సామర్థ్యాలే విజయానికి సోపానాలు

6 Sep, 2014 00:58 IST|Sakshi
సామర్థ్యాలే విజయానికి సోపానాలు

నే డున్నది పోటీ ప్రపంచం. యువత తమ లక్ష్యాన్ని సాధించే క్రమంలో అధిక పోటీని ఎదుర్కోవాల్సి వస్తోంది. దీంతో తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. వాస్తవ మేమిటంటే ఇలాంటి వాటిని ప్రతి వ్యక్తీ చదువులోనైనా, వ్యక్తిగత జీవితంలోనైనా ఎదుర్కోవాల్సిందే. వీటి నుంచి ఎవరూ తప్పించుకోలేరు. అపజయాలనేవి జీర్ణించుకోలేనివిగా ఉంటాయి. కానీ మనలో ఉండే సామర్థ్యాలపై నమ్మకం ఉంచి,కృషి సాగిస్తే విజయతీరాలకు చేరుకోవచ్చు. కాబట్టి గత చేదు అనుభవాలను విస్మరించి లక్ష్యం దిశగా అడుగులు వేయాలి.
 
 సామర్థ్యాలకు సానపెట్టు:
 కెరీర్‌లో రాణించాలంటే మొదట మనలోని సామర్థ్యాలను అంచనా వేయాలి. మూల్యాంకనం చేయాలి. ఎక్కడ వెనుకబడి ఉన్నామో గుర్తించాలి. దానికి అనుగుణంగా లోపాలను సరిదిద్దుకోవాలి. ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందు కేయాలి. గమ్యం చేరే ప్రయత్నంలో కొన్ని అవరోధాలు ఎదురవుతాయి. పొరపాట్లకు దారితీస్తాయి. కాబట్టి వీటిపై ఎప్పటికప్పుడు ఆత్మావలోకనం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎక్కడ తప్పులు దొర్లుతున్నాయో తెలుసుకొని, వాటిని పునరావృతం కాకుండా జాగ్రత్త పడొచ్చు.    
 
 లక్ష్యం వైపే మనసు:
 సంకల్పించిన లక్ష్యం మనసులో దృఢంగా నాటుకుపోవాలి. ఈ వైఖరే మన విజయానికి కొంత దోహదపడుతుంది. కొన్ని సందర్భాల్లో బయటి నుంచి కొన్ని ప్రతికూల కారకాలు ప్రభావం చూపుతాయి. అవి మనం నియంత్రిం చలేని స్థాయిలో ఉంటాయి. అయినా మన దృష్టంతా లక్ష్యంపైనే ఉండాలి. లేదంటే మన ఆశయసాధన ప్రయత్నం సఫలం కాదు.
 
 సామాజిక మద్దతు:
 లక్ష్యసాధనలో తరచూ వైఫల్యాలు చవిచూసేవారు తీవ్ర నిరాశకు గురవుతారు. ఇక తమవల్ల సాధ్యం కాదనే న్యూనతకు లోనవు తారు. ఇలాంటి వారు సామాజిక మాధ్యమా లైన ఫేస్‌బుక్, ట్విట్టర్, లింక్‌డ్ ఇన్, గూగుల్‌ప్లస్ ద్వారా మిత్రులతో తమ అనుభవాలను పంచుకోవాలి. ఇలా చేయడం వల్ల మిత్రులతోపాటు కొన్నిసార్లు అనుభవజ్ఞుల సలహాలు లభించే అవకాశం ఉంటుంది.  
 
 స్వీయ విమర్శ:
 ప్రయత్నంలో భాగంగా చిన్నచిన్న పొరపాట్లు తలెత్తడం సహజం. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని కంగారు పడాల్సిన అవసరం లేదు. కానీ అందివచ్చిన అవకాశం చేజార్చుకునే సందర్భంలో...ఎక్కడ పొరపాటు దొర్లిందో గుర్తించాలి. ఎట్టి సందర్భంలోనూ పరాజయాలకు లొంగి వెనకంజ వేయవద్దు. ఎన్నిసార్లు విఫలమయ్యావన్నది విషయం కాదిక్కడ. ప్రతి ప్రయత్నంలో లక్ష్యానికి ఎంత చేరువవుతున్నావన్నదే ముఖ్యం. లక్ష్యాన్ని వదిలిపెట్టకుండా ప్రయత్నం సాగిస్తే ఏదోరోజు విజయం సాధించవచ్చు.

మరిన్ని వార్తలు