ఎడ్యుకేషన్ & జాబ్స్

17 Sep, 2015 02:52 IST|Sakshi

విట్ విద్యార్థులకు 7,947 ఐటీ ఉద్యోగాలు
వేలూరు: ప్రతిష్టాత్మక విట్ యూనివర్సిటీలో జరిగిన క్యాంపస్ సెలక్షన్స్‌లో 7,947 మంది తమ విద్యార్థులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు ఐటీ కంపెనీలు ముందుకొచ్చాయని విట్ వర్సిటీ చాన్స్‌లర్ డాక్టర్ జి.విశ్వనాథన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 1వ తేదీ నుంచి 15 వరకు ఈ సెలక్షన్స్ నిర్వహించామని.. కాగ్నిజెంట్ 1,914, టీసీఎస్ 1,864, ఎక్షెనూర్ట్ 1,472, ఇన్ఫోసిస్ 1,456, విప్రో 1,241 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేసుకున్నాయని చెప్పారు.

దీంతో వరుసగా నాలుగో ఏడాది విట్ విద్యార్థులు భారీగా ఐటీ ఉద్యోగాలు సాధించి ప్రథమ స్థానంలో నిలిచారని, ఒకే కళాశాల నుంచి ఐదు ప్రముఖ కంపెనీలు ఒకేసారి వెయ్యి మందికిపైగా ఉద్యోగులను ఎంపిక చేసుకోవడం ఇదే ప్రథమమని పేర్కొన్నారు. ఇప్పటికే అత్యధిక సంఖ్యలో ఐటీ ఉద్యోగాలకు ఎంపికైన విట్ వర్సిటీ నాలుగు సార్లు లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కిందన్నారు.
 
‘కేఎల్’కు టోఫెల్ పరీక్ష కేంద్రం గుర్తింపు

హైదరాబాద్: కోనేరు లక్ష్మయ్య (కేఎల్) యూనివర్సిటీకి ప్రతిష్టాత్మకమైన టోఫెల్ అధికారిక పరీక్షా కేంద్రంగా గుర్తింపు లభించినట్లు ఆ వర్సిటీ ప్రెసిడెంట్ కోనేరు సత్యనారాయణ, ఉప కులపతి ఎల్‌ఎస్‌ఎస్ రెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. తమ వర్సిటీలో ఒకేసారి 96 మంది ఒక స్లాట్‌లో టోఫెల్ పరీక్షను రాయగలరని, ఈ పరీక్షను రాయడం ద్వారా ప్రపంచంలోని 130 దేశాల్లో ఉన్న 9,000 వర్సిటీల్లో ప్రవేశాలకు అర్హత సాధించవచ్చని వైస్ ప్రెసిడెంట్ రాజా హరీన్, ప్రొ. వైస్ చాన్స్‌లర్ ఎ.వి.ఎస్ ప్రసాద్ పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్య కోసం వెళ్లేందుకు కేఎల్ వర్సిటీలోని టోఫెల్ పరీక్షా కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
 
అంబేడ్కర్ వర్సిటీ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల
హైదరాబాద్: అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ అర్హత పరీక్ష ఫలితాలు బుధవారం వెల్లడయ్యాయి. డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి గత నెల 30న అర్హత పరీక్షను యూనివర్సిటీ నిర్వహించింది. 14,403 మంది అభ్యర్థులు పరీక్ష రాయగా 12,487 మంది ఉత్తీర్ణులైనట్లు యూనివర్సిటీ పౌర సంబంధాల అధికారి వెల్లడించారు. అడ్మిషన్లకు ఈ నెల 25న చివరి తేదీ అని పేర్కొన్నారు.
 
