పచ్చధనం పరవళ్లు

4 May, 2014 03:58 IST|Sakshi
పచ్చధనం పరవళ్లు
  •      మద్యం, డబ్బు పంపకాలకు రంగం సిద్ధం
  •      బంధువులు, ముఖ్యులకు పంపిణీ బాధ్యతలు
  •      కర్ణాటక నుంచి మద్యం దిగుమతి
  •  జిల్లాలో అత్యధిక నియోజకవర్గాల్లో గెలుపు తమది కాదని నిర్ణయించుకున్న తెలుగుతమ్ముళ్లు చివరి ప్రయత్నంగా ప్రలోభాల పర్వానికి తెరలేపారు. పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం తెప్పించి స్టాకు పెట్టుకోవటం, డబ్బులు పోలీసుల కన్నుగప్పి ఎలా పంపిణీ చేయాలి? అనే వ్యూహరచనల్లో ఉన్నారు. డబ్బుల కట్టలు రవాణా చేయకుండానే గ్రామ స్థాయిలో తమకు నమ్మకమైన వారికి, ఆర్థికలావాదేవీలు నిర్వహించే వ్యాపారస్తులకు, మిల్లర్లకు చెప్పి రైతులకు, గ్రామస్తులకు ఓట్లకు డబ్బులు పంచేందుకు నెట్‌వర్కును టీడీపీ అభ్యర్థులు, నాయకులు సిద్ధం చేసుకుంటున్నారు.            
     
    సాక్షి, చిత్తూరు: ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు టీడీపీ అభ్యర్థుల తరఫున వారికి చెందిన ముఖ్యులు, బంధువులు ఈ రంగంలోకి దిగారు. ఈ తరహా ప్రయత్నా లు పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పంలోనే మొదలైంది. శాంతిపురం మండలంలో కర్ణాటక నుంచి ఒక లారీ మద్యం దిగుమతి చేసుకుని గ్రామాల్లో రహస్యంగా ఉంచినట్లు సమాచారం.

    ఎన్నికలకు రెండు, మూడు రోజుల ముందు మద్యం తెప్పించాలంటే నిఘా ఎక్కువగా ఉంటుందని ముందే తెలుగుతమ్ముళ్లు మద్యం తెప్పించి దాచినట్లు తెలుస్తోంది. తంబళ్లపల్లె నియోజకవర్గంలో పొరుగున ఉన్న కర్ణాటక నుంచి మద్యం  ఎలా తెప్పించాలని ప్రణాళికలు వేసుకుంటున్నారు.

    డబ్బుల పంపిణీని కూడా వికేంద్రీకరించి, ముఖ్యంగా వైఎస్సార్‌సీపీకి కంచుకోటలుగా ఉన్న గ్రామాల్లో ఎక్కువగా ఓటుకు రూ.2000 వరకు పంచి ఓట్లు రాబట్టాలనే లక్ష్యంతో టీడీపీ అభ్యర్థులు, వారి తరఫున అనుచరులు సమాలోచనలు జరుపుతున్నారు. చిత్తూరు ఎంపీ శివప్రసాద్ ఏకంగా ఎంపీ లాడ్స్‌తో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రభుత్వ నిధులతో కొనుగోలు చేసిన వీధిదీపాలకు తన పేరు ముద్రించి,ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు.
     
    ఇప్పటికే గ్రామాలకు చేరిన డబ్బులు


    తెలుగుదేశం అభ్యర్థులు ఓట్లు కొనుగోలు చేయాలనే తలంపుతో ఇప్పటి నుంచే డబ్బులు సిద్ధం చేసుకుం టున్నారు. రహస్య స్థలాల్లో, నమ్మకమైనవారి వద్ద డబ్బుల కట్టలు దాచుతున్నారు. ఎక్కువ చోట్ల వికేంద్రీకరించి డబ్బులను ఎక్కడికక్కడే పంపిణీ చేసే విధంగా, ఎన్నికలు ముగిసిన తరువాత ఈ పది రోజుల వడ్డీతో కలిపి తమ తరఫున డబ్బులు పంపిణీ చేసినవారికి చెల్లించే విధంగా టీడీపీ అభ్యర్థులు లోపాయికారి ఒప్పందం చేసుకుంటున్నారు.

    అర్ధరాత్రుల్లో, తెల్లవారుజామున పోలీసు చెక్‌పోస్టులను తప్పించి గ్రామ రహదారుల్లో డబ్బులు రవాణా చేస్తున్నారు. ఇప్పటికే డబ్బులను గ్రామాలకు తరలించేశారు. చంద్రగిరి నియోజకవర్గంలో మండలాలవారీగా తమ ఉద్యోగులను టీడీపీ అభ్యర్థి గల్లా అరుణకుమారి ఇందుకోసమే ప్రత్యేకంగా నియమించినట్లు సమాచారం. ఒక పంచాయతీకి ఒక ఉద్యోగి దగ్గరుండి తెలుగుదేశం నాయకులతో కలిసి ఆ గ్రామస్తులకు కావాల్సిన డబ్బులు, బహుమతులు, ఇతర సామగ్రి, మద్యం పంపిణీ వ్యవహారాలు పర్యవేక్షించే విధంగా చేస్తున్నట్లు చెబుతున్నారు. గల్లా ఫ్యాక్టరీకి చెందిన నమ్మకస్తులు, వారి సామాజికవర్గానికి చెందిన వారినే ఈ పనికి ఉపయోగిస్తున్నారు.

మరిన్ని వార్తలు