పీఆర్ కండ్రిగ గ్రామాన్ని దత్తత తీసుకున్న సచిన్

31 Dec, 2014 23:59 IST|Sakshi
పీఆర్ కండ్రిగ గ్రామాన్ని దత్తత తీసుకున్న సచిన్

 -    ప్రముఖ చలనచిత్ర నటుడు అక్కినేని నాగేశ్వరరావు (91) హైదరాబాద్‌లో జనవరి 22న మరణించారు. దాదాపు ఏడున్నర దశాబ్దాల పాటు సాగిన ఆయన సినీరంగ జీవితంలో 256 చిత్రాల్లో నటించారు. అక్కినేని నాగేశ్వరరావు 1923 సెప్టెంబర్ 20న కృష్ణా జిల్లా గుడివాడలో జన్మించారు. కళారంగంలో చేసిన కృషికిగాను 1968లో పద్మశ్రీ, 1988లో పద్మభూషణ్, 2011లో పద్మవిభూషణ్‌లతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. 1991లో దాదాసాహెబ్‌ఫాల్కే పురస్కారం ఆయనకు దక్కింది.
 
 -    ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ఏర్పడే తేదీ (అపాయింటెడ్ డే)గా జూన్ 2ను పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వం మార్చి 4న నోటిఫికేషన్ జారీ చేసింది.
 
 -    కేంద్ర ప్రభుత్వం 2012-13 సంవత్సరానికి ఉత్తమ వారసత్వ నగరంగా తిరుపతిని ఎంపిక చేసింది. 2010-11లో హైదరాబాద్, 2011-12లో వరంగల్ ఉత్తమ వారసత్వ నగరాలుగా నిలిచాయి.
 
 -    ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు 2014కు పార్లమెం ట్ ఆమోదం తెలిపింది. ప్రత్యేక తెలంగాణ రాష్ర్ట ఏర్పా టుకు ఉద్దేశించిన బిల్లుకు లోక్‌సభ ఫిబ్రవరి 18న ఆమో దం తెలపగా, రాజ్యసభ ఫిబ్రవరి 20న ఆమోదించింది.
 
 -    ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు 2014ను లోక్‌సభ ఆమోదించినందుకు నిరసనగా అప్పటి ఉమ్మడి రాష్ర్ట ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి ఫిబ్రవరి 19న తన పదవికి రాజీనామా చేశారు.
 
 -    ఆంధ్రప్రదేశ్‌లో రాష్ర్టపతి పాలన విధించేందుకు కేంద్ర కేబినెట్ ఫిబ్రవరి 28న ఆమోదం తెలిపింది. శాసనసభను సుప్తచేతనావస్థలో ఉంచేందుకు నిర్ణయించింది. రాష్ర్టంలో రాష్ర్టపతి పాలన విధించడం ఇది రెండోసారి. తొలిసారి 1973లో పి.వి.నరసింహారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జై ఆంధ్ర ఉద్యమం వల్ల రాష్ర్టపతి పాలన విధించారు.
 
 -    సీమాంధ్ర రాజధాని ఎంపికకు కేంద్ర హోంశాఖ మార్చి 28న కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మాజీ కార్యదర్శి కె.శివరామకృష్ణన్ నేతృత్వంలో ఐదుగురు నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది.
 
 -    ఆంధ్రప్రదేశ్ శాసనసభ రద్దుకు, రాష్ర్టపతి పాలన ఏప్రిల్ 30 తర్వాత పొడిగింపునకు కేంద్ర కేబినెట్ ఏప్రిల్ 25న నిర్ణయించింది.
 
 -    ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ సభ్యులు నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి (80) హైదరాబాద్‌లో మే 9న అనారోగ్యంతో మరణించారు.
 
 -    2014 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి 63 సీట్లతోను, సీమాంధ్రలో తెలుగుదేశం, బీజేపీ కూటమి 106 సీట్లతో విజయం సాధించాయి. మే 16న వెలువడిన అసెంబ్లీ ఫలితాలలో టీఆర్‌ఎస్, టీడీపీలు మెజారిటీ సీట్లను కైవసం చేసుకొని ప్రభుత్వ ఏర్పాటుకు అర్హత సాధించాయి. కాగా సీమాంధ్రలో వైఎస్సార్‌సీపీ బలమైన ప్రతిపక్షంగా నిలిచింది.
 
