నారాయణ సేవలో తోపులాట

25 Apr, 2014 03:09 IST|Sakshi

పుట్టపర్తి అర్బన్, న్యూస్‌లైన్ : సత్యసాయిబాబా మహానిర్యాణం అనంతరం పుట్టపర్తిలో జరిగిన మహా నారాయణసేవకు ఊహించని విధంగా పెద్ద ఎత్తున మహిళలు రావడంతో తోపులాట చేసుకుంది. సత్యసాయి ఆరాధనోత్సవాల సందర్భంగా  గురువారం నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన ప్రజలు ఉదయం 5 గంటలకే హిల్‌వ్యూ స్టేడియంకు చేరుకున్నారు. అంచనాలకు మించి భక్తులు రావడంతో 8.30 గంటలకు స్టేడియం నిండిపోయింది.
 
 దీంతో ట్రస్ట్ వర్గాలు మిగిలిన వారందరినీ స్టేడియంలోకి వెళ్లకుండా అడ్డుకున్నాయి. ఉదయం  10 గంటలు దాటినా లోనికి వదలక పోవడంతో మహిళల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఫలితంగా చంటిబిడ్డలతో వచ్చిన వారు, గర్భిణులు, వృద్ధులు, వికలాంగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్టేడియం నిండిపోయిందని, బయట ఉన్న వారంతా ఇళ్లకు వెళ్లి పోవాలంటూ  డీఎస్పీ శ్రీనివాసులు,సీఐలు వేణుగోపాల్, శ్రీధర్, ఎస్సై ప్రవీణ్‌కుమార్ మైకుల్లో సూచించారు. దీంతో సుమారు 10 వేల మంది వెనుదిరిగారు. 11 గంటల సమయంలో  సెంట్రల్ ట్రస్ట్ మెంబర్ ఆర్‌జే రత్నాకర్ సూచన మేరకు భక్తులను లోనికి అనుమతించారు. ఈ సందర్భంగా తప్పిపోయిన ముగ్గురు చిన్నారులను పోలీసులు తల్లిదండ్రుల చెంతకు చేర్చారు.  నారాయణ సేవకు సుమారు 34 వేల మంది భక్తులు హాజరైనట్లు  సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు తెలిపారు. పట్టణంలో వాటర్ ప్యాకెట్లు, మజ్జిగ పాకెట్లు పంచిపెట్టారు. పోలీస్ సిబ్బంది తక్కువగా ఉండడంతో భక్తులను కంట్రోలు చేయలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్టేడియం లోనికి వెల్లినవారందరికి సరిపడా చీరలు,దోవతులు, లడ్డు, ప్రసాదం వాటర్ ప్యాకెట్లు అందించారు.
 

మరిన్ని వార్తలు