స్టెమ్‌ కోర్సులు

9 Sep, 2019 13:14 IST|Sakshi

ప్రపంచ వ్యాప్తంగా స్టెమ్‌ కోర్సులపై పెరుగుతున్న ఆసక్తి 

ఆసక్తికి తగ్గ ప్రోత్సాహం, అవసరాలకు అనుగుణంగా శిక్షణ కరవు

తాజా అంతర్జాతీయ సర్వేలో వెల్లడి

స్టెమ్‌.. (STEM - Science, Technology, Engineering, Mathematics) కోర్సులు. ఇవి నేటి టెక్నాలజీ యుగంలో ఎంతో ప్రాముఖ్యం సంతరించుకుంటున్న కోర్సులు! మరోవైపు ప్రపంచవ్యాప్తంగా స్టెమ్‌ నిపుణుల కొరత నెలకొంది. ఈ కోర్సుల పట్ల ఆసక్తి చూపుతున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నా... అందుకుతగ్గ ప్రోత్సాహం లభించట్లేదని తాజా సర్వే పేర్కొంది. అమెరికా మొదలు, అన్ని దేశాల్లోనూ ఇదే ధోరణి! మహిళా విద్యార్థుల్లో సైతం ‘స్టెమ్‌’ కోర్సులపై ఆసక్తి ఉన్నా.. లభించని తోడ్పాటు! తాజాగా అంతర్జాతీయంగా గ్లోబల్‌ టెక్నాలజీ అండ్‌ ఇంజనీరింగ్‌ సంస్థ ఎమర్సన్‌ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఈ నేపథ్యంలో మన దేశంలో స్టెమ్‌ కోర్సుల పరిస్థితి.. స్టెమ్‌ కోర్సులను అందిస్తున్న ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లు, వాటి ద్వారా లభించే అవకాశాలపై ప్రత్యేక కథనం..

స్టెమ్‌.. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్‌.. ఇండస్ట్రీ అవసరాల పరంగా  అత్యంత కీలకమైనవి. సంస్థల్లో కార్యకలాపాలు సమర్థవంతంగా సాగడానికి, కొత్తకొత్త ప్రొడక్ట్స్‌ మార్కెట్‌లోకి తేవడానికి స్టెమ్‌ నిపుణుల సేవలు తప్పనిసరి. అందుకే  స్టెమ్‌ కోర్సుల్లో ప్రతిభ చూపిన వారికి జాబ్‌ మార్కెట్లో మంచి డిమాండ్‌ నెలకొంది. అదే సమయంలో ఈ కోర్సులపై ఆసక్తి చూపుతున్న విద్యార్థుల సంఖ్య సైతం ఏటా పెరుగుతోంది. కానీ, స్టెమ్‌ కోర్సుల విద్యార్థులు రాణించేందుకు అవసరమైన ప్రోత్సాహం, ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా శిక్షణ లభించడం లేదని తాజా సర్వే పేర్కొంది. పర్యవ సానంగా ఈ విభాగంలో పరిశ్రమలు స్కిల్‌ గ్యాప్‌ సమస్యను ఎదుర్కొంటున్నాయి.

పెరుగుతున్న ఆసక్తి
ఇటీవల కాలంలో స్టెమ్‌ కోర్సుల్లో చేరాలనే ఆసక్తి గణనీయంగా పెరుగుతోంది. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే.. అగ్రరాజ్యంగా భావించే అమెరికాలో 60 శాతం మంది విద్యార్థులు స్టెమ్‌ కోర్సుల పట్ల ఆసక్తి చూపుతున్నారు. కానీ, వీరిలో 40 శాతం మంది తమకు సరైన ప్రోత్సాహకాలు లేవని పేర్కొనడం గమనార్హం.  మన దేశంలోనూ స్టెమ్‌ల్లోని ఇంజనీరింగ్, టెక్నాలజీ కోర్సుల పట్ల ఆసక్తి రెట్టింపు అవుతోంది. అదేవిధంగా సైన్స్, మ్యాథమెటిక్స్‌ కోర్సుల విషయంలో విద్యార్థులకు సరైన మార్గం నిర్దేశం లభించడంలేదు.

