ఉపాధ్యాయ కెరీర్‌కు బాటలు వేసే.. ఎడ్‌సెట్

27 Mar, 2014 14:33 IST|Sakshi

భావి తరాలను తీర్చిదిద్దే పవిత్ర వ్యాసాంగం.. ఉపాధ్యాయ వృత్తి.. అందుకే గురుదేవోభవ అంటూ.. తల్లిదండ్రుల తర్వాతి స్థానాన్ని గురువుకు కట్టబెట్టారు.. అటువంటి మహోన్నతమైన వృత్తిలోకి ప్రవేశించేందుకు బాటలు వేస్తున్న కోర్సుల్లో బీఈడీ (బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్) ఒకటి..  2014 సంవత్సరానికిగాను బీఈడీ కోర్సులో ప్రవేశం  కోసం నిర్వహించే ఎడ్‌సెట్ నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో ప్రిపరేషన్ ప్లాన్, పరీక్ష నిర్వహణపై ఎడ్‌సెట్-2014 కన్వీనర్‌తో ఇంటర్వ్యూ, తదితర వివరాలు..
 
ఎడ్‌సెట్ ద్వారా బీఈడీ కోర్సులోని ఫిజికల్ సెన్సైస్, బయాలాజికల్ సెన్సైస్, మ్యాథమెటిక్స్, సోషల్ స్టడీస్, ఇంగ్లిష్ వంటి ఐదు రకాల మెథడాలజీల్లో ప్రవేశం పొందొచ్చు.
 
 618కాలేజీలు, 60 వేలకుపైగా సీట్లు (దాదాపుగా)
 
 పరీక్ష విధానం
 పరీక్షను ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. సమాధానాలను గుర్తించడానికి రెండు గంటల సమయం (120 నిమిషాలు) ఉంటుంది. ఇందులో 150 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు చొప్పున మొత్తం మార్కులు 150. ఇందులో పార్ట్-ఎ, పార్ట్-బి, పార్ట్-సి అనే మూడు భాగాలు ఉంటాయి. ఇందులో పార్ట్-ఎ, పార్ట్-బి అందరికీ ఉమ్మడిగా ఉంటుంది. పార్ట్-సిలో అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్టు నుంచి 100 ప్రశ్నలు ఇస్తారు. వివరాలు..
 
 విభాగం    ప్రశ్నలు     మార్కులు
 పార్ట్-ఎ
 జనరల్ ఇంగ్లిష్     25    25
 పార్ట్-బి
 జనరల్ నాలెడ్జ్    15    15
 టీచింగ్ ఆప్టిట్యూడ్    10    10
 పార్ట్-సి మెథడాలజీ
 మ్యాథమెటిక్స్    100    100
 ఫిజికల్ సైన్స్
 ఫిజిక్స్    50    50
 కెమిస్ట్రీ     50     50
 బయాలాజికల్ సైన్స్    100    100
 బోటనీ    50    50
 జువాలజీ    50     50
 సోషల్ స్టడీస్    100    100
 జాగ్రఫీ     35    35
 హిస్టరీ    30    30
 సివిక్స్    15    15
 ఎకనామిక్స్    20    20
 
 జనరల్ టిప్స్:
 120 నిమిషాల్లోనే 150 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఒక్కో ప్రశ్నకు నిమిషం కంటే తక్కువ సమయం లభిస్తుంది. కాబట్టి వీలైనన్ని మోడల్ టెస్ట్‌లను రాస్తూ తక్కువ సమయంలో కచ్చితత్వంతో కూడిన సమాధానాలను ఇవ్వడం నేర్చుకోవాలి.
 ఎడ్‌సెట్‌లో అడిగే ప్రశ్నలు ఎనిమిది నుంచి డిగ్రీ వరకు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ముందుగా హైస్కూల్ స్థాయిలో ఉండి.. ఇంటర్, డిగ్రీలలో పునరావృతమయ్యే అంశాలను చదవాలి. తద్వారా సబ్జెక్ట్‌పై మంచి పట్టు వస్తుంది.
 కనీసం 110 మార్కులు సాధించే విధంగా ప్రిపరేషన్ సాగించాలి. కనీసం రోజుకు 5-6 గంటలు ప్రిపరేషన్‌కు కేటాయించాలి. సబ్జెక్ట్‌తోపాటు ఇంగ్లిష్, జీకే అంశాలను ప్రతి రోజూ చదవాలి.
 
 నోటిఫికేషన్ సమాచారం:
 అర్హత: 50 శాతం(రిజర్వుడ్ కేటగిరీ విద్యార్థులు 40 శాతం) మార్కులతో బీఏ/బీఎస్సీ/ బీకాం/బీఎస్సీ(హోంసైన్స్)/బీసీఏ/బీబీఎం లేదా పీజీ లేదా ఇంటిగ్రేటెడ్ పీజీ లేదా తత్సమానం.డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులూ అర్హులే.
 
 దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
 దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 24, 2014.
 రూ. 500 లేట్ ఫీజుతో దరఖాస్తుకు చివరి తేదీ:
 ఏప్రిల్ 30, 2014.
 పరీక్ష తేదీ: జూన్ 2, 2014 (11్చఝ-1ఞఝ).
 వెబ్‌సైట్: http://apedcet.org

 
 
 ప్రిపరేషన్ ప్లాన్..
 
పార్ట్-ఎ: జనరల్ ఇంగ్లిష్: ఈ విభాగంలోని ప్రశ్నలు పదో తరగతి స్థాయిలో ఉంటాయి. రీడింగ్ కాంప్రెహెన్షన్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, టెన్సెస్, స్పెల్లింగ్, వొకాబ్యులరీ, సినానిమ్స్, యాంటినొమ్స్, సింపుల్, కాంప్లెక్స్ సెంటెన్సెస్, వాయిస్ డెరైక్ట్ స్పీచ్ అంశాలపై ప్రశ్నలు వస్తాయి. ఈ విభాగం కోసం రెన్ అండ్ మార్టిన్ లేదా ఏదైనా ప్రామాణిక గ్రామర్ పుస్తకాన్ని చదవడం ప్రయోజనకరం.
 
పార్ట్-బి: ఈ విభాగం జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ సమ్మిళితంగా ఉంటుంది. జనరల్‌నాలెడ్జ్‌కు సంబంధించి ప్రామాణిక అంశాలుగా భావించే దేశాలు-కరెన్సీ-
రాజధానులు, భౌగోళిక ప్రాధాన్యం, సంస్కృతి, నాగరికత, ముఖ్య కట్టడాలు, ప్రదేశాలు, పండగలు, గ్రంథాలు-రచయితలు వంటి వాటిని విస్తృతంగా చదవాలి. వాటితోపాటు వర్తమానంగా జాతీయంగా, అంతర్జాతీయంగా, రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా చోటు చేసుకుంటున్న సంఘటనలను పరిశీలించాలి. స్టాండర్డ్ జీకే అంశాలను వర్తమాన అంశాలతో సమన్వయం చేసుకుంటూ ప్రిపరేషన్ సాగించాలి. ఈ విభాగం కోసం మనోరమ ఇయర్ బుక్, రోజూ రెండు దిన పత్రికలు చదవాలి.
 
టీచింగ్ ఆప్టిట్యూడ్: ఈ విభాగం పూర్తిగా కొత్తది. భవిష్యత్‌లో చేపట్టే ఉపాధ్యాయ వృత్తికి సంబంధించి అభ్యర్థుల ఆసక్తి, నైపుణ్యాలను స్వల్ప స్థాయిలో అంచనా వేయడానికి ఉద్దేశించిన విభాగమిది. ఇందులో టీచింగ్ స్కిల్స్‌ను పరీక్షించేలా ప్రశ్నలు అడుగుతారు. బోధించడంలో టీచర్ల సామర్థ్యం, మంచి టీచర్ల లక్షణాలు, వ్యక్తిగత వైరుధ్యాలున్న విద్యార్థులకు బోధించడంలో బోధకుడి సమర్థత, జనరల్ ఇంటెలిజెన్స్, అనలిటికల్ థింకింగ్‌లపై ప్రశ్నలుంటాయి. ఇచ్చిన ప్రశ్నను బట్టి విచక్షణ (సమయస్ఫూర్తి)తో సమాధానం ఇవ్వాలి. తరగతి గదిలో ఉపాధ్యాయుడి స్థానంలో మీరుంటే ఏం చేస్తారు? ఎలా వ్యవహరిస్తారు? వంటి అంశాలను విశ్లేషించుకొని సమాధానం ఇవ్వాలి.
 
 పార్ట్-సి:
అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్ట్ ఆధారంగా ప్రశ్నలు ఉంటాయి.
మ్యాథమెటిక్స్: సమితులు, సంబంధాలు, ప్రమేయాలు, వర్గ సమీకరణాలు, ద్విపద సిద్ధాంతం, సంయోగాలు, మాత్రికలు, త్రికోణమితి, శ్రేణులు, అవకలనం, సమాకలనం, సమూహాలు, వ లయాలు వంటి అంశాలు కీలకమైనవి. మిగతా సబ్జెక్ట్‌లతో పోల్చితే ఇందులో సమాధానాలను గుర్తించడానికి ఎక్కువ కసరత్తు చేయాలి. కాబట్టి ప్రతి రోజూ చదివిన టాపిక్‌కు సంబంధించిన మాదిరి ప్రశ్నలను సమయం నిర్దేశించుకుని సాధించాలి. వీలైనన్నీ గ్రాండ్‌టెస్ట్‌లు రాయాలి.
 
