భావి భారత నిర్మాతలు ఉపాధ్యాయులు

5 Sep, 2016 14:25 IST|Sakshi
భావి భారత నిర్మాతలు ఉపాధ్యాయులు

మాతృదేవోభవ..
 పితృదేవోభవ..
 ఆచార్య దేవోభవ..

 భారతీయ సమాజం జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత అక్షరాలుదిద్దించిన గురువుకే పెద్దపీట వేసింది. గురువును సాక్షాత్తూ దేవుడితో సమానంగా పూజించింది.. పూజిస్తోంది. నేటి బాలలే.. రేపటి పౌరులు.ఆ పౌరులను బాధ్యతాయుత వ్యక్తులుగా.. బంగారు భవిష్యత్తుకు మార్గనిర్దేశకులుగా.. ప్రగతి రథ సారధులుగా నిలిపేవారే.. ఉపాధ్యాయులు.అందుకే శతాబ్దాల నాటి గురుకులాలైనా.. ఆన్‌లైన్ పాఠాల సంస్కృతి పెరుగుతున్న నేటి ఆధునిక యుగంలోనైనా.. బోధన ఒక పవిత్రమైన వృత్తిగా భాసిల్లుతోంది.టీచర్స్ అంటే సమాజంలో గౌరవం ఇనుమడిస్తోంది. ఈ నేపథ్యంలో నేడు  గురు పూజోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థుల వ్యక్తిత్వ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్రపై విశ్లేషణ..
 
 దేర్ ఈజ్ నో నాలెడ్జ్ విత్ అవుట్ టీచర్స్.. టీచర్స్ ఆర్ ప్రొవైడర్స్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ విజ్‌డమ్.. జ్ఞాన సముపార్జనలో.. భవిష్యత్తు నిర్మాణంలో ఉపాధ్యాయులకున్న ప్రాధాన్యతను తెలిపేందుకు ఇంతకు మించిన పదాలు అక్కర్లేదు. అందుకే.. మన సమాజంలో తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయులకే స్థానం దక్కింది. తల్లిదండ్రులు పిల్లలకు జన్మనిస్తే.. వారికి బంగారు భవిష్యత్‌ను ఇచ్చే క్రమంలో కీలకపాత్ర టీచర్లదే.
 
 భవిష్యత్‌కు మార్గదర్శకులు
 ప్రొఫెసర్‌గా, శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా పనిచేసిన డాక్టర్ ఎ.పి.జె.అబ్దుల్ కలాం చెప్పిన మాటలే ఉపాధ్యాయ వృత్తికున్న గొప్పతనానికి నిదర్శనం. ‘ఒక విద్యార్థి వ్యక్తిత్వాన్ని, సామర్థ్యాన్ని, భవిష్యత్తును రూపుదిద్దే సర్వోన్నత వ్యక్తి ఉపాధ్యాయుడే’ అని ఆయన తరచుగా చెప్పేవారు. ఆయన వివిధ హోదాల్లో బిజీగా ఉన్నా మనసంతా బోధనపైనే ఉండేది. వీలు దొరికినప్పుడల్లా ఏవైనా పాఠశాలలు/యూనివర్సిటీలు/కళాశాలలను సందర్శించి వివిధ అంశాలపై ఉపన్యసించేవారు. ఎంతో ఉత్సాహంగా విద్యార్థులతో తన అనుభవాలను పంచుకునేవారు. వారిని ఉత్సాహపరిచేవారు.. కార్మోన్ముఖులను చేసేవారు. తాను ఎక్కడో దేశానికి దక్షిణం దిక్కులో సముద్రంలో విసిరేసినట్లుండే ఒక చిన్న ఊరు రామేశ్వరంలో పుట్టినా.. ఈ స్థాయికి రావడానికి తన గురువులే కారణమని కలాం ఎప్పుడూ గుర్తు చేసుకునేవారు.
 
