రఘురామ్ రాజన్ కమిటీ సూచనలు, పరిశీలన..

7 Nov, 2013 14:33 IST|Sakshi

భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన సమయంలో ఆర్థిక వ్యవస్థ బాగా వెనుకబడి ఉంది. ప్రాంతాల మధ్య ఆదాయ పంపిణీలో అసమానతలు ఎక్కువగా ఉన్నాయి. స్వాతంత్య్రానంతరం భారత్ ప్రాంతీయ సమతౌల్య అభివృద్ధిని లక్ష్యంగా నిర్దేశించుకుంది. అధిక వృద్ధి సాధన, ఆదాయ అసమానతల తొలగింపు వంటి అంశాలు దేశానికి సవాలుగా నిలిచాయి. అర్థిక వ్యవస్థలో ప్రభుత్వ జోక్యం ద్వారా మూల ధన పెట్టుబడులను ఉత్పాదక రంగాలకు మరల్చినప్పుడే అసమానతలు తొలగించవచ్చని ప్రభుత్వం భావించింది. ఈ క్రమంలో ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేసింది. తద్వారా కేంద్ర ప్రభుత్వ రాబడిని ఆయా ఆర్థిక సంఘాల సిఫార్సుల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు వనరుల పంపిణీ చేశారు.

 

 డా॥తమ్మా కోటిరెడ్డి,

 ప్రొఫెసర్, ఐబీఎస్ హైదరాబాద్.

 

 ఇప్పటి వరకు అమలు చేసిన 11 పంచవర్ష ప్రణాళికలు ప్రాంతీయ సమతౌల్య అభివృద్ధి, ఆర్థిక వృద్ధి రేటు పెంపు, పేదరిక నిర్మూలన, రాష్ట్రాల మధ్య అసమానతల తొలగింపు వంటి లక్ష్యాలను నిర్దేశించుకున్నాయి. ఆయా లక్ష్యాల సాధనకు కృషి చేశాయి. వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి నిమిత్తం ఆయా ప్రాంతాల్లో నీటి పారుదల, గ్రామీణ సౌకర్యాల కల్పనపై అధిక పెట్టుబడులు వెచ్చించారు. ఆర్థిక సంఘం, ప్రణాళికా సంఘం ద్వారా జరిగిన వనరుల పంపిణీలో పేద రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇచ్చారు. వనరుల సమీకరణ పేద రాష్ట్రాలకు ప్రతిబంధకంగా మారిన నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం అందించే గ్రాంట్లపై ఎక్కువగా ఆధారపడుతున్నాయి.

 

 రాష్ట్రాల నుంచి డిమాండ్:

 ప్రత్యేక కేటగిరీ హోదా పొందే విషయంలో రాష్ట్రాల నుంచి డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో కేంద్రం రాష్ట్రాలకు అదనపు సహాయాన్ని గ్రాంటుగా కల్పించే క్రమంలో అవసరమైన చర్యలను సూచించడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్‌రాజన్ నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో కూడిన నిపుణుల కమిటీని నియమించింది. రాష్ట్రాలకు ఆర్థిక సహాయం విషయంలో మల్టీ డెవలప్‌మెంట్ ఇండెక్స్ (కఠ్టజీ ఈ్ఛఠిౌ్ఛఞఝ్ఛ్ట ఐఛ్ఛ్ఠీ) ఫార్ములాను రాజన్ కమిటీ సూచించింది. రాష్ట్రాల వెనకబాటుతనాన్ని కొలవడానికి ఒక అభివృద్ధి సూచీని రూపొందించింది. అభివృద్ధిని ప్రోత్సహించడమే దీని వెనక  ఉన్న ఉద్దేశమని రాజన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. పేద రాష్ట్రాలకు అదనపు ఆర్థిక సహాయం అందించే విషయంలో ఇప్పటి వరకు అమల్లో ఉన్న ప్రత్యేక కేటగిరీ హోదా పద్ధతిని విడనాడాలని ఆయన సూచించారు.

 

 చలాంకాలు:

 నూతన పద్ధతి అవలంబించడం ద్వారా వెనకబడిన రాష్ట్రాలను గుర్తించడంతోపాటు భవిష్యత్ ప్రణాళిక రూపకల్పన, కేంద్రం నుంచి రాష్ట్రాలకు నిధుల పంపిణీ విషయంలో రూపొందించిన నూతన పద్ధతి ప్రభావం ఏమేరకు ఉంటుంది అనే విషయాలకు సంబంధించి అవసరమైన సిఫార్సుల కోసం రాజన్ కమిటీని ఏర్పాటు చేశారు. అభివృద్ధి సూచీ రూపకల్పనలో కమిటీ పది చలాంకాలను వినియోగించింది.

