లోక్సభ సభ్యులూ 'పెద్దలే'

26 May, 2014 11:18 IST|Sakshi

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ఎంపీ కావాలంటే ఆషామాషీ విషయం కాదు. లోక్సభకు పోటీచేసి గెలవాలంటే రాజకీయాల్లో తలపండిపోవాలి. చాలా తక్కువ మందికి మాత్రమే తక్కువ వయసులో గెలిచే అవకాశం ఉంటుంది. 16వ లోక్సభనే చూసుకుంటే.. మనకున్న మొత్తం 543 మంది ఎంపీలలో, ఏకంగా 253 మందికి 55 ఏళ్లకు పైగా వయసుంది. అదే గత లోక్సభలో అయితే ఈ వయసు దాటినవాళ్లు 234 మందే. దేశ చరిత్రలోనే ఇంత ఎక్కువ మంది పెద్దవయసు వాళ్లు లోక్సభకు ఎంపిక కావడం ఇదే ప్రథమమని అంటున్నారు. కాగా, ప్రతిసారీ లోక్సభకు ఎన్నికవుతున్న పెద్దవాళ్ల సంఖ్య పెరుగుతూనే వస్తోంది. యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిస్తున్నా.. లోక్సభకు మాత్రం పెద్దవాళ్లే ఎన్నికవుతున్నారు.

ఈసారి లోక్సభలో కురువృద్ధుడు లాల్కృష్ణ అద్వానీ. ఆయన వయసు 86 సంవత్సరాలు. ఆయనకంటే పెద్ద వయస్కులు ఎవరూ ఈ సభలో లేరు. ఇక మరో సీనియర్ నాయకుడు మురళీ మనోహర్ జోషి వయసు 80 ఏళ్లు. మాజీ ప్రధాని దేవెగౌడకు 81 ఏళ్లు. ఇక ఇప్పటివరకు లోక్సభకు అత్యంత ఎక్కువసార్లు ఎన్నికైన సభ్యుడు.. కాంగ్రెస్ ఎంపీ కమల్నాథ్ (67). ఆయన మధ్యప్రదేశ్లోని ఛింద్వారా నుంచి ఇప్పటికి తొమ్మిదిసార్లు ఎన్నికయ్యారు.

లోక్సభలో 40 ఏళ్లలోపు వయసున్న ఎంపీలు కేవలం 13 శాతం మందే.. అంటే 71 మంది మాట. ఈసారి అత్యంత పిన్నవయస్కులలో ఐఎన్ఎల్డీ అధినేత ఓంప్రకాష్ చౌతాలా మనవడు దుష్యంత్, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్ర మమతాబెనర్జీ మేనల్లుడు అభిషేక్ ఉన్నారు. ఈ జాబితాలో ఇంకా. చెన్నైకి చెందిన డాక్టర్ జె.జయవర్ధన్, హీనా గవిత్, రక్షా నిఖిల్ కూడా ఉన్నారు.

మరిన్ని వార్తలు