ఫిజికల్ సెన్సైస్: ఇందులో ఫిజిక్స్, కెమిస్ట్రీల నుంచి 50 ప్రశ్నల చొప్పున వస్తాయి. ఇందులో అడిగే ప్రశ్నలు అప్లికేషన్ పద్ధతిలో ఉంటాయి. టాపిక్‌ల వారీగా సిద్ధాంతాలు, నిర్వచనాలు, ఫార్ములాలను విస్తృతంగా అధ్యయనం చేయాలి. ఫిజిక్స్‌కు సంబంధించి.. యాంత్రిక శాస్త్రం, విద్యుత్, అయస్కాంతత్వం వంటి అంశాలపై ఎక్కువగా దృష్టి సారించాలి. కెమిస్ట్రీలో.. మూల, భౌతికరసాయన, కర్బన రసాయన శాస్త్రం నుంచి సమాన ప్రాధాన్యతలో ప్రశ్నలు వస్తాయి. మూలక, భౌతిక రసాయన శాస్త్రాలకు ఇంటర్మీడియెట్ స్థాయి పుస్తకాలు, కర్బన రసాయన శాస్త్రానికి సంబంధించి డిగ్రీ పుస్తకాలు చదవాలి.
 
 బయాలాజికల్ సెన్సైస్: ఇందులో బోటనీ, జువాలజీ అంశాల నుంచి సమాన సంఖ్యతో ప్రశ్నలు వస్తాయి.  జంతువుల విసర్జక వ్యవస్థ, కిరణజన్య సంయోగ క్రియ వంటి అంశాలపై ఎక్కువగా దృష్టిసారించాలి.
 
 సోషల్ స్టడీస్: అత్యధిక మంది అభ్యర్థులు రాసే సబ్జెక్ట్ ఇది. ఇందులో జాగ్రఫీ, హిస్టరీ, సివిక్స్, ఎకనామిక్స్ వంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. వీటిల్లో జాగ్రఫీ నుంచి అత్యధిక ప్రశ్నలు ఇస్తారు. కాబట్టి ఈ విభాగంపై దృష్టి సారిస్తే మంచి స్కోర్ సాధించవచ్చు. ఇందుకోసం పదో తరగతి వరకు ఉండే జాగ్రఫీ ప్రాథమిక అంశాలను ప్రిపేర్ కావాలి. అట్లాస్, మ్యాప్ ఆధారంగా ప్రిపేర్ కావాలి. సివిక్స్‌లో భారత రాజ్యాంగం-రాజకీయ వ్యవస్థ, రాజనీతి సిద్ధాంతాలు, అంతర్జాతీయ సంబంధాలు, రాష్ట్రానికి సంబంధించిన రాజ్యాంగ సవరణలు వంటి అంశాలపై ఎక్కువగా దృష్టి సారించాలి.
 
 ఎకనామిక్స్‌లో సూక్ష్మ ఆర్థిక శాస్త్రం, భారత ఆర్థికాభివృద్ధి, పంచవర్ష ప్రణాళికలు, పన్నులు, ద్రవ్య విధానం, బ్యాంకింగ్, జనాభా వంటి అంశాలను అధ్యయనం చేయాలి. వీటిని వర్తమాన అంశాలతో సమన్వయం చేసుకుంటూ చదవడం ప్రయోజనకరం. హిస్టరీలో ఆధునిక యుగం, సాంస్కృతిక పునరుజ్జీవనం, మత సంస్కరణోద్యమం, ఐరోపా-అమెరికా విప్లవాలు, ప్రపంచ యుద్ధాలు, ఐక్యరాజ్యసమితి, భారతదేశ చరిత్రకు స్వాతంత్య్ర ఉద్యమంలోని దశలు, నాగరికతలు, బౌద్ధ-జైన మతాలు, మౌర్యులు, గుప్తులు, ఆధునిక దక్షిణ భారతదేశ చరిత్ర వంటి అంశాలను క్షుణ్నంగా చదవాలి.
 
 ఇంగ్లిష్: ఇందులో ప్రశ్నలు రెండు విధాలుగా ఉంటాయి. మొదటి విధానంలో 8,9,10, ఇంటర్మీడియెట్ తరగతుల సిలబస్ ఆధారంగా ప్రశ్నలు ఇస్తారు. అందులో భాగంగా.. లాంగ్వేజ్ ఫంక్షన్స్, ఎలిమెంట్ ఫోనెటిక్స్, ఇడియమ్స్, రైటింగ్ స్కిల్స్, స్టడీ స్కిల్స్, రిఫరెన్స్ స్కిల్స్ వంటి అంశాల నుంచి 50 ప్రశ్నలు ఇస్తారు. రెండో విధానంలో బీఏ స్థాయిలో ఇంగ్లిష్ ఆప్షనల్‌కు సంబంధించి నిర్దేశించిన బీఏ (స్పెషల్ ఇంగ్లిష్)/ మోడర్న్ లిటరేచర్ నుంచి 50 ప్రశ్నలు వస్తాయి.
 