 అవి..

 నెలవారీ త లసరి వినియోగ వ్యయం

 విద్య

 ఆరోగ్యం

 కుటుంబ రంగ సౌకర్యాల సూచీ (అఝ్ఛజ్టీజ్ఛీట ఐఛ్ఛ్ఠీ)

 పేదరిక నిష్పత్తి

 మహిళా అక్షరాస్యతా రేటు

 ఎస్సీ, ఎస్టీ ప్రజల శాతం

 పట్టణీకరణ శాతం

 ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ (ఊజ్చీఛిజ్చీ జీఛిఠటజీౌ)

 కనెక్టివిటీ సూచీ.

 

 నేషనల్ శాంపిల్ సర్వే తలసరి వినియోగ వ్యయ అంచనా, పేదరిక నిష్పత్తి, పేదరికాన్ని నిర్వచించడానికి 12వ ప్రణాళికలో పేర్కొన్న విధంగా మల్టీ డెమైన్షనల్ అప్రోచ్‌ను కమిటీ పరిగణనలోకి తీసుకుంది. కమిటీ అభిప్రాయంలో రాష్ట్రాల స్కోర్ 0.6, అంతకంటే ఎక్కువగా ఉంటే వాటిని లీస్ట్ డెవలప్డ్ స్టేట్స్‌గా (ఔ్ఛ్చట్ట ఛ్ఛీఠిౌ్ఛఞ్ఛఛీ ట్ట్చ్ట్ఛట), 0.6 కంటే తక్కువ-0.4 కంటే ఎక్కువగా ఉంటే లెస్ డెవలప్డ్ స్టేట్స్‌గా (ఔ్ఛటట ఛ్ఛీఠిౌ్ఛఞ్ఛఛీ ట్ట్చ్ట్ఛట), 0.45 కంటే తక్కువగా ఉంటే రిలేటివ్‌లీ (ఖ్ఛ్చ్టజీఠ్ఛిడ ఛ్ఛీఠిౌ్ఛఞ్ఛఛీ ట్ట్చ్ట్ఛట-అభివృద్ధి దశలో ఉన్నా రాష్ట్రాలు) డెవలప్డ్ రాష్ట్రాలుగాను వర్గీకరించారు.

 

 వ్యతిరేకత:

 రాష్ట్రాలకు వనరుల కేటాయింపు విషయంలో గాడ్గిల్-ముఖర్జీ ఫార్ములాకు ప్రత్యామ్నాయంగా రాజన్ ప్రతిపాదించిన మల్టీ డెమైన్షనల్ ఇండెక్స్ పట్ల ప్రణాళికా సంఘ సభ్యుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గాడ్గిల్-ముఖర్జీ ఫార్ములా ప్రకారం రాష్ట్ర ప్రణాళికలకు కేంద్ర సహాయంలో భాగంగా మొత్తం నిధుల నుంచి 30 శాతం నిధులను ప్రత్యేక కేటగిరీ హోదా పొందిన రాష్ట్రాలకు కేటాయిస్తున్నారు. పెద్ద రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ ప్రణాళికలో 30 శాతాన్ని గ్రాంట్లుగాను, మిగిలిన 70 శాతాన్ని రుణంగానూ పొందుతున్నాయి. ప్రత్యేక కేటగిరీ హోదా పొందిన రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ ప్రణాళికా సహాయంలో 90 శాతాన్ని గ్రాంటుగా, మిగిలిన 10 శాతాన్ని రుణంగా పొందుతున్నాయి. ఆర్థిక సంఘం నుంచి కేంద్ర పన్ను రాబడి పంపకంలోనూ ప్రత్యేక కేటగిరీ హోదా పొందిన రాష్ట్రాలు లబ్ధి పొందుతాయి. జాతీయ అభివృద్ధి మండలి సమావేశంలో రాష్ట్రాలకు ప్రత్యేక కేటగిరీ హోదా కల్పనకు అవలంబించే విధానంలో భాగంగా కింది అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు.

 

 కొండ ప్రాంతాలు

 తక్కువ జన సాంద్రత లేదా గిరిజన (ట్రైబల్) జనాభా వాటా ఎక్కువగా ఉండడం

 ఆర్థిక-మౌలిక సౌకర్యాల వెనకబాటుతనం

 రాష్ట్ర ఫైనాన్స్ స్థితిగతులు సక్రమంగా లేకపోవడం

 ఈ అంశాల ప్రాతిపదికన అరుణాచల్‌ప్రదేశ్, అసోం, మణిపూర్, మేఘాలయ, మిజోరం, ఉత్తరాఖండ్, నాగాలాండ్, త్రిపుర, హిమాచల్‌ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, సిక్కిం రాష్ట్రాలకు ప్రత్యేక కేటగిరీ హోదా కేటాయించారు.

