18 పురాణాలు, 18 ఉప పురాణాలు ఉన్నాయి.
మార్కండేయ పురాణాన్ని మొదటిసారిగా  సంస్కృతం నుంచి తెలుగులోకి అనువదించారు. ఇది ప్రథమాంధ్ర మహాపురాణం.    ఈ పురాణ కర్త మారన.

పోతన మధురమైన శైలిలో భక్తి వర్ణనలతో శ్రీమద్భాగవత మహాపురాణాన్ని ఆంధ్రీకరించారు.
పబంధయుగంలో వెలసిన పురాణం మత్స్య పురాణం (కర్త హరిభట్టు)
వరాహపురాణాన్ని అనువదించిన జంటకవులు - నంది మల్లయ, ఘంట సింగన.
గరుడ పురాణాన్ని అనువదించిన అష్టదిగ్గజ కవి పింగళి సూరన.
పాల్కురికి సోమనాథుడు తెలుగులో స్వతంత్రంగా బసవ పురాణం గ్రంథాన్ని  రచించాడు.
ఎర్రన నృసింహ పురాణం అనే కావ్య రచనతో తెలుగులో ప్రబంధ రీతులను ప్రవేశపెట్టాడు.

ఇతిహాసం
ఇతిహాసం అంటే చరిత్ర అని అర్థం. ఈ విధంగా జరిగిందని చెప్పడం. చారిత్రకమైన ఇతివృత్తం కలది ఇతిహాసం. పూర్వకథ అనే అర్థం కూడా వస్తుంది.
అమరసింహుడు తన అమరకోశంలో ‘ఇతిహాసం పురావృత్తమ్’  అని పేర్కొన్నాడు.
వీటిని ఆంగ్లంలో ‘ఎపిక్’ అంటారు. ఇవి గ్రంథస్థం కాకముందు ఆశు రూపంలో ఉండేవి. ఇతిహాసాల్లో కథాకథనానికి ప్రాధాన్యం ఎక్కువ.
తెలుగునాట కథాకథనానికి ఆద్యుడు నన్నయ. రామాయణ, మహాభారత కావ్యాలను ఇతిహాసాలు అంటారు.
సూర్యవంశ చరిత్ర - రామాయణం
చంద్రవంశ చరిత్ర - భారతం
ఇతిహాసాలు రెండు రకాలు. అవి...
1. పరిక్రియ    2. పురాకల్పం
ఏకనాయకాశ్రీతం ఉన్న ఇతిహాసాన్ని పరిక్రియ అంటారు.
ఉదా: రామాయణం (రాముడు)
బహు నాయకాశ్రీతం ఉన్న ఇతిహాసాన్ని పురాకల్పం అంటారు.
ఉదా: మహాభారతం (పాండవులు, కౌరవులు)
తెలుగులో తొలి ఇతిహాసం ఆంధ్ర మహాభారతం
సంస్కృతంలో తొలి ఇతిహాసం రామాయణం.
తమిళంలో కంబడు కంబరామాయణం రచించాడు.
హిందీలో తులసీదాస్ రామచరిత మానస్ అనే పేరుతో రామాయణం రచించాడు.
తెలుగులో భారతానికి పరిశిష్ట గ్రంథం ఎర్రన హరివంశం.
తొలి తెలుగు రామాయణం రంగనాథ రామాయణం. ఇది తొలి తెలుగు ద్విపద రామాయణం. దీని కర్త గోన బుద్ధారెడ్డి.
తొలి తెలుగు చంపూ రామాయణం భాస్కర రామాయణం.
తొలి తెలుగు సంగ్రహ (సంక్షిప్త) రామాయణం మొల్ల రామాయణం. కంకంటి పాపరాజు రాసిన ఉత్తర రామాయణం తెలుగులో రసవత్కావ్యంగా ప్రసిద్ధికెక్కింది. ఆధునిక యుగంలో అల్లంరాజు రంగశాయి కవి చంపూ భారతాన్ని, చంపూ రామాయణాన్ని రచించాడు.
కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ శ్రీమద్రామాయణ కల్పవృక్షం రచించారు. దీనికి జ్ఞానపీఠ్ పురస్కారం పొందారు.
 
