జాతీయ సమైక్యత

29 Aug, 2017 01:47 IST|Sakshi
జాతీయ సమైక్యత

భారతదేశం విభిన్న మతాలు, సంస్కృతులు, జాతులు, భాషలు, కులాలు, తెగలు, భౌగోళిక ప్రత్యేకతలకు నిలయం. దేశంలో ఉన్న వైవిధ్యాలు, వైరుధ్యాలు ప్రపంచంలో మరెక్కడా కనిపించవు. ఈ వైవిధ్యాల వల్ల దేశంలో జాతీయ సమైక్యతతో కూడిన సమగ్ర అభివృద్ధిని సాధించడం పాలకులకు సవాలుగా మారింది. దేశంలో సామాజిక నిర్మితి మత, కుల ప్రాతిపదికపై ఉండటం వల్ల జాతీయ సమైక్యతకు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి.

జాతీయ సమైక్యత అనేది ఒక ప్రబలమైన మానసిక భావోద్వేగం. ఒక ప్రాంతంలో కొన్నేళ్లపాటు జీవించినప్పుడు ఆ ప్రాంతం పట్ల మమకారం, ప్రేమ, అనుబంధం ఏర్పడతాయి. అలాంటి సందర్భాల్లో జాతి, మత, కుల, లింగ, ప్రాంత భేదాలు లేకుండా మనమంతా భారతీయులమనే విశాల, ఉదాత్త భావోద్వేగం కలుగుతుంది. దేశం పట్ల ఉన్న ఇలాంటి భావజాలాన్ని జాతీయ సమైక్యత అంటారు. మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ అభిప్రాయం ప్రకారం జాతీయ సమైక్యత అనేది ప్రజాబాహుళ్య ఆలోచనల పరంపర నుంచి వెలువడే మేధో కాంతి వంటిది. జాతీయ సమైక్యత  అనేది రాజకీయ, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక మనోవైజ్ఞానిక రంగాలకు సంబంధించింది. అలాగే ఆయా రంగాల్లో ప్రజలందరి మధ్య సత్సంబంధాలను ఏర్పరచే ఒక బృహత్తర కార్యభావం.

జాతీయ సమైక్యతకు అవరోధాలు/సమస్యలు జాతీయ సమైక్యతకు ఎదురవుతున్న అవరోధాలు లేదా సమస్యలను కింది విధంగా పేర్కొనవచ్చు. అవి..మతతత్వం: భారతదేశం అనేక మతాలకు నిలయం. భారత రాజ్యాంగం అన్ని మతాల పట్ల సమాన గౌరవం, తటస్థ వైఖరి కలిగి ఉంటుంది. మత స్వేచ్ఛను రాజ్యాంగం ప్రాథమిక హక్కుగా గుర్తించింది. అల్ప సంఖ్యాక వర్గాలకు ప్రత్యేక హక్కులను కల్పించింది. అయితే దేశంలో పలు మతాల మధ్య గల భేదాల ఆధారంగా మతతత్వాన్ని ఒక రాజకీయవాదంగా ఉపయోగించుకోవడం వల్ల అది మతమౌఢ్యానికి దారితీసింది.

