శశికపూర్‌కు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం

26 Mar, 2015 03:18 IST|Sakshi
శశికపూర్‌కు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం

 అంతర్జాతీయం
 ఆకలితో ఉన్నవారిలో సగం మంది అయిదు దేశాల్లోనే.. ప్రపంచంలో ఆకలితో ఉన్నవారిలో సగం మంది అయిదు మధ్య ఆదాయ దేశాలైన భారత్, బ్రెజిల్, చైనా, మెక్సికో, ఇండోనేషియాలో ఉన్నారు. ఈ మేరకు అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధన సంస్థ (ఐఎఫ్‌పీఆర్‌ఐ) మార్చి 19న తన నివేదికలో పేర్కొంది. 2014లో బలమైన ఆర్థిక వృద్ధి చూపిన ఈ దేశాల్లో 363 మిలియన్ల మంది ఆకలితో బాధపడుతున్న వారున్నట్లు తెలిపింది. 2014-15 ప్రపంచ ఆహార విధాన నివేదిక (జీఎఫ్‌పీఆర్) ఈ దేశాలు తమ ఆహార విధానాలను మార్చుకోవాలని కోరింది. పౌష్టికాహారం, ఆరోగ్యంపై దృష్టిసారించాలని, వ్యవసాయంలో లింగ వ్యత్యాసం తొలగించాలని, అందరికీ ఆహార భద్రత కల్పించేందుకు గ్రామీణ మౌలిక వసతులు మెరుగుపరచాలని కోరింది.
 
 ఇజ్రాయెల్ ప్రధానిగా నెతన్యాహూ
 బెంజిమెన్ నెతన్యాహూ మరోసారి ఇజ్రాయెల్ ప్రధానిగా కొనసాగనున్నారు. మార్చి 18న జరిగిన ఎన్నికల ఫలితాల్లో నెతన్యాహూకు చెందిన లికుడ్ పార్టీ పార్లమెంటు నెస్సెట్‌లోని 120 స్థానాలకు 30 స్థానాలు గెలుచుకుంది. అరబ్ పార్టీల కూటమికి 14 స్థానాలు దక్కాయి. ఇతర చిన్నపార్టీలతో కలిసి నెతన్యాహూ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మద్దతు కూడగట్టారు.
 
 జాతీయం
 కనిష్టంగా ‘టోకు ధరల సూచీ’ ద్రవ్యోల్బణం టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 2015 ఫిబ్రవరిలో -2.06 శాతంగా నమోదైంది. ఇంత కనిష్ట స్థాయిలో నమోదు కావడం 40 ఏళ్లలో ఇదే తొలిసారి. వరుసగా నాలుగో నెల ప్రతి ద్రవ్యోల్బణం నమోదైంది. టోకు ధరల సూచీలో ప్రధాన విభాగాలైన ఆహారం, ఇంధనం, తయారీ ఉత్పత్తుల ధరలు తగ్గడం వల్ల ఈ రేటు తగ్గుతోంది. కేంద్ర ప్రభుత్వం మార్చి 16న విడుదల చేసిన గణాంకాల్లో ద్రవ్యోల్బణం వివరాలు వెల్లడించింది.
 
 నల్లధనం నియంత్రణ బిల్లుకు ఆమోదం
 విదేశాల్లో దాచిన నల్లధనం కేసులకు సంబంధించిన బిల్లుకు కేంద్ర కేబినెట్ మార్చి 17న ఆమోదం తెలిపింది. వెల్లడించని విదేశీ ఆదాయం, ఆస్తుల (పన్ను విధింపు) బిల్లు-2015కు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఆమోదం లభించింది. ఈ బిల్లు ప్రకారం దాచిపెట్టిన ఆదాయం, ఆస్తులకు సంబంధించిన పన్నులపై 300 శాతం జరిమానా విధిస్తారు. పదేళ్ల కఠిన కారాగార శిక్ష కూడా ఉంటుంది. విదేశీ ఆస్తులకు సంబంధించిన వివరాలు సరిగా చూపకపోయినా, ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయకపోయినా విచారణ పరిధిలోకి వస్తారు. ఈ కేసుల్లో ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష ఉంటుంది. పన్ను విధించదగ్గ ఆదాయం లేకపోయినప్పటికీ విదేశీ ఆస్తుల సొంతదారు, లబ్ధిదారు తప్పనిసరిగా రిటర్నులు దాఖలు చేయాలి. వీటిలో విదేశీ ఖాతా తెరిచిన తేదీని తప్పనిసరిగా పేర్కొనాలి. నేరానికి పాల్పడిన వారు వివాదాల పరిష్కార కమిషన్‌ను ఆశ్రయించడానికి అనుమతి ఉండదు.
 
