వైఎస్సార్ కాంగ్రెస్ గెలుపు ఖాయం

16 May, 2014 04:07 IST|Sakshi

- లగడపాటి సర్వే అవాస్తవం  
- రాష్ట్ర ప్రజలు వైఎస్ కుటుంబంతోనే ఉన్నారు   
- పార్టీ నేతల ధీమా

 
సాక్షి, హైదరాబాద్:  సీమాంధ్ర ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ గెలుపొందడం ఖాయమని ఆ పార్టీ నేతలు ఢంకా బజాయించి చెప్పారు. పార్టీ గెలుపు విషయంలో కార్యకర్తలు, నేతలు ఏ మాత్రం సందేహించాల్సిన పనిలేదని 16న ఫలితాల వెల్లడి తరువాత సంబరాలు చేసుకుందామని తెలిపారు. పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద గురువారం అధికార ప్రతినిధులు ఓవీ రమణ, వాసిరెడ్డి పద్మ, రైతు విభాగం కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డి విడివిడిగా మీడియాతో మాట్లాడుతూ పార్టీ విజయం పట్ల అణువంతైనా అనుమానం అక్కరలేదని ధీమా వ్యక్తంచేశారు.

పందాల కోసమే లగడపాటి సర్వే: ఓవీ రమణ
 మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వేల్లో ఎంత మాత్రం నిజం లేదు. అవి చిల్లర దందాలు, పందాల కోసమే. ప్రామాణికత ఉన్న ఏజెన్సీలు నిర్వహించిన సర్వేలన్నింటిలోనూ పరిస్థితి వైఎస్సార్ కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నట్లు వస్తున్నాయి. ‘హిందూ’ లాంటి దినపత్రికల వార్తలు, పేరుమోసిన జాతీయ చానెళ్లు నిర్వహించిన సర్వేల్లో కూడా వైఎస్సార్ కాం గ్రెస్‌కు సీమాంధ్రలో స్పష్టమైన మెజారిటీ రాబోతోందని, జగన్ ముఖ్యమంత్రి అవుతారని చెబుతున్నాయి. లగడపాటి లాంటి వారు ఎల్లో మీడియాతో కలిసి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. ఎవరెంత దుష్ర్పచారం చేసినా వైఎస్సార్ గెలుపు వంద శాతం ఖాయం.

స్థానిక ఎన్నికలకు సార్వత్రిక ఎన్నికలకు  సంబంధం లేదు: నాగిరెడ్డి
 స్థానిక ఎన్నికల ఫలితాలకు, సార్వత్రిక ఎన్నికలకు సంబంధమే లేదు. నేడు ప్రకటించబోయే శాసనసభ, లోక్‌సభ ఫలితాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ గెలుపు సాధించడం ఖాయం. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తరువాత గత నాలుగున్నరేళ్లుగా కాంగ్రెస్, టీడీపీ కలిసి వైఎస్ కుటుంబాన్ని ఎలా వేధించాయో, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా ఎన్ని కుట్రలు పన్నాయో ప్రజలంతా గమనించారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జగన్‌ను ముఖ్యమంత్రి చేసుకోవాలన్న బలీయమైన కాంక్ష ప్రజల్లో కనిపించింది. అదే మా పార్టీని విజయపథంలో నడిపిస్తుంది.

ప్రత్యర్థుల మైండ్ బ్లాంక్ అవుతుంది: వాసిరెడ్డి
సార్వత్రిక ఎన్నికల్లో ప్రజా తీర్పు మావైపే ఉండబోతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ గెలవలేదని ప్రగల్భాలు పలికిన వారందరికీ నేటి గెలుపు గుణపాఠం కాబోతోంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తరువాత ప్రత్యర్థుల ‘మైండ్ బ్లాంక్’ అవుతుంది. రాష్ట్ర ప్రజలు వైఎస్ కుటుంబం వెనుక ఉన్నారనే సత్యాన్ని మేము దగ్గర నుంచి చూశాం. 16న చారిత్రాత్మకమైన తీర్పు వెలువడబోతోంది.

మరిన్ని వార్తలు