రేపే విడుదల!

14 May, 2014 22:14 IST|Sakshi

 సాక్షి, ముంబై: రాష్ట్రంలోని 48 లోక్‌సభ నియోజకవర్గాలకు పోటీ చేసిన 897 మంది అభ్యర్థుల భవితవ్యం రేపు తేలనుంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు మరో 24 గంటల్లో వెలువడనుండడంతో అన్ని పార్టీల అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారుల్లో తీవ్ర ఉత్కంఠ వాతావరణం నెలకొంది. శుక్రవారం జరగనున్న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన కోసం ఎన్నికల సంఘం రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఏర్పాట్లను పూర్తిచేసింది. ఏప్రిల్ 10, 17, 24 తేదీల్లో మూడు విడతలుగా పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మూడు దశల్లో ఓటర్లు ఇచ్చిన తీర్పు ఈవీఎంలలో భద్రంగా ఉంది. రేపటితో ఇవి బహిర్గతం కానున్నాయి.  

 ప్రత్యేక ఏర్పాట్లలో ఎన్నికల సంఘం...
 ఓట్ల లెక్కింపు ప్రక్రియ నుంచి ఫలితాల ప్రకటన వరకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ఎన్నికల సంఘం ఇప్పటికే పూర్తి చేసింది. ఇందుకోసం మంత్రాలయలో 12 కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జరిగే ఓట్ల లెక్కింపు వివరాలు ఈ కంట్రోల్ రూమ్‌ల ద్వారా తెలియజేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ఈ కంట్రోల్ రూమ్‌ల నిర్వహణ బాధ్యతలను 20 మంది అధికారులకు అప్పగించారు. ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో 14 రౌండ్లుగా ఓట్ల లెక్కింపు జరగనుంది. అభ్యర్థులు ఎక్కువగా ఉన్న చోట టేబుల్స్ సంఖ్యను పెంచనున్నారు.

 భద్రతపై ప్రత్యేక శ్రద్ధ..
 ఓట్ల లెక్కింపు సందర్భంగా భద్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్టు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ఎలాంటి అవాఛంనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు.. ఏదైన తీవ్రమైన సంఘటన జరిగితే కాల్పులు కూడా జరిపేందుకు పోలీసులకు అనుమతులిచ్చారని చెప్పారు. లెక్కింపు కేంద్రాల వద్దకు కేవలం పాస్‌లు ఉన్నవారిని మాత్రమే అనుమతించనున్నట్టు ఎన్నికల సంఘం తెలిపింది. మంత్రాలయలో ప్రతి అంతస్తుపై ఎన్నికల ఫలితాల వివరాలను తిలకించేందుకు టీవీలు ఏర్పాటు చేయనున్నారు. దీంతోపాటు మంత్రాలయ ప్రధానద్వారం, పోస్ట్‌ఆఫీస్‌వైపు ఉన్న ద్వారం వద్ద భారీ స్క్రీన్‌లను ఏర్పాటు చేయనున్నారు.  

 టీవీ, రేడియోల్లో...
 ప్రజలందరికి ఓట్ల లెక్కింపు వివరాలు దూరదర్శన్‌తోపాటు ఆకాశవాణి(రేడియో) ద్వారా వెనువెంటనే తెలియజేయనున్నారు. ప్రతీరౌండ్‌లో ఏ అభ్యర్థికి ఆధిక్యం లభించింది? ఎవరికి ఎన్ని ఓట్లు పోలయ్యాయి..? ఎవరు విజయం సాధించారు..? ఇలా అన్ని వివరాలను వెనువెంటనే ప్రకటించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.

 విజయోత్సవాల ఏర్పాట్లలో గెలుపు గుర్రాలు...
 ఆలూ లేదు... చూలూ లేదు... కొడుకు పేరు సోమలింగం అన్న చందంగా నేటి రాజకీయాల పరిస్థితి ఉంది. శుక్రవారం వెలువడనున్న లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం విజయోత్సవాలను ఘనంగా జరుపుకునేందుకు ప్రముఖ పార్టీలకు చెందిన కొందరు నాయకులు అప్పుడే సన్నద్ధమయ్యారు. ఫలితాలు తమకే అనుకూలంగా వస్తాయనే ధీమాతో కొందరు ముందే భారీగా మిఠాయిలు, డీజే సౌండ్ సిస్టం, విద్యుత్ దీపాలు, బ్యాండ్ బృందాలు, బాణసంచాలకు అప్పుడే అర్డర్లు ఇచ్చేశారు.

 కేంద్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడం ఖాయమని తెలుసుకున్న బీజేపీ వర్గాలు కూడా భారీగా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, ఆనందోత్సవాలు నిర్వహించేందుకు అవసరమైన సరంజామాను ఫలితాలకు ముందే సిద్ధం చేసుకున్నాయి. దీంతో మిఠాయి షాపులు, బ్యాండ్ బృందాలకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఫలితాల అనంతరం ప్రజలకు పంపిణీ చేసేందుకు నగరంలోని గిర్గావ్ (చర్నిరోడ్) ప్రాంతంలోని ప్రముఖ గణేశ్ భండార్ షాపు యజమానికి సుమారు 25-30 వేల బూంది లడ్డూలు తయారుచేయాలని బీజేపీ నాయకులు ఆర్డర్ ఇచ్చారు. లడ్డూలకు తోడుగా ప్రముఖులకు అందజేసేందుకు ఖరీదైన బర్ఫీ, కాజుకత్రీ, మాల్‌పోహ లాంటి స్వీట్లు కూడా అర్డర్ చేసినట్లు బీజేపీ ప్రతినిధి అతుల్ షా చెప్పారు.

కమలం ఆకారంలో ఉండే 10 కేజీల భారీ కేక్ కూడా అర్డర్ ఇచ్చారు. ఫలితాలకు ఒక రోజు ముందు (15న) సీపీ ట్యాంక్ పరిసరాల్లో నరేంద్ర మోడీ, ఆయన తల్లి ఇంటర్వ్యూ ఎల్సీడీపై ప్రసారం చేయనున్నారు. 16న నాగ్‌పాడా, కామాటిపుర, కస్తూర్భా గాంధీ చౌక్, ఉమర్‌ఖాడీ తదితర ప్రాంతాల్లో ప్రజలు ఫలితాలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు