గాంధీనగర్ నుంచే అద్వానీ

21 Mar, 2014 00:39 IST|Sakshi

న్యూఢిల్లీ: మలుపులు తిరుగుతూ.. ఉత్కంఠ రేపుతూ సాగిన రాజకీయ కురువృద్ధుడు, బీజేపీ అగ్రనేత నేత లాల్‌కృష్ణ అద్వానీ లోక్‌సభ సీటు వ్యవహారం చివరికి టీ కప్పులో తుపాను మాదిరిగా ముగిసింది. పార్టీ నాయకత్వం దిగి రావడంతో అద్వానీ కూడా ఓ మెట్టుదిగారు. ముందు భోపాల్ నుంచి పోటీకి మొగ్గు చూపిన ఆయన చివరికి గాంధీనగర్ నుంచే లోక్‌సభ ఎన్నికల బరిలో దిగుతానని ప్రకటించారు. గాంధీనగర్, భోపాల్ సీట్లలో ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది అద్వానీయే నిర్ణయించుకోవాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజనాథ్‌సింగ్ ప్రకటించారు. రాజ్‌నాథ్ ప్రకటన వెలువడిన కొద్ది సేపటికే అద్వానీ తన నిర్ణయాన్ని వెల్లడిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. దీంతో అద్వానీ పోటీ చేసే స్థానంపై 24 గంటలుగా కొనసాగిన డ్రామాకు తెరపడినట్లయ్యింది.

 

అయితే మోడీకి, అద్వానీకి మధ్య ఉన్న దూరాన్ని ఈ వ్యవహారం మరోసారి బట్టబయలు చేయడం గమనార్హం. కాగా గురువారం ఉదయం పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీతో పాటు పార్టీ సీనియర్ నేతలు సుష్మాస్వరాజ్, అరుణ్‌జైట్లీ, వెంకయ్యనాయుడు అద్వానీతో భేటీ అయ్యారు. మోడీ సుమారు అరగంట పాటు అద్వానీతో సమావేశమై గుజరాత్ ప్రజలంతా అద్వానీ గాంధీనగర్ నుంచి పోటీ చేయాలని కోరుకుంటున్నట్టు ఆయనకు విన్నవించారు. అనంతరం సుష్మా, జైట్లీ, వెంకయ్య కూడా అద్వానీతో చర్చించారు.


 

మరిన్ని వార్తలు