క్రీడలు

19 Dec, 2016 20:10 IST|Sakshi
క్రీడలు

హాకీ
అజ్లాన్‌ షా కప్‌: మలేసియాలోని ఇపోలో జరిగిన సుల్తాన్‌ అజ్లాన్‌ షా కప్‌ హాకీ టోర్నమెంట్‌ను ఆస్ట్రేలియా గెలుచుకుంది. ఏప్రిల్‌ 16న జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా 4–0తో భారత్‌పై విజయం సాధించింది. ఈ టైటిల్‌ను ఆస్ట్రేలియా గెలవడం ఇది తొమ్మిదోసారి.

 చాంపియన్స్‌ ట్రోఫీ: జూన్‌ 18న లండన్‌లో జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా 3–1 గోల్స్‌ తేడాతో భారత్‌పై గెలుపొంది ట్రోఫీని సాధించింది. ఇది ఆస్ట్రేలియాకు 14వ చాంపియన్స్‌ ట్రోఫీ టైటిల్‌. భారత్‌ తొలిసారి చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌కు చేరుకుంది.

లండన్‌లోనే జరిగిన మహిళల చాంపియన్స్‌ ట్రోఫీ హాకీ
టైటిల్‌ను అర్జెంటీనా కైవసం చేసుకుంది. జూన్‌ 26న అర్జెంటీనా మహిళల జట్టు ఫైనల్లో నెదర్లాండ్స్‌ను ఓడించింది. ఇది అర్జెంటీనాకు 7వ చాంపియన్స్‌ ట్రోఫీ టైటిల్‌.

అండర్‌–18 ఆసియాకప్‌: ఢాకాలో జరిగిన అండర్‌–18 ఆసియాకప్‌ హాకీ టోర్నీలో భారత్‌ విజేతగా నిలిచింది. సెప్టెంబర్‌ 30న జరిగిన ఫైనల్లో భారత్‌ 5–4 గోల్స్‌ తేడాతో ఆతిథ్య బంగ్లాదేశ్‌పై నెగ్గింది.

ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీ: మలేసియాలోని క్వాంటన్‌లో జరిగిన పురుషుల ఆసియా హాకీ చాంపియన్స్‌ ట్రోఫీని భారత్‌ గెలుచుకుంది. అక్టోబర్‌ 30న జరిగిన ఫైనల్లో భారత్‌ 3–2 గోల్స్‌ తేడాతో పాకిస్తాన్‌ను ఓడించింది.

మహిళల ఆసియా హాకీ చాంపియన్స్‌ ట్రోఫీ సింగపూర్‌లో జరిగింది. నవంబర్‌ 5న జరిగిన ఫైనల్లో భారత్‌ 2–1 తేడాతో చైనాపై గెలుపొందింది.

దక్షిణాసియా క్రీడలు
12వ దక్షిణాసియా క్రీడలు ఫిబ్రవరి 5 నుంచి 16 వరకు గువహటి, షిల్లాంగ్‌ నగరాల్లో జరిగాయి. వీటిలో ఎనిమిది దక్షిణాసియా దేశాలు పాల్గొన్నాయి. ఈ క్రీడల మస్కట్‌ ‘టిఖోర్‌’ (బేబీ రైనో). 188 బంగారు పతకాలు, 90 రజత పతకాలు, 30 కాంస్య పతకాలు సాధించి భారత్‌ పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.

లారెస్‌ అవార్డులు
అత్యంత ప్రతిష్టాత్మక లారెస్‌ అవార్డులను 2016 ఏప్రిల్‌లో
ప్రకటించారు.
స్పోర్ట్స్‌మన్‌ ఆఫ్‌ ది ఇయర్‌æ– నొవాక్‌ జొకోవిచ్‌ (టెన్నిస్‌)
స్పోర్ట్స్‌ ఉమెన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ – సెరెనా విలియమ్స్‌ (టెన్నిస్‌)
టీమ్‌ ఆఫ్‌ ది ఇయర్‌ – ఆల్‌బ్లాక్స్‌ (న్యూజిలాండ్‌ రగ్బీ జట్టు)
బ్రేక్‌ త్రూ ఆఫ్‌ ది ఇయర్‌ – జోర్డాన్‌ స్పీత్‌ (గోల్ఫ్‌)
స్పోర్ట్స్‌ పర్సన్‌ విత్‌ ఎ డిజేబిలిటీ ఆఫ్‌ ది ఇయర్‌ – డేనియల్‌ డయాస్‌ (స్విమ్మింగ్‌)

యురేసియన్‌ బ్లిట్జ్‌ చెస్‌
కజకిస్తాన్‌లోని ఆల్మాతిలో జూన్‌లో యురేసియన్‌ బ్లిట్జ్‌ చెస్‌ టోర్నమెంట్‌ జరిగింది. ఇందులో భారత క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక విజేతగా నిలిచింది.

