స్పెల్ 'బీ' రెడీ

30 Apr, 2016 01:52 IST|Sakshi

స్కూల్‌ఎడ్యుకేషన్
స్పెల్లింగ్ బీలో.. ‘బీ’ అంటే తేనెటీగ అని అర్థం. ఎలాగైతే తేనెటీగ అనేక పుష్పాల నుంచి మకరందాన్ని సేకరిస్తుందో.. అలాగే విద్యార్థులు అక్షరాలను కూర్చి పదం చెప్పాల్సి ఉంటుంది.


ఇప్పుడంతా ఇంగ్లిష్ చదువులమయం. ఇంగ్లిష్ రాకుంటే భవిష్యత్ లేదనుకునే పరిస్థితి. నిజానికి ఇంగ్లిష్‌ను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా కమ్యూనికేషన్‌కు ఉపయోగించుకోవచ్చు. అది దాని ప్రత్యేకత. ఇతర దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు, ఉన్నత వ్యక్తులతో మాట్లాడాలంటే ఇంగ్లిష్ అత్యవసరం. అందుకే ఇంగ్లిష్‌లో కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నవారికే కార్పొరేట్ కంపెనీలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. అందువల్లే ఇంగ్లిష్ చదువులకు ఆదరణ పెరిగింది.

ఇంగ్లిష్ వొకాబులరీపై పట్టు సాధించేందుకు స్పెల్లింగ్ బీ (స్పెల్ బీ) పోటీలు తోడ్పడతాయి. స్పెల్లింగ్ బీ అనేది ఇంగ్లిష్ పదాలకు సంబంధించిన ఒక పోటీ. ఇందులో పృచ్ఛకులు (ప్రశ్నలు అడిగేవారు) అడిగిన ఇంగ్లిష్ పదానికి విద్యార్థులు తప్పులు లేకుండా స్పెల్లింగ్ చెప్పాల్సి ఉంటుంది. ఈ పోటీలు మొదట అమెరికాలో జరిగాయి. అమెరికాలో జాతీయ స్పెల్లింగ్ బీ పోటీలను 1925లో ప్రారంభించారు. ఈ పోటీల్లో ఇటీవలి కాలంలో భారత సంతతి విద్యార్థులే రాణిస్తున్నారు. భారత్‌లో కూడా ప్రస్తుతం ఈ పోటీలు విరివిగా నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రైవేటు స్కూళ్లలో స్పెల్ బీ పోటీలు నిర్వహిస్తున్నారు. సాక్షితోపాటు మీడియా, కార్పొరేట్ సంస్థలు కూడా ఈ పోటీలు నిర్వహిస్తూ ప్రతిభావంతులను ప్రోత్సహిస్తున్నాయి.
 
ఉపయోగాలెన్నో..
* స్పెల్ బీ పోటీల వల్ల ముఖ్యంగా ఇంగ్లిష్ వొకాబులరీ (పదజాలం)పై పట్టు వస్తుంది. ఫలితంగా వారికి ఇంగ్లిష్‌లో రాసే, మాట్లాడే నైపుణ్యాలు పెరుగుతాయని స్పోకెన్ ఇంగ్లిష్ నిపుణులు రామేశ్వర్ గౌడ్ చెబుతున్నారు.
* విద్యార్థులు ఇంగ్లిష్‌లో నిపుణులుగా తయారవుతారు.
* కేవలం ఒక పదానికి సంబంధించిన స్పెల్లింగ్ మాత్రమే కాకుండా ఆ పదం ఉచ్ఛారణ, నిర్వచనం, మూలం తెలుసుకోవచ్చు. ఈ దిశగా విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నామని ప్రభుత్వ పాఠశాల ఇంగ్లిష్ అధ్యాపకులు డి.హనుమంతరావు చెప్పారు.
 
వొకాబులరీని పెంచుకునే మార్గాలు..
* ఎంత చదివితే అంత వొకాబులరీ మీ సొంతం అవుతుంది. ముఖ్యంగా నవలలు, కథలు, మ్యాగజైన్లు, న్యూస్‌పేపర్లను వీలైనంత ఎక్కువగా చదువుతూ ఉండాలి. వీటిలో కొత్తగా కనిపించిన పదాలను ఒక పుస్తకంలో రాసుకోవాలి. వాటి అర్థాలు, ఉచ్ఛారణను నిఘంటువు సాయంతో తెలుసుకోవాలి. తర్వాత వీలైనన్ని ఎక్కువసార్లు ఆ పదాలను చదవడం ద్వారా ఎప్పటికీ గుర్తుంచుకోవచ్చు.
* ఎప్పుడూ మీ వద్ద ఒక ప్రామాణిక ఇంగ్లిష్ నిఘంటువు, థెసారస్ (పర్యాయ పదకోశం) ఉంచుకోండి. రోజూ ఒక కొత్త ఇంగ్లిష్ పదం నేర్చుకోండి.
* ఇతరులతో మాట్లాడటం వల్ల కూడా కొత్త పదాలను తెలుసుకోవచ్చు. అలాగే దాన్ని ఎలా ఉచ్చరిస్తున్నారో కూడా తెలుస్తుంది.

మరిన్ని వార్తలు