 నైపుణ్యాలకు నగిషీలు..
 వజ్రం ఎంత గొప్పదైనా.. దానికి సానపెడితేనే మరింత వెలుగులీనుతుంది. అదేవిధంగా చిన్నారుల్లో సహజసిద్ధమైన సామర్థ్యాలున్నా.. వారిని సానపెట్టి వజ్రాల్లా తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే. చిన్నారుల్లోని నైపుణ్యాలను గుర్తించి.. వాటికి నగిషీలు అద్ది, మట్టిలోని మాణిక్యాలను కూడా వెలుగులోకి తీసుకువచ్చేది మాత్రం టీచర్లే. ఆర్ట్ ఆఫ్ టీచింగ్ ఈజ్ ఆర్ట్ ఆఫ్ అసిస్టింగ్ డిస్కవరీ అనే మాటే.. పిల్లల్లో నైపుణ్యాలను వెలికితీయడంలో ఉపాధ్యాయుల పాత్రను తెలియజేస్తోంది. అత్యున్నత నోబెల్ బహుమతి గ్రహీతల నుంచి సమాజంలో ఉన్నత స్ధానంలో ఉన్న వ్యక్తుల వరకు దాదాపు ప్రతి ఒక్కరూ తమకు స్ఫూర్తి, ప్రేరణ తమ చిన్ననాటి ఉపాధ్యాయులే అని పేర్కొనడం మనం తరచూ వింటూనే ఉంటాం. అలాంటి గొప్ప వృత్తి ఉపాధ్యాయ వృత్తి.
 
 అనుబంధం అంతంతమాత్రం..

 ప్రస్తుతం 21వ శతాబ్దంలో.. 4జీ ఫోన్లు, అరచేతిలో ఒక్క క్లిక్‌తో సమస్త ప్రపంచ సమాచారం కళ్ల ముందుంటోంది. ఈ క్రమంలో ఈ తరం ఉపాధ్యాయుల పట్ల విద్యార్థులు ఎలా వ్యవహరిస్తున్నారు. విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు ఎలాంటి శ్రద్ధ చూపుతున్నారు? అంటే .. వీరి మధ్య అనుబంధం అంతగా ఉండటం లేదని చెప్పొచ్చు. తరగతి గది మారింది. పాఠశాల స్థాయిలో బ్లాక్ బోర్డ్, చాక్ పీస్ స్థానంలో వైట్ బోర్డ్స్, మార్కర్ పెన్స్ సంస్కృతి పెరిగింది. ఆడియో-విజువల్ టూల్స్‌తో క్లాస్‌రూంలు ఆధునికతను సంతరించుకుంటున్నాయి.
 
 ‘క్లాస్ రూంలో పాఠాలు వినపోయినా ఫర్వాలేదు. ఇంటర్నెట్, ఈ-లెర్నింగ్ టూల్స్ ఉన్నాయిగా’ అనే దృక్పథం యువతలో పెరుగుతోంది. కానీ ఈ-లెర్నింగ్ టూల్స్, ఆన్‌లైన్ ట్యూషన్స్, వీడియో లెక్చర్స్ సైతం ఉపాధ్యాయులే రూపొందిస్తారని యువత గుర్తించాలి అని విద్యావేత్తలు అంటున్నారు. ‘టెక్నాలజీ అనేది విద్యా బోధనలో ఒక సాధనం మాత్రమే. విద్యార్థిని తీర్చిదిద్దడంలో టీచర్ పాత్రే అత్యంత కీలకం’ అని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ చేసిన వ్యాఖ్యలే విద్యార్థుల భవిష్యత్ నిర్దేశం దిశగా నేటి ఆధునిక యుగంలో ఉపాధ్యాయుల పాత్రను తేటతెల్లం చేస్తోంది.
 
