‘ముంబై’ బరిలో 75 మంది

11 Apr, 2014 22:36 IST|Sakshi

సాక్షి, ముంబై: ముంబైలోని నాలుగు లోక్‌సభ నియోజక వర్గాల్లో మొత్తం 75 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ విషయాన్ని  రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నాలుగు లోక్‌సభ నియోజక వర్గాల్లో మొత్తం 101 మంది నామినేషన్లు వేశారు. అందులో తొమ్మిది మంది ఉపసంహరించుకున్నారు. 17 మంది అభ్యర్థుల నామినేషన్లు రద్దు కావడంతో 75 మంది బరిలో మిగిలారు. ఉత్తర ముంబై, ఉత్తర-మధ్య ముంబై నియోజక వర్గాల నుంచి 21 మంది, ఈశాన్య ముంబై నుంచి 19 మంది, వాయవ్య ముంబై నుంచి 14 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇదిలాఉండగా ఆదివారం నుంచి ఇంటింటికి వెళ్లి ఓటరు స్లిప్పుల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఇందులో మీ ఓటు ఏ పోలింగ్ కేంద్రంలో ఉంది? బూత్ నంబర్ తదితర వివరాలు ఉంటాయి.  

 ఈవీఎంలు, ఓట్ల లెక్కింపు...
 15 కంటే ఎక్కువ మంది అభ్యర్థులు బరిలో ఉన్న ఉత్తర ముంబై, ఉత్తర -మధ్య ముంబై, ఈశాన్య ముంబై నియోజక వర్గాల్లోని పోలింగ్ కేంద్రాల్లో రెండు చొప్పున ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (ఈవీఎం)లు అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా 15 కంటే తక్కువ అభ్యర్థులున్న వాయవ్య ముంబై నియోజక వర్గంలో ఒకే ఈవీఎం ఉంటుంది. వచ్చే నెల 16వ తేదీన ఉత్తర ముంబై, వాయవ్య ముంబై, ఉత్తర-మధ్య ముంబై నియోజక వర్గాల ఓట్ల లెక్కింపు గోరేగావ్‌లోని నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో, ఈశాన్య ముంబై నియోజక వర్గం ఓట్ల లెక్కింపు విక్రోలిలోని గోద్రెజ్ పాఠశాలలో జరుగుతుంది. ఇదిలాఉంచితే ఉత్తర ముంబై నియోజకవర్గంలో పోలీసులు రెండు కేసుల్లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

 ఎవరికి లాభించేనో?
 తొలి విడతలో విదర్భలోని 10 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం పెరుగుదల ఎవ రికి లాభించనుందనే విషయమై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఇందువల్ల తమ అభ్యర్థులకే ప్రయోజనం చేకూరుతుందంటూ ప్రజాస్వామ్య కూటమి, మహాకూటమితోపాటు ఇతర పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే పోలింగ్ శాతం పెరిగితే అది అధికార పక్షాలపై వ్యతిరేకత కారణంగా ప్రతిపక్షాలకు లబ్ధి చేకూరుతుందంటూ రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఈసారి కూడా ఇలాగే  జరిగే అవకాశముందంటున్నారు. ఇదిలాఉంచితే ఈసారి మైనారిటీ ఓటర్ల శాతం కూడా గణనీయంగా పెరిగింది. దీంతో వీరు ఎవరివైపు మొగ్గుచూపారనే విషయాన్ని ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. 2009 ఎన్నికల్లో విదర్భలోని 10 లోక్‌సభ నియోజకవర్గాల్లో 50 శాతం పోలింగ్ నమోదైంది. ఈసారి సుమారు 62 నుంచి 65 శాతానికి పోలింగ్ పెరిగింది. వీరిలో అన్ని వర్గాల ఓటర్లున్నారు. దీంతో ఎవరికి లాభం చేకూరనుందనేది వేచిచూడాల్సిందే.  
 
 పోలింగ్ శాతం వివరాలు..
 లోక్‌సభ              2014                 2009
 బుల్డాణా               58.66               61.6
 అకోలా                  65                   49
 అమరావతి            65                     51
 వర్ధా                    61                     52
 రామ్‌టెక్               62                    50.8
 నాగపూర్             59                     43.4
 గ డ్చిరోలి              65                      65
 చంద్రాపూర్           63                      58.48
 యావత్మాల్          60                     54.5

 

మరిన్ని వార్తలు