కరెంటు ఉండదు.. నీళ్లు రావు!

6 May, 2014 10:00 IST|Sakshi
కరెంటు ఉండదు.. నీళ్లు రావు!

అమేథీ, రాయ్బరేలీ.. ఈ రెండు నియోజకవర్గాలు కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలు. ఉత్తరప్రదేశ్లో అధికారానికి దూరమైనా కూడా ఈ రెండు నియోజకవర్గాలను మాత్రం కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకుంటూనే ఉంది. గాంధీ కుటుంబ సభ్యులే నేరుగా ఈ రెండు లోక్సభ స్థానాలకు ప్రాతినిధ్యం వహిస్తుండటంతో పెద్ద నాయకులు ఉన్నారని, తమకు అండదండలు ఉంటాయని ఇన్నాళ్ల నుంచి వాళ్లను గెలిపిస్తూనే ఉన్నారు. అయితే.. ఇందిరాగాంధీ లాంటి అగ్రనేతలు ప్రాతినిధ్యం వహించిన అమేథీ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉండాలి? అత్యాధునిక సౌకర్యాలు, అధునాతన సదుపాయాలతో ఊరంటే ఇదీ అని అందరూ అనుకునేలా ఉండాలి.

ఎక్కడ చూసినా ఫ్లై ఓవర్లు, రోజంతా కరెంటు, అన్ని ప్రాంతాలకు, ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతిరోజూ మంచినీళ్లు, హేమమాలిని బుగ్గలంత నున్నగా రోడ్లు.. ఇవన్నీ ఉంటాయని ఊహిస్తాం, ఆశిస్తాం. కానీ అమేథీ పరిస్థితి వాస్తవంగా చూస్తే మాత్రం అందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. ఆ నియోజకవర్గ పరిధిలో ఎక్కడా సరైన నీటి సరఫరా అన్నది కూడా లేదు. రైతులకు కేవలం 3- 4 గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా అందుబాటులో ఉంటోంది. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న సమాజ్వాదీ పార్టీ అధికారంలో ఉన్నా, స్వయంగా పార్టీ ఉపాధ్యక్షుడు, యువరాజు రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్నా కూడా ఇక్కడ రోడ్లు కూడా ఏమంత గొప్పగా లేవు.

ఇంకా దారుణమైన విషయం ఏమిటంటే, రాహుల్ గాంధీ తన ఎంపీ నిధులలో కేవలం 51 శాతాన్ని మాత్రమే వినియోగించారు. అభివృద్ధి పనులు చేయించడం కోసం కేటాయించిన నిధులనుకూడా పూర్తిగా ఖర్చుపెట్టకపోతే ఇక అక్కడి రోడ్లు, వంతెనలు, ఇతర సౌకర్యాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు కదా!! ఇన్నాళ్లుగా గాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉన్న అమేథీలో ఇప్పుడు ముక్కోణపు పోరు ఉంది. కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీ రంగంలో ఉండగా, ఆయనకు తోడుగా సోదరి ప్రియాంక ప్రచారం చేస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ తరపున కుమార్ విశ్వాస్, బీజేపీ నుంచి నటి స్మృతి ఇరానీ ఇక్కడ బరిలో ఉన్నారు.

>
మరిన్ని వార్తలు