 మూర్తిమత్వానికి చోదక శక్తులు
 చాలామంది ఉపాధ్యాయులు అంకితభావం, కష్టించే స్వభావం, వృత్తిని ప్రేమించేతత్వాన్ని కలిగి ఉంటున్నారు. తమ బోధనల ద్వారా విద్యార్థులను గొప్పగా తీర్చిదిద్దాలనుకుంటున్నారు. వారి సంపూర్ణ మూర్తిమత్వానికి చోదక శక్తులుగా నిలవాలనుకుంటున్నారు. అత్యంత శ్రద్ధతో ఒక టీచర్ చెప్పే పాఠాన్ని వింటే.. సదరు అంశానికి సంబంధించి సగం నైపుణ్యం పొందినట్లే. ఎందుకంటే పలువురు విద్యావేత్తల అభిప్రాయం ప్రకారం ఒక విద్యార్థికి క్లాస్ రూం పాఠం ద్వారా 50 శాతం; లైబ్రరీ ద్వారా 25 శాతం; ఇతర లెర్నింగ్ సదుపాయాల ద్వారా 25 శాతం నైపుణ్యాలు అందుతాయి. అంటే టెక్నాలజీ ఎంత పెరిగినా.. ఎన్ని ఆధునిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చినా ప్రత్యక్షంగా టీచర్ చెప్పే పాఠం ద్వారా లభించే జ్ఞానమే అధికం. దీన్ని నేటి యువత గుర్తించాలి.
 
 ఎర్లీ చైల్డ్‌హుడ్.. ఎంతో ప్రధానం
  సరిగా మాటలు పలకడం కూడా రాని వయసులో ప్రీ-ప్రైమరీ, కిండర్‌గార్టెన్, నర్సరీ, ఎల్‌కేజీ ఇలా రకరకాల పేర్లతో పిల్లలను పాఠశాలల్లో చేర్చుతున్న రోజులివి. ఈ పరిస్థితుల్లో తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ఆ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించేది ఉపాధ్యాయులే. ఆట బొమ్మలతో పాఠాలు చెబుతూ.. వాటిని చిన్నారులు అర్థం చేసుకోవడంలో ఉపాధ్యాయులు పాటించే సహనం, ఓర్పు, నేర్పు గురించి ఎంత చెప్పినా తక్కువే. అంతేకాకుండా చిన్నారుల్లో ఉన్న సహజ సిద్ధ నైపుణ్యాలను వెలికితీయడంలో టీచర్ల పాత్ర వెలకట్టలేనిది. అందుకే గుడ్ టీచర్ నోస్ హౌ టు బ్రింగ్ అవుట్ ది బెస్ట్ ఇన్ స్టూడెంట్స్ అనే మాట కూడా ఉంది.
 
 ఉపాధ్యాయుల సలహాలు తీసుకోండి
 ప్రస్తుత పరిస్థితుల్లో ఉపాధ్యాయులు - విద్యార్థుల మధ్య సాన్నిహిత్యం కొంత తగ్గుతుందనే మాట వాస్తవమే. కారణం.. ఆధునిక యుగంలో యువత క్లాస్ రూం లెర్నింగ్‌కు తక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. ఆధునిక టెక్నాలజీ ద్వారా పలు మార్గాలు వీరికి అందుబాటులోకి రావడమే ఇందుకు ప్రధాన కారణం. కానీ గుర్తించాల్సిన విషయం ఏంటంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి డాక్టరేట్ స్టడీస్ వరకు స్టూడెంట్ - టీచర్ మధ్య గుడ్ రిలేషన్ ఉండాలి. అది విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది.
 - ప్రొఫెసర్ వి.రామ్ గోపాల్‌రావు
 డెరైక్టర్, ఐఐటీ-ఢిల్లీ

 
 
 ప్రొఫెషన్‌ను ప్రేమించాలి
 ఉపాధ్యాయ వృత్తిలో అడుగుపెట్టేవారికి ఈ వృత్తిని ప్రేమించే లక్షణం ఎంతో అవసరం. తాము భావి పౌరులను తీర్చిదిద్దుతున్నామనే ఆలోచనతో ఉండాలి. ముఖ్యంగా ప్రీ-ప్రైమరీ స్థాయిలోని టీచర్లు ఎంతో ప్రత్యేకంగా వ్యవహరించాలి. అప్పటివరకు తల్లిదండ్రులు తప్ప మరో ప్రపంచం తెలియకుండా.. క్లాస్ రూంలో అడుగుపెట్టే చిన్నారులను ఆ వాతావరణానికి అలవాటు పడేలా చేసే నేర్పు ఎంతో అవసరం. దానిపైనే పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.
 - సీతాకిరణ్, ప్రిన్సిపాల్,
 డీఏవీ పబ్లిక్ స్కూల్

 

మరిన్ని వార్తలు