 -    తెలంగాణ రాష్ట్ర తొలి శాసనసభ స్పీకర్‌గా వరంగల్ జిల్లా భూపాలపల్లి ఎమ్మెల్యే సిరికొండ మధుసూదనాచారి (టీఆర్‌ఎస్), డిప్యూటీ స్పీకర్‌గా మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి (టీఆర్‌ఎస్) ఏకగ్రీవంగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
 
 -    ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్. చంద్రబాబు నాయుడు జూన్ 8న ప్రమాణస్వీకారం చేశారు.
 
-    బోనాలు, బతుకమ్మ ఉత్సవాలను రాష్ట్ర పండుగలుగా గుర్తించినట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 16న ప్రకటించింది.
 
 -    ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో 281 చదరపు కిలోమీటర్ల మేర అడవుల విస్తీర్ణం తగ్గిందని జూన్ 10న విడుదలైన ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక పేర్కొంది.
 
-    ఆంధ్రప్రదేశ్ తొలి శాసనసభ స్పీకర్‌గా కోడెల శివ ప్రసాదరావు (టీడీపీ), డిప్యూటీ స్పీకర్‌గా మండలి బుద్ధ ప్రసాద్ (టీడీపీ) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
 
 -    అనంతపురం జిల్లా ధర్మవరం చేనేత పట్టు వస్త్రాలు, పావడాలకు భారత ప్రభుత్వం నుంచి భౌగోళిక గుర్తింపు పత్రం లభించింది.
 
 -    తెలంగాణ రాష్ట్ర తొలి శాసనమండలి ఛైర్మన్‌గా స్వామిగౌడ్ (టీఆర్‌ఎస్) జూలై 2న ఎన్నికయ్యారు.
 
 -    పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపునకు గురయ్యే ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపేందుకు ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు-2014ను జూలై 11న లోక్‌సభ, జూలై 14న రాజ్యసభ ఆమోదించాయి.
 
 -    ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లా భీమిలి ఎర్రమట్టి దిబ్బలను జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్‌ఐ) భౌగోళిక వారసత్వ ప్రదేశం (జియో హెరిటేజ్ సైట్)గా గుర్తించింది. ఈ దిబ్బలు సుమారు 20 వేల ఏళ్ల కిందట ఏర్పడ్డాయి.
 
 -    కేంద్ర ప్రభుత్వానికి, దక్షిణాది రాష్ట్రాలకు మధ్య సమన్వయం చేయడంలో కీలక పాత్ర పోషించే దక్షిణ ప్రాంతీయ మండలి వైస్ చైర్మన్‌గా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును కేంద్రం నియ మించింది. దీనికి చైర్మన్ కేంద్ర హోం శాఖ మంత్రి.
 
 -    తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి భక్తులు హుండీలో సమర్పించిన బంగారు ఆభరణాలు, కానుకలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఆగస్టు 2న జమ చేసింది. తిరుపతి వచ్చిన ఎస్‌బీఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్యకు 1800 కిలోల బంగారాన్ని తితిదే కార్య నిర్వహణాధికారి ఎం.జి. గోపాల్ అందజేశారు. దీంతో ఇంతపెద్ద మొత్తం బంగారాన్ని బ్యాంకులో డిపాజిట్ చేసిన మొదటి సంస్థగా తితిదే రికార్డు సృష్టించింది.
 
 -    రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ తొలి బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు శాసనసభలో ప్రవేశపెట్టారు. ఆగస్టు 20న 2014-15 ఆర్థిక సంవత్సరంలో మిగిలిన కాలానికి బడ్జెట్‌ను శాసనసభకు సమర్పించారు. మొత్తం బడ్జెట్: రూ. 1,11,824 కోట్ల్లు.
 