 జాట్‌ల కోటాను రద్దుచేసిన సుప్రీంకోర్టు
 జాట్ వర్గాన్ని ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) కేంద్ర జాబితాలో చేర్చుతూ గతంలో జారీఅయిన నోటిఫికేషన్‌ను సుప్రీంకోర్టు మార్చి 17న రద్దు చేసింది. 2014, మార్చిలో యూపీఏ ప్రభుత్వం తొమ్మిది రాష్ట్రాల్లోని జాట్లకు ఓబీసీ రిజర్వేషన్ కల్పించింది. అయితే జాట్లను ఓబీసీల్లో చేర్చాల్సిన అవసరం లేదంటూ వెనుకబడిన వర్గాల జాతీయ కమిషన్ చేసిన సిఫార్సును కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదని కోర్టు పేర్కొంది. జాట్‌లు బీహార్, గుజరాత్, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో ఉన్నారు.
 
 అస్త్ర క్షిపణి పరీక్ష విజయవంతం
 దేశీయంగా రూపొందించిన బియాండ్ విజువల్ రేంజ్ (బీవీఆర్).. ఎయిర్ టు ఎయిర్ క్షిపణి అస్త్ర ప్రయోగం విజయవంతమైంది. ఈ ప్రయోగాన్ని మార్చి 18న ఒడిశాలోని చాందీపూర్‌లో చేపట్టారు. క్షిపణిని సుఖోయ్-30 యుద్ధవిమానం నుంచి కదులుతున్న లక్ష్యం వైపు ప్రయోగించారు. యుద్ధ విమానం నుంచి క్షిపణి విడిపోయి, 2 కి.మీ. ఎత్తులో కదులుతున్న లక్ష్యాన్ని అడ్డుకుంది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) రూపొందించిన అతిచిన్న క్షిపణి అస్త్ర. దీని పొడవు 3.8 మీటర్లు. ఇది 15 కిలోల బరువున్న ఆయుధాలను మోసుకెళ్లగలదు. సూపర్‌సోనిక్ వేగంతో శత్రు విమానాలను అడ్డుకొని, ధ్వంసం చేయగలదు.
 
 ప్రతినెలా 7 నుంచి టీకాల వారం
 వచ్చే ఐదేళ్లలో దేశవ్యాప్తంగా ప్రతి చిన్నారికీ టీకాలు అందేలా మిషన్ ఇంద్రధనుష్ ప్రచార కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి నడ్డా మార్చి 23న ఢిల్లీలో ప్రారంభించారు. ఈ ఏడాది తొలివిడతలో దేశవ్యాప్తంగా 201 జిల్లాల్లో ఈ సంపూర్ణ టీకా కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఇందులో తెలంగాణ నుంచి ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాలను, ఆంధ్రప్రదేశ్ నుంచి తూర్పు గోదావరి, గుంటూరు, కృష్ణా, కర్నూలు, విశాఖపట్నం జిల్లాలను ఎంపిక చేశారు.
 
