నోటీసులపై హైకోర్టులో కేవీపీ పిటిషన్

26 Apr, 2014 02:56 IST|Sakshi

అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వండి.. సోమవారంనాడు విచారణ!

  హైదరాబాద్: టైటానియం ఖనిజం తవ్వకాల వ్యవహారంలో ఇంటర్‌పోల్ తనకు రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయడాన్ని కాంగ్రెస్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు హైకోర్టులో సవాల్ చేశారు. ఈ నోటీసు ఆధారంగా తనపై అరెస్టు సహా ఎటువంటి చర్యలు తీసుకోకుండా సీఐడీ అధికారులను ఆదేశించాలని కోరుతూ లంచ్ మోషన్ రూపంలో ఆయన తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.సత్యనారాయణ ప్రసాద్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ వ్యవహారం అంతర్జాతీయ చట్టాలకు సంబంధించిందని, దీనిపై లోతుగా వాదనలు వినాల్సింది ఉందని, ఇప్పటికిప్పుడు ఉత్తర్వులివ్వలేనని జస్టిస్ నూతి రామ్మోహనరావు స్పష్టంచేశారు. లంచ్ మోషన్ కాకుండా రెగ్యులర్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచించారు. దీంతో రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి, సీఐడీ అదనపు డీజీలను ప్రతివాదులుగా పేర్కొంటూ కేవీపీ రెగ్యులర్ పిటిషన్ వేశారు. ఇది సోమవారం విచారణకు రానుంది.

 నాకెలాంటి సంబంధం లేదు...‘‘టైటానియం తవ్వకాల వ్యవహారంతో నాకెలాంటి సంబంధం లేదు. మీడియా ద్వారానే నాకీ విషయం తెలిసింది. అమెరికా ప్రభుత్వం నన్ను అరెస్ట్ చేయాలని భావిస్తున్నట్టు కూడా కథనాలొస్తున్నాయి. అమెరికా కోర్టు మోపిన అభియోగాలకూ, నాకూ సంబంధం లేదు. ఎన్నికల నేపథ్యంలో కొన్ని శక్తులు నాకు వ్యతిరేకంగా పనిచేస్తూ నా ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్ర పన్నుతున్నాయి. నాపై వస్తున్న ఆరోపణల్లో ఎంత మాత్రం వాస్తవం లేదు. 2006కు సంబంధించిన వ్యవహారంగా పత్రికా కథనాల్లో వస్తోంది. మరి ఇప్పటికిప్పుడు అరెస్టు చేయాల్సిన అవసరమేంటి? అమెరికా చట్టాలు ఇక్కడ నాకు వర్తించవు.

ఇంటర్‌పోల్ నోటీసు ఆధారంగా సీఐడీ అధికారులు చర్యలు తీసుకుంటే నా ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘించినట్లే. 1977 నాటి భారత్-అమెరికా ఒప్పందం ప్రకారం ఇక్కడి అధికారులు చట్ట ప్రకారం అనుసరించాల్సిన విధి విధానాలను పూర్తి చేసి, బాధితుడి వాదనలు విన్నాకే నోటీసు జారీ చేయాలి. అవేవీ లేకుండానే ఇంటర్‌పోల్ నోటీసులిచ్చింది కనక వీటి ప్రకారం సీఐడీ అధికారులు చర్యలు తీసుకోవటానికి వీల్లేదు. ఈ మేరకు సీఐడీని ఆదేశించండి’’ అని పిటిషన్లో కేవీపీ అభ్యర్థించారు.
 కేవీపీపై సీఐడీకి అందిన ఇంటర్‌పోల్ నోటీసు
 కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావుపై ఇంటర్‌పోల్ జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీసు శుక్రవారం సీఐడీ అధికారులకు అందింది. ఆయనపై ఈ నోటీసుల్ని ఇంటర్‌పోల్ ద్వారా అమెరికా జాతీయ క్రైమ్ బ్యూరో పంపిన లేఖ (నం. ఏ-2828/4-2014) బుధవారం సీబీఐకి అందిన విషయం విదితమే. దీని ద్వారా రాష్ట్ర స్థాయి నోడల్ ఏజెన్సీ సీఐడీకి శుక్రవారం చేరింది. ఈ నోటీసుల్లో ఎక్కడా ప్రొవిజినల్ అరెస్టుకు సంబంధించిన వారెంట్ లేదని సీఐడీ చీఫ్ కృష్ణప్రసాద్ వెల్లడించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి పారిపోకుండా అతడి అప్పగింత ప్రక్రియ పూర్తయ్యే వరకు అదుపులో ఉంచుకోమని విదేశాన్ని కోరడాన్నే ప్రొవిజినల్ అరెస్టు అంటారు. ఈ అంశం ఎక్కడా రెడ్‌కార్నర్ నోటీసుల్లో ప్రస్తావించలేదని, దీనిపైనే సీబీఐకి ఫ్యాక్స్ ద్వారా లేఖ పంపామని కృష్ణప్రసాద్ మీడియాకు వెల్లడించారు. వారి జవాబు కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు.

మరిన్ని వార్తలు