యువహో..!

21 Mar, 2014 05:06 IST|Sakshi

ఎన్నికల భారతాన్ని శాసించనున్న యువత..
ఓటర్లలో 2.33 కోట్ల మంది 18-19 ఏళ్ల వారే

 
43 వేల మంది.. వీరెవరో తెలుసా? దేశవ్యాప్తంగా ప్రతి లోక్‌సభ స్థానంలోనూ 2014 జనవరి నాటికి కొత్తగా నమోదైన 18-19 ఏళ్ల యువ ఓటర్లు. దేశమంతటా కలిపి మొత్తం 2.33 కోట్ల మంది. వీరంతా ఒకేతాటిపై నడిచే పక్షంలో ఏకంగా 226 లోక్‌సభ స్థానాల్లో వీరు ఎవరికి ఓటేస్తారో నిస్సందేహంగా వారే విజేతలవుతారు. ఎందుకంటారా? 2009 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 226 స్థానాల్లో విజేతలకు దక్కిన మెజారిటీ 43 వేల కంటే చాలా తక్కువ! అంటే ఈ నవ యువ ఓటర్లు తలచుకుంటే ఈసారి సగానికి సగం మంది లోక్‌సభ అభ్యర్థుల భాగ్యరేఖలను నిర్దేశించగలరన్నమాట! అదే కొత్తగా నమోదైన ఓటర్లలో 18-22 ఏళ్ల మధ్య వయసు వారిని తీసుకుంటే ఒక్కో లోక్‌సభ స్థానంలో ఏకంగా 90 వేలున్నారు! వీరిలో అందరి దాకా అక్కర్లేదు, కేవలం మెజారిటీ యువత ఒక్కతాటిపై నిలిస్తే చాలు... వారు ఎవరికి ఓటేస్తే వారిదే గెలుపు. ఇక మొత్తం భారత ఓటర్లలో 18-35 ఏళ్ల వయసున్న యువ ఓటర్ల సంఖ్య ఎంతో తెలుసా? ఏకంగా 39 కోట్లు! 2009తో పోలిస్తే దాదాపుగా రెట్టింపు.
 
  ప్రస్తుతమున్న మొత్తం ఓటర్లలో సగం!! ఈ ఎన్నికల్లో జాతీయ స్థాయిలో యువ ఓటు ఎంతటి ప్రబల శక్తిగా మారనుందో, యువత ఎంతటి నిర్ణాయక శక్తిగా ఆవిర్భవించనుందో చెప్పేందుకు ఇంతకు మించిన గణాంకాలు ఇంకేం కావాలి?! మరి వీరంతా కలసికట్టుగా ముందుకొస్తే? చేయీ చేయీ కలిపి, పిడికిళ్లు బిగించి పోలింగ్ బూత్‌లకేసి కదిలితే? వారి చూపుడు వేళ్లే బ్యాలెట్ బాక్సుల సాక్షిగా దేశ భవిష్యత్తును లిఖిస్తాయి. వ్యవస్థలో మేలిమి మార్పు తీసుకొస్తాయి. బాపూజీ తీసుకొచ్చిన స్వరాజ్యాన్ని సురాజ్యంగా మార్చి, ఆయన కన్న కలల్ని నిజం చేసి చూపిస్తాయి. అందుకే... దేశ దిశను మార్చనున్నది, దాని దశను మేలిమలుపు తిప్పనున్నది యువతీ యువకులే. ఒకరకంగా 16వ లోక్‌సభ రూపురేఖలను పూర్తిగా యువ ఓటర్లే నిర్దేశించనున్నారు. వేయి మాటలెందుకు? నవ భారత యువ శక్తి రానున్న లోక్‌సభ ఎన్నికల సాక్షిగా తన విశ్వరూపం ప్రదర్శించనుంది. ఆసేతుహిమాచలమూ ఇప్పుడు యువ గాలి యమ జోరుగా వీస్తున్నది...                                                                                                                                                                                                                                                                                                                                                   నిర్మిద్దాం.. నవలోకం
 తెలుగు జాతికిది పరీక్షా కాలం
 అతి త్వరలో ఆవిర్భవించనున్న కొత్త తెలుగు రాష్ట్రాలు రెండూ ప్రగతి బాటన పయనించాలి. సర్వతోముఖంగా అభివృద్ధి చెందాలి. జాతీయ స్థాయిలో సగర్వంగా తలెత్తుకోవాలి. ఈ సమున్నత లక్ష్యాలను సాధించాలంటే అభివృద్ధే ధ్యేయంగా పని చేసే పార్టీ కావాలి. వికాసమే లక్ష్యంగా పాటుపడే నవ నేత రావాలి. అలాంటి పార్టీని, అటువంటి నేతను ఎంచుకునే చరిత్రాత్మక అవకాశం ఎన్నికల రూపంలో ఇప్పుడు మన ముందుంది. దీన్ని రెండు చేతులా అందిపుచ్చుకోవాల్సింది ముఖ్యంగా యువతే. ఎందుకంటే రాష్ట్ర ఓటర్లలో దాదాపు మూడో వంతు 30 ఏళ్ల లోపు యువతీ యువకులే! తెలుగువారి భవిత ఈ 1.9 కోట్ల మంది యువ ఓటర్ల చేతిలో ఉంది. రెండు రాష్ట్రాల నవ నిర్మాణం యువ భాగస్వామ్యంతోనే సాధ్యం. అందుకే యువత తన ఓటు ఆయుధాన్ని విచక్షణతో ఉపయోగించాలి. యువ ఆకాంక్షలను అర్థం చేసుకోగల విశ్వసనీయ నేతకు, చెప్పింది చేసి చూపించే పార్టీకి పట్టం కట్టాలి.
 