జండర్‌ గ్యాప్‌
స్టెమ్‌ కోర్సుల అభ్యసనం పరంగా దేశంలో ఎదురవుతున్న మరో సమస్య.. జండర్‌ గ్యాప్‌(లింగ వివక్ష). మహిళా విద్యార్థులు నిరుత్సాహానికి గురవుతున్నారు. తాజా సర్వే ప్రకారం 41 శాతం మంది విద్యార్థినులు స్టెమ్‌ కెరీర్స్‌ పురుషుల కోసమే అనే అభిప్రాయంతో ఉన్నట్లు వెల్లడైంది.  మరో 44 శాతం మంది మహిళలు సైతం ఈ రంగంలో తమకు రోల్‌ మోడల్స్‌ లేరని, దాంతో స్టెమ్‌ కోర్సుల్లో చేరేందుకు ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సి వస్తోందన్నారు. తల్లిదండ్రులు కూడా స్టెమ్‌ కోర్సుల్లో అమ్మాయిలను చేర్పించేందుకు వెనుకాడుతున్నారు. ఈ విషయంలో ఇంజనీరింగ్‌ కోర్సులు కొంత ఫర్వాలేదు. కానీ సైన్స్, మ్యాథమెటిక్స్‌తో అమ్మాయిలకు పెద్దగా ఉపయోగంలేదనే భావన నేటికీ ఉంది.

స్టెమ్‌తో ఉజ్వల భవిత
వాస్తవానికి స్టెమ్‌లోని సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్‌.. ఈ  నాలుగింటిలో ఏ కోర్సు పూర్తిచేసుకున్నా.. ఉజ్వల భవిత ఖాయంగా కనిపిస్తోంది. ఇంజనీరింగ్, టెక్నాలజీ విభాగాలనే పరిశీలిస్తే.. ఉత్పత్తి రంగం మొదలు ఐటీ, ఆటోమేషన్‌ వరకు.. అవకాశాలు పుష్కలం. సైన్స్, మ్యాథమెటిక్స్‌ల్లో పీహెచ్‌డీ స్థాయి కోర్సులు పూర్తిచేస్తే విస్తృత ఉపాధి వేదికలు అందుబాటులోకి రావడం ఖాయం. కానీ, ఈ సబ్జెక్ట్‌లలో ఈ స్థాయి నిపుణులు లేక పరిశ్రమ వర్గాలు, పరిశోధన కేంద్రాలు స్కిల్‌ గ్యాప్‌ సమస్యను ఎదుర్కొంటున్నాయి.

మార్గాలు అనేకం
స్టెమ్‌ కోర్సులు అభ్యసించేందుకు అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఇంజనీరింగ్, టెక్నాలజీకి సంబంధించి ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీల్లో  కోర్సులు అభ్యసించే అవకాశముంది. సైన్స్‌ కోర్సుల అభ్యర్థులు.. ఐఐఎస్‌ఈఆర్, ఐఐఎస్‌సీ వంటి ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్‌లలో సైన్స్‌ విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ స్థాయి నుంచే రీసెర్చ్‌ వైపు అడుగులు వేసే వీలుంది.  

స్కిల్‌ గ్యాప్‌.. ప్రధాన సమస్య
స్టెమ్‌ కోర్సుల్లో చేరే వారి సంఖ్య పెరుగుతున్నప్పటికీ.. జాబ్‌ మార్కెట్లో స్కిల్‌ గ్యాప్‌ అనేది ప్రధాన సమస్యగా మారింది. అకడమిక్‌ స్థాయిలో సరైన సదుపాయాలు లేకపోవడం, ఇండస్ట్రీ వర్గాలు ఇన్‌స్టిట్యూట్‌లతో కలిసి నడవకపోవడం ఇందుకు ముఖ్య కారణంగా కనిపిస్తోంది. తాజా సర్వే ప్రకారం కంపెనీలు తమ ఉద్యోగుల్లో స్టెమ్‌ నైపుణ్యాలు పెంపొందించేలా శిక్షణ ఇవ్వాలని 87 శాతం మంది పేర్కొనడం స్కిల్‌ గ్యాప్‌ సమస్యకు నిదర్శనంగా చెప్పొచ్చు.

అక్కడా భారతీయ నిపుణులు
వాస్తవానికి మన దేశం నుంచి విదేశాలకు వెళ్తున్న స్టెమ్‌ నిపుణుల సంఖ్య ఏటా  పెరుగుతోంది. తాజా గణాంకాల ప్రకారం అమెరికా మొదలు పలు దేశాల్లోని సంస్థల్లో పనిచేస్తున్న స్టెమ్‌ నిపుణుల్లో భారతీయుల సంఖ్య 20 నుంచి 30 శాతంగా ఉంది. ఈ నిపుణులు దేశంలోనే ఉండేలా ప్రోత్సాహకాలు అందించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి మేధో వలసలను అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

