వెబ్‌సైట్‌ అంటే ఏమిటి?

16 Jan, 2017 16:27 IST|Sakshi
వెబ్‌సైట్‌ అంటే ఏమిటి?

మరీ లోతైన వివరాలలోకి వెళ్ళకుండా క్లుప్తంగా చెప్పుకోవాలంటే... ఇంటర్‌నెట్‌ ద్వారా కంప్యూటర్‌పై మనకు లభించే పుస్తకాలను లేదా పత్రికలను వెబ్‌సైట్స్‌ (Web Sites) అని అంటారు. మనం చదివే పుస్తకాలలో ఉన్నట్లు వెబ్‌సైట్లలో కూడా అనేక పేజీలుంటాయి. పుస్తకంలో ఒక పేజీ నుంచి మరో పేజీలోకి ఎలా వెళ్ళవచ్చో వెబ్‌సైట్‌లో కూడా అలాగే ఒక పేజీ నుంచి మరో పేజీలోకి వెళ్ళవచ్చు. పుస్తకంలో లాగానే వెబ్‌సైట్‌లోనూ తిరిగి మెుదటి పేజీలోకి రావచ్చు. ఇలా ఒక పేజీ నుంచి మరో పేజీలోకేగాక ఒకోసారి ఒక వెబ్‌సైట్‌ నుంచి మరో వెబ్‌సైట్‌లోకి నేరుగా వెళ్ళిపోయే సదుపాయమూ వుంటుంది. ఇలాంటి సదుపాయం పుస్తకాలలో వుండదు. పుస్తకాలలో మనకు అవసరవునుకున్న పేజీలను జెరాక్స్‌ తీసుకోగల్గినట్లే వెబ్‌సైట్ల నుంచి కూడా మనకు కావాలనుకున్న పేజీల ప్రింట్‌లను తీసుకోవచ్చు. ఒకో వెబ్‌సైట్‌లోనూ కొన్ని పదుల పేజీల నుంచి (కొన్నిటిలో పదికన్నా తక్కువే ఉండొచ్చు) కొన్ని వేల పేజీల దాకా ఉండవచ్చు.

ఇవాళ ఇంటర్‌నెట్‌లో 10 కోట్లకు పైగా వెబ్‌సైట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇవన్నీ మన పుస్తకాల లాగా కేవలం అక్షరాలు – బొమ్మలతో మాత్రమే నిండి వుండవు. వీటిలో 1. అక్షరాలు, అంకెలతో వుండేవి (టెక్ట‍్స్‌ ) 2. నిశ్చల చిత్రాలతో (ఇమేజస్‌) వుండేవి. 3. మాటలు, పాటలు, సంగీతంతో (సౌండ్‌) వుండేవి. 4. కదిలే చిత్రాలతో (వీడియో) వుండేవి. అని వెబ్‌సైట్లు ప్రధానంగా 4 రకాలవి వుంటాయి. కొన్ని వెబ్‌సైట్లలో ఈ నాలుగు అంశాలూ ఉండవచ్చు. మరికొన్నిటిలో వీటిలో ఏవైనా ఒక రెండో, మూడో వుండవచ్చు. అనేక దేశాలకు చెందిన ప్రభుత్వాలు, వివిధ సేవలను అందించేవారు, వస్తువులను ఉత్పత్తి చేసేవారు, వ్యాపార సంస్థలు, స్వచ్ఛంద సేవాసంస్థలు, కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు... ఆఖరికి వ్యక్తులు కూడా తమకు సంబంధించిన సమాచారాన్ని వెబ్‌సైట్ల – రూపంలో ఇంటర్‌నెట్‌ వ్యవస్థలో పొందుపరుస్తున్నారు. ఆయా వెబ్‌సైట్లను ఇంటర్‌నెట్‌లో ఓపెన్‌ చేసి చూడడం ద్వారా మనం మనకు కావలసిన సమాచారాన్ని పొందవచ్చు.

ఉదాహరణకు www.sakshi.com అనే వెబ్‌సైట్‌ని ఓపెన్‌ చేసి మీరు ‘సాక్షి’ పేపర్‌ని చదవవచ్చు. అదే విధంగా www.yatra.com అనే వెబ్‌సైట్‌ని సందర్శించడం ద్వారా వివిధ యాత్రాస్థలాల వివరాలను తెలుసుకోవచ్చు. వివిధ స్థాయిల విద్యార్థుల చదువుకి, మనోవికాసానికి పనికొచ్చే వెబ్‌సైట్లు కూడా ఇంటర్‌నెట్‌లో లభిస్తాయి.

మరిన్ని వార్తలు