 జాతీయ ఉత్తమ చిత్రం ‘కోర్టు’
 డెరైక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ 2014 సంవత్సరానికి గాను 62వ జాతీయ చలనచిత్ర అవార్డులను మార్చి 24న ప్రకటించింది. వీటిని విజేతలకు మే 3, 2015న అందజేస్తారు. ఉత్తమ ఫీచర్ చలనచిత్రం: కోర్టు (మరాఠీ); ఉత్తమ పాపులర్ చలనచిత్రం: మేరీ కోమ్ (హిందీ); ఉత్తమ బాలల చలనచిత్రం: కాక్కా ముత్తైతమిళం); ఎలిజబెత్ ఏకాదశి (మరాఠీ); ఉత్తమ నటుడు: విజయ్ (నాను అవనల్లా అవళు, కన్నడ); ఉత్తమ నటి: కంగనా రనౌత్ (క్వీన్, హిందీ); ఉత్తమ దర్శకుడు: శ్రీజిత్ ముఖర్జీ (చోటుష్కోనే, బెంగాలీ); ఉత్తమ ప్రాంతీయ చలన చిత్రం (తెలుగు): చందమామ కథలు
 
 క్రీడలు
 కెప్టెన్‌గా ధోనీ రికార్డు భారత క్రికెట్ జట్టును వంద వన్డేల్లో గెలిపించిన కెప్టెన్‌గా ఎం.ఎస్.ధోనీ రికార్డు సృష్టించాడు. మార్చి 19న బంగ్లాదేశ్‌తో జరిగిన వరల్డ్‌కప్ క్వార్టర్ ఫైనల్లో విజయంతో ఈ గుర్తింపు లభించింది. ధోనీ 178 వన్డేల్లో 100 విజయాలు సాధించాడు. వన్డే చరిత్రలో ఈ ఘనత సాధించిన ఆస్ట్రేలియేతర ఆటగాడు ధోనీనే. రికీ పాంటింగ్ (165), అలెన్ బోర్డర్ (107) ధోనీ కంటే ముందున్నారు.
 
 సానియా జోడీకి ఇండియన్ వెల్స్ టైటిల్
 సానియా మీర్జా స్విట్జర్లాండ్‌కు చెందిన మార్టినా హింగిస్‌తో కలిసి ప్రతిష్టాత్మక ఇండియన్ వెల్స్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టోర్నమెంట్ టైటిల్ గెలుచుకుంది. అమెరికాలోని కాలిఫోర్నియాలో మార్చి 21న జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో ఎకతెరీనా మకరోవా-ఎలీనా వెస్నినా (రష్యా) జోడీని సానియా-హింగిస్ జోడీ ఓడించింది. విజేతగా నిలిచిన వీరికి రూ.కోటి 83 లక్షల ప్రైజ్‌మనీ దక్కింది. సానియాకు కెరీర్‌లో ఇది 24వ డబుల్స్ టైటిల్ కాగా, హింగిస్‌కు 42వ డబుల్స్ టైటిల్. ఇండియన్ వెల్స్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) గెలుచుకున్నాడు. ఫైనల్లో రోజర్ ఫెదరర్ (స్విస్)ను జొకోవిచ్ ఓడించాడు. ఇది జొకోవిచ్‌కు 50వ ఏటీపీ టైటిల్. మహిళల సింగిల్స్ టైటిల్‌ను సిమోనా హలెప్ గెలుచుకుంది. ఈమె ఫైనల్లో జెలెనా జంకోవిచ్‌ను ఓడించింది.
 
 ప్రపంచకప్‌లో మార్టిన్ గప్తిల్ అత్యధిక స్కోర్
 న్యూజిలాండ్‌కు చెందిన మార్టిన్ గప్తిల్ ప్రపంచకప్ క్రికెట్‌లో అత్యధిక స్కోర్ చేసి రికార్డు సృష్టించాడు. మార్చి 21న వెస్టిండీస్‌తో జరిగిన ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్లో గప్తిల్ 237 (163 బంతుల్లో) పరుగులు చేసి, నాటౌట్‌గా నిలిచాడు. ఇది ప్రపంచకప్‌లో అత్యధిక స్కోర్. వన్డేల్లో రెండో అత్యధిక స్కోర్. వన్డేల్లో భారత్‌కు చెందిన రోహిత్‌శర్మ నవంబర్ 13న కోల్‌కతాలో శ్రీలంకపై 264 పరుగులు చేసి మొదటి స్థానంలో ఉన్నాడు.
 