ప్రబంధం
ప్రకృష్టమైన బంధం ఉన్న రచనను ‘ప్రబంధం’ అంటారు. ఏదైనా పురాణేతిహాసాల నుంచి ఒక చిన్న కథను గ్రహించి, స్వకపోక కల్పనలతో స్వతంత్ర కావ్యం అన్నట్లుగా భాషింపజేయడాన్ని ప్రబంధం అంటారు. అష్టాదశ వర్ణనలున్న కావ్యాన్ని ప్రబంధం అంటారు. దీన్నే మహాకావ్యం అని కూడా పిలుస్తారు.
లక్షణాలు:
పురాణేతిహాసాల నుంచి కథను గ్రహించాలి.
ఏకనాయకాశ్రయత్వం.
వస్త్వైక్యం ఉండాలి.
అష్టాదశ వర్ణనలు ఉండాలి.
శృంగారం రసరాజంగా ఉండాలి.
 అలంకారికమైన శైలి ఉండాలి.
సజీవ పాత్ర చిత్రణ ఉండాలి.
అనువాదం కాకుండా, స్వతంత్ర రచన అన్నట్లు ఉండాలి.
 
క్రీ.శ. 16వ శతాబ్ద కాలాన్ని తెలుగు సాహిత్య చరిత్రలో ప్రబంధ యుగం అంటారు. శ్రీ కృష్ణదేవరాయలు కాలంలో వెలువడిన కావ్యాలను ప్రబంధాలు అంటారు. రాయల యుగంలో వెలువడిన ప్రబంధాలతో 16వ శతాబ్దం స్వర్ణయుగంగా పరిఢవిల్లింది.
తొలి తెలుగు సమగ్ర ప్రబంధం మను     చరిత్ర. చిట్టచివరి ఉత్తమ ప్రబంధం విజయ విలాసం (చేమకూర వెంకటకవి)
తెలుగులో వెలువడిన కల్పిత ప్రబంధం కళాపూర్ణోదయం. దీన్ని పద్య రూపంలో ఉన్న నవల అని పిలుస్తారు.
 
శతకం
శత్ అనే సంస్కృత ధాతువు నుంచి శతకం  అనే పదం జనించింది. శత్ అంటే నూరు (వంద) అని అర్థం. నూరు పద్యాల రచనను శతకం అంటారు. కానీ తెలుగు లాక్షణికుల ప్రకారం నూరు పైచిలుకు పద్యాల రచనే శతకం. ఇవి  నీతిని, లోక ధర్మాలను బోధిస్తాయి.
నిర్వచనాలు: ‘శతేన శతకం ప్రోక్తం’ అని సంస్కృతంలో నియమం ఉంది.
తెలుగులో నూరు, నూట ఎనిమిది, నూట పదహారు శ్లోకాలు/ పద్యాలతో కూడినవి కూడా శతకాలే.
లక్షణాలు: సంస్కృత, ప్రాకృత శతకాల్లోని లక్షణాలే తెలుగు శతకాల్లోనూ రూపుదిద్దుకున్నాయని ప్రముఖ శతక సాహిత్య పరిశోధకుడు డాక్టర్ కె. గోపాలకృష్ణారావు అభిప్రాయపడ్డారు. శతకానికి కింది లక్షణాలుండాలని ఈయన తెలిపారు.
     1. సంఖ్యా నియమం
     2. మకుట నియమం
     3. ఛందోనియమం
     4. రస నియమం
     5. ఆత్మాశ్రయ కవితా ధర్మం
     6. ముక్తక లక్షణం (ప్రత్యేక భావం)

మరిన్ని వార్తలు