 -    2013-14 సామాజిక, ఆర్థిక సర్వేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 20న శాసనసభకు సమర్పించింది. ముఖ్యాంశాలు: రాష్ట్ర మొత్తం జనాభా: 4.94 కోట్లు. పురుషులు: 2.47 కోట్లు (50.1 శాతం), మహిళలు: 2.46 కోట్లు(49.9 శాతం), గ్రామీణ జనాభా: 70.42 శాతం. పట్టణ జనాభా: 29.58 శాతం. స్త్రీ, పురుష నిష్పత్తి: 996: 1000, అత్యధిక స్త్రీ, పురుష నిష్పత్తి గల జిల్లా: విజయనగరం (1,019), తలసరి ఆదాయం: రూ.76,041, అత్యధిక తలసరి ఆదాయం గల జిల్లా: విశాఖపట్టణం (రూ.1,13,860), అతి తక్కువ తలసరి ఆదాయం గల జిల్లా: శ్రీకాకుళం (రూ.53,203).
 
 -    బంగారుతల్లి పథకం పేరును మా ఇంటి మహాలక్ష్మిగా మారుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది.
 
 -    ప్రముఖ దర్శకుడు, చిత్రకారుడు, కార్టూనిస్ట్ బాపు (81) చెన్నైలో ఆగస్టు 31న అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన అసలు పేరు సత్తిరాజు లక్ష్మీనారాయణ. బాపు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో 51 చిత్రాలకు దర్శకత్వం వహించారు. తొలిచిత్రం సాక్షి (1967). 2013లో బాపుకు పద్మశ్రీ పురస్కారం లభించింది.
 
 -    ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపికకు కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ ఆగస్టు 27న కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు నివేదిక అందించింది.
 
 -    ప్రకాశం జిల్లా కలెక్టర్ జీఎస్‌ఆర్‌కేఆర్ విజయ్‌కుమార్ సెప్టెంబర్ 8న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా సాక్షర భారత్ - 2014 పురస్కారాన్ని అందుకున్నారు. అక్షర విజయం కార్యక్రమం ద్వారా ప్రకాశం జిల్లాలో కేవలం 9 నెలల్లో 4.75 లక్షల మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దినందుకుగాను ఈ పురస్కారం దక్కింది.
 
 -    ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి (సెప్టెంబర్ 9)ని తెలంగాణ భాషా దినోత్సవంగా ఖరారు చేస్తున్నట్లు సీఎం కె.చంద్రశేఖర్‌రావు సెప్టెంబర్ 9న ప్రకటించారు.
 
 -    అందరికీ విద్యుత్తు అందించే కార్యక్రమానికి సంబంధించిన ఒప్పందంపై కేంద్రం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు సెప్టెంబర్ 16న సంతకాలు చేశాయి.
 
 -    వ్యవసాయ సాంకేతిక సమాచారాన్ని రైతులకు అందించే లక్ష్యంతో కిసాన్‌వాణి సదుపాయాన్ని ఆంధ్రాబ్యాంకు అందుబాటులోకి తీసుకువచ్చింది.
 
 -    హుద్ హుద్ పెను తుపాను ఉత్తరాంధ్రను అతలాకుతలం చేసింది. అక్టోబర్ 12న విశాఖపట్నం సమీపంలో తీరం దాటిన హుద్ హుద్ పెను తుపాను.. గంటకు 195 కిలోమీటర్ల వేగంతో కూడిన పెనుగాలులతో ఈ సముద్ర తీర నగరంలో కనీవినీ ఎరుగని విధ్వంసం సృష్టించింది. విశాఖపట్నంతోపాటు శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి తుపాను తాకిడికి గురయ్యాయి. ఈ తుపాన్‌కు హుద్ హుద్ అనే పేరును ఒమన్ సూచించింది. హుద్ హుద్ అనేది ఇజ్రాయెల్ జాతీయ పక్షి.
 
 -    దేశంలో ఆరో పెద్ద నగరంగా పేరొందిన హైదరాబాద్ ఆర్థిక పరిస్థితిలోనూ ఏఏ (అఅ) రేటింగ్ సాధించింది.
 
 -    హైదరాబాద్‌లో 11వ మెట్రో పొలిస్ సదస్సు అక్టోబర్ 6 నుంచి 10 వరకు జరిగింది. ‘అందరి కోసం నగరాలు’ అనే ఇతివృత్తంతో యువత, అందరికీ నివాసం, నగరాల్లో జీవనం అనే అంశాలపై సదస్సు సాగింది. తర్వాత సదస్సు అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్ వేదికగా 2017లో జరగనుంది.
 
