భూగర్భాన్వేషకుడు.. జియాలజిస్ట్

15 Jul, 2014 23:38 IST|Sakshi
భూగర్భాన్వేషకుడు.. జియాలజిస్ట్

అప్‌కమింగ్ కెరీర్: భూగర్భం... అపారమైన ఖనిజ సంపద, ముడి చమురు, సహజ వాయువు, జల వనరులకు నిలయం. భూగర్భ సంపద మెండుగా ఉన్న దేశాలు ప్రపంచంలో అగ్రరాజ్యాలుగా ఎదిగాయి. అనతికాలంలోనే సంపన్న దేశాలుగా అవతరించాయి. అక్కడి ప్రజల జీవన ప్రమాణాలు ఊహించనంతగా పెరిగాయి. దేశ ముఖచిత్రాన్ని మార్చేసే శక్తి భూగర్భ సంపదకు ఉంది.  అలాంటి సంపదను అన్వేషించి, వెలికితీసేవారే జియాలజిస్ట్‌లు. ఎదుగుదలకు లెక్కలేనన్ని అవకాశాలు ఉన్న కెరీర్.. జియాలజిస్ట్. భూగర్భాన్వేషణకు ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. వందల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నాయి. దీంతో జియాలజిస్ట్‌లకు డిమాండ్ పెరిగిపోయింది. ఈ రంగంపై ప్రజల్లో అంతగా అవగాహన లేకపోవడంతో జియాలజీ కోర్సులను అభ్యసించిన నిపుణుల కొరత కంపెనీలను వేధిస్తోంది. మనదేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో చమురు, గ్యాస్ వెలికితీత ఊపందుకుంటోంది. మైనింగ్ పరిశ్రమ అభివృద్ధి చెందింది. జాతీయ అంతర్జాతీయ సంస్థలు ఈ రంగంలోకి ప్రవేశిస్తున్నాయి.
 
 జియాలజిస్ట్‌లకు అధిక వేతనాలు ఇచ్చి నియమించుకుంటున్నాయి. జియాలజిస్ట్‌లకు ప్రస్తుతం దేశ విదేశాల్లో ఎన్నో అవకాశాలు లభిస్తున్నాయి. జియాలజీలో ఎంఎస్సీ పూర్తిచేయగానే ఉద్యోగం సిద్ధంగా ఉంటోంది. జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్‌ఐ), సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్, ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్, డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్, ఓఎన్‌జీసీ, ఆయిల్ ఇండియా వంటి ప్రభుత్వ సంస్థల్లో, మైనింగ్ శాఖల్లో అవకాశాలు సులువుగా దక్కుతున్నాయి. రిలయన్స్, హిందూస్థాన్ జింక్ లిమిటెడ్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ, సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ వంటి ప్రముఖ సంస్థల్లోనూ మంచి అవకాశాలున్నాయి. కాలేజీలు/యూనివర్సిటీల్లోనూ ఫ్యాకల్టీగా, పరిశోధకులుగానూ సేవలందించొచ్చు.  
 
 అర్హతలు
 మ్యాథమెటిక్స్, సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియెట్ పూర్తిచేసిన తర్వాత జియాలజీలో బ్యాచిలర్స్ డిగ్రీలో చేరొచ్చు. అనంతరం మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ కూడా చేస్తే ఉద్యోగావకాశాలు సులభంగా పొందొచ్చు.   
 
 వేతనాలు
 ఎంఎస్సీ డిగ్రీ ఉన్న జియాలజిస్ట్‌కు రూ.5 లక్షల వరకు వార్షిక వేతనం లభిస్తుంది. పరిజ్ఞానం, పనితీరును బట్టి జీతభత్యాలు ఉంటాయి. ప్రారంభంలో నెలకు సగటున రూ.25 వేల దాకా వేతనం అందుకోవచ్చు. అంతర్జాతీయ చమురు, గ్యాస్ కంపెనీలో చేరితే నెలకు రూ.లక్షన్నర దాకా పొందొచ్చు.
 
 జియాలజీ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు
 - ఉస్మానియా యూనివర్సిటీ
 వెబ్‌సైట్: http://www.osmania.ac.in/
 - ఆంధ్రా యూనివర్సిటీ
 వెబ్‌సైట్: http://www.andhrauniversity.edu.in/
 - నాగార్జునా యూనివర్సిటీ
 వెబ్‌సైట్: http://www.nagarjunauniversity.ac.in/  
 
 - ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్-ధన్‌బాద్
 వెబ్‌సైట్: http://www.ismdhanbad.ac.in/
 - సెంటర్ ఫర్ ఎర్త్ సెన్సైస్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్-బెంగళూరు
 వెబ్‌సైట్: http://www.ceas.iisc.ernet.in/
 
 అన్వేషణతో అద్భుత ఫలం  
 ‘‘భూ అంతరాల్లో దాగిన ఖనిజాల అన్వేషణలో జియాలజిస్టుల భాగస్వామ్యం తప్పనిసరి. ఇటీవలి కాలంలో జియాలజీ కోర్సులకు డిమాండ్ పెరిగింది. జియాలజిస్ట్‌లకు అవకాశాలు పెరగడమే ఇందుకు కారణం. ప్రభుత్వ, ప్రైవేట్ మైనింగ్ సంస్థలు గనుల తవ్వకాలకు, ఖనిజాల వెలికితీతకు నిపుణులను నియమించుకుంటున్నాయి. జియాలజిస్ట్‌లకు మనదేశంలోనే కాకుండా విదేశాల్లోనూ అధిక వేతనాలతో ఉద్యోగాలు లభిస్తున్నాయి. శ్రమించగల తత్వం, ఓర్పు ఉన్న వారికి ఇది బెస్ట్ కెరీర్’’
 - డాక్టర్ ఎం.మురళీధర్, జియాలజీ విభాగ అధిపతి,
 ఉస్మానియా విశ్వవిద్యాలయం

మరిన్ని వార్తలు