టీడీపీతో పొత్తు

29 Mar, 2014 03:50 IST|Sakshi

సాక్షి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి: భారతీయ జనతా పార్టీ జిల్లాపై పట్టుకోసం వ్యూహరచన చేస్తోంది. టీడీపీతో పొత్తు దాదాపు ఖరారు కావడంతో దక్షిణ తెలంగాణలోనే అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో ఎక్కువ సీట్లు తీసుకోవాలని భావిస్తోంది. తెలంగాణ రాష్ట్ర సాధన తమవల్లే సాధ్యమైందనే ఊపుతో ఉన్న కమలనాథులు.. ఈ సారి ఆశాజనక ఫలితాలు నమోదు చేస్తామని అంచనా వేసుకుంటున్నారు. సంప్రదాయబద్ధంగా జిల్లాలో చెప్పుకోదగ్గ ఓటు బ్యాంకు ఉండడంతో బీజేపీ జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలో టీడీపీతో పొత్తు చర్చలు తుది దశకు చేరుతున్న తరుణంలో ఐదారు అసెంబ్లీ సెగ్మెంట్లు, రెండు  పార్లమెంటరీ స్థానాలపై కన్నేసింది.

పొత్తుల ఖరారుపై ఇరుపార్టీల అగ్రనాయకులు జరుపుతున్న సంప్రదింపుల్లో సీట్ల కేటాయింపు ఆసక్తిగా మారింది. నగర శివార్లలో బీజేపీకి పట్టు ఉండడం, వీటిలో కొన్నింటికి ఆ పార్టీ ప్రాతినిధ్యం వహిం చిన నేపథ్యంలో.. ఈ స్థానాలపైనే కమల దళం గురిపెట్టింది. ముఖ్యంగా ఎల్‌బీనగర్, ఉప్పల్, మల్కాజిగిరి, తాండూరు, మహేశ్వరం, కూకట్‌పల్లి శాసనసభా నియోజకవర్గాలు బీజేపీ జాబితాలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే జిల్లాలోని రెండు లోక్‌సభ స్థానాలు మల్కాజిగిరి, చేవెళ్ల కూడా తమకే వదిలిపెట్టాలని ఆ పార్టీ గట్టిగా పట్టుపడుతోంది. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో సైకిల్‌కు పంక్చర్ కావడం, బీజేపీకి కాసింత ఆదరణ పెరిగిన నేపథ్యంలో ఇరుపార్టీలకు పొత్తు అనివార్యంగా మారింది.

బీజేపీకి ఉన్న ఓటు బ్యాంకుతో తమకు కలిసివస్తుందని ‘దేశం’ ఆశిస్తుండగా, గ్రామస్థాయిలో టీడీపీ బలంగా ఉండడం తమకు లాభిస్తుందని కాషాయదళం అంచనా వేస్తోంది. అయితే, పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటులో కమలనాథులు పంతానికి పోవడం, అందులో ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో రెండు పార్లమెంటు సీట్లు కావాలని కోరడం ‘దేశం’ నాయకత్వానికి చిరాకు తెప్పిస్తోంది. అంతేగాకుండా టీడీపీ గెలిచే అవకాశాలు మెండుగా ఉన్న స్థానాలను ఆ పార్టీ కోరడం కూడా తమ్ముళ్లకు మింగుడు పడడంలేదు. కమలానికి కేటాయిస్తే ప్రత్యర్థులకు అనుకూలంగా మారుతుందని భావిస్తోంది.     

మూడింటికి ఓకే!
మల్కాజిగిరి, ఎల్‌బీనగర్, కూకట్‌పల్లి నియోజకవర్గాలు బీజే పీకి కేటాయించేందుకు టీడీపీ మొగ్గు చూపుతోంది. స్థానిక నేతల్లో కుమ్ములాటలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో మల్కాజిగిరి స్థానాన్ని వదిలేయాలని టీడీపీ నాయకత్వం నిర్ణయానికొచ్చింది. ఇక ఎల్‌బీనగర్‌లో సీమాంధ్ర ఓటర్లు ఎక్కువగా ఉండడం, గతంలో ఇక్కడ బీజేపీ ప్రాతినిధ్యం వహించినందున ఈ సీటును విడిచిపెట్టేందుకు సుముఖత చూపుతోంది. అలాగే కూకట్‌పల్లిలో బీజేపీకి గట్టి పట్టు ఉన్నందున పొత్తులో భాగంగా దీన్ని కూడా త్యాగం చేయాలని యోచిస్తోంది.

తాండూరు విషయంలో మాత్రం ఇంకా తుది నిర్ణయానికి రాలేకపోతోంది. ఇక్కడి ఎమ్మెల్యే పి.మహేందర్‌రెడ్డి టీఆర్‌ఎస్ గూటికి చేరిన తర్వాత కాంగ్రెస్ సీనియర్ నేత ఎం.నరేశ్ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈయనకు దాదాపుగా టికెట్ ఖరారు చేస్తున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు  ప్రకటించారు. ఈ నేపథ్యంలో దీన్ని ఇప్పుడు పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయిస్తే నరేష్‌కు అన్యాయం జరుగుతుందని ఆ పార్టీ అధినాయకత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. సంప్రదింపుల్లో ఈ స్థానం కోసం బీజేపీ మొండిగా వ్యవహరిస్తే నరేశ్ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకొని ముందడుగు వేయాలని ‘దేశం’ భావిస్తోంది. ఇక ఉప్పల్‌లో రాజ్యసభ సభ్యుడు దేవేందర్‌గౌడ్ కుమారుడు వీరేందర్ బరిలో ఉంటున్నందున ఈ సీటును వదులుకునే అవకాశం కనిపించడంలేదు.

పార్టీ బలంగా ఉందనుకుంటున్న మహేశ్వరం స్థానాన్నీ వదులుకునే పరిస్థితి లేదు. లోక్‌సభ స్థానాల విషయానికి వస్తే ఈ రెండు స్థానాలపై టీడీపీ గట్టి ఆశలు పెట్టుకుంది. తెలంగాణలో గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్న ఈ రెండింటిని మిత్రపక్షానికి కేటాయించేందుకు సుముఖంగా లేదు. హైదరాబాద్, సికింద్రాబాద్, భువనగిరి తదితర సీట్లు వదులుకుంటున్నందున.. ఈ రెండు స్థానాలు తమకే కేటాయించాలని బీజేపీ కోరే అవకాశమున్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనా బీజేపీ- టీడీపీ మధ్య పొత్తులకు లైన్‌క్లియర్ అయిన తర్వాతే సీట్ల సర్దుబాటుపై స్పష్టత వస్తుందని అంటున్నాయి.

మరిన్ని వార్తలు