సాఫ్ట్‌వేర్‌ కొలువు వీడి..సాగుబడికి..

29 Jul, 2017 04:16 IST|Sakshi
సాఫ్ట్‌వేర్‌ కొలువు వీడి..సాగుబడికి..

ఆస్ట్రేలియాలో ఎంఎస్‌.. ఆ వెంటనే అక్కడే ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం.. నెలకు లక్షల్లోనే జీతం.. చేతిలో ఆస్ట్రేలియా సిటిజన్‌ షిప్‌! నేటి తరం యువతకు అంతకంటే ఏం కావాలి! కోర్సులో చేరిన రోజు నుంచే ఇలాంటి అవకాశాల కోసం ఎదురు చూసే వారెందరో!! కానీ ఆ యువకుడికి మాత్రం ఇవేమీ సంతృప్తినివ్వలేదు. ఏసీ గదుల్లో ఉన్నా యాంత్రిక జీవనం సాగిస్తున్నాననే భావన ‘సాగు’ బాట పట్టించింది. అడిలైడ్‌ నుంచి సొంతూరుకు తిరిగొచ్చి పొలం పనులు, వ్యవసాయంవైపు కదిలాడు. వినూత్న పద్ధతుల్లో వ్యవసాయం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న కోయంబత్తూరుకు చెందిన సురేశ్‌ బాబు స్ఫూర్తి కథనం...

సురేశ్‌బాబుది వ్యవసాయ ఆధారిత కుటుంబమే. ఆర్థికంగా ఫర్వాలేదనిపించే    పరిస్థితి. అయితే కోయంబత్తూరు ప్రాంతంలో వ్యవసాయం అనుకూలంగా లేకపోవడం, నీరు, విద్యుత్‌ వంటి సదుపాయాల కొరతతో సాగుకు ఇబ్బందిగా ఉండేది. దాంతోపాటు తన కుమారుడు పొలం పనులకు పరిమితం కాకూడదని భావించిన తండ్రి.. సురేశ్‌బాబును ఉన్నత విద్య చదివించారు. అప్పటికే  సాఫ్ట్‌వేర్‌ రంగంలో క్రేజ్‌ కారణంగా ఇంజనీరింగ్‌ వైపు అడుగులు వేస్తున్న స్నేహితులను చూసి.. సురేశ్‌బాబు కూడా బీటెక్‌ పూర్తి చేశాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్‌ సౌత్‌ ఆస్ట్రేలియాలో ఎంఎస్‌ కోర్సులో 2009లో ప్రవేశం పొందాడు.

కోర్సు పూర్తవుతూనే కొలువు
కోర్సు పూర్తవుతూనే 2011లో సురేశ్‌బాబుకు అడిలైడ్‌లోని ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో ప్రోగ్రామర్‌గా ఉద్యోగం లభించింది. దాదాపు నాలుగేళ్లు ఆ సంస్థలో పని చేశాడు. కానీ విధుల్లో చేరిన కొద్ది రోజులకే జీవితం యాంత్రికంగా మారిందనే భావన మొదలైంది. అది రాన్రానూ పెరిగి పెద్దదైంది. చివరికి 2014లో స్థిర నిర్ణయానికి వచ్చేశాడు. అదే ‘ఉద్యోగం వదిలేయడం. సొంతూరుకు వెళ్లి తన పొలంలో వ్యవసాయం చేయడం’.  అప్పటికి సురేశ్‌బాబుకు నెలకు మూడు లక్షల వరకు జీతం వచ్చేది. ఆస్ట్రేలియా సిటిజన్‌షిప్‌ కూడా లభించింది. కానీ, అవన్నీ తన ఆసక్తి, సంతృప్తినిచ్చే వ్యవసాయం ముందు దిగదుడుపే అని భావించానని చెబుతాడు. ఆస్ట్రేలియా నుంచి సొంతూరుకు వచ్చేస్తున్నానని చెప్పినప్పుడు.. కుటుంబం, స్నేహితుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. వాటిని పట్టించుకోకుండా మాతృభూమిపై అడుగుపెట్టాడు.