 
 జూన్ 23న ఫలితాలు
 ఎడ్‌సెట్ నిర్వహణకు సంబంధించి ఎడ్‌సెట్-2014 కన్వీనర్ ప్రొఫెసర్ నిమ్మ వెంకటరావుతో ప్రత్యేక ఇంటర్వ్యూ..

 
 దరఖాస్తులు ప్రారంభం:
 ప్రస్తుతం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 42 హెల్ప్‌లైన్ సెంటర్లు ఏర్పాటు చేశాం. గతేడాది దరఖాస్తు చేసుకున్న విద్యార్థులను బట్టి మొత్తం 287 పరీక్షా కేంద్రాలలో పరీక్ష నిర్వహించడం జరిగింది. ఈ విద్యా సంవత్సరం కూడా వచ్చిన దరఖాస్తుల మేరకు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తాం.
 
 మార్పుల్లేవ్:
 దరఖాస్తు, పరీక్షా విధానంలో ఎటువంటి మార్పులు చేయలేదు. పాత విధానంలోనే దరఖాస్తులను ఆన్‌లైన్ విధానంలో స్వీకరిస్తున్నాం. గతేడాది 1,47,709 మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు. అత్యధికంగా ఉస్మానియా వర్సిటీ పరిధి నుంచి దరఖాస్తులు వచ్చాయి. ఈ ఏడాది 1.5 లక్షల వరకు దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. సబ్జెక్ట్‌ల వారీగా చూస్తే సోషల్‌స్టడీస్ విభాగం కోసం అత్యధికంగా దరఖాస్తులు చేసుకుంటున్నారు. గతేడాది సోషల్ సబ్జెక్టుకు 65,073 దరఖాస్తులు వచ్చాయి.
 
 సవరణలకు అవకాశం:
 ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసే సమయంలో ఎటువంటి పొరపాట్లు చేసినా వాటిని సరిచేసుకునే అవకాశం ఉంది. ఇందుకోసం ఏప్రిల్ 25 నుంచి 27వ తేదీ మధ్య సమయం ఇస్తున్నాం. ఆ సమయంలో నేరుగా విద్యార్థులే వెబ్‌సైట్‌లో తప్పులను సరిచేసుకోవచ్చు. లేని పక్షంలో సందేహాలు ఉంటే 0891-2579797 నంబర్‌లో సంప్రదించవచ్చు. సందేహాలను convenoredcet2014@ gmail.comకు మెయిల్ కూడా చేయవచ్చు.
 
 జూన్ 12న ఫైనల్ కీ:
 ప్రాథమిక ‘కీ’ని జూన్ 5వ తేదీన, ఫైనల్ ‘కీ’ని జూన్ 12వ తేదీన, ఫలితాలను జూన్ 23వ తేదీన విడుదల చేస్తాం. ఫలితాలు విడుదలైన తర్వాత  కౌన్సెలింగ్ తేదీలపై నిర్ణయం ఉంటుంది.
 
 కోర్సు వ్యవధి పెరగొచ్చు!
 జస్టిస్ వర్మ కమిషన్ విద్యలో సమూల మార్పులను తీసుకురావడానికి కృషి చేస్తోంది. ఆ మేరకు బీఈడీ కోర్సుల కాల వ్యవధి పెంపు వంటి మార్పు లు చోటు చేసుకునే అవకాశం ఉంది. దీనికి అనుగుణంగా విద్యార్థుల సంఖ్య కూడా పెరగవచ్చు.
 
 ఎడ్‌సెట్‌తోనే ఫీజు రీయింబర్స్‌మెంట్:
 ఎడ్‌సెట్ పరీక్ష రాసిన వారికి మాత్రమే ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం వర్తిస్తుంది. ఆంధ్రా విశ్వవిద్యాలయం, బీ.ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయాలు అందిస్తున్న బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్) కోర్సుల్లో ప్రవేశం కూడా ఎడ్‌సెట్ ద్వారానే నిర్వహిస్తాం. ఈ సారి కూడా ఒక నిమిషం నిబంధన అమల్లో ఉంది. పరీక్ష సమయాని కంటే ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. గడువు వరకు వేచి చూడడం కంటే ముందుగానే దరఖాస్తు చేసుకోవడం శ్రేయస్కరం.
 
 -వేదుల నరసింహం,
 న్యూస్‌లైన్, విశాఖపట్నం.
 

>
మరిన్ని వార్తలు