భవిష్యత్తుకు స్టెమ్‌ నిపుణులే పునాది
ప్రస్తుతం దేశంలో జరుగుతున్న పరిశోధనల దృష్ట్యా.. భవిష్యత్తులో స్టెమ్‌ నిపుణులుæ దేశ ప్రగతికి పునాదులుగా నిలవనున్నారు. అందుకు తగ్గట్టుగా స్టెమ్‌ విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందించాలని, స్కిల్‌ గ్యాప్‌ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సైన్స్, మ్యాథమెటిక్స్‌ వంటి అంశాల్లో పరిశోధనలు చేసే వారికి ఆర్థిక ప్రోత్సాహకాలు మరింత పెంచాలంటున్నారు. అదే విధంగా ఇంజనీరింగ్, టెక్నాలజీకి సంబంధించి నూతన నైపుణ్యాలు అందించే విధంగా ప్రత్యేక ఇన్‌స్టిట్యూట్‌లు, కోర్సులు ప్రారంభించాలని సూచిస్తున్నారు.

ఇండస్ట్రీతో కలిసి
స్టెమ్‌ విభాగాల్లో నెలకొన్న స్కిల్‌ గ్యాప్‌ సమస్య పరిష్కారానికి ఇన్‌స్టిట్యూట్‌లు, ఇండస్ట్రీ వర్గాలతో కలిసి పనిచేయాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కోర్సు ప్రారంభించే సమయంలో ఇండస్ట్రీ వర్గాలతో సంప్రదించి పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాలను కరిక్యులంలో చేర్చాలి. అలాగే పరిశోధనల పరంగా జాయింట్‌ రీసెర్చ్‌ ప్రోగ్రామ్స్‌ చేపట్టడం, వాటిలో విద్యార్థులను భాగస్వాములను చేయడం ద్వారా   స్కిల్‌ గ్యాప్‌ సమస్యను అధిగమించే వీలుంది.

ప్రోత్సాహకాలు అందించేలా
స్టెమ్‌ కోర్సుల్లో చేరే మహిళా విద్యార్థులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాలని నిపుణులు పేర్కొంటున్నారు. తల్లిదండ్రుల్లోనూ అవగాహన కల్పించి, ఆడ పిల్లలు సైతం స్టెమ్‌ విభాగాల్లో ముందంజలో నిలిచేలా చర్యలు తీసుకోవాలం టున్నారు. ఐఐటీల్లో మహిళల కోసం ప్రత్యేకంగా సూపర్‌ న్యూమరరీ కోటా పేరుతో సీట్లు కేటాయిస్తున్నప్పటికీ.. ఇతర ఇన్‌స్టిట్యూట్‌లు, కోర్సులకు కూడా వీటిని వర్తించాలనే అభిప్రాయం వినిపిస్తోంది.

స్టెమ్‌ కోర్సులు.. సర్వే ముఖ్యాంశాలు
దేశ అభివృద్ధిలో స్టెమ్‌ ఉద్యోగాలే కీలకమని చెప్పిన వారు– 84 శాతం.
స్టెమ్‌ ఎడ్యుకేషన్‌ ముఖ్యం అన్నవారు–96%
స్టెమ్‌ విభాగాల్లో మహిళా రోల్‌ మోడల్స్‌ లేకపోవడం కూడా సమస్యగా ఉందని చెప్పిన వారి సంఖ్య–44 శాతం.
అమెరికాలో ప్రతి పది మందిలో ఆరుగురులో స్టెమ్‌ కోర్సుల పట్ల ఆసక్తి. కానీ, ప్రతి పది మందిలో నలుగురు  ఈ విభాగంలో సరైన ప్రోత్సాహం లేదని చెప్పారు.

ఎలాంటి సందేహం లేదు
స్టెమ్‌ కోర్సులతో అటు ఇండస్ట్రీకి, ఇటు విద్యా ర్థులకు ప్రయోజనాలు చేకూరుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ కోర్సుల్లో చేరే విద్యార్థుల సంఖ్య మ రింత పెరగాల్సిన అవ సరం ఉంది. ఇటీవల కాలంలో ఆసక్తి పెరుగుతున్న మాట వాస్తవమే. కానీ, మార్కెట్‌ అవసరాలను పరిగణనలోకి తీసుకుంటే.. ఇది తక్కువనే చెప్పాలి. దీనికి పరిష్కారం ఈ కోర్సుల పట్ల విద్యార్థుల్లో ముందు నుంచే అవగాహన కల్పించడం.– ప్రొఫెసర్‌ ఎం.జె.స్వామి, స్కూల్‌ ఆఫ్‌ కెమిస్ట్రీ, హెచ్‌సీయూ.

మరిన్ని వార్తలు