చారిత్రకంగా పరిశీలిస్తే మన దేశంలో బ్రిటిష్‌ పాలనా కాలంలోనే మత గుర్తింపులు ప్రస్ఫుటంగా వెలుగులోకి వచ్చాయి. బ్రిటిష్‌ వారి కాలంలో మత ప్రాతిపదికన ఏర్పాటైన సంస్థలు, ప్రత్యేక ఓటర్లు, బ్రిటిష్‌ వారి విభజించు–పాలించు విధానం, మహ్మద్‌ అలీ జిన్నా ప్రతిపాదించిన ద్విజాతి సిద్ధాంతం మొదలైన వాటి ఫలితంగా భారత్‌ రెండు దేశాలుగా విడిపోయింది (పాకిస్థాన్‌ విడిపోవడం). ఈ విభజన ఒక విషాద ఘటనగా మిగిలిపోయింది. ఈ సందర్భంలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో మత ప్రాతిపదికన ప్రజలను సమీకరించే ప్రయత్నం జరిగింది. ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల ప్రజల్లో మత విభజన స్పష్టంగా గోచరిస్తుంది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, బిహార్, గుజరాత్, మహారాష్ట్రల్లో మతపరమైన హింస జరుగుతూనే ఉంది. ఇందిరాగాంధీ హత్యానంతరం సిక్కు వ్యతిరేక సంఘర్షణలు, అలాగే బాబ్రీ మసీదు సంఘటన, గుజరాత్‌లో జరిగిన మత ఘర్షణలు దేశ సమైక్యతకు సవాలుగా మారాయి.

కులతత్వం
భారత సమాజంలో అనేక కులాలు, ఉపకులాలు ఉన్నాయి. కులపరమైన ప్రత్యేకతలు, కుల సంఘీభావం ఉండటం సమంజసమే. అయితే అది కులతత్వంగా పరిణమించినప్పుడు జాతి సమైక్యతకు ప్రమాదంగా మారుతోంది. కుల తత్వమంటే ఒక కులం పట్ల మరొక కులం ఈర్ష్య, ద్వేషం, పక్షపాతంతో కూడిన ప్రవర్తన.

అధికారం కోసం రాజకీయ పార్టీలు కులాన్ని ఒక సాధనంగా ఉపయోగించుకుంటున్నాయి. తద్వారా సమాజం కుల ప్రాతిపదికన విడిపోతోంది. అది దేశ ఐక్యత, సమగ్రతకు సవాలుగా పరిణమిస్తోంది.  

ఉగ్రవాదం, తీవ్రవాదం
ఇటీవలి కాలంలో ఇవి అంతర్జాతీయ సమస్యలుగా పరిణమించాయి. భారత్‌తో పాటు చాలా దేశాలు ఈ సమస్యతో సతమతమవుతున్నాయి. ఉగ్రవాదం, తీవ్రవాదం పదాలకు నిర్వచనాలు వేరైనా వాటి ప్రభావం మాత్రం సమాజంపై ఎక్కువగా ఉంటోంది. భారతదేశంలోని ప్రధాన నగరాల్లో ముఖ్యంగా ముంబై, ఢిల్లీ, హైదరాబాద్‌లలో జరుగుతున్న బాంబు పేలుళ్లు, కశ్మీర్‌లో నిత్యం జరిగే అల్లర్లు భారత ఐక్యతకు, సమగ్రతకు ప్రధాన సవాళ్లుగా పరిణమించాయి.

నేరమయ రాజకీయాలు
ఆధునిక వ్యవస్థలో ప్రజాస్వామ్యానికి తీవ్ర సవాలుగా మారిన అంశం రాజకీయ ప్రక్రియ నేరమయం కావడం. 1993లో ఎన్‌ఎన్‌ వోహ్రా కమిటీ ఈ అంశంపై సా«ధికారిక నివేదిక ఇచ్చింది. కొందరు రాజకీయ నాయకులు, మాఫియా కుమ్మక్కై భూముల ఆక్రమణ, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు.

అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ అనే స్వచ్ఛంద సంస్థ కేంద్ర ఎన్నికల సంఘం నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా పలు వివరాలను వెల్లడించింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన సుమారు 5380 మంది అభ్యర్థులు ఇచ్చిన అఫిడవిట్లలో 17% మందిపై నేరారోపణలు, 10% మందిపై తీవ్ర నేరారోపణలు ఉన్నాయి. రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే ఉత్తరప్రదేశ్‌లో 30%, మహారాష్ట్రలో 26%, బిహార్‌లో 16%, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో 11% మంది అభ్యర్థులపై నేరారోపణలున్నాయి. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ పాలనకు ఇది పెను సవాలుగా మారింది.

