ఇంటర్వ్యూలో గెలుపునకు.. సన్నద్ధత, ఆత్మవిశ్వాసం!

11 Sep, 2014 00:06 IST|Sakshi
ఇంటర్వ్యూలో గెలుపునకు.. సన్నద్ధత, ఆత్మవిశ్వాసం!

జాబ్ ఇంటర్వ్యూ అనగానే అభ్యర్థుల్లో ఏదో తెలియని బెరుకు మొదలవుతుంది. అదో భయపెట్టే భూతంలాగా భావిస్తుంటారు. కానీ, ముందుగా సన్నద్ధమై, ఆత్మవిశ్వాసం పెంచుకుంటే మౌఖిక పరీక్షను ఎదుర్కోవడం సులభమే. ఇంటర్వ్యూలో ఉభయపక్షాల భాగస్వామ్యం ఉంటుంది. ఈ పరీక్ష మీకే కాదు కంపెనీకీ కూడా అవసరమే. మీకు ఉద్యోగం కావాలి, సంస్థకు మంచి ఉద్యోగి కావాలి. కాబట్టి మీరు భయపడడం అన వసరం. ముందస్తు సన్నద్ధత, ఆత్మవిశ్వాసం.. ఈ రెండింటితో ఎలాంటి ఇంటర్వ్యూలోనైనా జయకేతనం ఎగరేయొచ్చు.
 
 కామన్ ప్రశ్నలు:  ఇంటర్వ్యూలో అడగబోయే అన్ని ప్రశ్నలను ఎవరూ ఊహించలేరు. కానీ, సాధారణంగా అన్ని మౌఖిక పరీక్షల్లో అడిగే కొన్ని కామన్ ప్రశ్నలు ఉంటాయి. వాటికి సరైన సమాధా నాలను సిద్ధం చేసుకుంటే యుద్ధంలో సగం గెలుపు ఖాయమైనట్లే. తెలిసిన విషయాలను ఇంటర్వ్యూ లో పూర్తిఆత్మవిశ్వాసంతో చెబితే సానుకూలమైన ఫలితం కచ్చితంగా ఉంటుంది.  కరిక్యులమ్ విటే (సీవీ)లో రాసిన అన్ని అంశాలపై మీకు పట్టు ఉండాలి. సీవీని ఎక్కువసార్లు చదువుకోవాలి. అందులో ప్రస్తావించిన అంశాలపై ఇంటర్వ్యూలో ప్రశ్నలను సంధిస్తారు. విద్యాభ్యాసం, పాత యాజ మాన్యం గురించి అడుగుతారు. సీవీకి సంబంధించి ఎలాంటి ప్రశ్న అడిగినా బదులిచ్చేలా ఉండాలి.
 
 కనీసం నటించండి: మీలో ఆత్మవిశ్వాసం తగుపాళ్లలో లేకపోవచ్చు. పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నట్లు ఇంటర్వ్యూలో నటించండి. మీ శరీరభాష దానికి తగ్గట్లుగా ఉండాలి. దీనివల్ల రిక్రూటర్‌పై సానుకూల ప్రభావం కలిగించొచ్చు. వంగిపోయినట్లుగా కాకుండా కుర్చీలో నిటారుగా కూర్చోండి. రిక్రూటర్ కళ్లలోకి నేరుగా చూస్తూ ధైర్యంగా మాట్లాడండి. ‘ఈ ఇంటర్వ్యూలో విఫలమైతే నాకు నష్టమేం లేదు’ అనే మైండ్‌సెట్‌ను అలవర్చుకుంటే ఒత్తిడి తగ్గిపోతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
 
 కంటినిండా నిద్ర: ఉదయాన్నే శరీరం, మనసు తాజాగా ఉండాలంటే రాత్రి కంటినిండా నిద్రపోవాలి. ఇంటర్వ్యూ కోసం ఆఖరి క్షణంలో ప్రిపరేషన్ ప్రారంభిస్తే కంగారు తప్పదు. విశ్రాంతి కూడా దొరకదు. కాబట్టి ముందుగానే అన్ని ఏర్పాట్లను పూర్తిచేసుకొని ఇంటర్వ్యూ ముందురోజు రాత్రి హాయిగా నిద్రించండి. ఆలస్యంగా భోజనం చేయడం వంటి వాటికి దూరంగా ఉండాలి. ఇంటర్వ్యూలో ధరించాల్సిన దుస్తులు, బూట్లను ముందురోజే సిద్ధం చేసి పెట్టుకోవాలి. మహిళలైతే తమ గోళ్ల రంగు(నెయిల్ పెయింట్)ను, ఎబ్బెట్టుగా ఉండే అలంకరణను తొలగించుకోవాలి.
 
 సమయానికి చేరుకొనేలా: కారణాలు ఏవైనా కానివ్వండి.. మౌఖిక పరీక్షకు ఆలస్యంగా హాజరుకావడం ఎంతమాత్రం సరికాదు. ఇంటి నుంచి ఇంటర్వ్యూ కార్యాలయం వరకు ప్రయాణించడం ప్రయాసతో కూడుకున్నదే. దూర ప్రయాణమైతే అలసిపోతారు. ఇంటి నుంచి కార్యాలయం ఎంత దూరంలో ఉంది? అక్కడికి చేరడానికి ఎంత సమయం పడుతుంది? ఎప్పుడు బయల్దేరాలి? వంటి విషయాలను ముందుగానే తెలుసుకోవాలి. వీలైతే ఒకసారి అక్కడికి వెళ్లిరావడం మంచిది. దాని ప్రకారం ప్రణాళికను తయారు చేసుకోవచ్చు. ఆఖరి నిమిషంలో హడావుడిగా పరుగులు పెట్టే పరిస్థితి తెచ్చుకోవద్దు.
 
 ఉదయం వేళ మేలు:ఇంటర్వ్యూ కార్యాలయానికి చేరుకున్న తర్వాత  మీ వంతు కోసం నిరీక్షించాల్సి ఉంటుంది. అప్పుడు ఒక గ్లాస్ నీరు తాగండి. బిగ్గరగా ఊపిరి పీల్చుకోండి. విశ్రాంతి స్థితిలోకి రండి. గొంతులో గరగర లేకుండా చూసుకోండి. ఇంటర్వ్యూలో చెప్పబోయే సమాధానాలను మనసులో ఒకసారి మననం చేసుకోండి. మీ గురించి మీరు మనసులో చెప్పుకోండి. దీనివల్ల ఒత్తిడి మాయమవుతుంది. ఇంటర్వ్యూ ఏ సమయంలో నిర్వహించాలనేది కంపెనీ నిర్ణయమే. ఒక్కోసారి ఈ అవకాశం అభ్యర్థికే ఇస్తుంటారు. అలాంటప్పుడు ఉదయం వేళనే ఎంచుకోండి. ఎందుకంటే అప్పుడు వాతావరణం నిర్మలంగా ఉంటుంది. శరీరం, మనసు రిలాక్స్‌డ్‌గా ఉంటాయి. ఆ సమయంలో విజయావకాశాలు అధికం. ఒకవేళ మధ్యాహ్నం లేదా సాయంత్రమైతే అందుకనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలి.

మరిన్ని వార్తలు