ఐదో విడతలో 65% పోలింగ్

18 Apr, 2014 03:45 IST|Sakshi
ఐదో విడతలో 65% పోలింగ్

*అతి పెద్ద విడత లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతం 
*12 రాష్ట్రాల్లోని 121 స్థానాలకు ఎన్నికలు

 
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల ఐదో, అతిపెద్ద విడత పోలింగ్ గురువారం చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. 12 రాష్ట్రాల్లోని 121 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. పోలింగ్ సగటున 65 శాతం నమోదైంది. ఇది 2009 నాటి పోలింగ్‌కంటే ఎక్కువ. ప్రభుత్వ వ్యతిరేక ఓటు వల్ల ఈసారి పోలింగ్ పెరిగిందని భావిస్తున్నారు. తాజా విడతలో పశ్చిమ బెంగాల్‌లో అత్యధికంగా 78.89 శాతం, మధ్యప్రదేశ్‌లో అతి తక్కువగా 54.41 శాతం రికార్డయింది.
 
అయితే మధ్యప్రదేశ్‌లో గత ఎన్నికల నాటి 46.2 శాతం కంటే ఇది మెరుగ్గా ఉండడం విశేషం. తాజా పోలింగ్‌లో జార్ఖండ్‌లో స్వల్పహింస చోటు చేసుకుంది. మావోయిస్టులు మందుపాతర పేల్చడంతో నలుగురు సీఆర్‌పీఎఫ్ జవాన్లు గాయపడ్డారు. నక్సల్స్ ఓ రైల్వే ట్రాక్‌ను పేలుడు పదార్థాలతో ధ్వంసం చేశారు. బాంబులూ పేల్చారు. ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్ ఎన్నికల బృందం లక్ష్యంగా దాడి చేసినా ఎవరూ గాయపడలేదు. 1,769 మంది అభ్యర్థులు బరిలో ఉన్న ఐదో విడత ముగింపుతో మొత్తం తొమ్మిది విడతల ఎన్నికల్లో సగం ప్రక్రియ పూర్తయింది.
 
తొలి నాలుగు విడతల్లో 111 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు.16 కోట్ల మందికిపైగా ఓటర్లున్న ఐదో విడతలోని 121 స్థానాల్లో ప్రస్తుతం 46 బీజేపీ దాని మిత్రపక్షాల ఖాతాలో, 46 కాంగ్రెస్, దాని మిత్రపక్షాల ఖాతాలో ఉన్నాయి. దీంతో ఎన్నికల ఫలితాల్లో ఈ పోలింగ్ కీలకం కానుంది.

ఈ విడతలో బీహార్‌లోని 7 స్థానాలు, ఛత్తీస్‌గఢ్‌లోని 3, జమ్మూకాశ్మీర్‌లో 1(ఉధంపూర్), జార్ఖండ్‌లోని 6, కర్ణాటకలోని మొత్తం 28, మధ్యప్రదేశ్‌లోని 10, మహారాష్ట్రలోని 19, మణిపూర్‌లో 1(మణిపూర్ ఇన్నర్), ఒడిశాలోని 11, రాజస్థాన్‌లోని 20, ఉత్తరప్రదేశ్‌లోని 11, పశ్చిమ బెంగాల్‌లోని 4 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఒడిశాలో 77 అసెంబ్లీ స్థానాలకూ ఎన్నికలు జరిపి రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ముగించారు. ఇక్కడ మూడో విడతలో 70 అసెంబ్లీ, 10 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరిగింది.  
 
పోలింగ్ ఇలా.. : దేశంలో బీజేపీ గాలి వీస్తోందని సర్వేలు చెబుతున్న నేపథ్యంలో ఆసక్తికరంగా మారిన కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో 68 శాతం పోలింగ్ నమోదైంది. కాంగ్రెస్ బీజేపీకి చెక్ పెట్టేందుకు ఇది తోడ్పడొచ్చని భావిస్తున్నారు. 2009 ఎన్నికల్లో ఇక్కడ 59 శాతం పోలింగ్ జరిగింది. నాటి ఎన్నికల్లో 18 స్థానాలు దక్కించుకున్న బీజేపీ ఈ సారి గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది.

- మరో కీలక రాష్ట్రమైన మహారాష్ట్రలో 61.7, బీహార్‌లో 56 శాతం పోలింగ్ జరిగింది. గత ఎన్నికల్లో బీహార్ పోలింగ్ 39.3 శాతమే. తాజా ఎన్నికలను  బహిష్కరించాలని నక్సల్స్ పిలుపునిచ్చినప్పటికీ జార్ఖండ్‌లో 62, ఛత్తీస్‌గఢ్‌లో 65, ఉత్తరప్రదేశ్‌లో 62.62, ఒడిశాలో 70 శాతం నమోదైంది. రాజస్థాన్‌లో గత ఎన్నికలకంటే 15 శాతం పెరిగి 63.4కు చేరింది.  
 
- మణిపూర్‌లో 74, జమ్మూకాశ్మీర్‌లో 69 శాతం రికార్డయింది. కాశ్మీర్ పోలింగ్ గత ఎన్నికలకంటే 24 శాతం ఎక్కువ.

- ఒడిశాలోని నక్సల్స్ ప్రభావమున్న చిత్రకొండ అసెంబ్లీ స్థానంలో రీపోలింగ్ కోసం 15 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, 8 కేంద్రాల్లో ఒక్కరు కూడా ఓటేయలేదు.
 
బరిలోని ప్రముఖులు..
ఈ విడతలో తలపడిన అభ్యర్థుల్లో.. నందన్ నీలేకని, మాజీ ప్రధాని దేవెగౌడ, బీజేపీ నేతలు మేనకా గాంధీ, గోపీనాథ్ ముండే, కేంద్ర మంత్రులు సుశీల్‌కుమార్ షిండే, వీరప్ప మొయిలీ, గులాం నబీ ఆజాద్, సుప్రియా సూలే, మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్, కాంగ్రెస్ నేత అజిత్ జోగీ తదితర ప్రముఖులు ఉన్నారు.
 
బీహార్‌లోని పాటలీపుత్ర నుంచి పోటీ చేస్తున్న ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్ యాదవ్ కుమార్తె మీసా భారతి తనకు ఓటు లేని పోలింగ్ కేంద్రంలోకి వెళ్లడంతో ఆమెపై ఎఫ్‌ఐఆర్ దాఖలైంది. ఈ ఘటన తర్వాత 50 మంది బూత్‌లోకి వెళ్లి గొడవ చేసి, ఈవీఎంను ధ్వంసం చేశారు.

>
మరిన్ని వార్తలు