కాంపిటీటివ్ కౌన్సెలింగ్: సివిల్స్‌లో తెలుగు సాహిత్యం

3 Jul, 2014 00:15 IST|Sakshi
కాంపిటీటివ్ కౌన్సెలింగ్: సివిల్స్‌లో తెలుగు సాహిత్యం

సివిల్స్‌లో తెలుగు సాహిత్యాన్ని ఆప్షనల్‌గా తీసుకునే వాళ్లు అత్యధిక మార్కులు సాధించాలంటే ఏయే అంశాలను నేర్చుకోవాలి? రెఫరెన్స్ బుక్స్ ఏమైనా ఉన్నాయా?  
 - పి.అరవింద్ కుమార్,
 ఉప్పల్
 
 పోటీ పరీక్షల్లో కెమిస్ట్రీ ప్రాధాన్యం ఎంత మేరకు ఉంటుంది? ఏయే పాఠ్యాంశాలు ముఖ్యమైనవి?
 - కె.స్పందన,
 అంబర్‌పేట
 
 తెలుగు సాహిత్యాన్ని ఆప్షనల్‌గా ఎంచుకున్న వాళ్లు అత్యధిక మార్కులు సాధించాలంటే వ్యాఖ్యానాలపై పట్టు పెంచుకోవాలి.  ఎందుకంటే మొత్తం 250 మార్కుల్లో 100 మార్కులకు వ్యాఖ్యానాలు అడుగుతారు. ఈ మార్కులే అభ్యర్థి ర్యాంకును నిర్ణయిస్తాయి. కాబట్టి అభ్యర్థులు పేపర్-2లోని రసము, ధ్వని, వక్రోక్తి లాంటి సౌందర్య సంబంధ అంశాలను ఔపోసాన పట్టాలి.  పాఠ్యగ్రంథాలను ప్రత్యక్షంగా చదివి ఉండడం అనివార్యం అని యూపీఎస్సీ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. కాబట్టి వీటిని ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. అభ్యర్థులు రాసిన వ్యాసరూప సమాధానాలు, వ్యాఖ్యానాల్లో పాఠ్య గ్రంథాలు చదివారనే విషయం ప్రతిబింబించాలి.  పేపర్‌లో ప్రస్తుతం ఛాయిస్‌లు ఇవ్వడం లేదు. మారిన పేపర్ విధానంతో అభ్యర్థులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదు. గత పరీక్షల్లో అడగని ప్రశ్నలు ఇప్పుడు అడుగుతున్నారు. అభ్యర్థులు ఈ విషయాన్నీ దృష్టిలో ఉంచుకొని అధ్యయనం కొనసాగించాలి. ఉదాహరణకు సోమిదమ్మ పాత్ర చిత్రణ(గుణనిధి కథ) గురించి 2012 సివిల్స్‌లో అడిగారు. ఈ ప్రశ్నను అప్పటి వరకు నిర్వహించిన ఏ పరీక్షలోనూ అడగలేదు. సిలబస్‌లో ఉన్న ఎనిమిది కాన్సెప్ట్‌ల్లో నాలుగు ప్రాచీన, నాలుగు ఆధునిక సాహిత్యానికి సంబంధించినవి. ఇవే కాకుండా మరో 5 నుంచి 6 కళాసౌందర్య అంశాలపై పట్టు సాధించాలి. పాఠ్యగ్రంథాలనే ప్రామాణికంగా తీసుకోవాలి.
 
 రిఫరెన్స్ పుస్తకాలు:
 1. తెలుగు సాహిత్య సమీక్ష (రెండ సంపుటాలు)  - జి.నాగయ్య
 2. తెలుగు భాషా చరిత్ర
     - భద్రిరాజు కృష్ణమూర్తి
 3. తెలుగు భాషా చరిత్ర
     - వెలమల సిమ్మన్న
 ఇన్‌పుట్స్: డాక్టర్ పాతూరి నాగరాజు,
 సివిల్స్ సీనియర్ ఫ్యాకల్టీ ఇన్ తెలుగు
 సివిల్ సర్వీసెస్, గ్రూప్-1 లాంటి పోటీ పరీక్షల్లో జనరల్ సైన్స్ విభాగంలో రసాయన శాస్త్రం ఒక ముఖ్యమైన విభాగం. గత నాలుగేళ్ల ప్రశ్నపత్రాలను పరిశీలించినట్లయితే రసాయనశాస్త్రం నుంచి  ఆరు నుంచి పది ప్రశ్నలు వస్తుండడాన్ని గమనించవచ్చు.  వివిధ పాలీమర్‌లు, ఔషధాలు, పర్యావరణ రసాయనశాస్త్రం, ఆమ్లాలు-క్షారాలు, లోహశాస్త్రం, వివిధ మూలకాల ఉపయోగాలు, హానికర ప్రభావాలు, కేంద్రక రసాయన శాస్త్రం మొదలైన అంశాలపైనే  ఎక్కువగా ప్రశ్నలు అడుగుతున్నారు.  పరమాణు నిర్మాణం, ఆవర్తన పట్టిక, రసాయనశాస్త్రం, వివిధ  రసాయన పదార్థాల ఫార్మూలాలు వాటి ఉపయోగాలు,  ఆర్గానిక్ కెమిస్ట్రీ లాంటి అంశాలను రిపీటెడ్‌గా చదవాలి.
 
 ఈ పాఠ్యాంశాల్లోంచి ఇస్తున్న ప్రశ్నలను గమనిస్తే ఫండమెంటల్స్ పైనే ఎక్కువగా అడగడాన్ని మనం గమనించొచ్చు. ఎనిమిది నుంచి పదో తరగతి వరకు ఎన్‌సీఈఆర్‌టీ  పాఠ్యపుస్తకాలు చదివితే సరిపోతుంది. ఇక మూడోది కరెంట్ అఫైర్స్‌కు సంబంధించిన అంశాలతో ఇమిడి ఉన్న రసాయన శాస్త్రం. ఉదాహరణకు బాక్సైట్ మైనింగ్‌పై చర్చ జరుగుతున్నప్పుడు ఆ ధాతువు నుంచి సంగ్రహించే లోహం ఏది? అని అడిగారు. కాబట్టి హైస్కూల్ స్థాయి పాఠ్యపుస్తకాలతో పాటు పత్రికల్లో వచ్చే విషయ సంబంధిత వ్యాసాలు, సమకాలీన అంశాలకు సంబంధించిన అంశాలు దృష్టిలో ఉంచుకుని చదివితే రసాయన శాస్త్రంలోని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది.
 ఇన్‌పుట్స్: డాక్టర్ బి.రమేష్,
 సీనియర్ ఫ్యాకల్టీ ఇన్ కెమిస్ట్రీ, హన్మకొండ.

మరిన్ని వార్తలు