బల్దియా పోల్ శాతం66.30

31 Mar, 2014 02:20 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : చెదురు మదురు ఘటనలు మినహా జిల్లాలో ఆదివారం మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. నిజామాబాద్ కార్పొరేషన్‌తో పాటు కామారెడ్డి, బోధన్, ఆర్మూరు మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరిగాయి. ఆదివారం ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ 9 గంటల వరకు మందకొడిగా సాగింది. ఆ తర్వాత ఓటుహక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు తీరారు. బోధన్ 24వ వార్డులో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్‌కు గంటసేపు అంతరాయం కలిగింది. నిజామాబాద్, కామారెడ్డి, బోధన్ ఆర్మూరులలో అక్కడక్కడా పోలింగ్ కేంద్రాల వద్ద గుంపులను చెదరగొట్టేందుకు పోలీసులు స్వల్పంగా లాఠీచార్జి చేశారు.

 బోధన్‌లో జోరుగా...
 జిల్లాలో మొత్తంగా పుర పోలింగ్ ఓటింగ్ శాతం 66.30గా నమోదైనట్లు అధికారులు ఆదివారం రాత్రి ప్రకటించారు. అత్యధికంగా బోధన్‌లో (73)శాతం ఓటిం గ్ నమోదు కాగా.. అత్యల్పంగా నిజామాబాద్ నగరంలో(54.70) శాతం నమోదైంది. నిజామాబాద్‌లో 2,42,440 ఓట్లకు గాను 1,32,617 మంది ఓటు వేశా రు.పోలింగ్ 54.70 శాతంగా నమోదైంది. కామారెడ్డిలో 58,905 మంది ఓటర్లకు 39,832 మంది తమ ఓటుహక్కును వినియోగించుకోగా, 67.72 శాతంగా పోలింగ్ నమోదైంది. ఆర్మూరులో 34,752 మందికి 26,246 మంది ఓట్లేయగా 69.77 శాతం, బోధన్‌లో 55,875కు 40,791 ఓట్లు పడగా 73 శాతంగా నమోదైనట్లు అధికారులు తెలిపారు.

 ఓట్లు గల్లంతు...
 పలుచోట్ల ఓట్లు గల్లంతు కావడంతో ఓటర్లు ఆందోళనకు దిగారు. నిజామాబాద్‌లోని నాగారం డివిజన్‌లో ఓట్లు గల్లంతు కాగా, 41వ డివిజన్‌లో కాంగ్రెస్, బీజేపీ వర్గాల మధ్యన గొడవ జరిగి ఉద్రిక్తతకు దారితీసింది. నిజామాబాద్‌లో ఓటర్ స్లిప్పులు అందక కొందరు...పేర్లు గల్లంతవడం వల్ల మరికొందరు ఓటుహక్కును వినియోగించుకోలేక పోయారు. పోలింగ్ కేంద్రాలు తెలియక , సరైన గుర్తింపు కార్డులు లేక కొందరు ఓటు వినియోగించుకోలేక పోయారు.

 నిజామాబాద్, ఆర్మూరులలో పోలీసుల ఓవరాక్షన్...
 నిజామాబాద్, ఆర్మూరు సీఐలు శ్రీనివాస్, సైదులు ఓవర్ యాక్షన్ చేశారని జిల్లా కలెక్టర్, ఎస్పీ, మానవ హక్కుల సంఘానికి పలువురు ఫిర్యాదులు చేశారు. ఆర్మూరులో పోలీసుల తీరుతో గొడవ జరగగా, స్థానిక డీఎస్పీ ఆకుల రాంరెడ్డి రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు. అర్ధరాత్రి తన ఇంటిపై పడి కుటుంబసభ్యులను చితకబాదారని నిజామాబాద్ నగర సీఐ సైదులుపై 48 డివిజన్ అభ్యర్థి బొబ్బిలి మాధురి కలెక్టర్ , ఎస్పీ, హెచ్చార్సీకి ఫిర్యాదు చేశారు. కామారెడ్డిలోని 28వ వార్డులో టీఆర్‌ఎస్ అభ్యర్థి చంద్రశేఖర్‌రెడ్డి ఓటర్‌మార్క్ జాబితాను అనుమతి లేకుండా బయటకు తీసుకెళ్లగా, రిటర్నింగ్ అధికారి ఫిర్యాదు మేరకు ఆయనపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. నిజామాబాద్ ఖిల్లా చౌరస్తాలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరగ్గా పోలీసులు లాఠీచార్జి చేశారు.

మరిన్ని వార్తలు