మైనార్టీ స్కాలర్‌షిప్‌ల గడువు పొడిగింపు

సాక్షి, హైదరాబాద్: మైనార్టీ విద్యార్థులు 2015-16 విద్యాసంవత్సరానికి పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు అక్టోబర్ 30 వరకు గడువు పొడిగించారు. ఈ మేరకు రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ డెరైక్టర్ ఎంజే అక్బర్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 2014-15 విద్యాసంవత్సరానికి గానూ దరఖాస్తు చేసుకోని విద్యార్థులకు ఈ నెల 20లోగా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు తెలిపారు.
 
ఓయూలో కాంట్రాక్టు అధ్యాపక ఉద్యోగాలు
హైదరాబాద్: ఓయూ పరిధిలోని మెదక్ జిల్లా నర్సాపూర్ పీజీ కేంద్రంలో కాంట్రాక్టు అధ్యాపక ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఎంసీజే కోర్సుకు 2, ఎమ్మెస్సీ ఆర్గానిక్, ఇన్‌ఆర్గానిక్ కెమిస్ట్రీలో 2, ఎమ్మెస్సీ మ్యాథ్స్‌లో ఒక ఉద్యోగానికి అర్హత గల అభ్యర్థులు ఈ నెల 21లోగా దరఖాస్తు చేసుకోవాలని రిజిస్ట్రార్ సురేశ్‌కుమార్ బుధవారం సూచించారు. గతంలో దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
 
వెబ్‌సైట్‌లో బీఈడీ అభ్యర్థుల జాబితా
హైదరాబాద్: ఎడ్‌సెట్-2015 కౌన్సెలింగ్ ద్వారా రెండు సంవత్సరాల బీఈడీ కోర్సులో సీట్లు సాధించిన అభ్యర్థుల జాబితాను వెబ్‌సైట్లో ఉంచినట్లు కన్వీనర్ ప్రసాద్ తెలిపారు. అభ్యర్థులు  www.tsedcet.tsche.ac.in వెబ్‌సైట్‌లో తమ పేరు చూసుకోవచ్చని చెప్పారు. రాష్ర్ట వ్యాప్తంగా 189 బీఈడీ కాలేజీల్లోని 14,385 సీట్లలో మొదటి విడత 11,936 సీట్లను భర్తీ చేసినట్లు చెప్పారు.
 
21న ఎంపీఈడీ చివరి విడత కౌన్సెలింగ్
హైదరాబాద్: ఓయూ క్యాంపస్ పీజీ అడ్మిషన్స్ కార్యాలయంలో ఈ నెల 21న ఎంపీఈడీ చివరి విడత కౌన్సెలింగ్ జరగనున్నట్లు బుధవారం డెరైక్టర్ గోపాల్‌రెడ్డి తెలిపారు. 51 నుంచి 75 ర్యాంకు సాధించిన ఎస్సీ అభ్యర్థులు, 76 ర్యాంక్ నుంచి 500 ర్యాంకు సాధించిన ఎస్సీ (బాలికలు) హాజరుకావాలని సూచించారు.
 
బీసీ స్టడీ సెంటర్ల ద్వారా గ్రూప్స్‌కు శిక్షణ
సాక్షి, హైదరాబాద్: టీఎస్‌పీఎస్‌సీ ద్వారా భర్తీ చేయనున్న గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాల పోటీపరీక్షల కోసం రాష్ట్రంలోని పది బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా త్వరలోనే శిక్షణ ప్రారంభిస్తామని బీసీ సంక్షేమశాఖ డెరైక్టర్ కె.ఆలోక్‌కుమార్ తెలిపారు. రాష్ర్టంలో పదిజిల్లాల్లోని 9 స్టడీ సెంటర్ల (హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు కలిపి ఒకటి)తో పాటు, మెదక్‌జిల్లా సిద్దిపేటలో ఏర్పాటుచేస్తున్న బీసీ స్టడీసర్కిల్ ద్వారా ఒక్కో స్టడీసెంటర్‌లో వందమంది చొప్పున శిక్షణను అందిస్తామన్నారు.

మరిన్ని వార్తలు