 వార్తల్లో వ్యక్తులు
 మాధవ్ గాడ్గిల్‌కు టైలర్ పురస్కారం ప్రముఖ పర్యావరణవేత్త మాధవ్ గాడ్గిల్ 2015 సంవత్సరానికి పర్యావరణ విజయానికిచ్చే టైలర్ అవార్డుకు ఎంపికయ్యారు. గాడ్గిల్ పశ్చిమ కనుమల ఎకాలజీ ఎక్స్‌పర్ట్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. అమెరికాలోని సథరన్ కాలిఫోర్నియా యూనివర్సిటీ సహాయంతో టైలర్ ప్రైజ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ 1973లో ఈ అవార్డును ఏర్పాటు చేసింది. గాడ్గిల్‌తో పాటు ఈ అవార్డుకు అమెరికన్ మెరైన్ ఎకాలజిస్టు జేన్ లుబ్‌చెంకో కూడా ఎంపికయ్యారు. వీరిద్దరికి రెండు లక్షల డాలర్ల నగదు బహుమతిని సమానంగా అందజేస్తారు.
 
 బ్రిటన్ రాయల్ సొసైటీ అధ్యక్షునిగా
 వెంకట్రామన్ రామకృష్ణన్ బ్రిటన్‌లోని ప్రముఖ సంస్థ రాయల్ సొసైటీకి అధ్యక్షుడిగా భారత సంతతికి చెందిన నోబెల్ అవార్డు గ్రహీత వెంకట్రామన్ రామకృష్ణన్ ఎన్నికయ్యారు. దీనికోసం జరిగిన ఎన్నికల ఫలితాలను మార్చి మూడో వారంలో ప్రకటించారు. రాయల్ సొసైటీ అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి భారత సంతతి వ్యక్తిగా వెంకట్రామన్ గుర్తింపు సాధించారు. 1660లో స్థాపించిన రాయల్ సొసైటీ అధ్యక్షుడు బ్రిటన్ ప్రభుత్వానికి శాస్త్రీయ సలహాదారుగా వ్యవహరిస్తారు. రామకృష్ణన్ 2009లో మరో ఇద్దరు శాస్త్రవేత్తలతో కలిసి రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్నారు.
 
 సింగపూర్ జాతిపిత లీ క్వాన్ యూ మృతి
 సింగపూర్ జాతిపిత, తొలి ప్రధాని లీ క్వాన్ యూ (91) సింగపూర్‌లో మార్చి 23న మరణించారు. మలేసియా నుంచి సింగపూర్ విడిపోవడంలో ప్రధానపాత్ర పోషించారు. బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్య్రం పొందిన తర్వాత సింగపూర్‌ను ప్రపంచస్థాయి వాణిజ్య, ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దేందుకు లీ క్వాన్ ఎంతో కృషిచేశారు. లీ 31 ఏళ్ల పాటు 1959 నుంచి 1990లో పదవి నుంచి వైదొలగే వరకు ప్రధానిగా పనిచేశారు. లీ కుమారుడు లూంగ్ సింగపూర్ ప్రధానిగా ఉన్నారు.
 
 శ్రీలంక మాజీ సైన్యాధిపతి శరత్ ఫోన్సెకాకు
 ఫీల్డ్ మార్షల్ హోదా శ్రీలంక అత్యున్నత సైనిక హోదా ఫీల్డ్ మార్షల్‌ను ఆ దేశ మాజీ సైన్యాధిపతి శరత్ ఫోన్సెకాకు మార్చి 22న కొలంబోలో అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనా ప్రదానం చేశారు. ఆయన ఈ హోదాను పొందిన తొలి శ్రీలంక జాతీయుడు. ఉగ్రవాదంపై సాధించిన విజయానికి ఆయనకు ఈ హోదా దక్కింది. 2009లో తమిళ టైగర్స్‌పై విజయం సాధించే దిశగా ఆయన సైన్యాన్ని నడిపారు. ఆయన్ను 2010లో అప్పటి ప్రభుత్వం రాజద్రోహం కింద జైలుకు పంపింది. ఆయన రెండేళ్లు జైలు జీవితం గడిపారు. అంతర్జాతీయ ఒత్తిడితో 2012లో విడుదలయ్యారు. జైలుశిక్ష వల్ల ఏడేళ్లపాటు ఎన్నికల్లో పోటీచేసేందుకు అర్హత కోల్పోయారు.
 