 దేశ భవిష్యత్తు యువత చేతిలో ఉందనేది నిజం. వారు తలచుకుంటే ఏమైనా సాధించగలరు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరిన వేళ కొత్త రాష్ట్ర నవ నిర్మాణంలో వారు చురుగ్గా పని చేయాలి. ఇందుకు అవసరమైన శక్తిని కూడదీసుకోవాలి. వ్యవస్థాగత నిర్మాణానికి ప్రభుత్వంపై ‘ప్రెజర్ గ్రూప్’గా తమ బాధ్యతను కొనసాగించాలి.
 
 యువత సానుకూల దృక్పథాన్ని పెంపొందించుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగాలపై మోజు పడకుండా ప్రైవేటు రంగంలో ఉద్యోగాలకు, స్వయం ఉపాధికి ఉపయోగపడే వృత్తి నైపుణ్యాలను పెంచుకోవాలి. తద్వారా తెలంగాణ నవ నిర్మాణంలో చురుకైన పాత్ర పోషించవచ్చు. మార్పు కోసం  వినూత్నంగా ఆలోచించాలి. ప్రపంచీకరణ ప్రయోజనాలను అందిపుచ్చుకోగలిగితే వారికిక తిరుగుండదు.  
 - ప్రొఫెసర్ కె.స్టీవెన్‌సన్,
 జర్నలిజం విభాగం,
 ఉస్మానియా విశ్వవిద్యాలయం

 
 సరైన నేతను ఎన్నుకోవాలి
 ప్రతి ఒక్కరూ ఓటు హక్కుని వినియోగించుకోవాలి. కొంతమంది మనకేంటిలే అని ఓటేయరు. కానీ రాష్ట్రంలో పరిస్థితి బాగాలేదనీ, ప్రభుత్వం పనితీరు సరిగ్గా లేదని మాత్రం విమర్శిస్తారు. ఎవరైతే ఓటేయరో వాళ్లకి ప్రశ్నించే హక్కు, విమర్శించే హక్కు లేదు. మన హక్కుల కోసం మనం పోరాడాలంటే తప్పనిసరిగా ఓటేయాలి. ఓటు విలువ పిల్లలకు తెలియజేయాల్సిన బాధ్యత పెద్దలది. కానీ మన దేశంలో చాలావరకు పెద్దలే ఓటు హక్కుని వదులుకుంటున్నారు. అది దురదృష్టకరం. విలువైన ఓటును డబ్బుకు అమ్ముకోవద్దు. సరైన నాయకుణ్ణి ఎన్నుకోవాలి.
 - తాప్సీ, సినీ నటి
 
 ఆలోచించి ఓటేయాలి
 ఓటు వేసేముందు బాధ్యతాయుతంగా ఆలోచించాలి. నేను మొదటిసారి ఓటు వేస్తున్నాను. ఉత్తమమైన ప్రభుత్వాన్ని అందించే వారికే ఓటేస్తా. మంచి నాయకుడిని ఎన్నుకోవడం మనందరి బాధ్యత. అభివృద్ధికి పట్టం కడుతూ, యువతకు ఉపాధి కల్పించేవారికే ఓటు వేయాలి.
 - కె.పద్మ, సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ అనలిస్ట్, యాక్సెంచర్ సర్వీసెస్, హైదరాబాద్
 