 

 పరిశీలన:

 రాజన్ కమిటీ రూపొందించిన సూచీ ప్రకారం రాష్ట్రాలకు ప్రణాళికా పరంగా వనరుల బదిలీని నిర్ణయించలేం. నేషనల్ శాంపిల్ సర్వే నుంచి సమీకరించిన నెలవారీ తలసరి వ్యయం దత్తాంశాన్ని ఈ సూచీ రూపకల్పనలో వినియోగించారు. రాజన్ కమిటీలో సభ్యుడైన శైబాల్ గుప్తా ఈ సూచీ రూపకల్పనలో నెలవారీ తలసరి వ్యయం ప్రామాణిక సూచికగా ఉపకరించదని అభిప్రాయపడ్డారు. కుటుంబ శ్రేయస్సు నిర్ణయించడానికి నెలవారీ తలసరి వ్యయం సూచికను తీసుకోవడంపై ఆర్థికవేత్త హసీబ్ ద్రాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సూచికకు బదులుగా తలసరి స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి సరైన కొలమానంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

 

 అమలు చేస్తే:

 ఈ నివేదికలోని సిఫార్సులను అమలు చేస్తే జమ్ము-కాశ్మీర్ ప్రత్యేక కేటగిరీ హోదాను కోల్పోతుంది. తద్వారా కేంద్రానికి, జమ్మూ-కాశ్మీర్‌కు ప్రస్తుతం ఉన్న ఆర్థిక సంబంధాలు తదుపరి కాలంలో కొనసాగే సూచనలు ఉండవు. మహరాష్ట్ర, గుజరాత్‌లలో పన్ను రాబడి పెరుగుతున్నప్పటికీ.. ఈ సూచీ ప్రకారం మహారాష్ట్రను అధిక అభివృద్ధి చెందిన రాష్ట్రంగాను, గుజరాత్‌ను అల్పాభివృద్ధి రాష్ట్రంగానూ వర్గీకరించారు. 2011-12లో ఇతర రాష్ట్రాలతో పోల్చితే బీహార్‌లో అధిక వృద్ధి నమోదు కాగా మల్టీ డెవలప్‌మెంట్ ఇండెక్స్ ప్రకారం లీస్ట్ డెవలప్డ్ స్టేట్‌గా గుర్తింపు పొందింది. భారత్ సగటు అక్షరాస్యత రేటు గుజరాత్ కంటే 1991-2001 మధ్య కాలంలో ఎక్కువకాగా 2001-11 మధ్య గుజరాత్ కంటే తక్కువగా నమోదయింది. మహిళా అక్షరాస్యతలోనూ ఇదే స్థితి స్పష్టమవుతోంది. బీహార్, ఒడిశా ముఖ్యమంత్రులు రాజన్ నివేదికను స్వాగతించగా, తమిళనాడు ముఖ్యమంత్రి మాత్రం తప్పుపట్టారు.

 

 సందేహాస్పదమే:

 ఆర్థిక క్రమశిక్షణ లోపించడం, పన్ను రాబడిలో సరైన ప్రగతి కనబరచకపోవడం వంటి అంశాలను రాష్ట్రాల వెనకబాటు తనాన్ని గుర్తించే క్రమంలో ఆర్థిక సంఘం పరిగణనలోకి తీసుకుంది. దీనికి విరుద్ధంగా రాజన్ కమిటీ మరో పది చలాంకాలను అభివృద్ధి సూచీ కొలమానానికి  ఉపయోగించింది. ఒడిశా తలసరి ఆదాయంలో బీహార్ తలసరి ఆదాయం సగ భాగం మాత్రమే అయినప్పటికీ బీహార్‌ను లెస్ బ్యాక్‌వర్డ్ రాష్ట్రంగా గుర్తించారు. తలసరి ఆదాయం విషయంలో గుజరాత్ మూడో స్థానాన్ని ఆక్రమించినప్పటికీ రాజన్ కమిటీ ఆ రాష్ట్రాన్ని లెస్ డెవలప్డ్ స్టేట్‌గా గుర్తించింది. 14వ ఆర్థిక సంఘం విత్త బదిలీలో రాష్ట్ర వాటా పెంచిన క్రమంలోనూ, జాతీయ అభివృద్ధి మండలి సమావేశంలో మొత్తం 28 రాష్ట్రాలలో అధిక శాతం మంది రాష్ట్రాధినేతలు అభ్యంతరం వ్యక్తం చేసే సూచనల నేపథ్యంలో రాజన్ కమిటీ సిఫార్సుల అమలు సందేహాస్పదమే. సులభమైన, అందరి సమ్మతి పొందే అండర్ డెవలప్‌మెంట్ ఇండెక్స్ (్ఖఛ్ఛీట ఛ్ఛీఠిౌ్ఛఞఝ్ఛ్ట ఐఛ్ఛ్ఠీ) రూపకల్పనకు ఎంపిక చేసిన చలాంకాలు ఉపకరిస్తాయి. అవి..