ప్రాంతీయ తత్వం
మితిమీరిన ప్రాంతీయ తత్వం దేశ ఐక్యతకు, సమగ్రతకు ప్రమాదం. రాజ్యాంగం అమల్లోకి వచ్చే సమయానికి ప్రాంతీయ ఉద్యమాలు భాష, సంస్కృతుల పరిరక్షణకు మాత్రమే పరిమితమై ఉండేవి. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుతో ఈ సమస్య సమసిపోయింది. ఆ తర్వాతి కాలంలో అంటే 1975 తర్వాత ప్రాంతీయ ఉద్యమాలు ఆర్థిక సమానత్వం కోసం వచ్చాయి. ఆర్థికంగా వెనకబడిన ప్రాంతాలు ఇతర ప్రాంతాల ఆధిపత్యానికిలోనై సాంస్కృతిక ప్రత్యేకతను కోల్పోతాయి. మొదట్లో ఈ ఉద్యమాలకు సంబంధించి వాటి న్యాయమైన సమస్యలను పరిష్కరించే ప్రయత్నం జరిగినా తర్వాత వాటిని అణగదొక్కే యత్నం జరిగింది. దీంతో అవి శాంతిభద్రతలు, ఐక్యత, సమగ్రతలకు తద్వారా రాజ్యాంగ అమలుకు సవాలుగా మారాయి. అలాగే గిరిజనులు, దళితులు, పేద రైతులు, కార్మికులు వివిధ సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాల్లో పాల్గొంటున్నారు. ఇలాంటివి దేశంలో ఏదో ఒక చోట తలెత్తుతున్నాయి. వాటిని పరిష్కరించడం లేదా అణచివేయడం వల్ల మరికొన్ని కొత్త సమస్యలు వస్తున్నాయి.

ముగింపు
జాతీయ సమైక్యతకు ఎదురవుతున్న సమస్యలను విశాల దృక్పథంతో పరిశీలిస్తే వాటిలో ప్రధాన మైనవి ఆర్థిక సమస్యలని స్పష్టమవుతుంది. ఆర్థిక వెనకబాటుతనం, పేదరికం వివిధ రూపాల్లో వేర్పాటువాదానికి, భూమి పుత్రుల భావానికి దారితీస్తుంది. తద్వారా ప్రాంతీయ, ఉపప్రాంతీయ భావజాలం బలపడుతూ ఉంది. మౌలిక సమస్యలైన పేదరికం, నిరుద్యోగం, సాంఘిక వివక్షతలు, తీవ్రవాద, ఉగ్రవాదాలకు కారణంగా మారాయి. అందువల్ల సంతులిత ఆర్థికాభివృద్ధిపై ప్రభుత్వాలు దృష్టి సారించాలి. ప్రజలు జాతీయ భావాలను పెంపొందించుకోవాలి. ఈ మేరకు  విద్యను సార్వత్రికం చేయాలి.

జాతీయ సమైక్యతను పెంపొందించే మార్గాలు
ప్రజల్లో మత, ప్రాంతీయ భావాలను రెచ్చగొట్టే కార్యక్రమాలకు రాజకీయ పార్టీలు దూరంగా ఉండాలి.

జాతి, కుల, భాషా భేదాలను ప్రోత్సహించకూడదు.

మత సమస్యలను పరిష్కరించేందుకు రాజ్యాంగేతర ఆందోళన పద్ధతులను అనుమతించకూడదు.

రాజకీయ ప్రయోజనాల కోసం అధికారాన్ని ఉపయోగించకూడదు.

పాఠ్యాంశాల్లో మతతత్వ అంశాలను తొలగించాలి.

జాతీయ సమైక్యతను పెంపొందించడానికి ప్రత్యేక కార్యక్రమాలు, సమావేశాలు ఏర్పాటు చేయాలి.

మరిన్ని వార్తలు