ప్రొ కబడ్డీ లీగ్‌–4
ప్రొ కబడ్డీ లీగ్‌ నాలుగో సీజన్‌ టైటిల్‌ను పట్నా పైరేట్స్‌ జట్టు గెలుచుకుంది. జూలై 31న హైదరాబాద్‌లో జరిగిన ఫైనల్లో పట్నా పైరేట్స్‌.. జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ను ఓడించింది. మహిళల టైటిల్‌ను స్టోర్మ్‌ క్వీన్స్‌ జట్టు గెలుచుకుంది.

ప్రపంచకప్‌ కబడ్డీ
అక్టోబర్‌ 22న అహ్మదాబాద్‌లో జరిగిన ప్రపంచకప్‌ కబడ్డీ ఫైనల్లో భారత్‌.. ఇరాన్‌ను ఓడించి టైటిల్‌ సాధించింది.

ఫార్ములా వన్‌
2016 ఫార్ములా వన్‌ రేసింగ్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌ను జర్మనీకి చెందిన నికో రోస్‌బర్గ్‌ (మెర్సిడెస్‌ జట్టు) గెలుచుకున్నాడు. ఆ తర్వాత రోస్‌బర్గ్‌ డిసెంబర్‌ 2న ఫార్ములా వన్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు.

రియో ఒలింపిక్స్‌
బ్రెజిల్‌లోని రియో డి జెనీరో నగరంలో ఆగస్టు 5 నుంచి 21 వరకు 31వ ఒలింపిక్స్‌ను నిర్వహించారు. ఈ వేసవి ఒలింపిక్స్‌లో 206 దేశాల జట్లతోపాటు ఒక శరణార్థుల జట్టు కూడా పాల్గొంది. 28 క్రీడల్లో 306 విభాగాల్లో పోటీలు నిర్వహించారు. తొలి స్వర్ణ పతకాన్ని అమెరికా క్రీడాకారిణి వర్జీనియా త్రాషర్‌ షూటింగ్‌తో సాధించింది. అమెరికా (46 స్వర్ణ పతకాలు), గ్రేట్‌ బ్రిటన్‌ (27), చైనా (26)లు తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. భారత్‌తోపాటు మంగోలియా ఒక రజతం, ఒక కాంస్య పతకం సాధించి 67వ స్థానంలో సంయుక్తంగా నిలిచాయి. ప్రారంభోత్సవ వేడుకల్లో అభినవ్‌ బింద్రా, ముగింపు ఉత్సవాల్లో సాక్షి మాలిక్‌ పతాక ధారులుగా వ్యవహరించారు. అభినవ్‌ బింద్రా, సచిన్‌ టెండూల్కర్, సల్మాన్‌ ఖాన్, ఎ.ఆర్‌. రెహ్మాన్‌ రియో ఒలింపిక్స్‌కు ప్రచారకర్తలు.
హరియాణా క్రీడాకారిణి సాక్షి మాలిక్‌ ఆగస్టు 17న మహిళల ఫ్రీ స్టయిల్‌ రెజ్లింగ్‌ పోటీల్లో 58 కిలోల విభాగంలో కాంస్య పతకం సాధించింది. హైదరాబాద్‌కు చెందిన పి.వి. సింధు ఆగస్టు 19న మహిళల బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌లో రజత పతకం సాధించింది.