 తలసరి రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి

 ఆరోగ్యం (శిశు మరణాల రేటు)

 విద్య (మహిళా అక్షరాస్యత రేటు, పాఠశాల హాజరు నిష్పత్తి)

 పేదరిక నిష్పత్తి (టెండూల్కర్ నివేదిక ప్రకారం)

 పట్టణీకరణ రేటు

 తలసరి విద్యుచ్ఛక్తి లభ్యత/వినియోగం

 కుటుంబ సౌకర్యాలు (తాగునీరు, పారిశుధ్యం, బ్యాంకింగ్, టెలిఫోన్ సౌకర్యం)

 కనెక్టివిటీ సూచీ (రైల్, రోడ్డు)

 

 ముఖ్యాంశాలు

 

 కమిటీ మొత్తం 28 రాష్ట్రాలను మూడు కేటగిరీలుగా విభజించింది. మల్టీ డెమైన్షనల్ ఇండెక్స్‌లోని స్కోర్స్ ఆధారంగా రాష్ట్రాలను లీస్ట్ డెవలప్డ్, లెస్ డెవలప్డ్, రిలేటివ్‌లీ డెవలప్డ్ స్టేట్స్‌గా వర్గీకరించారు.

 గోవా, కేరళ, తమిళనాడు, పంజాబ్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, హర్యానాలను అత్యధిక అభివృద్ధి చెందిన రాష్ట్రాలు (మోస్ట్ డెవలప్డ్ స్టేట్స్)గా గుర్తించారు.

 మణిపూర్, పశ్చిమ బెంగాల్, నాగాలాండ్, ఆంధ్రప్రదేశ్, జమ్మూ-కాశ్మీర్, మిజోరం, గుజరాత్, త్రిపురలను లెస్ డెవలప్డ్ స్టేట్స్‌గా గుర్తించారు.

 ఒడిశా, బీహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, అరుణాచల్‌ప్రదేశ్, అసోం, మేఘాలయ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లను లీస్ట్ డెవలప్డ్ స్టేట్స్‌గా గుర్తించారు.

 గోవా, కేరళలు అత్యధిక అభివృద్ధి చెందిన రాష్ట్రాలుగాను, ఒడిశా, బీహార్ వెనకబడిన రాష్ట్రాలుగాను అంచనా వేశారు.

 ఎండీఐ స్కోర్స్ ప్రకారం మొదటి పది స్థానాల్లో నిలిచిన రాష్ట్రాలను ధనిక రాష్ట్రాలుగాను, చివరి పది స్థానాల్లో నిలిచిన రాష్ట్రాలను పేద రాష్ట్రాలుగాను పరిగణించరాదు.

 తక్కువ స్కోర్ సాధించిన రాష్ట్రాలు కేంద్రం నుంచి పంపిణీ చేసే వనరులలో ప్రాధాన్యత పొందుతాయి.

 అభివృద్ధి సూచీలో వనరుల ఫార్ములాను 10 సంవత్సరాల తర్వాత సమీక్షించాలి. అనుభవాల దృష్ట్యా ఫార్ములాను సవరించాలి.

 ఈ నివేదికలో పేర్కొన్న ప్రక్రియకనుగుణంగా రాష్ట్రాలకు కేంద్రం అభివృద్ధి నిధులను పంపిణీ చేయాలి.

 అభివృద్ధి సూచీ ద్వారా లీస్ట్ డెవలప్డ్ స్టేట్స్‌గా పేర్కొన్న రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం వివిధ రుపాల్లో ఇచ్చే మద్దతుకు సంబంధించి అర్హత కలిగి ఉంటాయి.

 ప్రతి రాష్ట్రం కేంద్రం పంపిణీ చేసే నిధులలో స్థిర వాటా కలిగి ఉండడంతోపాటు అభివృద్ధి అవసరాలు, ప్రగతి అనే రెండు అంశాల ప్రాతిపదికన అదనపు వనరుల పంపిణీలో ప్రాధాన్యత పొందుతాయి.

మరిన్ని వార్తలు