 -    తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలి బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ నవంబరు 5న శాసనసభకు సమర్పించారు. మొత్తం రూ. 1,00,637 కోట్ల బడ్జెట్‌లో ప్రణాళికా వ్యయం రూ. 48,640 కోట్లు కాగా, ప్రణాళికేతర వ్యయం రూ. 51,989 కోట్లు.
 
 -    తెలంగాణ సామాజిక, ఆర్థిక సర్వే -2014: రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణం: 1,14,840 చ.కి.మీ, జనాభా (2011 నాటికి): 3.51 కోట్లు, రాష్ట్ర స్థూల ఆదాయం (జీఎస్‌డీపీ): రూ. 3,78,963 కోట్లు, తలసరి ఆదాయం: రూ. 93,151, జీఎస్‌డీపీలో సాగురంగం వాటా: 17 శాతం, పారిశ్రామిక రంగం వాటా: 27శాతం, సేవారంగం వాటా: 56 శాతం, అక్షరాస్యత: 66.46 శాతం, పట్టణ జనాభా: 39 శాతం, అడవుల విస్తీర్ణం: 28.89 శాతం, సాగునీటి సౌకర్యం: 31.64 లక్షల హెక్టార్లు.
 
 -    తెలంగాణ ప్రభుత్వం అధికారిక చిహ్నాలను ఖరారు చేసింది. రాష్ట్ర పక్షిగా పాల పిట్ట, రాష్ట్ర జంతువుగా జింక, రాష్ట్ర వృక్షంగా జమ్మిచెట్టు, రాష్ట్ర పుష్పంగా తంగేడు పువ్వును నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు నవంబరు 17న తెలిపారు.
 
 -    రాష్ట్రంలో సమాచార, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రజలకు ఉత్తమ సేవలందించినందుకు తెలంగాణ పౌర సరఫరాల శాఖకు ఉత్తమ ఇ-ఇండియా గవర్నమెంట్ టు సిటిజన్స్ ప్రాజెక్ట్ ఆఫ్ ద ఇయర్-2014 అవార్డు లభించింది.
 
 -    ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ దిలీప్ బాబాసాహెబ్ భోస్లే డిసెంబరు 8న బాధ్యతలు చేపట్టారు.
 
 -    వికీపీడియా గ్రాంట్‌కు పశ్చిమగోదావరి జిల్లా పోడూరుకు చెందిన బాసె కాశీవిశ్వనాథ్ ఎంపికయ్యారు.
 2015 జనవరిలో ప్రకటించే గ్రాంట్‌కు ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన వందల ప్రతిపాదనల్లో ఏడింటిని ఎంపిక చేయగా వాటిలో భారత్ నుంచి విశ్వనాథ్ ప్రతిపాదన ఒకటి.
 
 -    రచయిత, విమర్శకుడు రాచపాళెం చంద్రశేఖరరెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఆయన తెలుగులో రాసిన ‘మన నవలలు, మన కథానికలు’ అనే పుస్తకానికి ఉత్తమ విమర్శకుడిగా ఎంపికయ్యారు.
 
 -    పశ్చిమగోదావరి జిల్లా మార్టేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ ఎంటీయూ-1156 పేరిట కొత్త వరి వంగడాన్ని డిసెంబర్ 16న విడుదల చేసింది.
 
 -    రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ బిల్లుకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిసెంబర్ 22న ఆమోదం తెలిపింది.
 
 జూన్ 2న దేశంలో 29వ  రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. అదే రోజు తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర రావు (కేసీఆర్) ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ నరసింహన్ కేసీఆర్‌తో ప్రమాణస్వీకారం
 చేయించారు. అలాగే ఆయనతోపాటు 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. సంసద్ ఆదర్శ్ గ్రామ యోజనలో భాగంగా క్రికెటర్, ఎంపీ సచిన్ టెండూల్కర్ నెల్లూరు జిల్లా గూడూరు మండలంలోని పుట్టం రాజువారి కండ్రిగ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. నవంబరు 16న ఆ గ్రామాన్ని సందర్శించి పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.

మరిన్ని వార్తలు