సొంత పొలంలో సాగుతో ప్రారంభం
ఆస్ట్రేలియా నుంచి తిరిగి రాగానే తమ పదెకరాల పొలంలో సాగుకు ఉపక్రమించాడు. మదురమలై సమీపంలో మరో నాలుగు ఎకరాలు భూమి కొనుగోలు చేశాడు. ఇందుకోసం తాను అప్పటివరకు సంపాదించిన మొత్తాన్ని వెచ్చించాడు. వాస్తవానికి సాగులో అడుగుపెట్టే సమయానికి అతనికి వ్యవసాయమంటే ఏంటో తెలియదు. దుక్కి దున్నడం, నారు పోయడం తెలియదు. కానీ, సంకల్పం ఉంటే దేన్నైనా సాధించొచ్చని అనుకున్నాడు. తన ఆలోచనలకు కార్యరూపం ఇచ్చేందుకు తమిళనాడు అగ్రికల్చర్‌ యూనివర్సిటీ అధికారులను, వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించి సలహాలు తీసుకున్నాడు.

ఆటుపోట్లను దాటుకుంటూ
ప్రారంభంలో సురేశ్‌బాబుకు ఎన్నో ఆటుపోట్లు ఎదురయ్యాయి. పొలంపై ఏనుగులు దాడి చేయడం ప్రధాన సమస్యగా మారింది. దీంతో ఎలక్ట్రికల్‌ ఫెన్సింగ్‌ వేసి ఏనుగుల దాడి నుంచి బయటపడాలని భావించాడు. కానీ, విద్యుత్‌ శాఖ నిరాకరించింది. దీంతో సోలార్‌ ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేశాడు.

ఆర్గానిక్‌ ఫార్మింగ్‌
సురేశ్‌బాబు ఆర్గానిక్‌ ఫార్మింగ్‌ విధానాన్ని అవలంబించాడు. మొదట పోకచెక్కల పంట వేశాడు. మంచి దిగుబడి వచ్చింది. దీంతోపాటు అరటి పంట వేశాడు. అందులోనూ సత్ఫలితమే. ఇక వెనుదిరిగి చూసుకోకుండా ముందుకు సాగుతున్నాడు. ఇతని ఆర్గానిక్‌ సాగు పద్ధతులు, పంట దిగుబడి చూసిన సరిహద్దు పొలాల్లోని రైతులు కూడా ఇప్పుడు సురేశ్‌ నుంచి సలహాలు తీసుకుంటూ ఆదాయాన్ని పెంచుకుంటున్నారు. సురేశ్‌బాబు కేవలం వ్యవసాయానికే పరిమితం కాకుండా.. అప్పటికే తన తండ్రి నిర్వహిస్తున్న డెయిరీ ఫామ్‌ను విస్తరించాడు. తమిళనాడు ప్రభుత్వ ఆధ్వర్యంలోని డెయిరీ సంస్థకు పాలు సరఫరా   చేస్తున్నాడు.

అవార్డులు సొంతం
వ్యవసాయమంటే ఏ మాత్రం తెలియకుండా అడుగు పెట్టిన సురేశ్‌బాబు ఇప్పుడు అదే వ్యవసాయంలో వినూత్న పద్ధతిలో సాగు చేసినందుకు అవార్డులు సైతం అందుకున్నాడు. గతేడాది యంగ్‌ అచీవర్‌ అవార్డ్, యంగ్‌ ప్రోగ్రెసివ్‌ ఫార్మర్‌ అవార్డులు సొంతం చేసుకున్నాడు.

నేటి యువతకు మీరిచ్చే సలహా ఏమిటని అడిగితే.. ఏదైనా మనస్ఫూర్తిగా ఇష్టం ఉంటేనే చేయండి. లేదంటే సమయం వృథా అవుతుంది. ఇష్టం ఉన్న రంగంలో ప్రవేశిస్తే.. ఇవాళ కాకపోయినా.. రేపైనా.. ఫలితం ఖాయమంటున్నాడు  సురేశ్‌ బాబు.

మరిన్ని వార్తలు