మైనారిటీలకు బాబు వెన్నుపోటు

7 May, 2014 04:53 IST|Sakshi
మైనారిటీలకు బాబు వెన్నుపోటు

- పీలేరులో జై సమైక్యాంధ్ర పార్టీకి సహకరిస్తున్న టీడీపీ
 - ఆత్మవంచన చేసుకోలేని టీడీపీ కార్యకర్తల తిరుగుబాటు
 - మైనారిటీలకు టికెట్టు ఇచ్చినట్టే ఇచ్చి వెన్నుపోటు రాజకీయం చేస్తున్న బాబు
 - తొలి నుంచి చంద్రబాబుకు    సహకరించినందుకే    కిరణ్ సోదరునికి మద్దతు

 
 సాక్షి, తిరుపతి: పీలేరులో జై సమైక్యాంధ్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కిరణ్‌కుమార్‌రెడ్డి సోదరుడు కిషోర్‌కుమార్‌రెడ్డికి టీడీపీ బహిరంగంగా మద్దతు పలుకుతోంది. వాస్తవానికి ఈ నియోజకవర్గం నుంచి మైనారిటీ అభ్యర్థిని రంగంలోకి తెచ్చి, గెలిపిస్తే మంత్రిని చేస్తానంటూ ఎన్నికల ప్రచారంలో ప్రగల్బాలు పలికిన చంద్రబాబు పోలింగ్‌కు ముందు రోజు తన సహజ స్వభావాన్ని బయటపెట్టారు.
 
 మంగళవారం ఉదయం నుంచి టీడీపీ నాయకులు జై సమైక్యాంధ్ర పార్టీ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలని శ్రేణులను ఆదేశిస్తున్నారు. దీంతో కిందిస్థాయి కార్యకర్తలు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. కొందరు ఈ విషయమై నేతలను ప్రశ్నించడంతో పాటు తిరుగుబాట్లకు సిద్ధమయ్యారు. ఇంతకాలం కిరణ్‌కు వ్యతిరేకంగా పోరాడి ఇప్పుడు సహరించడమంటే ఆత్మవంచన చేసుకోవడమేనని మదనపడుతున్నారు. కార్యకర్తల్లో వచ్చిన తిరుగుబాటు అసలుకే ఎసరు పెట్టేట్టు కనిపించడంతో నేతలు బుజ్జగించే పనిలో ఉన్నారు.
 
 పీలేరు అభ్యర్థి ఎంపికలో కిరణ్, బాబుల డ్రామా
 
 పీలేరు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులను తెలుగుదేశం, జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షులు చంద్రబాబునాయుడు, కిరణ్‌కుమార్‌రెడ్డి ఆఖరు నిమిషం వరకు ప్రకటించలేదు. ముందుగా జరిగిన ఒప్పందం మేరకే అభ్యర్థుల ప్రకటనలో జాప్యం చేశారని అంటున్నారు.
 
  ఓటమి భయం పట్టుకున్న కిరణ్‌కుమార్‌రెడ్డి పార్టీ అధ్యక్షుని హోదాలో రాష్ట్రమంతా ఎన్నికల ప్రచారం చేయాల్సి ఉన్నందునే సోదరుడిని బరిలోకి తెచ్చానని ఇచ్చిన వివరణ జనాన్ని సంతృప్తిపరచలేదు. తండ్రి అమరనాథరెడ్డి హయాం నుంచి తమ కుటుంబాన్ని ఆదరిస్తూ వచ్చిన ద్వితీయశ్రేణి నాయకులు వైఎస్‌ఆర్ సీపీలోకి వెళ్లడంతో కిరణ్‌కు ఓటమి భయం పట్టుకుంది. దీంతో పోలింగ్‌రోజున కిషోర్‌కు సహకరించే విధంగా చంద్రబాబుతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నట్టు విమర్శలు వస్తున్నాయి. పీలేరులో విజయంపై చంద్రబాబుకు ఆశలు లేకపోవడంతో రాష్ట్రంలో ఒక్క సీటైనా మైనారిటీలకు ఇవ్వాల్సి ఉన్నందున అది ఇక్కడ ఇచ్చినట్టు ఇచ్చి వెన్నుపోటుకు సిద్ధమయ్యారు.
 
 మైనారిటీలకు ఇచ్చే ప్రాధాన్యం ఇలాగేనా?
 
 ఈ ఎన్నికల్లో బీజేపీతో అంటకాగుతున్న చంద్రబాబు మైనారిటీలకు ఇస్తున్న ప్రాధాన్యం ఇదేనా అని పీలేరు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీ విశ్వాసాన్ని చూరగొనేందుకు మైనారిటీలకు ఓడిపోయే టికెట్టు ఇచ్చి చివరి నిమిషంలో అనధికారికంగా మరో పార్టీ అభ్యర్థికి ఓట్లు వేసే పరిస్థితి తీసుకురావడం అంతా ఒక వ్యూహం ప్రకారం నడిపారనే అనుమానాలు మైనారిటీల్లో వ్యక్తమవుతున్నాయి.
 
 బెడిసికొడుతున్న వ్యూహం
 
 మంగళవారం ఉదయం నుంచి నియోజకవర్గంలో టీడీపీ నేతలు జై సమైక్యాంధ్ర పల్లవి ఎత్తుకోవడంతో టీడీపీ శ్రేణులతో పాటు జనం కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు తమకు చేస్తున్న అన్యాయంపై కసితో ఉన్నారు. ఇంత దారుణంగా మోసగిస్తారని ఊహించలేదని ఒక మైనారిటీ నేత వాపోయారు. జై సమైక్యాంధ్ర నేతలు ఓటర్లకు నగదు పంపిణీ చేస్తూ ఒక ఓటు జేఎస్పీకి మరో ఓటు బీజేపీకి వేయాలంటూ ప్రచారం చేస్తున్నారు. దీంతో ఓటర్లు కూడా అక్కడక్కడా నిలదీసినట్టు తెలుస్తోంది. ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు చేస్తున్న కుట్రను తిప్పికొట్టేందుకు రెండు ఓట్లూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేయాలనే నిర్ణయానికి అక్కడి ఓటర్లు వస్తున్నారు.
 

మరిన్ని వార్తలు