 శశికపూర్‌కు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం
 దేశ సినీరంగ ప్రఖ్యాత పురస్కారం ‘దాదాసాహెబ్ ఫాల్కే’.. 2014 సంవత్సరానికిగానూ బాలీవుడ్ నటుడు, నిర్మాత, దర్శకుడు శశికపూర్(77)ను వరించింది. వందకు పైగా సినిమాల్లో నటించిన శశికపూర్.. సొంత నిర్మాణ సంస్థను స్థాపించి పలు సినిమాలు నిర్మించారు. అజూబా అనే ఫాంటసీ సినిమాకు దర్శకత్వం వహించారు. తండ్రి పృథ్వీరాజ్ కపూర్, అన్న రాజ్‌కపూర్ అనంతరం ఈ పురస్కారాన్ని అందుకోనున్న మూడో వ్యక్తి శశికపూర్. పురస్కారం కింద ఆయన స్వర్ణకమలం, రూ. 10 లక్షల నగదు అందుకోనున్నారు. 2014 ఏడాదికి ఫాల్కే అవార్డ్ గ్రహీతగా కపూర్‌ను ఐదుగురు సభ్యుల జ్యూరీ ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. నమక్‌హలాల్, దీవార్, కభీకభీ తదితర హిట్ సినిమాల్లో కపూర్ ప్రధాన పాత్రలు పోషించారు. అమితాబ్, ఆయన నటించిన పలు సినిమాలు బాక్సాఫీస్ హిట్స్‌గా నిలిచాయి. 1938 మార్చి 18న జన్మించిన శశికపూర్ ప్రస్తుతం కిడ్నీ, ఇతర వయో సంబంధ వ్యాధులతో బాధపడుతూ వీల్‌చెయిర్‌కే పరిమితమయ్యారు.
 
 అమెరికా విద్యామండలి అధిపతిగా
 భారతీయ మహిళ అమెరికా విద్యా మండలి బోర్డ్ ఆఫ్ డెరైక్టర్ల చైర్‌పర్సన్‌గా భారతీయ అమెరికన్ మహిళ రేణూ కట్టర్ ఎన్నికయ్యారు. మార్చి 16న వాషింగ్టన్‌లో జరిగిన విద్యామండలి 97వ వార్షిక సమావేశంలో ఆమెను ఎంపిక చేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన రేణూ 2008 నుంచి యూనివర్సిటీ ఆఫ్ హూస్టన్ అధ్యక్షురాలిగా ఉన్నారు.
 
 రాజేంద్రసింగ్‌కు స్టాక్‌హోం వాటర్ ప్రైజ్
 ప్రముఖ పర్యావరణవేత్త రాజేంద్రసింగ్ ప్రతిష్టాత్మక స్టాక్‌హోం వాటర్ ప్రైజ్-2015కు ఎంపికయ్యారు. వాటర్ మ్యాన్‌గా పిలిచే రాజేంద్రసింగ్ గ్రామీణుల స్థితిగతులు మెరుగుపరిచేందుకు విశేష కృషిచేశారు. రాజస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఆయన 1959లో జన్మించారు. అనేక దశాబ్దాలుగా కరవుపై పోరాటం చేస్తున్నారు. గ్రామీణ సమాజాల్లో సాధికారతకు కృషిచేస్తున్నారు. సామాజిక పరంగా నీటి పరిరక్షణ, నిర్వహణకు కృషిచేసినందుకు ఆయనకు 2001లో రామన్ మెగసెసే అవార్డు దక్కింది. స్టాక్‌హోం వాటర్ ప్రైజ్‌ను 1991లో స్టాక్‌హోం ఇంటర్నేషనల్ వాటర్ ఇన్‌స్టిట్యూట్ నెలకొల్పింది. ఈ అవార్డు కింద 1,50,000 డాలర్లు అందజేస్తారు.

మరిన్ని వార్తలు