పారాలింపిక్స్‌
15వ పారాలింపిక్స్‌ను రియో డి జెనీరోలో సెప్టెంబర్‌ 7 నుంచి 18 వరకు నిర్వహించారు. చైనా 107 బంగారు పతకాలు సాధించి అగ్రస్థానంలో నిలవగా, గ్రేట్‌ బ్రిటన్‌ (64) రెండో స్థానంలో, ఉక్రెయిన్‌ (41) మూడో స్థానంలో నిలిచాయి. భారత్‌ రెండు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యం సాధించి 43వ స్థానంలో నిలిచింది. పురుషుల హైజంప్‌లో మరియప్పన్‌ తంగవేలు, పురుషుల జావెలిన్‌ త్రోలో దేవేంద్ర జజారియా... స్వర్ణ పతకాలు సాధించారు. మహిళల షాట్‌పుట్‌లో దీపా మాలిక్‌ రజత పతకం, పురుషుల హైజంప్‌లో వరుణ్‌ సింగ్‌ భాటి కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు.

ఫుట్‌బాల్‌
శాఫ్‌ కప్‌: జనవరి 3న తిరువనంతపురంలో జరిగిన ఫైనల్లో భారత్‌ 2–1 గోల్స్‌ తేడాతో అఫ్గానిస్తాన్‌ను ఓడించి దక్షిణాసియా ఫుట్‌బాల్‌ సమాఖ్య (శాఫ్‌) కప్‌ను కైవసం చేసుకుంది. భారత్‌ 7వసారి ఈ కప్‌ను గెలుచుకుంది.

సంతోష్‌ ట్రోఫీ: నాగ్‌పూర్‌లో మార్చి 13న జరిగిన ఫైనల్లో సర్వీసెస్‌ జట్టు.. మహారాష్ట్రను 2–1తో ఓడించి సంతోష్‌ ట్రోఫీ జాతీయ ఫుట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ను సాధించింది. ఇది సర్వీసెస్‌కు ఐదో సంతోష్‌ ట్రోఫీ.
ఫిఫా నూతన అధ్యక్షుడు: ప్రపంచ ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఫిఫా) నూతన అధ్యక్షుడిగా గియానీ ఇన్‌ఫాంటినో (స్విట్జర్లాండ్‌) ఎన్నికయ్యారు. అవినీతి ఆరోపణల కారణంగా అధ్యక్ష పదవిని కోల్పోయిన సెప్‌బ్లాటర్‌ స్థానంలో ఆయన ఎంపికయ్యారు. ఫిఫా ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌లో ఉంది.

ఫెడరేషన్‌ కప్‌: గువహటిలో మే 21న జరిగిన ఫైనల్లో మోహన్‌ బగాన్‌ జట్టు.. ఐజాల్‌ ఎఫ్‌సీ జట్టును ఓడించి ఫెడరేషన్‌ కప్‌ను గెలుచుకుంది. మోహన్‌ బగాన్‌ జట్టు ఫెడరేషన్‌ కప్‌ గెలవడం ఇది 14వసారి.
కోపా అమెరికా: కోపా అమెరికా సెంటెనరీ టోర్నమెంట్‌ 2016, జూన్‌లో యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికాలో జరిగింది. ఈ టోర్నీ తొలిసారి దక్షిణ అమెరికా ఖండం బయట జరిగింది. జూన్‌ 26న జరిగిన ఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌ చిలీ.. పెనాల్టీ çషూటౌట్‌లో 4–2తో అర్జెంటీనాపై గెలుపొంది టైటిల్‌ను వరుసగా రెండోసారి సాధించింది.

యూరో–2016: ఫ్రాన్స్‌లో జరిగిన యూరో ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌లో తొలిసారి పోర్చుగల్‌ విజేతగా నిలిచింది. జూలై 10న జరిగిన ఫైనల్లో పోర్చుగల్‌.. ఆతి«థ్య జట్టు ఫ్రాన్స్‌ను 1–0 తేడాతో ఓడించి తొలిసారి ఓ అంతర్జాతీయ ట్రోఫీని గెలుచుకుంది.

డ్యూరాండ్‌ కప్‌: ఆసియాలో అతి పురాతన ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ డ్యూరాండ్‌ కప్‌ను ఆర్మీ గ్రీన్‌ జట్టు గెలుచుకుంది. సెప్టెంబర్‌ 11న న్యూఢిల్లీలో జరిగిన ఫైనల్లో ఆర్మీగ్రీన్‌.. నెరోకా ఫుట్‌బాల్‌ క్లబ్‌ను ఓడించింది.

మరిన్ని వార్తలు