 
 దళిత, బలహీన వర్గాల ఓటింగ్ పెరుగుతుంది
 ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు యువత ఉత్సాహం చూపడం ఆహ్వానించదగ్గ పరిణామం. దేశవ్యాప్తంగా బహు పార్టీల మధ్య పోటీ నెలకొన్న ఈ ఎన్నికల్లో యువత మరింత ఉత్సాహంగా ఓటు వేస్తారు. సహజంగానే ‘ధిక్కార’ స్వరం విన్పించే యువకులు ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనడం వల్ల, అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని కూడా ధిక్కరిస్తారు. ఈ ఎన్నికల్లో బడుగు, బలహీన వర్గాల వారు ఆ దిశగా ధైర్యంగా ఓటు వేస్తారు. ఆయా ప్రాంతాల్లో పార్టీలకున్న నెట్‌వర్క్, ప్రాంతీయ పార్టీల ప్రభావం, అభ్యర్థుల గుణగణాలు వగైరాలన్నీ యువతరం ఓట్లపై ప్రభావం చూపుతాయి. పట్టణ ప్రాంతాల్లో మాత్రం యువత ‘కొత్తదనానికి’ అవకాశం కల్పించే ధోరణి ఢిల్లీ ఎన్నికల్లో వెల్లడైంది.
 - కంచ ఐలయ్య, సామాజికవేత్త

ప్రశ్నించే హక్కు వస్తుంది..
 ‘నాకు 18 ఏళ్లు వచ్చినప్పటి నుంచి అన్ని ఎన్నికల్లోనూ ఓటు వేస్తున్నాను. ఈతరం యువత ఇతర వ్యాపకాల్లో ఎంత బిజీగా ఉన్నా పోలింగ్ రోజున మాత్రం తప్పకుండా తమ ఓటేయాలి. ఓటరుగా ఎవరినైనా ప్రశ్నించే హక్కు మీకుంది. పోటీ పడుతున్న వారిలో మంచి అభ్యర్థి ఉన్నారా... అతను ఆ తర్వాత మీకోసం పని చేస్తాడా, లేదా అన్నది చూసుకోవాలి. ఓటు రూపంలో మీ ముందున్న అవకాశాన్ని తప్పనిసరిగా ఉపయోగించుకోండి. అప్పుడే ఏదైనా సమస్య వస్తే ప్రశ్నించే నైతిక హక్కు మీకుంటుంది. యువత కేవలం ఓటు వేయడంతోనే సరి పెట్టుకోకుండా ప్రస్తుత రాజకీయ పరిణామాలపై కూడా దృష్టి పెట్టాలి.
 - గుత్తా జ్వాల, అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి
 
 2014 ఓటర్ల తుది జాబితా ప్రకారం
 వయసుల వారీగా రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య


 
 నవ తెలంగాణ నిర్మాణంలో భాగం కండి
 అమరుల త్యాగాలు...సబ్బండ వర్ణాల పోరాటాలతో అరవై ఏళ్ల తండ్లాట తీరింది. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష నెరవేరింది. నెత్తుటి జ్ఞాపకాలు, నిత్య నినాదాలతో చరిత్రలో నిలిచిన తెలంగాణ గడ్డ నేడు నవ తెలంగాణ కోరుకుంటున్నది.  సామాజికంగా, ఆర్ధికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా మరింతగా వెలుగులీనాలంటే ఎలాంటి మేలిమి మార్పులు రావాలి? అందుకోసం ఏమేం చేయాలి? ఎవరెవరు ఎలా నడుం బిగించాలి? వీటన్నింటి మీద మీ ఆలోచనలను ‘సాక్షి’తో పంచుకోండి.
 మీ అభిప్రాయాలను క్లుప్తంగా మాకు రాసి పంపండి. ఫొటోను జతపర్చండి.
 ఎలక్షన్ సెల్, సాక్షి దినపత్రిక, రోడ్ నం.1 బంజారాహిల్స్, హైదరాబాద్.

మరిన్ని వార్తలు