'మామ కూతురికి ఓటేయకపోతే మటాషే'

18 Apr, 2014 14:07 IST|Sakshi
'మామ కూతురికి ఓటేయకపోతే మటాషే'

మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ కి, వివాదాలకు చాలా దగ్గరి సంబంధం. ఆయన నోరు విప్పితే చాలు కాంట్రవర్సీ అయివుతుంది. తాజాగా ఎన్నికల వేళ మహారాష్ట్రలో ఓటర్లను ఆయన బెదిరించారు. తమ పార్టీకి ఓటేయకపోతే ఊరికి నీటి సరఫరా ఉండదని ఆయన వార్నింగ్ ఇచ్చారు.


మహారాష్ట్రలోని బారామతి నియోజకవర్గం నుంచి అజిత్ పవార్ మామ, నేషనలిస్ట్ కాంగ్రెస్ అధినేత శరద్ పవార్ కూతురు సుప్రియా సులే పోటీ చేస్తున్నారు. ఆమెకు మద్దతుగా ప్రచారం చేస్తూ మసల్ వాడీ అనే గ్రామంలో అజిత్ స్థానికులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన సుప్రియా సులేకి ఓటు వేయకపోతే ఊరికి నీటి సరఫరా నిలిపివేస్తామని బెదిరించారు. అంతే కాదు. 'ఎవరు ఏ పార్టీకి ఓటేశారో మాకు తెలిసిపోతుంది. ఈ ఈవీఎంలు ఆ విషయాన్ని చెప్పాస్తాయి. మాకు ఓటేయకపోతే గ్రామానికి నీరుండదు,' అని ఆయన అన్నారు.


ఈ వ్రసంగాన్ని ఎవరో రహస్యంగా సెల్ ఫోన్ ద్వారా షూట్ చేసి బయటపెట్టారు. ఇప్పుడు అది హల్ చల్ చేస్తూండటంతో శివసేన, బిజెపిలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి, పవార్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


విడియోలో ఒక స్థానిక యువకుడు ఊరికి నియమితంగా నీరు సరఫరా చేయాలని, గతంలో వాగ్దానాలు ఏమయ్యాయని అడిగితే అతడిని బయటకు పంపించేయడం కనిపిస్తుంది. ఎన్నికల సంఘం దీనిపై ఇప్పటి వరకూ స్పందించలేదు. గతేడాది అజిత్ పవార్ కరువు ప్రాంతాలలో ప్రసంగిస్తూ డ్యాములు, రిజర్వాయర్లు నిండాలంటే నేను వాటిల్లో మూత్ర విసర్జన చేసి నింపాలా అని రైతులను ప్రశ్నించారు. అప్పట్లో ఇది పెద్ద సంచలనం రేపింది.

మరిన్ని వార్తలు